ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉండే రోగులకు చికిత్స అందించేందుకు అనేక వైద్య పరికరాలు వాడతారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి అనేక ట్యూబులు, మెషీన్లు, వైర్లు, కేబుళ్లతో కూడిన వైద్య పరికరాలను వారి శరీరానికి తగిలిస్తారు. కొంత మంది ఇంటెన్సివ్ కేర్ నుంచి కొన్ని రోజుల్లోనే బయటకి వస్తే, కొంత మందికి కొన్ని వారాలు, నెలలు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది.
లైవ్ రిపోర్టింగ్
అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి
Post update
కరోనావైరస్పై తాజా సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
కరోనావైరస్: ప్రపంచవ్యాప్తంగా 1,47,632.. భారత్‌లో 452.. తెలంగాణలో 18.. ఏపీలో 14 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా 21,88,194 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,47,632 మంది మరణించారు.(17.04.2020 రాత్రి 10 గంటల వరకు వివరాలు)
* భారత్‌లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇందులో మృతులు 452, కోలుకున్నవారు 1766 మినహాయించగా ప్రస్తుతం 11,616 యాక్టివ్ కేసులున్నాయి.
* ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి, 14 మంది మరణించారు.
* తెలంగాణలో శుక్రవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం 766 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 మంది మరణించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోవిడ్-19 పరీక్ష చేశారు. నెగటివ్ ఫలితం వచ్చింది.
కరోనావైరస్ అదుపులోకి వచ్చిందంటున్న జర్మనీ
లాక్డౌన్ సత్ఫలితాలు ఇచ్చిందని, తమ దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత గణనీయంగా తగ్గిందని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్ వెల్లడించారు.
ఏప్రిల్ 12 నుంచి కొత్తగా వైరస్ సోకుతున్నవారి సంఖ్య కంటే కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతోందని.. వైరస్ సోకుతున్న రేటు 0.7కి తగ్గిందని చెప్పారు.
జర్మనీలో ఇప్పటివరకు 3,868 మంది కోవిడ్-19 బారినపడి మరణించారు. ఇది యూరప్‌లోని ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ కంటే తక్కువ. అయితే, మరణాలు మాత్రం ఇంకా జర్మనీలో తగ్గలేదు.
అంతేకాదు.. వైద్యసిబ్బందికి వైరస్ సోకడమూ తగ్గలేదు. ఇంతవరకు ఆ దేశంలో 1,34,000 మందికి వైరస్ సోకింది.
జర్మనీలో వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా లాక్డౌన్ అమలు చేశారు. సార్లాండ్, బవేరియా వంటి ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేశారు.
జర్మనీలో రోగనిర్ధణ పరీక్షలు జరిపే ల్యాబరేటరీల పనితీరును ప్రపంచమంతా ప్రశంసిస్తోంది.
ఏప్రిల్ మొదటివారంలోనే జర్మనీలో రోజుకు లక్షకుపైగా పరీక్షలు జరుపుతూ యూరోపియన్ యూనియన్‌లోని మిగతా దేశాలన్నిటికంటే ముందున్నారు.
హెల్త్ కేర్ వర్కర్స్ కోసం వారానికి 5 కోట్ల మాస్కులు తయారుచేస్తామని.. ఇది ఆగస్టుకు సాధ్యమవుతుందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.
తెలంగాణలో 766కి పెరిగిన పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 766కి పెరిగింది.
శుక్రవారం కొత్తగా 66 కేసులు నమోదు కాగా మరణాలేమీ లేవు.
ఇప్పటివరకు 18 మంది మరణించగా, 186 మంది కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జయ్యారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో 562 యాక్టివ్ కేసులున్నాయి.
ప్రస్తుతం యాక్టివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 286 ఉన్నాయి.
జిల్లాలవారీగా చూస్తే సూర్యాపేట జిల్లాలో 44, నిజామాబాద్‌లో 42, వికారాబాద్‌లో 33, వరంగల్ అర్బన్‌లో 21 కేసులున్నాయి. హైదరాబాద్ సహా మొత్తం 28 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులున్నాయి.
ముంబయిలో 2,120 పాజిటివ్ కేసులు.. 121 మరణాలు
మహారాష్ట్ర రాజధాని ముంబయి కరోనావైరస్ గుప్పిట చిక్కుకుని విలవిలలాడుతోంది. శుక్రవారం ముంబయిలో కొత్తగా 77 పాజిటివ్ కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి.
దీంతో ఇప్పటివరకు ముంబయిలో పాజిటివ్ కేసుల సంఖ్య 2,120.. మరణాలు 121కి పెరిగాయి.
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు కోవిడ్-19 పరీక్ష.. నెగటివ్‌గా నిర్ధరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కోవిడ్ –19 పరీక్ష చేశారు.
ఈ పరీక్షలో ఆయనకు కోవిడ్ నెగటివ్‌గా నిర్ధరణ శుక్రవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి.
ఆ కిట్‌ను ఉపయోగించి వైద్యులు ముఖ్యమంత్రికి ఈ పరీక్ష జరిపారు.
కోవిడ్-19 పేరుతో రోజుకు 1.8 కోట్ల ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్న మోసగాళ్లు: గూగుల్
ప్రపంచవ్యాప్తంగా జీమెయిల్ వినియోగిస్తున్నవారికి మోసగాళ్లు కోవిడ్-19 పేరు వాడుతూ రోజుకు 1.8 కోట్ల మోసకారి మెయిల్స్ పంపిస్తున్నారని గూగుల్ వెల్లడించింది.
వినియోగదారుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం సేకరించడానికి మోసగాళ్లు రకరకాల పన్నాగాలతో మోసకారి మెయిల్స్ పంపిస్తున్నారని తెలిపింది.
రోజుకు 10 కోట్ల ఫిషింగ్ ఈమెయిల్స్‌ను తాము బ్లాక్ చేస్తున్నామని చెప్పింది. గత వారం ఇలాంటి కరోనావైరస్ పేరుతో ఇలాంటి ఫిసింగ్ మెయిల్స్ 50 కోట్లు వచ్చాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, వివిధ దేశాల ప్రభుత్వాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు పంపినట్లుగా తప్పుడు ఈమెయిల్స్‌ను మోసగాళ్లు పంపుతున్నారని గూగుల్ చెప్పింది.
భారత్‌లో 13,835కి చేరిన పాజిటివ్ కేసులు.. మృతులు 452
శుక్రవారం(17.04.2020) సాయంత్రం 5 గంటలకు ముందు 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1076 కొత్త కేసులు, 32 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కి చేరింది. ఇందులో మృతులు 452, కోలుకున్నవారు 1766 మినహాయించగా ప్రస్తుతం 11,616 యాక్టివ్ కేసులున్నాయని తెలిపింది.
24 గంటల్లో దేశవ్యాప్తంగా 1007 కొత్త కేసులు.. 23 మరణాలు
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1007 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. 23 మంది కరోనా రోగులు మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు.
దేశంలో కోలుకుంటున్నవారు, మరణిస్తున్నవారి నిష్పత్తి 80:20గా ఉందని.. ఇది చాలా ఇతర దేశాల కంటే ఎక్కువని చెప్పారు.
మే నెల నాటికి 10 లక్షల ఆర్టీపీసీఆర్ కిట్లు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
కేరళ, ఉత్తరాఖండ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, లద్ధాఖ్, పుదుచ్చేరి, దిల్లీ, బిహార్, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, అస్సాం, త్రిపుర తదితర రాష్ట్రాల్లో కేసులు రెట్టింపవుతున్న వేగం జాతీ సగటు కంటే తక్కువ ఉందని లవ్ అగర్వాల్ చెప్పారు.
లాక్‌డౌన్‌కు ముందు కేసులు రెట్టింపైన వేగం 3 రోజులుగా ఉండేదని.. గత ఏడు రోజుల డాటా పరిశీలిస్తే ఇప్పుడు రెట్టింపవుతున్న వేగం 6.2 రోజులుగా ఉందని ఆయన చెప్పారు.
ప్రస్తుతం వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించామని.. బీసీజీ, కన్వాల్సెంట్ ప్లాస్మా థెరపీ, మోనో క్లోనల్ యాంటీ బాడీస్ వంటివన్నీ కలిపి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
కరోనాపై అవగాహనకు విజయవాడలో భారీ చిత్రం
విజయవాడ అజిత్ సింగ్ నగర్ వద్ద ‘మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం’ అంటూ రోడ్డుపై భారీ పెయింటింగ్ వేశారు.
రెడ్ జోన్ పరిధిలోని ప్రజలు సరైన అవగాహన లేక రాకపోకలు సాగిస్తున్న తరుణంలో వారిలో చైతన్యం తెచ్చేందుకే ఈ పెయింటింగ్ వేయించినట్లు ట్రాపిక్ సీఐ బాలరాజు తెలిపారు.
లాక్డౌన్ ఉన్నా ప్రార్థనలు జరుపుతామంటున్న పాక్ మతాధికారులు
కోవిడ్-19 కారణంగా ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం ఉన్నప్పటికీ తాము దేశవ్యాప్తంగా శుక్రవారం ప్రార్థనలు జరుపుతామని పాకిస్తాన్‌లోని ఇస్లాం మతాధికారులు కొందరు చెప్పారు.
పాకిస్తాన్లో అమల్లో ఉన్న లాక్డౌన్ మసీదులకు వర్తించదని కొందరు మతపెద్దలు ఈ వారం ప్రారంభంలో చెప్పారు.
వయోధికులంతా ఇళ్లలోనే ప్రార్థనలు జరుపుకోవాలని, మిగతావారంతా మసీదులకు వచ్చి సామాజిక దూరం పాటిస్తూ ప్రార్థనలు జరపాలని అన్నారు.
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూనే రోజుకు 5 ప్రార్థనలు చేయడం తప్పనిసరి’’ అని ముఫ్తీ తాఖీ ఉస్మానీ అనే ఇస్లాం స్కాలర్ అన్నారు.
పాకిస్తాన్లో ఇప్పటికే జనం గుమిగూడడాన్ని నిషేధించారు. ఇది అన్ని ప్రదేశాలకు వర్తిస్తుంది. కానీ, చాలామంది ప్రార్థనల పేరుతో పెద్దసంఖ్యలో వస్తున్నారు.
ఇప్పటివరకు పాక్‌లో 7 వేల మందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా 120 మందికిపైగా మరణించారు.
కర్ణాటకలో లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి సిద్ధలింగేశ్వర రథోత్సవం
దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమాన్ని అడ్డుకోకపోవడంతో చిత్తాపూర్ తాలూకా మెజిస్ట్రేట్, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
రేవూర్ గ్రామాన్ని జిల్లా యంత్రాంగం సీల్ చేసింది. సామాజిక దూరం పాటించాలనే నిబంధనని ఈ రథోత్సవంలో పూర్తిగా ఉల్లంఘించారు.
రెండేళ్ల చిన్నారికి కోవిడ్-19 సోకడంతో కంటైన్మెంట్ ఏరియాగా గుర్తించిన వాడి గ్రామానికి రథోత్సవం జరిగిన ప్రాంతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారని ఒక అధికారి చెప్పారు.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
జనం అలికిడి లేకపోవడంతో రోడ్లపైకి వచ్చిన సింహాలు
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌లో ప్రజల అలికిడి లేకపోవడాన్ని గమనించిన సింహాలు రోడ్లపైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాన్ని పార్క్ రేంజర్ రిచర్డ్ సౌరీ తన మొబైల్ కెమెరాలో బంధించారు.
సాధారణంగా పర్యటకులతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డు లాక్ డౌన్‌తో నిర్మానుష్యంగా మారడంతో ఒక సింహాల గుంపు రోడ్లపై విశ్రాంతి తీసుకోవడాన్ని రిచర్డ్ సౌరీ బుధవారం గమనించారు.
కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి మార్చ్ 25 నుంచి విధించిన లాక్ డౌన్‌తో క్రూగర్ వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రం కూడా మూతపడింది.
పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చెన్నైలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కోలుకున్న 30 మంది కోవిడ్ రోగుల డిశ్చార్జ్
చెన్నైలోని ఒమన్దురార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి 30 మంది కోవిడ్-19 రోగులు ఈ రోజు డిశ్చార్జ్ అయ్యారు.
ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తమ ఆరోగ్య సమస్యలు తెలుసుకుని పరిష్కరించారని వారు చెప్పారు.
తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ బచ్చన్ రూ.1.8 కోట్ల విలువైన సహాయం
తెలుగు సినీ కార్మికులకు అమితాబ్ బచ్చన్ సహాయం అందించారు.
బిగ్‌బజార్ స్టోర్లలో రెడీమ్ చేసుకోవడానికి వీలుగా ఒక్కొక్కటి రూ.1500 విలువ చేసే 12 వేల కూపన్లను ఆయన ఏర్పాటు చేసినట్లు చిరంజీవి వెల్లడించారు.
వీటి విలువ రూ. 1.8 కోట్లు. తెలుగు సినీ కార్మికులకు ఆదుకున్నందుకు అమితాబ్‌కు చిరంజీవి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
కరోనావైరస్: “చైనాలో ఏం జరిగిందో మాకు తెలియదు”:ఫ్రాన్స్
కోవిడ్-19 సంక్షోభం విషయంలో చైనా వ్యవహరించిన తీరుపై అనుమానం వ్యక్తం చేశారు ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్. అక్కడ ఏం జరిగిందో తమకు తెలియదని వ్యాఖ్యానించారు.
ఫైనాన్సియల్ టైమ్స్ తో మాట్లాడిన ఆయన ఈ సంక్షోభం విషయంలో చైనా మరింత బాగా వ్యవహరించి ఉండాలని సూచించడం అమాయకత్వమే అవుతుందన్నారు.
యూరోపియన్ దేశాలు వృద్ధుల్ని వృద్ధాశ్రమాల్లో ఉంచి వారి ప్రాణాల్ని గాలికొదిలేశాయంటూ చైనా విదేశాంగ శాఖ వెబ్ సైట్లో ఓ కథనం ప్రచురితమయ్యింది. దాంతో ఈ వివాదం మొదలయ్యింది.
ఈ కథనంపై తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఫ్రాన్స్ విదేశాంగ శాఖ చైనా దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది.
అయితే సమాచార లోపం వల్లే ఈ పరిణామాలు తలెత్తాయని చైనా స్పష్టం చేసింది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఫ్రాన్స్ వ్యవహరించిన తీరుపై తాము ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చెయ్యలేదని చైనా అధికార ప్రతినిధి జవో లిజియన్ అన్నారు.
మహారాష్ట్రలో ఒకే రోజు 288 కరోనా పాజిటివ్ కేసులు
మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 3,204కి చేరుకుంది. ఒకే రోజు కొత్తగా 288 కేసులు నమోదు కాగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఆ రాష్ట్ర వైద్య శాఖ వెల్లడించింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనావైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 194కి చేరింది.
చైనాలో ఒక్కసారిగా పెరిగిన మరణాల సంఖ్య
వుహాన్‌లోనే 50% పెరిగిన మృతుల సంఖ్య
కొన్ని వారాలుగా సుమారు చైనాలో 3,300గా ఉన్న మరణాల సంఖ్య ఇప్పుడు ఒక్కసారిగా 4,600కి చేరుకుంది. అందుకు కారణం ఈ వైరస్‌కి కేంద్ర బిందువైన వుహాన్‌లో మరణాల సంఖ్య ఏకంగా 50 శాతం పెరగడమే. అక్కడ మొత్తంగా 1290 మంది కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారని తాజాగా వెల్లడైంది.
ఒకానొక సమయంలో చైనా చెప్పిన గణాంకాలపై అనేక సందేహాలు వెల్లడయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా ఇదే విషయమై విమర్శించారు.
అయితే ఈ గణాంకాలు విడుదల చేస్తున్న సమయంలో వుహాన్ నగర అధికారులు తాము వాస్తవాలను దాచి పెట్టే ప్రయత్నాలు చెయ్యడం లేదని మరోసారి స్పష్టం చేశారు.
ఏపీకి లక్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్లు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కొత్తగా లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను సమకూర్చుకుంది. దక్షిణ కొరియాలోని సోల్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా రాష్ట్రానికి చేరుకున్న కిట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ కిట్ల సాయంతో కేవలం పది నిముషాల్లో ఫలితాన్ని తెలుసుకోవచ్చు. ఈ పరికరాలను త్వరలోనే అన్ని జిల్లాలకు పంపిస్తామని అధికారులు వెల్లడించారు.
ఐపీఎల్‌కి ఆతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చిన శ్రీలంక
కోవిడ్-19 సంక్షోభం కారణంగా నిరవధికంగా వాయిదా ఐపీఎల్‌కు తాము ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటి వరకు శ్రీలంకలో 200 కరోనా కేసులు నమోదయ్యాయి.