Got a TV Licence?

You need one to watch live TV on any channel or device, and BBC programmes on iPlayer. It’s the law.

Find out more
I don’t have a TV Licence.

లైవ్ రిపోర్టింగ్

అన్ని సమయాలు యుకె ఆధారంగా పేర్కొనబడ్డాయి

  1. కరోనావైరస్: ఈరోజు ముఖ్యాంశాలు

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు 28,40,830కి పెరిగాయి. మృతుల సంఖ్య 1,99,271కి చేరింది.

    * అమెరికాలో 9,07,096మందికి వైరస్ సోకగా 52,546 మంది.. ఇటలీలో 1,92,994 మందికి వైరస్ సోకగా 25,969 మంది మరణించారు. స్పెయిన్‌లో 22,902 మందికి వైరస్ సోకగా 22,902 మంది మృతిచెందారు. ఫ్రాన్స్‌లో 1,59,952 మంది వైరస్ బారిన పడగా 22,245 మంది చనిపోయారు. యూకేలో 1,49,554 మందికి వైరస్ సోకగా 20,319 మంది ప్రాణాలు కోల్పోయారు.

    * భారత్‌లో 24,942 పాజిటివ్ కేసులు నమోదు కాగా 779 మంది మరణించారు.

    * తెలంగాణలో 990 పాజిటివ్ కేసులు.. 25 మరణాలు నమోదయ్యాయి.

    * ఆంధ్రప్రదేశ్‌లో 1016 పాజిటివ్ కేసులు.. 31 మరణాలు నమోదయ్యాయి.

    కరోనా కేసుల వివరాలు
  2. తెలంగాణలో కొత్తగా 7 పాజిటివ్ కేసులు.. మొత్తం 990

    తెలంగాణలో శనివారం కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

    దీంతో మొత్తం కేసుల సంఖ్య 990కి చేరింది.

    ఇప్పటివరకు మొత్తం 25 మంది మరణించగా, 307 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు.

    ప్రస్తుతం 658 మంది చికిత్స పొందుతున్నారు.

    కరోనా కేసులు
  3. బ్రిటన్‌లో 20 వేలు దాటిన మరణాలు

    బ్రిటన్‌లో కోవిడ్-19 మృతుల సంఖ్య 20 వేలు దాటిందని హోం సెక్రటరీ ప్రీతి పటేల్ తెలిపారు.

    ఈ సంక్షోభ సమయంలో నేరగాళ్లు విజృంభిస్తున్నారని.. మాస్కుల రవాణా ముసుగులో తరలిస్తున్న 10 లక్షల పౌండ్ల విలువైన కొకైన్‌ను బోర్డర్ ఫోర్స్ స్వాధీనం చేసుకుందని చెప్పారు.

    ఫిషింగ్ స్కామ్స్ జరుగుతున్నాయని.. కొన్ని వెబ్‌సైట్లు బోగస్ పీపీఈలు విక్రయిస్తున్నాయని తెలిపారు.

    చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించి 1300 ఫిర్యాదులు వచ్చాయన్నారు.

  4. మహారాష్ట్రలో ఒక్క రోజే 811 కొత్త కేసులు.. 22 మంది మృతి

    మహారాష్ట్రలో శనివారం కొత్తగా 811 పాజిటివ్ కేసులు నిర్ధరణయ్యాయి. 22 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,628కి చేరింది. మృతుల సంఖ్య 323కి పెరిగింది.

    View more on twitter
  5. కర్నూలు జిల్లాలో ఈరోజు 24 మంది కరోనా రోగుల డిశ్చార్జ్

    కర్నూలు డిశ్చార్జ్

    కర్నూలు జిల్లాలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న విశ్వభారతి కోవిడ్ ఆస్పత్రి నుంచి సాయంత్రం 24 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ చెప్పారు.

    దీంతో ఇప్పటివరకూ జిల్లాలో ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన కరోనా రోగుల సంఖ్య 31కి చేరింది.

    కరోనా కేసులు పెరుగుతున్న కర్నూలు జిల్లాలో ఒకే రోజు 24 మంది ఆరోగ్యంగా డిశ్చార్జ్ కావడం ఒక పెద్ద ఉపశమనం అని కలెక్టర్ అన్నారు.

    కర్నూలు డిశ్చార్జ్

    ఈనెల 6న వీరిని ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స తర్వాత కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం రెండు సార్లు చేసిన పరీక్షల్లో అందరికీ నెగటివ్ వచ్చింది. ఈరోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారందరూ పురుషులే.

    ఈనెల 6న వీరిలో కర్నూలు నుంచి ఏడుగురు, నంద్యాల నుంచి ఏడుగురు ఉన్నారు.

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారికి ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు, పండ్లు అందించిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వారిని ప్రత్యేక వాహనాల్లో స్వస్థలాలకు పంపించారు.

  6. అహ్మదాబాద్ ఆస్పత్రిలో ముస్లిం రోగుల రంజాన్ ప్రార్థనలు

    అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో ఉన్న ముస్లిం కరోనా రోగులకు రంజాన్ నెలలో ప్రార్థనలు చేసుకోడానికి ఆస్పత్రి అధికారులు ఈరోజు అనుమతించారని ఏఎన్ఐ చెప్పింది.

    ఈ ఆస్పత్రిలో మొత్తం 472 కరోనా పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారని గుజరాత్ సమాచార శాఖ చెప్పిందని తెలిపింది.

    View more on twitter
  7. దేశంలో గత 24 గంటల్లో 1490 కొత్త కేసులు నమోదు, 56 మంది మృతి

    భారత్‌లో గత 24 గంటల్లో 1490 కొత్త కరోనా కేసులు, 56 మృతులు నమోదైనట్లు ఏఎన్ఐ చెప్పింది.

    ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వివరాల ప్రకారం, కొత్త కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 24,942కు పెరిగింది. వీటిలో 18,953 యాక్టివ్ కేసులు కాగా, 5,210 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 779 మంది మృతి చెందారు. అని అందులో చెప్పారు.

    View more on twitter
  8. కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఏపీ డీజీపీ

    ఏపీ డీజీపీ

    అనంతపురం ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ పర్యటించారు. కరోనాతో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

    కరోనా గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పాజిటివ్ రోగులను కాంటాక్ట్ అయిన వారిని వీలైనంత త్వరగా గుర్తిస్తున్నామని చెప్పారు.

    ఏపీకి విదేశాల నుంచి 28 వేల మంది, దిల్లీ జమాత్ నుంచి 1185 మంది వచ్చారని, అందరినీ గుర్తించి క్వారంటైన్లో ఉంచామని డీజీపీ చెప్పారు.

    అన్నిశాఖల సమన్వయంతో పోలీస్ శాఖ ముందుకు వెళ్తోందని చెప్పిన గౌతం సవాంగ్, రాష్ట్ర పోలీసులకు పీపీఈ కిట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం 2.89 కోట్లు మంజూరు చేసిందన్నారు.

  9. ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా లేఖ

    దేశం ఎదుర్కుంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారని ఏఎన్ఐ చెప్పింది.

    సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల గురించి మరోసారి ఆందోళన వ్యక్తం చేసిన సోనియా, దానిని ఎదుర్కోడానికి ఐదు బలమైన పరిష్కారాలను ఈ లేఖలో సూచించారని చెప్పింది.

    View more on twitter
  10. సామాజిక దూరం పాటించని బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ

    కర్ణాటకలో హొన్నలి బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ రేణుకాచార్య సామాజిక దూరం నియమాలను ఉల్లంఘించారని ఏఎన్ఐ చెప్పింది.

    ఈనెల 23న ఆశా వర్కర్ల కోసం దావణగెరె జిల్లాలోని హొన్నలిలో వారు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైనవారు సామాజిక దూరం పాటించకుండా ఒకే చోటభారీ సంఖ్యలో గుమిగూడారు.

    ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను ఏఎన్ఐ పోస్ట్ చేసింది.

    View more on twitter
  11. మే 3 తర్వాత లాక్‌డౌన్ దశలవారీగా ఎత్తివేయాలి: కేవీ సుబ్రమణ్యం

    కేవీ సుబ్రమణ్యం

    కరోనాతో లాక్‌డౌన్ విధించడంతో దేశంలో ఆర్థిక మందగమనం లాంటి పరిస్థితి ఏర్పడింది.

    అయితే లాక్‌డౌన్ ఎప్పుడు పూర్తిగా ఎత్తివేస్తారు అనే దానిపై కేంద్రం ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.

    ఇటు, ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణ్యం బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబోవు రోజుల్లో దశలవారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాల్సి ఉంటుంది అన్నారు..

    బీబీసీ ప్రతినిధి జుగల్ పురోహిత్‌తో మాట్లాడిన ఆయన "మహమ్మారి తర్వాత ఎక్కడ ప్రజలు సజీవంగా ఉంటారో, అక్కడికి సమృద్ధి చేరుకుంటుందని స్పానిష్ ఫ్లూ తర్వాత మనకు తెలిసింది" అని చెప్పారు.

    "అందుకే, మే 3 తర్వాత, మనం జాగ్రత్తగా ఉండాలి. లాక్‌డౌన్‌ను దశలవారీగా ఎత్తివేయాలి. ఇక్కడ మూడు అంశాలు కీలకం. ఒకటి హాట్‌స్పాట్లపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. పనులు జరిగే ప్రాంతాల్లో, కార్యాలయాల్లో సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికవ్యవస్థపై అత్యంత ప్రభావం చూపించే రంగాలను తెరిచేలా చూడాలి" అని కేవీసుబ్రమణ్యం చెప్పారు.

    కేవీ సుబ్రమణ్యం పూర్తి ఇంటర్వ్యూ త్వరలో...

  12. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగుల్లో యాంటీ బాడీస్ ఉండవు: WHO

    కోవిడ్-19 నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారు, తర్వాత మరోసారి ఆ వైరస్‌కు గురికాకుండా కాపాడేలా వారి శరీరంలో యాంటీ బాడీస్ ఉన్నట్టు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

    కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారికి మరోసారి వైరస్ వ్యాపించకుండా శరీరంలో యాంటీ బాడీస్ ఏర్పడతాయని కొన్ని రోజుల ముందు భావించారు. వాటికి డబ్ల్యుహెచ్ఓ తెరదించింది.

    View more on twitter
  13. జమ్మూకశ్మీర్‌కు 2.5 టన్నుల వైద్య పరికరాలు

    కరోనా సంక్షోభ సమయంలో జమ్ముకశ్మీర్‌కు కేంద్రం ఒక విమానంలో అత్యవసర వైద్య పరికరాలను పంపించిందని ఏఎన్ఐ చెప్పింది.

    భారత వైమానిక దళానికి చెందిన లైఫ్ లైన్ ఉడాన్ విమానంలో 2.5 టన్నుల వైద్య పరికరాలు పంపించారు. వీటిలో 50 వేల మాస్కులు, పీపీఈలు, వెంటిలేటర్లు, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్లు, ఇతర మందులు, వ్యాక్సిన్లు ఉన్నాయి అని వార్తా సంస్థ తెలిపింది.

    View more on twitter
  14. సొంత రాష్ట్రానికి 2224 మంది హర్యానా వలస కార్మికులు

    హర్యానాకు చెందిన 2224 మంది వలస కార్మికులు ఈరోజు 82 బస్సుల్లో సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చారని రాష్ట్ర హోంశాఖ అదనపు కార్యదర్శి అవనీష్ కె అవస్థి చెప్పారు.

    వారందరినీ స్వస్థలాలకు పంపించే ముందు వారందరూ కొన్నిరోజులు క్వారంటైన్‌లో ఉంటారని ఆయన చెప్పినట్లు ఏఎన్ఐ ట్వీట్ చేసింది.

    View more on twitter
  15. ర్యాపిడ్ టెస్ట్ కిట్ల వినియోగం మళ్లీ వాయిదా

    దేశంలో కరోనా కోసం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ఉపయోగించకుండా ఆపే దిశగా కేంద్రం యోచిస్తోందని ఏఎన్ఐ చెప్పింది.

    "కరోనావైరస్‌పై మంత్రి మండలి బృందం ఒక సమావేశం నిర్వహించింది. ప్రస్తుతానికి భారత్‌లో పరిస్థితి నియంత్రణలో ఉందని, ప్రభుత్వం వైపున చేపట్టిన చర్యలకు సానుకూల ఫలితాలు వచ్చాయని భావించింది. అందుకే ప్రస్తుతానికి ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ఉపయోగించడాన్ని వాయిదా వేయవచ్చని భావించింది" అని ఏఎన్ఐ తన ట్వీట్‌లో తెలిపింది.

    మరో ట్వీట్‌లో 'ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి 15 లక్షల మందికి పరీక్షలు చేసే సామర్థ్యం ఉంది. చాలా భారతీయ కంపెనీలు టెస్టింగ్ కిట్స్ తయారు చేసే పనిలో ఉన్నాయి. దాదాపు 1.25 లక్షల స్వచ్చంద సేవకులు కోవిడ్-19 చేసే ఈ యుద్ధంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని' చెప్పింది.

    View more on twitter
  16. జపాన్ తీరంలోని నౌకలో 60 కొత్త కేసులు

    నాగసాకి నౌక

    జపాన్‌లోని నాగసాకి రేవు దగ్గర నిలిచి ఉన్న కోస్టా అట్లాంటికా అనే నౌకలో శనివారం 60 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. వీటితో కలిపి ఈ నౌకలో ఉన్న మొత్తం కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 150కి చేరింది.

    ప్రయాణికులు ఎవరూ లేని ఈ నౌకలో 623 మంది సిబ్బంది ఉన్నారని భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత ఈ నౌకను చైనాకు వెళ్లకుండా జపాన్‌లోని నాగసాకి వైపు మళ్లించారు.

    అప్పటి నుంచి ఇందులో సిబ్బంది చిక్కుకుపోయి ఉన్నారు. అయితే కొంతమంది సిబ్బంది ఇప్పటికే నౌక వదిలి వెళ్లిపోయారని స్థానిక మీడియా చెబుతోంది.

    జపాన్‌లో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 12,800 కరోనా కేసులు బయటపడగా, ఇప్పటివరకూ 345 మంది చనిపోయారు.

  17. యూపీలో జూన్ 30 వరకూ జనం గుమిగూడడంపై నిషేధం-యోగీ

    యోగీ

    జూన్ 30 వరకూ యూపీలో ప్రజలు గుమిగూడడానికి అనుమతి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సీఎం ఈ నిర్ణయంతీసుకున్నారు.

    యూపీలో జూన్ 30 వరకూ రాజకీయ ర్యాలీలు, సామాజిక-సాంస్కృతిక సమావేశాలపై నిషేధం విధించారు. అంతకు ముందు యూపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులను తిరిగి స్వస్థలాలకు తీసుకొస్తామని యోగీ చెప్పారు.

    ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ 1600కు పైగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 25 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 24 వేలు దాటింది. కోవిడ్-19 మృతుల సంఖ్య 775కు చేరింది.

  18. దుకాణాలు తెరవడానికి హోంమంత్రిత్వ శాఖ అనుమతి

    హోంశాఖ ఆదేశాలు

    గ్రామాల్లో అన్నిరకాల షాపులుతెరవడానికి అనుమతులు ఇచ్చామని హోంమంత్రిత్వ అధికారి పుణ్య సలిల శ్రీవాస్తవ చెప్పారు.

    కానీ, పట్టణాలు, నగరాల్లో షాపింగ్ మాల్స్ లాంటి వాటిని తెరవడానికి మాత్రం అనుమతి లేదని చెప్పారు.

    పట్టణ ప్రాంతాల్లో కంటోన్మెంట్ జోన్లోకి రాని పట్టణ ప్రాంతాల్లో కొన్ని రకాల షాపులు తెరవడానికి అనుమతి ఇచ్చాం. వాటిలో చిన్న దుకాణాలు, పరిసరాల్లో ఉన్న షాపులు, జనాలు ఎక్కువగా తిరగని ప్రాంతాల్లో ఉండేవి ఉన్నాయి అని ఆమె చెప్పారు.

    షాపులు తెరిచేవారు కచ్చితంగా ఆరోగ్య ప్రమాణాలను పాటించాలి. వాటిలో పనిచేసేవారు మాస్కులు వేసుకోవాలి. సామాజిక దూరం నియమాలు పాటించాలి అని చెప్పారు.

    వీటితోపాటూ కొన్ని రకాల సేవలు అందించే షాపులు మూసివేయాలని ఆదేశించామని పుణ్య సలిల్ శ్రీవాస్తవ్ చెప్పారు.

    ఈ షాపుల్లో బార్బర్ షాపులు, బ్యూటీ పార్లర్లు లాంటివి ఉన్నాయి. మద్యం షాపులకు కూడా అనుమతి నిరాకరించారు.

  19. కరోనావైరస్ పుట్టుకపై అంతర్జాతీయ దర్యాప్తు చేయాలనే డిమాండ్‌ను తోసిపుచ్చిన చైనా

    కరోనావైరస్ పుట్టుక గురించి స్వతంత్రంగా అంతర్జాతీయ దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌ను చైనా తోసిపుచ్చింది.

    ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచే, అసలు అది ఎలా మొదలైందో తేల్చేందుకు అంతర్జాతీయ దర్యాప్తునకు చైనా అనుమతించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

    ఈ డిమాండ్లు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని, కరోనా మహమ్మారి మీద పోరాడుతున్న చైనా దృష్టిని అవి పక్కదారి పట్టిస్తాయని బ్రిటన్‌లోని ఉన్నత స్థాయి చైనా రాయబారి ఒకరు షెన్ వెన్ బీబీసీతో అన్నారు.

    అంతర్జాతీయ దర్యాప్తు జరిపించేందుకు చైనా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలేంటి?

    పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

    కరోనావైరస్ పుట్టుకపై అంతర్జాతీయ దర్యాప్తు చేయాలనే డిమాండ్‌ను తోసిపుచ్చిన చైనా
  20. లాక్‌డౌన్ ఎఫెక్ట్: పడిపోయిన పాలు, పాల ఉత్ప‌త్తుల‌ విక్ర‌యం... కష్టాల్లో పాడి రైతులు

    లాక్‌డౌన్ కార‌ణంగా దాదాపుగా అన్ని రంగాలూ ప్ర‌భావితం అవుతున్నాయి. చివ‌ర‌కు పాలు, పాల ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు కూడా భారీగా పడిపోతున్నాయి.

    స‌హ‌జంగా మార్చి నుంచి జూన్ నెల వ‌ర‌కూ సీజ‌న్‌గా భావించే పాల ఉత్ప‌త్తుల అమ్మ‌కాల‌కు ఈసారి పెద్ద చిక్కు వ‌చ్చి ప‌డింది. ర‌వాణా స‌మ‌స్య‌లు, ఇత‌ర ఇక్క‌ట్లు క‌లిపి పాల విక్ర‌యాల‌ను 25 శాతానికే ప‌రిమితం చేశామని కొన్ని డెయిరీలు చెబుతున్నాయి.

    దాంతో పాడి రైతుల నుంచి పాల కొనుగోళ్ళ విష‌యంలోనూ నియంత్ర‌ణ త‌ప్ప‌డం లేదని చెబుతున్నారు. తీసిన పాలు ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని రైతులు చెబుతుంటే, చివ‌ర‌కు డెయిరీ సిబ్బందిలో కూడా కోత త‌ప్ప‌డం లేదు.

    పూర్తి కథనం చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

    గేదె పాలు పితుకుతున్న మహిళ