తోటి తెగలో కాబోయే తొలి ఇంజినీరు కళ్యాణి
- అనంత్ అవస్థీ
- బీబీసీ హిందీ

ఫొటో సోర్స్, C H KRISHNA
తెలంగాణలో వేగంగా అంతరించిపోతున్న ఆదివాసీ సముదాయాలలో 'తోటి' తెగ ఒకటి. ఈ సముదాయం నుంచి యూనివర్సిటీలో అడుగు పెట్టిన తొలి అమ్మాయిగా కళ్యాణి చరిత్ర సృష్టించారు.
పదిహేడేళ్ల కళ్యాణి తన ఆర్థిక సమస్యలను, సామాజిక వెనుకబాటునూ లెక్క చేయకుండా జవాహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ - జేఎన్టీయూలో సీటు సంపాదించుకోవడం వెనుక ఎంతో పోరాటం, పట్టుదలా ఉన్నాయి.
ఓటమిని ఎందుకు అంగీకరించాలి?
ఇప్పటి వరకూ సాగిన తన ప్రయాణం గురించి కళ్యాణి బీబీసీతో మాట్లాడారు. ఇక్కడి వరకు చేరుకోవడంలో తన అనుభవాలను పంచుకున్నారు.
"కేవలం ఆడపిల్లను అయినంత మాత్రాన ఓటమిని ఎందుకు అంగీకరించాలి? మా తెగలో ఉన్నత విద్య కోసం యూనివర్సిటీ దాకా చేరుకున్న తొలి అమ్మాయిని నేను. మా సముదాయం నుంచి ఇంజినీరును కాబోతున్న తొలి మహిళను నేనే. ఇది నా చిరకాల స్వప్నం. ఇక్కడి వరకూ చేరుకోగలిగినందుకు చాలా సంతోషపడుతున్నా" అని కళ్యాణి అన్నారు.
చదువు కోసం కళ్యాణి ఆరో తరగతి లోనే తన ఇంటిని వదిలేశారు.
యూనివర్సిటీకి చేరుకోవడం దాకా సాగిన ప్రయాణం గురించి కల్యాణి ఇలా చెప్పారు: "ఊళ్లో మా ఇల్లు చాలా చిన్నది. మా నాన్న కూలీ పని చేసేవాడు. చదువు కోసం నేను ఆరో తరగతిలోనే మా ఇల్లొదిలేసి దూరంగా వెళ్లిపోయాను. నేను హాస్టల్లో ఉంటూ చదువుకున్నాను. అమ్మాయిని అయినందువల్ల అనేక అదనపు సమస్యలు ఎదుర్కొన్నా. అయితే తాగడానికి నీళ్లు కూడా దొరక్కపోవడమనేది అన్నింటికన్నా పెద్ద సమస్య. మా ఇంట్లో తాగేందుకు నీళ్లు వచ్చేవి కాదు.
ఫొటో సోర్స్, C H KRISHNA
'తోటి లాగా కష్టపడాలి. రాజు లాగా సుఖపడాలి' అనే సామెత వీరి చాకిరీకి సంకేతం.
'మా వాళ్ల కోసం ఇంజినీరును కావాలి'
'తోటి' సముదాయాన్ని 'గోండు' ఆదివాసీ తెగకు ఉపతెగ అని చెబుతారు. గ్రామాలు తిరుగుతూ 'కీకిరి' అనే వాయిద్యంతో కథలు చెప్పడంలో వీరికి చాలా ప్రావీణ్యం ఉంది.
'తోటి లాగా కష్టపడాలి. రాజు లాగా సుఖపడాలి' అనే సామెత వీరి శ్రమైక జీవనానికి అద్దం పడుతుంది.
తమ తెగకు చెందిన వారు ప్రతిరోజూ ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారో కల్యాణి కళ్లారా చూశారు. వారిని ఈ కష్టాల నుంచి బైట పడెయ్యడం కోసం ఆమె సైంటిస్టు కావాలనుకుంటున్నారు.
తమ ఇల్లూ, ఊరూ గురించి చెప్పేటప్పుడు కల్యాణి భావోద్వేగానికి లోనవుతారు.
మళ్లీ కాస్త స్థిమితపడ్డ తర్వాత, "మా ఊళ్లో రైతులకు చాలా సమస్యలున్నాయి. వాళ్లు ఎంతో బాధ పడుతున్నారు. అందుకే నేను ఇంజినీరును కావాలనుకుంటున్నా. నా చదువుతో వారికి కొంచెమైనా మేలు జరగాలనుకుంటున్నా" అని కల్యాణి అన్నారు.
ఫొటో సోర్స్, C H KRISHNA
"మా నాన్న చాకటి కృష్ణ నా జీవితంలో అసలైన హీరో." - కళ్యాణి
'మీపై మీరు నమ్మకం పెట్టుకోండి'
ఆ తర్వాత కల్యాణి మరింత ఆత్మవిశ్వాసంతో ఇలా అన్నారు: "నేను ఇంజినీరు, సైంటిస్టు అయింతర్వాత మళ్లీ మా ఊరికే వెళ్తాను. అక్కడి జనాల బాధల్ని కొంతైనా తగ్గించడానికి ప్రయత్నిస్తాను."
ఒకప్పుడు తోటి తెగకు చెందిన మహిళలు ఊరూరూ తిరిగి పచ్చబొట్లు వేయడంలో ప్రసిద్ధులు.
కానీ కాలక్రమంలో వారు కూడా వ్యవసాయ కూలీ పనుల్లోనే స్థిరపడిపోయారు.
'సాటి అమ్మాయిలకు కల్యాణి ఏం చెప్పాలనుకుంటున్నారు' అని అడిగినప్పుడు, "అమ్మాయిలెవ్వరూ ఎవ్వరికీ భయపడకూడదు. మీరేం సాధించాలనుకుంటున్నారో దానికి కావాల్సిన ధైర్యసాహసాలు మీలో ఉన్నాయని గుర్తించండి. అమ్మాయిగా పుట్టినందుకు ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించకండి. ప్రపంచంలో చాలా సమస్యలున్నాయి. బాగా కష్టపడండి. మీ చేతుల్ని మీరు నమ్ముకోండి. ఇతరులపై ఆధారపడకండి. బాధ్యతల్ని చేపట్టడానికి జంకకండి. అంతే.. మీకిక తిరుగుండదు" అని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, SRINIVAS SWAMY
కోచింగ్ కోసం మొదట్లో విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చేది.
కూతుళ్ల బాధ్యత
"మీ కూతుళ్లను బాధ్యతలు తీసుకోనివ్వండి, వాళ్లపై భరోసా ఉంచండి. మీ మనసులో ఉన్న భయాలన్నీ తొలగించుకోండి" అని కల్యాణి ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులకు చెప్పాలనుకుంటున్నారు.
తన తండ్రి గురించి చెప్పమని అడిగినప్పుడు, "మా నాన్న చాకటి కృష్ణ నా జీవితంలో అసలైన హీరో. ఆయన పదవ తరగతి వరకే చదివినప్పటికీ చిన్నతనం నుంచే నన్ను ఇంజినీరింగ్ చదవాలని ప్రోత్సహిస్తూ వచ్చారు" అని కల్యాణి చెప్పారు.
గత రెండేళ్లలో తెలంగాణలోని వేర్వేరు ఆదివాసీ తెగలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు కల్యాణి లాగానే దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరారు.
ఆదివాసీ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులలో ప్రతిభను ప్రోత్సహించేందుకు 2015 నుంచి ఐటీడీఏ (సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ) స్టార్స్ 30 పథకం కింద సహాయం అందిస్తోంది.
ఫొటో సోర్స్, SRINIVAS RAO
స్టార్ 30 పథకం కింద ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థినీ, విద్యార్థులు
సూపర్-30 ఒరవడిలో
ఈ పథకాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆర్.వీ. కర్నన్ ఈ విషయంపై మాట్లాడుతూ, "కల్యాణి అంతరించిపోతున్న తోటి తెగకు చెందిన అమ్మాయి. తోటి తెగ మొత్తం జనాభా ఇప్పుడు ఆరు వేలకు మించి లేదు. అనేక అసమానతలను ఎదుర్కొంటూ ఈ అమ్మాయి ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్ పాస్ కావడం సంతోషకరం" అని అన్నారు.
"మేం బిహార్ సూపర్ 30ని ప్రేరణగా తీసుకొని స్టార్ 30 అనే పథకాన్ని ప్రారంభించాం. కోచింగ్ కోసం మొదట్లో పిల్లలు హైదరాబాద్‌కు వెళ్లే వారు. అయితే వెనుకబడిన సముదాయాలకు చెందిన పిల్లలు హైదరాబాద్ వెళ్లలేకపోయేవారు. దాంతో మేం ఈ పథకాన్ని ప్రారంభించి ఆదివాసీ తెగలకు చెందిన 10 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి దిల్లీ, తదితర మహానగరాలలో లభ్యమయ్యే కోచింగ్, నోట్స్, మాక్ టెస్ట్ వంటివి ఆదిలాబాద్‌లోనే అందించాం" అని కలెక్టర్ చెప్పారు.
ఈ పథకం కింద ఉచిత వసతి, కోచింగ్ అందిస్తారు. 2017లో స్టార్ 30 పథకం వల్ల ఆదివాసీ తెగలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఐఐటీ, జేఈఈ ఎంట్రన్స్ పరీక్షలలో ఉత్తీర్ణులు కాగలిగారు.
మా ఇతర కథనాలు:
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన 10 విషయాలు
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- ‘అమెరికాలో రెట్టింపైన భారతీయ విద్యార్థులు’
- కాలేజీ పాఠమట.. కట్నంతో లాభమట!
- అభిప్రాయం: సమ న్యాయం జరిగేలా స్థానికతను నిర్వచించాలి
- మీ ద్వేషమే మీకు రక్ష!!
- బౌద్ధ సన్యాసినుల్ని మీరెప్పుడైనా చూశారా!
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లోనూ ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి)