త‌ల్లిపాలు ప‌ట్టించే టెక్నాల‌జీతో ఉపయోగమా? ఇబ్బందా?

  • 26 సెప్టెంబర్ 2017
తల్లిపాలు సాంకేతిక సహాయం టెక్నాలజీ పాల పంపులు Breastfeeding technology pumps Image copyright Getty Images

పాలిచ్చే త‌ల్లుల‌కు చాలా ర‌కాలుగా స‌హ‌క‌రించే యాప్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. బేబీ ఎంత గ్యాప్‌తో పాలు తాగుతోంది, చివ‌రిసారిగా ఏ వైపు తాగింది, స‌గ‌టున ఎంత సేపు తాగుతోంది.. ఇలాంటి స‌మాచారాన్ని ఆ యాప్‌ల ద్వారా తెలుసుకోవ‌చ్చు.

త‌ల్లిపాల గొప్ప‌త‌నం గురించి కొత్త‌గా చెప్పుకోవాల్సింది లేదు.

''వీడు నాలుగేళ్లు రొమ్ముపాలు తాగాడు. అందుకే దుక్క‌లాగా ఉన్నాడు'' అని గ‌ర్వంగా చెప్పుకునే తల్లులు చాలామందే ఉంటారు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వైద్య సంస్థలూ తల్లిపాలు పట్టించటం వల్ల అటు పిల్లలకు, ఇటు తల్లులకు కలిగే లాభాలను ప్రచారం చేస్తున్నాయి.

కానీ, పసికందులకు పాలు పట్టించటంలో చాలామంది తల్లులు ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా పాలు పట్టించలేకపోతున్నామని కొందరు బాధపడుతున్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పిల్లల్ని పెంచటం ఒక మధురానుభూతి. తల్లులు చాలా విషయాలపై శ్రద్ధ పెట్టాల్సి వస్తుంది.

అలారమ్‌లు పెట్టుకోవచ్చు

పిల్లలకు పాలు పట్టించటంలో తల్లులకు సహకరించే టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. ఈ వ్యాపారం ఊపందుకుంటోంది.

కాలిఫోర్నియాకు చెందిన రియల్‌ ఎస్టేట్ ఉద్యోగం చేసే యాష్లే ఆల్బర్ట్‌కు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ నాలుగేళ్లలోపు వారే.

పిల్లలకు పాలివ్వటంలో బేబీ కనెక్ట్‌ అనే యాప్ తనకు బాగా ఉపయోగపడుతోందని ఆమె అంటున్నారు.

ఈ యాప్‌లో సమాచారం మొత్తాన్ని రికార్డు చేయటంతో పాటు అలారమ్‌లను కూడా పెట్టుకోవచ్చు.

''పాలివ్వటం, డైపర్లు మార్చటం, పిల్లల ఎదుగుదల, వారికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ఆస్పత్రి సమాచారం, మందులు, ఆహారం.. ఇలా అన్నింటికీ ఈ యాప్‌ను నేను వాడుకున్నాను'' అని ఆల్బర్ట్ చెప్పారు.

Image copyright Kristina Martin
చిత్రం శీర్షిక పిల్లల్ని పెంచేందుకు ఏదో ఒక విధంగా తల్లులు టెక్నాలజీపై ఆధారపడుతున్నారు.

అమెరికాలో స్థిరపడిన ఫ్రెంచ్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గ్జేవియర్ లానే 2008లో తన భార్య ఇద్దరు పిల్లలకు పాలు పట్టించటంలో సహకరించటానికి ఈ యాప్ రూపొందించారు.

ఫీడ్ బేబీ, మైమెడెల వంటి యాప్‌లు కూడా వినియోగంలో ఉన్నాయి.

కానీ, ఈ యాప్‌లు ఉపయోగపడతాయని అందరూ ఒప్పుకోవట్లేదు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పంప్‌ల సహాయంతో పాలు పట్టించే విధానం రాన్రానూ పెరుగుతోంది.

'మనకు తెలిసినదానికంటే కొత్తగా చెప్పేదేముంది?'

‘‘ఒక తల్లి పని కేవలం పిల్లల్ని చూసుకోవటమే కాదు. తన జీవితాన్ని మెరుగుదిద్దుకోవటం, తన లక్ష్యాలను సాధించటం, స్వతంత్రంగా ఎదగటం కూడా. యాప్‌ల సహకారం తీసుకుంటే ఆమె ఈ రెండింటినీ సమన్వయం చేసుకోగలుగుతుంది‘‘ అని మెడెలా కంపెనీలో ఛీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న స్టీఫెన్ ఫ్లింట్ చెప్పారు.

కానీ, ఈ యాప్‌లు అర్థవంతమైన సమాచారం ఇవ్వటం లేదని కొందరంటున్నారు.

మనం ఇచ్చే సమాచారాన్ని విశ్లేషించి, మనకు కొత్త సమాచారాన్ని, విలువైన సలహాలను ఇచ్చేలా యాప్‌లు ఉండాలే కానీ, మనం అంచనా వేయగలిగిన సమాచారాన్నే ఇస్తే ఉపయోగం ఏంటని వైద్య రంగ విశ్లేషకుడు బ్రహదీశ్ చంద్రశేఖర ప్రశ్నిస్తున్నారు.

పంప్‌ల సహాయంతో పాలు తీసి, డబ్బాల్లో పోసి పిల్లలకు పట్టించటం మనకు కొత్తకాదు. అయితే, మరో ఐదేళ్లలో ఈ పంప్‌లు 11 శాతం పెరగనున్నాయని నిపుణులు అంటున్నారు.

అయితే, పాలు తీసేప్పుడు ఈ పంప్‌లు వింత శబ్దాలు చేస్తున్నాయని కొందరు తల్లులు ఫిర్యాదు చేస్తున్నారు. కాబట్టి, రాబోయే కాలంలో పెరుగుతున్న సాంకేతికతతో ఈ శబ్దాలను తగ్గించే అవకాశం ఉంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఈ కథనం గురించి మరింత సమాచారం