ప్రెస్‌ రివ్యూ: పెరిగిన తిరుమల శ్రీవారి ప్రసాదం ధరలు!

  • 22 డిసెంబర్ 2017
తిరుమల ఆలయం Image copyright Sridhr Raju

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రసాదాల ధరలు పెరిగాయని ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించాయి.

ఆ కథనాల ప్రకారం.. సిఫార్సు లేఖలతో వచ్చే వారికి జారీ చేసే లడ్డూ, ఇతర ప్రసాదాల ధరలను పెంచారు. కొత్త ధరలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చాయి.

ఆలయం లోపల వగపడిలో సిఫారసులపై విక్రయించే లడ్డూ, వడ, పెద్ద లడ్డూతోపాటు పెద్ద వడ ధరలూ పెరిగాయి.

ఆలయం వెలుపల ఉద్యోగుల సిఫారసులపై జారీచేసే లడ్డూ ధరలు రూ.25 నుంచి రూ.50కి పెంచారు.

టీటీడీ సమాచార కేంద్రాలకు తరలించే లడ్డూ ధరను సైతం రూ.50కి పెంచారు.

దర్శనంతో నిమిత్తం లేకుండా జారీ చేస్తున్న లడ్డూ ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు.


ప్రసాదాలు తయారీ ఖర్చు పాత ధర కొత్త ధర
చిన్న లడ్డూ 40 25 50
పెద్ద లడ్డూ 100 200
చిన్న వడ 80 25 100
పెద్ద వడ 50 200
కళ్యాణోత్సవం లడ్డూ 160 100 200

అదనపు లడ్డూ ప్రసాదం కోరుకునే వారికి మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది.

భక్తులకు దేవస్థానం అందించే లడ్డూ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు.

సర్వదర్శనం, దివ్యదర్శనంలో ఇచ్చే రాయితీ, అదనపు లడ్డూ ధరలు, రూ.300 టికెట్లు, వీఐపీ దర్శన టికెట్లపై ఇచ్చే అదనపు లడ్డూ ధరలు యధాతథంగా ఉంచారు.

లడ్డూ ప్రసాదాల ధరను గత పదేళ్లుగా టీటీడీ పెంచలేదు.

ముడి సరకుల ధరలు పెరగడంతో భక్తులపై భారం వేయక తప్పలేదని టీటీడీ చెబుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గూగుల్ మ్యాప్‌తో ఇక లెక్క పక్కా!

గూగుల్ మ్యాప్‌తో ఆస్తుల గుర్తింపు!

గూగుల్ మ్యాప్‌తో ఆస్తులను గుర్తించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది.

దాని ప్రకారం ఆస్తుల మార్కెట్‌ విలువ పక్కాగా తెలుసుకునేందుకు, ఆ వివరాలు మున్సిపల్, పంచాయతీ, రెవెన్యూ శాఖలతో అనుసంధానం చేసేందుకు ఈ టెక్నాలజీని వాడబోతున్నారు.

ఇందుకోసం జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ - జీఐఎస్‌ సాయంతో గూగుల్ మ్యాప్‌ల ద్వారా ఆస్తులను గుర్తించాలని ఏపీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించింది.

గూగుల్ మ్యాప్‌ల ద్వారా ఆస్తులను గుర్తించి, వాటి సర్వే నెంబర్ల బట్టి అక్కడ నిర్మాణాలు ఉన్నాయా, ఖాళీ స్థలమా అనేది నిర్ధరిస్తారు.

మార్కెట్ విలువ నిర్ణయంలో పొరపాట్లు దొర్లకుండా జీఐఎస్‌ పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు.

చిలకలూరిపేట పట్టణంలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు.

రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్ చేరింది.

Image copyright APPSC

2018లో ఏపీలో కొత్త నోటిఫికేషన్లు!

ఏపీలో వివిధ పోస్టుల భర్తీకి 2018లో కొత్త నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నాయని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. త్వరలోనే రిక్రూట్‌మెంట్ల కేలండర్ విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్ వివరించినట్లు ఆ కథనం పేర్కొంది.

ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని ఉదయభాస్కర్ చెప్పారు.

గ్రూప్‌-2 అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జనవరి ఒకటి, రెండు వారాల్లో జరుగుతుందని తెలిపారు.

జనవరి 22 నుంచి గ్రూప్ 1 (2011) ఇంటర్వ్యూలు, త్వరలోనే గ్రూప్‌-1(2016) ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆయన వివరించారు.

గ్రూప్‌-3 ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.

Image copyright DEVIPRIYA/Facebook

దేవిప్రియకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్టు దేవీప్రియ రాసిన 'గాలిరంగు' కవితాసంపుటికి ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అనువాద విభాగంలో వెన్నవరం వల్లభరావు రచించిన విరామమెరుగని పయనం రచనకు అవార్డును ప్రకటించారు.

పత్రికల్లో రన్నింగ్ కామెంటరీ వంటి రాజకీయ వ్యంగ్య కాలమ్‌తో ప్రజలకు చేరువైన దేవీప్రియ నాలుగున్నర దశాబ్దాలుగా కవిత్వాన్ని తన భావచైతన్య వాహికగా చేసుకొన్నారు.

ఆయన అసలు పేరు షేక్‌ఖాజా హుస్సేన్, గుంటూరు ఆయన స్వస్థలం.

దేవీప్రియ అనే కలంపేరుతోనే సాహిత్య ప్రపంచానికి పరిచయమయ్యారు.

దేవిప్రియ సంపాదకత్వంలో వెలువడిన ప్రజాతంత్ర పత్రికలోనే తొలిసారి శ్రీశ్రీ అనంతం ప్రచురితమైంది.

దేవీప్రియ మనోరమ అనే వారపత్రికను నడిపించారు.

అనువాద విభాగంలో వెన్న వల్లభరావుకు, విరామమెరుగని పయనం పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది.

2018 ఫిబ్రవరిలో లక్ష రూపాయల చెక్కు, తామ్రపత్రం, శాలువాతో అవార్డు గ్రహీతలను సత్కరిస్తారు.

Image copyright ROBERTO SCHMIDT

తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపు లేదు!

తెలంగాణలో వచ్చే ఏడాది కూడా ప్రస్తుత విద్యుత్ చార్జీలే వసూలు చేస్తామని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు-(డిస్కంలు) చెబుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి-ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపించాయి.

దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ -టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ-టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యాలు గురువారం 2018-19కి సంబంధించిన తమ వార్షిక ఆదాయ అవసరాల అంచనాలు (ఏఆర్‌ఆర్‌), టారీఫ్‌ ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి.

అయితే రూ.4,300 కోట్ల ఆదాయ లోటును ఎలా అధిగమిస్తారన్న విషయంపై డిస్కంలు ఎలాంటి ప్రకటన చేయలేదు.

విద్యుతచార్జీలు పెంచవద్దని డిస్కంలు చేసిన ప్రతిపాదనలపై ఈఆర్సీ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది.

డిస్కంల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి వచ్చే ఏడాది మార్చిలోగా టారీఫ్‌ ఉత్తర్వులు జారీ చేయనుంది.

విద్యుత్‌ చార్జీలను పెంచవద్దని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే విద్యుత్‌ శాఖను ఆదేశించారు.

మా ఇతర కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి: 'ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా'.. రద్దుపై ఏపీ సీఎం సంకేతాలు

'ఇంగ్లిష్ మీడియం బిల్లు'కు రెండోసారి ఏపీ అసెంబ్లీ ఆమోదం.. ఇప్పుడు మండలిలో ఏం జరుగుతుంది..

కరోనా వైరస్‌: చైనాలో మరో నగరానికి రాకపోకలు నిలిపివేత

‘రోహింజ్యాలపై మారణహోమం ఆపేందుకు చర్యలు తీసుకోండి’- మయన్మార్‌కు ఐసీజే ఆదేశం

ఆంధ్రప్రదేశ్: శాసన మండలిలో అసలేం జరిగింది? సెలెక్ట్ కమిటీ ఏం చేస్తుంది

చనిపోయిన వ్యక్తి నుంచి వీర్యం సేకరించి పిల్లలు పుట్టించొచ్చా

పీవీ సింధు విజయాల వెనుక పీబీఎల్‌ పాత్ర కూడా ఉందా

రజినీకాంత్ చెప్పిన దాంట్లో నిజమెంత... సీతారాముల నగ్నవిగ్రహాలకు పెరియార్ చెప్పుల దండలు వేసి ఊరేగించారా..

బెజోస్ ఫోన్ హ్యాకింగ్: అమెజాన్ బిలియనీర్ ఫోన్‌ని సౌదీ యువరాజు హ్యాక్ చేశారా?