పాలమూరు జిల్లాలో శిలాయుగపు ఆనవాళ్లు!

  • 4 జనవరి 2018
నిలువు రాళ్లు
చిత్రం శీర్షిక ఈ రాళ్ల నీడ మారితే కాలం మారినట్లు లెక్క!

చూడ్డానికి ఇవి మామూలు రాళ్లు. 14 అడుగుల ఎత్తున్న నిలువురాళ్లు. ఒకప్పుడు వీటిని చూస్తే ప్రజలకు భయం. పరిశోధకులకు మాత్రం ఇవి అత్యంత అమూల్యమైనవి.!

తెలంగాణ-కర్నాటక సరిహద్దుల్లో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణ మండలం కృష్ణా తీరంలో ముడుమాల్ గ్రామం శివార్లలో ఇవి ఉన్నాయి.

పంట పొలాల్లో 80 ఎకరాల విస్తీర్ణంలో 80 గండ శిలలు ఉన్నాయి. ఒక్కోటి 12 నుంచి 14 అడుగుల ఎత్తు ఉన్నాయి.

చిన్న చిన్న రాళ్లు 3500లకు పైగానే ఉన్నాయి.

రాళ్ల నీడ మారితే కాలం మారుతుంది!

ఇప్పుడు వాతావరణ మార్పులను తెలుసుకునేందుకు ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది.

కానీ 3000 ఏళ్ల క్రితం ఈ నిలువురాళ్ల నీడ ఆధారంగానే అప్పటి ప్రజలు రుతువులు, కాలాలను గుర్తించే వారని పరిశోధకులు చెబుతున్నారు.

సూర్యుడి గమనాన్ని బట్టి పడే ఈ రాళ్ల నీడల ఆధారంగా వాతావరణ మార్పులను అప్పటివారు గుర్తించేవారని అంచనా వేస్తున్నారు.

అంటే రాళ్ల నీడలు ఒక క్రమంలో, ఒక నిర్దిష్ట ప్రాంతంలో పడగానే రుతుపవనాలు ప్రారంభమవుతాయని, నీడలు మరో క్రమంలో, మరో చోటికి మారితే ఎండాకాలం వచ్చిందని తెలుసుకుంటారని నిపుణుల బృందం గుర్తించింది.

చిత్రం శీర్షిక ఒక్కో నిలువు రాయి 12 నుంచి 14 అడుగుల ఎత్తు ఉన్నాయి

నాడు ఖగోళ పరిశోధనశాల.. నేడు రాళ్లదిబ్బ!

ఈ నిలువురాళ్లను ఆనాటి ఖగోళ పరిశోధనశాలగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

క్రీ.పూ 500 ఏళ్ల క్రితమే ఇక్కడి వాళ్లు 'స్కై మ్యాప్' తయారు చేసుకున్నారు. అప్పటి స్కై మ్యాప్‌ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది.

అప్పటి స్కై మ్యాప్‌కు, ఇప్పుడు ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించిన ఆధునిక స్కై మ్యాప్‌కు పోలికలు ఉన్నట్లు గుర్తించారు.

ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మండలాన్ని ఒక రాతిపై ఆనాడే చెక్కారు.

నిలువు రాళ్లకు కేంద్ర బిందువుగా దాన్ని ఏర్పాటు చేశారు.

చిత్రం శీర్షిక నక్షత్రాలు, గ్రహాల కదలికలను పరిశీలించడానికి క్రీ.పూ.500 క్రితం తయారు చేసినట్లు చెబుతున్న 'స్కై మ్యాప్' ఇది

నిలువురాళ్లపై విదేశీ పరిశోధకుల ఆసక్తి!

వేల ఏళ్ల క్రితమే ఖగోళశాస్త్ర పరిశోధనలకు ముడుమాల్ కేంద్రంగా నిలిచిందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ పుల్లారావు చెప్పారు.

ముడుమాల్ రాళ్లపై ఆయన అధ్యయనం చేశారు. దేశ, విదేశాలలో వీటిపై పరిశోధన పత్రాలు సమర్పించారు.

పదేళ్ల క్రితమే నిలువురాళ్ల రహస్యం బయటపడింది. అప్పటి నుంచి దేశ, విదేశీ పరిశోధకులు ఈ రాళ్లను అధ్యయనం చేస్తున్నారు.

కాలిఫోర్నియా యూనివర్శిటీ, కొరియా జ్యోంగీ ప్రావిన్షియల్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు బృందం నిలువు రాళ్లపై అధ్యయనం చేసింది.

భవిష్యత్తులో మరింత సమగ్రంగా పరిశోధన చేస్తామని వారు ప్రకటించారు.

ఇంతటి చారిత్ర్రక ప్రాధాన్యత ఉన్న నిలువురాళ్లు ప్రపంచంలో మరెక్కడా లేవని దక్షిణ కొరియా ప్రతినిధులు తెలిపారు.

చిత్రం శీర్షిక ముడుమాల్‌లో ఉన్న నిలువురాళ్లను పరిశోధించడానికి దేశ, విదేశీ శాస్త్రవేత్తలు తరలివస్తున్నారు.

ఆసియాలోనే అత్యంత అరుదైన గండ శిలలు!

ఆదిమానవుల ఊహాశక్తికి, మేధస్సుకు ఈ నిలువురాళ్లు ఒక చిహ్నమని పరిశోధకులు చెబుతున్నారు.

ఆసియాలోనే ఇవి అత్యంత అరుదైన గండ శిలలు అని చెబుతున్నారు.

వీటిని బృహత్ శిలాయుగం నాటి చారిత్రక సంపదగా వారు భావిస్తున్నారు.

బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులకు గుర్తుగా భారీ రాళ్లను పాతుతారు.

ముడుమాల్ పరిధిలో గండ శిలలను క్రమపద్ధతిలో పాతిన తీరు ఆశ్చర్యపరుస్తోంది.

చిత్రం శీర్షిక ముడుమాల్‌లో 80 ఎకరాల్లో 80 నిలువురాళ్లు ఉన్నాయి. 3500పైగా చిన్న రాళ్లు ఉన్నాయి.

దేవత ఆగ్రహానికి గురై మనుషులే రాళ్లుగా మారిపోయారట!

కొన్నేళ్ల కిందటి వరకు స్థానికులు ఈ ప్రాంతాన్ని దయ్యాల దిబ్బగా భావించి అటువైపు వెళ్లేందుకే భయపడేవారు.

నిలువురాళ్లపై చిత్ర విచిత్రమైన కథలు ప్రచారంలో ఉన్నాయి.

గ్రామ దేవత ఆగ్రహనికి గురై, మనుషులే ఇలా రాళ్లుగా మారిపోయారని స్థానికులు చెబుతుంటారు.

ఈ రాళ్లను తాకినా, తొలగించినా రక్తం కక్కుకుని చనిపోతారని పదేళ్ల క్రితం వరకూ భయపడేవారు.

కొందరు స్థానికుల్లో ఇప్పటికీ ఈ భయం అలాగే ఉందని ముడమాల్ గ్రామానికి చెందిన కవిత చెప్పారు.

నిలువురాళ్ల తిమ్మప్పను కులదేవతగా భావిస్తూ స్థానికులు పూజలు చేస్తుంటారు. 30 కుటుంబాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొంటారని సరస్వతి అనే మహిళ బీబీసీతో అన్నారు.

చిత్రం శీర్షిక ఆసియాలో ఒక్క ముడుమాల్‌లోనే ఇలాంటి శిలలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

సమాధి రాళ్లు కాదు.. ఖగోళ పరిశోధనశాల!

ఇవి సమాధి రాళ్లు కావని, క్రీస్తుపూర్వం మానవులు ఖగోళ పరిజ్ఞానానికి తగ్గట్టుగా వీటిని ఏర్పాటు చేసుకున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

ఇక్కడ పాతిన నిలువు రాళ్లన్నీ నల్లరాళ్లే. వాటిని కృష్ణా నది ఒడ్డు నుంచి తెచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు.

అవి చాలా కాలం నీళ్లలో నానిన రాళ్లుగా తేల్చారు.

కేవలం నిలువుగా పాతేందుకు ప్రత్యేకంగా నల్లరాళ్లనే ఎందుకు వాడారో తెలియాల్సి ఉంది.

భారీ శిలలతో కూడిన వృత్తాకార నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి.

ఆసియా ఖండంలో ఇలాంటివి ఇక్కడ మాత్రమే ఉన్నాయని పురావస్తు నిపుణులు చెబుతున్నారు.

పలు దేశాలకు చెందిన ప్రొఫెసర్లు కూడా ఈ ప్రాంతంపై పరిశోధన చేశారు.

ఈ నిర్మాణం వెనుక ఇంకా మరెన్నో రహస్యాలు దాగున్నాయని పరిశోధకులు చెప్పినట్లు ముడుమాల్‍ సర్పంచ్ అశోక్ గౌడ్ బీబీసీకి వివరించారు.

చిత్రం శీర్షిక గుప్త నిధుల తవ్వకాలతో కొన్ని రాళ్లు ధ్వంసం అయ్యాయి

నిలువురాళ్ల కింద గుప్త నిధులు!

ఈ శిలల కింద గుప్త నిధులు ఉన్నాయన్న ఆశతో కొందరు దుండగులు తవ్వకాలు జరిపారు. 2006లో ప్రొక్లెయినర్‌తో తవ్వకాలు చేపట్టారు. కానీ ఎలాంటి నిధులు దొరకలేదు.

ఈ ప్రాంతంలోని భూములను ప్రభుత్వం కొందరు రైతులకు పంచింది.

వారిలో కొందరు ఈ రాళ్లను ధ్వంసం చేసి వ్యవసాయం ప్రారంభించారు.

ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

నిలువురాళ్ల పరిరక్షణకు తమ శాఖ ద్వారా చర్యలు చేపడుతున్నట్టు పురావస్తు శాఖ డైరెక్టర్ విశాలాక్షి తెలిపారు.

పట్టాదారుల నుంచి 4ఎకరాల స్థలాన్ని సేకరించామని, మరో 10ఎకరాల ప్రభుత్వ భూమి కలుపుకుని మొత్తం 14ఎకరాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ అనుమతితో భవిష్యత్‌లో తవ్వకాలు జరిపి సమగ్ర అధ్యయనం చేస్తామని బీబీసీకి వివరించారు.

మా ఇతర కథనాలు:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.