ప్రెస్‌రివ్యూ: ఆధార్‌ డేటా సులభంగా సైబర్ దాడికి గురికావొచ్చు : ఆర్బీఐ అనుబంధ సంస్థ

  • 10 జనవరి 2018
అదన్నమాట

సైబర్‌ నేరగాళ్ల నుంచి ఆధార్‌ సమాచారానికి ఎప్పటికైనా ముప్పు తప్పదని భారతీయ రిజర్వ్‌ బ్యాంకుకు అనుబంధంగా ఉన్న 'బ్యాంకింగ్‌ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, పరిశోధన సంస్థ' తేల్చినట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

సమాచారాన్ని వాణిజ్యపరంగా దుర్వినియోగం చేయడం కంటే... ఇది సులభంగా సైబర్‌ దాడికి గురయ్యేలా ఉండడం ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది.

వేలిముద్రల సమాచారం జాతికి ముఖ్యమైన సొత్తు. బ్యాంకు వ్యవస్థకు, వివిధ ప్రభుత్వ పథకాలకు ఇవే ఆధారం.

వాణిజ్యాన్ని, పరిపాలనను సంకట స్థితిలోకి నెట్టేసే రీతిలో ఉడాయ్‌ సమాచారంపై దాడి జరిగితే వాటిల్లే నష్టం అపారం... అనూహ్యం' అని పేర్కొంది.

ఆధార్ సమాచారాన్ని కాపాడడం ప్రధానమైన సవాల్‌.

అనేక పథకాలకు, ఆర్థిక కార్యకలాపాలకు ఆధార్‌ను వాడుతున్నందువల్ల ఎక్కువ జాగ్రత్తలు అవసరమని అభిప్రాయపడింది.

ఆధార్‌తో ప్రయోజనాలు ఎక్కువా, ఖర్చు ఎక్కువా అనేది కాలమే తేల్చాలని పేర్కొంది.

రూ.500కే ఆధార్ లీక్‌ కథనం నేపథ్యంలో 'బ్యాంకింగ్‌ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, పరిశోధన సంస్థ' చేసిన అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకొంది.

Image copyright ISRO

స్వదేశీ ఉప గ్రహాల ప్రయోగంలో ఇస్రో సెంచరీ!

స్వదేశీ ఉపగ్రహాల ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సెంచరీ కొట్టబోతుంది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈ నెల 12న ఉదయం 9.28 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ-40 రాకెట్‌ ద్వారా స్వదేశీ వందో ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది.

స్వదేశీ ఉపగ్రహం కార్టోశాట్‌-2ఈఆర్‌తో పాటు మరో 30 శాటిలైట్లను ఒకేసారి రోదసిలోకి పంపుతారు.

కార్టోశాట్‌-2ఈఆర్‌ భూ వాతావరణంలో మార్పులను గుర్తించడానికి సహాయం చేస్తుంది.

కార్టోశాట్‌-2ఈఆర్‌ బరువు 710 కేజీలు. మిగతా 30 ఉపగ్రహాల బరువు 613 కిలోలు.

30 ఉపగ్రహాలలో మరో రెండు భారత్‌కు చెందినవే. ఒకటి మైక్రో శాటిలైట్‌కాగా, రెండోది నానో శాటిలైట్‌.

మిగతా 28 ఉపగ్రహాలలో అమెరికా, బ్రిటన్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ కొరియా, ఫ్రాన్స్‌, ఫిన్‌లాండ్‌, కెనడా దేశాలకు చెందిన 3 మైక్రో, 25 నానో శాటిలైట్లు ఉన్నాయి.

Image copyright Getty Images

లాలూ సేవ కోసం ముందే జైలుకు!

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు సహాయంగా ఉండేందుకు ఇద్దరు అనుచరులు ఆయనకంటే ముందే జైలుకు వెళ్లారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. దాని ప్రకారం..

చాలారోజులు లాలూ సహాయకులుగా పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం ఆయన ఉన్న రాంచీ బిర్సాముండా జైల్లోనే ఉన్నారు. దాణా కేసు తీర్పు వచ్చే లోపే జైల్లో సేవకుల ఏర్పాట్లు జరిగిపోయాయి.

లక్ష్మణ్‌ మహతో, మదన్‌ యాదవ్‌లు రాంచీలో పాల వ్యాపారం చేసేవారు. లక్ష్మణ్‌, మదన్‌ తనపై దాడి చేసి, 10వేలు దొంగిలించారంటూ సుమిత్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.

ఆ వెంటనే.. పోలీసుల ఎదుట లక్ష్మణ్‌, మదన్‌ లొంగిపోయారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరచగా జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించారు.

ప్రస్తుతం జైల్లో లాలూకు వీరు వండిపెట్టడం సహా ఇతర పనులు చేసిపెడుతున్నారు.

గతంలో మరో కేసులో లాలూ జైల్లో ఉన్నప్పుడు కూడా లక్ష్మణ్‌, మదన్‌ అక్కడే ఉన్నారు.

Image copyright Twitter

అజ్ఞాతవాసికి సంక్రాంతి కానుక!

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించిన అజ్ఞాతవాసి సినిమా ప్రత్యేక ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సాక్షి ఒక వార్త రాసింది. దాని ప్రకారం..

10 తేదీ నుంచి 17వ తేదీ వరకు అజ్ఞాతవాసి సినిమాకు రాత్రి 1 గంట నుంచి ఉదయం 10గంటల వరకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గతంలో వచ్చిన సందేశాత్మక, చారిత్రాత్మక, సాంఘిక సినిమాలకు ఇవ్వని ఈ ప్రత్యేక అనుమతి, కమర్షియల్ చిత్రం అజ్ఞాతవాసికి ఇవ్వడంపై సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.

తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఒక్క షో వేసుకునేందుకు మాత్రమే అనుమతినిచ్చినట్లు తెలుస్తోందని రాసింది.

'సినీ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ సీఎం చంద్రబాబు గతంలో పన్ను మినహాయింపు ఇచ్చారు.

దానికంటే ముందు విడుదలైన చారిత్రక సినిమా రుద్రమదేవికి ఎటువంటి పన్ను మినహాయింపులుగానీ, రాయితీలు గానీ ఇవ్వలేదు.

భారీ బడ్జెట్‌తో బహుభాషల్లో నిర్మించిన బాహుబలికి కూడా అజ్ఞాతవాసికి ఇచ్చిన తరహాలో అవకాశం ఇవ్వలేదని సినీవర్గాలు అంటున్నాయని' సాక్షి కథనం పేర్కోంది.

Image copyright Getty Images

ట్రెండ్ మారుతోంది. క్లీన్ షేవ్‌ స్థానంలో యువకులు గడ్డం పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గడ్డం పెంచడమే కాదు.. దాని సంరక్షణకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడటం లేదు.

భారతదేశంలో మగవారు తమ గడ్డాల అందానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. గడ్డం మెరుపు తమ అందాన్ని, ఆనందాన్ని మరింత పెంచుతుందని మగవారు భావిస్తుండటంతో గడ్డం సంరక్షణకు అధికంగా ఖర్చు చేస్తున్నారు.

ఫలితంగా మగవారి సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ విలువ వంద కోట్లకు చేరిందని నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది. ఆ కథనం ప్రకారం..

సినిమా హీరోలు, క్రికెట్ స్టార్లను ఆదర్శంగా తీసుకుని యువత గడ్డం పెంచడంపై ఆసక్తి చూపిస్తున్నారు. మొదట్లో తాత్కాలిక వ్యామోహంలా కనిపించినా.. మెల్లగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు కూడా ఈ ధోరణి విస్తరించింది.

  • గడ్డం ఉంచుకోవడం లౌకికవాద ధోరణికి ప్రతీకగా భావిస్తున్నారు.
  • గడ్డానికి ప్రత్యేకంగా నూనెలు, వ్యాక్స్, హెయిర్ సెరమ్, ట్యాటూ ఆయిల్ మార్కెట్‌లో లభిస్తున్నాయి.
  • రూ.2500 విలువ చేసే 24 క్యారెట్ గడ్డం నూనె సైతం అందుబాటులో ఉంది.
  • గడ్డానికి రంగు వేసుకునే ధోరణి బాగా పెరిగింది.
  • గతంలో మాదిరిగా మగవారు మహిళల ఉత్పత్తులను వాడేందుకు ఇష్టపడటం లేదు.

వస్త్రధారణ, అలంకరణపై శ్రద్ధ, పెరిగిన ఆదాయంతో మగవారి సౌందర్య ఉత్పత్తుల మార్కెట్ 5వేల కోట్లకు చేరింది.

మగవారి అలంకరణ ఉత్పత్తుల మార్కెట్ గత ఐదేళ్లలో 42 శాతం వృద్ధి చెందింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.