ప్రెస్‌రివ్యూ: విమాన ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాలి! - పార్లమెంటరీ స్థాయీ సంఘం

 • 15 జనవరి 2018
ఎయిరిండియా విమానం Image copyright Getty Images

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉండాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. అభివృద్ధి చెందిన దేశాల ఛార్జీల విధానం భారతదేశంలో అనుసరణీయం కాదని స్పష్టం చేసింది.

ఈ అంశంపై ఈనాడు పత్రిక ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

విమాన ఛార్జీలపై నియంత్రణ లేకుండా చేయడమంటే... ప్రయాణికులను దోచుకోవడానికి అపరిమిత స్వేచ్ఛను ఇచ్చినట్లు కాదని పార్లమెంటరీ స్థాయీ సంఘం అభిప్రాయపడింది.

ఇంధన ధరలు సగానికి సగం తగ్గినా, ఆ ప్రయోజనాలను ప్రయాణికులకు అందించట్లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రయాణాలను రద్దు చేసుకుంటే డబ్బులను వెనక్కి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది.

సీట్లు, ఆహార నాణ్యత, ఇతర సదుపాయాలపైనా దృష్టి సారించాలని కేంద్రానికి ఇచ్చిన తన నివేదికలో కోరింది.

Image copyright Reuters

పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలోని ముఖ్యాంశాలు

ఇంధన ధరలు గణనీయంగా తగ్గినా, ఆ మేరకు ఛార్జీలను తగ్గించట్లేదు.

 • పండుగల వేళ, తక్కువ సమయం ప్రయాణానికి సాధారణ సమయంలో కంటే పది రెట్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు.
 • పౌరవిమానయాన శాఖ ప్రతి సెక్టర్‌లో కూడా విమాన టికెట్లకు గరిష్ఠ పరిమితిని విధించాలి.
 • రద్దు మొత్తం కనీసం ఛార్జీలో 50% మించకూడదు
 • విమాన టికెట్ల రద్దు ఛార్జీలకు సంబంధించి ఒక విధానం ఉండాలి.
 • కనీస ఛార్జీలో 50 శాతం కంటే ఎక్కువ క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉండకూడదు.
 • టికెట్‌ రద్దు చేసుకున్న ప్రయాణికుల నుంచి పన్నులు, ఇంధన ఛార్జీలను వెనక్కి ఇవ్వాలి.
 • బోర్డింగ్‌ పాస్‌ కోసం చెకిన్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు 10 నిమిషాలకంటే ఎక్కువ ఉండకుండా చూడాలి.
 • సెల్ఫ్‌ చెకింగ్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలి. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో ఈ-బోర్డింగ్‌ సదుపాయం కల్పించాలి.

విమాన ప్రయాణికుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారానికి తీసుకువచ్చిన ఎయిర్‌సేవా యాప్‌ విస్తృతంగా వినియోగించేలా చూడాలి.

విమానాల్లో తగిన లెగ్‌ స్పేస్‌ ఉండటంలేదు. కనీస లెగ్‌ స్పేస్‌కు సంబంధించి పౌరవిమానయాన సంస్థ మార్గదర్శకాలను రూపొందించాలి.

విమానాశ్రయాల్లో విదేశీ విమానాలకు ఎక్కువ అవకాశం కల్పిస్తూ స్వదేశీ విమానాలకు అవకాశాలను తగ్గించడం సరికాదు. కేంద్రం దీనిపై దృష్టి సారించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.

Image copyright Getty Images

గోదావరి-కావేరి అనుసంధానంతో తెలంగాణకు నష్టం!

గోదావరి నుంచి కావేరికి నీటిని తరలించాలన్న కేంద్ర ప్రభుత్వ నదుల అనుసంధాన ప్రతిపాదనను వ్యతిరేకించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని కేంద్రానికి స్పష్టం చేయనుందని ఆంధ్రజ్యోతి ఒక వార్త ప్రచురించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం గోదావరిలో ఉన్న నీరు రాష్ట్ర అవసరాలకే సరిపోతుందని, ఇతర బేసిన్లకు తరలించడానికి అదనపు నీరు లేదని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం గోదావరిపై పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, ఇక్కడి నీటిని ఇతర ప్రాంతానికి తరలిస్తే.. భవిష్యత్తులో తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్రం తెరపైకి తీసుకొచ్చిన నదుల అనుసంధాన ప్రతిపాదనను వ్యతిరేకించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.

ఇదే విషయాన్ని స్పష్టం చేయడానికి మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి ఢిల్లీ వెళ్లనున్నారు.

Image copyright Telangana cmo/facebook

గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు; అక్కడి నుంచి పెన్నా బేసిన్‌ ద్వారా కావేరి బేసిన్‌కు తీసుకెళ్లడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధాన ప్రతిపాదనను తీసుకువచ్చింది.

ఇందులో భాగంగా, ఖమ్మం జిల్లా అనికేపల్లి వద్ద ప్రత్యేక బ్యారేజీని నిర్మించి, ఇక్కడి నుంచి సుమారు 247 టీఎంసీల గోదావరి నీటిని లిప్టు చేసి నాగార్జున సాగర్‌లోకి తరలించాలని ప్రతిపాదించింది. ఆ నీటిని పెన్నా ద్వారా కావేరి బేసిన్‌ వరకు తరలించాలని భావించింది.

నదుల అనుసంధానంలో మొదటి ప్రతిపాదన ప్రకారం మహానది నుంచి నీటిని గోదావరికి తీసుకు రావాల్సి ఉంది. ఇలా మహానది నుంచి తీసుకొచ్చిన నీటిని అనికేపల్లి రిజర్వాయర్‌లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి సాగర్‌కు, ఆ తర్వాత పెన్నా నుంచి కావేరి బేసిన్‌కు తరలించాలని ప్రతిపాదించారు.

అయితే.. మహానది నుంచి నీటి తరలింపును ఒడిసా ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాంతో ఆ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. దానిస్థానంలో తెలంగాణలో కాళేశ్వరం దిగువన గోదావరి నది నుంచి నీటిని కావేరి బేసిన్‌కు తరలించాలని నిర్ణయించింది.

కానీ ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పలు సాగునీటి ప్రాజెక్టులు చేపడుతోంది. ఈ నేపథ్యంలో గోదావరి నుంచి 247 టీఎంసీలను కావేరి బేసిన్‌కు తరలించడానికి అంగీకరిస్తే..భవిష్యత్తులో తెలంగాణ నీటి అవసరాలపై తీవ్ర ప్రభావం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

అయితే.. మహానది నుంచి నీటిని గోదావరిలోకి తీసుకొస్తే.. అప్పుడు నదుల అనుసంధానానికి మొగ్గు చూపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మహానది నుంచి నీటిని తరలించకుండా గోదావరి నుంచే నీటిని తీసుకెళ్లడాన్ని మాత్రం అంగీకరించకూడదని నిశ్చయించింది. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయనుంది.

Image copyright Alok Putul

విస్తరణ వ్యూహంలో మావోయిస్టు పార్టీ

గుజరాత్, మహారాష్ట్రలో విస్తరణకు మావోయిస్టుల పార్టీ కసరత్తు చేస్తోందని సాక్షి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

మహారాష్ట్రలో మావోయిస్టుల పునర్నిర్మాణం చర్యలు నిజమేనని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. ముంబైలో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ చేపట్టిన తనిఖీల్లో ఏడుగురు మావోయిస్టులు పట్టుబడటమే దీనికి నిదర్శనమని చెబుతున్నాయి.

ముంబైలో మావోయిస్టుల కార్యకలాపాల వెనకున్న కారణాలపై ఆరా తీసేందుకు తెలంగాణ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం-ఎస్‌ఐబీ ముంబై వెళ్లింది.

ముంబైలో ఏటీఎస్‌ అరెస్ట్‌ చేసిన ఏడుగురు మావోయిస్టు నేతలు అజ్ఞాతంలో ఉన్న తెలంగాణ వ్యక్తుల జాబితాలో ఉన్నారా లేరా అనే విషయమై ఎస్‌ఐబీ అధికారులు ఆరా తీయనున్నారు.

తెలంగాణ, ఆంధప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు ముంబై పారిశ్రామిక ప్రాంతాలైన విక్రోలీ, రాంబాయ్, అంబేడ్కర్‌నగర్లలో నివసిస్తున్నారు.

ఇక్కడి కార్మికులను తమ కోసం పనిచేసేలా ప్రోత్సహించేందుకు కేంద్ర కమిటీ ఆదేశాలతో కొందరు మావోయిస్టులు రహస్యంగా అక్కడ నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టు నేత గణపతి గతంలో ముంబై వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు ఎస్‌ఐబీ గుర్తించింది. ఇప్పుడు అరెస్టయిన వారిని విచారిస్తే గణపతి ట్రీట్‌మెంట్‌ వ్యవహారంతోపాటు ఇతర కీలక నేతల షెల్టర్ల వివరాలు తెలిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గుజరాత్‌, మహారాష్ట్రలో పార్టీ పునర్మిణానికి గోల్డెన్‌ కారిడార్‌ కమిటీ పేరుతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగిస్తోంది.

Image copyright Getty Images

ఆర్టీసీ బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్

సిటీ ఆర్టీసీ బస్సుల్లో చిల్లర కష్టాలకు చెక్ పెట్టాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది.

అందుకోసం రూ.5, 10,15, 20, 25, 30 వారీగా టెకెట్ డినామినేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

అలాగే, సిటీ ఆర్టీసీ బస్సుల్లో కనీస చార్జీని రూ.7 నుంచి 5కు తగ్గించింది.

ఈ నిర్ణయం హైదరాబాద్‌తోపాటు వరంగల్ సిటీ బస్సుల్లో అమలుకానుంది.

జూన్ 2016లో టికెట్ ధరలు సవరించగా.. అప్పటి నుంచి చిల్లర లేక గొడువలు జరిగాయి.

తగ్గించిన ధరలు ఇలా ఉన్నాయి!

సిటీ ఆర్డినరీ బస్సుల్లో కనీస టికెట్ ధర రూ. 7 నుంచి రూ.5కు తగ్గింది.

 • రూ.8, 11గా ఉన్న టికెట్ ధరలు ప్రస్తుతం రూ.10
 • రూ.13 నుంచి 17వరకు ఉన్న ధరలు ప్రస్తుతం రూ.15
 • రూ.18 నుంచి 22 వరకు ఉన్న ధరలు ప్రస్తుతం రూ.20
 • రూ.23 నుంచి 27 వరకు ఉన్న ధరలు ప్రస్తుతం రూ.25

మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ధరలు ఇలా

 • రూ. 8 నుంచి 12 వరకు ఉన్న టికెట్ ధర రూ.10
 • రూ.13 నుంచి 17 వరకు ధరలు రూ.15
 • రూ.18 నుంచి 22 వరకు చార్జీలు రూ.20

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.