ప్రెస్‌రివ్యూ: ఆధార్ కొత్త ఫీచర్.. ఫేస్ రికగ్నిషన్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివి

  • 16 జనవరి 2018
ఆధార్ Image copyright Mansi Thapliyal

వేలిముద్రలు, కంటిపాపల స్కానింగ్‌తో ప్రస్తుతం ఆధార్ ధ్రువీకరణ చేస్తున్నారు. రేషన్ షాపుకు వెళ్లినా.. బ్యాంకుకు వెళ్లినా.. లేదంటే కొత్త సిమ్ కార్డు తీసుకుందామన్నా ఇదే పద్ధతి పాటిస్తున్నారు.

కానీ కొందరి వేలిముద్రలు, కంటిపాపలను స్కానర్లు సరిగా గుర్తించడం లేదు. ముఖ్యంగా వృద్ధుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.

అలాంటి సమయంలో వారు చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్యకు పరిష్కారంగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా -యూఐడీఏఐ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి తీసుకొస్తోందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక ఓ కథనం ప్రచురించింది.

ఆధార్ వినియోగదారులకు 'ఫేస్ రికగ్నిషన్' ఫీచర్‌ను జోడిస్తున్నట్లు యూఐడీఏఐ ప్రకటించింది.

'ఫేస్ రికగ్నిషన్' ఎలా పనిచేస్తుంది?

కనుపాపల్ని స్కాన్ చేసినట్లే ముఖాన్ని స్కాన్ చేసి ఆధార్‌ ధ్రువీకరణ చేస్తారు.

స్కానింగ్ సమయంలో ముఖ కదలికలు ఉంటేనే ఈ ఫీచర్ పని చేస్తుంది.

అంటే ఫేస్ రికగ్నిషన్ సమయంలో నవ్వడమో, కనురెప్పలు ఆడించడమో చేయాలి.

'ఫేస్ రికగ్నిషన్' ఎందుకు?

వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, లేదా వన్‌టైమ్ పాస్‌వర్డ్ ద్వారా ఆధార్ వెరిఫికేషన్‌కు చాలా సమయం పడుతోంది.

పైగా వృద్ధుల వేలిముద్రలు, కనుపాపలను స్కానింగ్ మెషీన్లు కొన్నిసార్లు గుర్తించడం లేదు.

అందుకే ఫేస్ రికగ్నిషన్ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

జులై ఒకటో తేదీ నుంచి ఈ ఫీచర్‌ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు.

Image copyright Getty Images

దుర్వినియోగం చేసే అవకాశం ఉందా?

ఫేస్ రికగ్నిషన్‌ ఫీచర్‌ను దుర్వినియోగం చేసే అవకాశం లేదని యూఐడీఏఐ చెబుతోంది.

పడుకున్న వ్యక్తి ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా ఆధార్ ధ్రువీకరణ చేయలేరు.

పైగా ఒక్క ఫేస్ రికగ్నిషన్‌తోనే ఆధార్ ధ్రువీకరణ జరగదు.

దానికి అదనంగా వేలిముద్రలో, కనుపాప స్కానింగో, లేదంటే వన్‌టైమ్‌ పాస్‌వర్డుల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది.

దీనికోసం మళ్లీ ఆధార్ సెంటర్‌కి వెళ్లాలా?

ఫేస్ రికగ్నిషన్ ఫీచర్ కోసం మళ్లీ ఆధార్ సెంటర్‌కి వెళ్లి ఫొటోలు దిగాల్సిన పని లేదు.

ఇదివరకే ఆధార్ డేటా బేస్‌లో ఉన్న మీ సమాచారం ఆధారంగా ఇది పనిచేస్తుంది.

ఇందుకోసం బయోమెట్రిక్ స్కానింగ్ మెషీన్లలో కొన్ని సాంకేతిక మార్పులు చేసే అవకాశం ఉంది.

Image copyright uidai

ఆధార్ గోప్యత, భద్రతకు ప్రాధాన్యం

భారత దేశంలో ప్రస్తుతం 119 కోట్ల మందికి ఆధార్ ఉంది.

ఆధార్ గోప్యత, భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ వర్చువల్ ఆధార్‌ కార్డులను తీసుకొస్తామని ప్రకటించిన వారం రోజుల లోపే యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఆధార్‌ కేసును సుప్రీంకోర్టు విచారించడానికి కొన్నిరోజుల ముందు ఆధార్ ప్రాధికార సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.

Image copyright AFP

12గంటల పాటు కనిపించకుండా పోయిన ప్రవీణ్ తొగాడియా!

విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా 12 గంటల పాటు కనిపించకుండా పోయారు. ఆ తర్వాత స్పృహలేని స్థితిలో గుజరాత్‌లోని ఓ ఆస్పత్రిలో కనిపించారు అని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక కథనం రాసింది. దాని ప్రకారం..

2001 నాటి కేసులో ప్రవీణ్ తొగాడియాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు గుజరాత్ వెళ్లారు.

ప్రవీణ్ తొగాడియా ఉదయం 10.30కి అహ్మదాబాద్‌లోని వీహెచ్‌పీ కార్యాలయం నుంచి బయటికి వెళ్తూ కనిపించారు.

ఆ తర్వాత రాత్రి 9.20 గంటలకు వీహెచ్‌పీ కార్యాలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ ఆస్పత్రిలో దర్శనమిచ్చారు.

పోలీసులు తొగాడియాను అరెస్ట్ చేయబోతున్నారంటూ వీహెచ్‌పీ కార్యకర్తలు నగరంలో ఆందోళనలు చేపట్టారు.

ప్రవీణ్ తొగాడియా లోషుగర్‌తో బాధపడుతున్నారని డాక్టర్లు చెప్పారు.

‘ప్రవీణ్ తొగాడియాను మగతగా ఉన్న స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఆయన షుగర్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆరోగ్యం స్థిరంగా ఉంది’ అని డాక్టర్ రూప్‌కుమార్ చెప్పారు.

కొటార్‌పూర్‌ వాటర్ వర్క్స్ ప్రాంతంలో ప్రవీణ్ తొగాడియాను పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

రాజస్తాన్‌లో 16 ఏళ్ల క్రితం సెక్షన్ 144ను ఉల్లంఘించి జనాన్ని పోగు చేశారని, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారని తొగాడియాపై కేసు నమోదైంది.

ఆ కేసులో కోర్టు ఆదేశాల ప్రకారం రాజస్థాన్ పోలీసులు ప్రవీణ్ తొగాడియాను అదుపులోకి తీసుకునేందుకు అహ్మదాబాద్‌లోని వీహెచ్‌పీ కార్యాలయానికి వెళ్లారు. కానీ అక్కడాయన లేకపోవడంతో తిరిగొచ్చారని సవాయ్ మాధాపూర్ ఎస్పీ మమన్ సింగ్ తెలిపారు.

తొగాడియాను అదుపులోకి తీసుకోలేదని, అయినా వీహెచ్‌పీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తున్నారని పోలీసులు చెప్పారు.

Image copyright Reuters

సుప్రీంకోర్టు అధికారులకు 'వాషింగ్ అలవెన్స్' రూ.21 వేలు

ఇక నుంచి సుప్రీంకోర్టు అధికారులు ఏడాదికి 21,000 రూపాయల వాషింగ్ అలవెన్స్ అందుకోనున్నారు.

ఇది స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ -ఎస్‌పీజీ కమాండోల వాషింగ్ అలవెన్స్‌తో సమానం.

అంతేకాదు ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ అధికారుల దుస్తుల నిర్వహణ భత్యం కంటే ఎక్కువ.

యూనిఫాల కొనుగోలు, వాటి నిర్వహణ కోసం పారామిలటరీ దళాలు, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సైనికులకు ఏడాదికి రూ.10,000 భత్యం ఇస్తారు.

వీరికంటే ఎక్కువగా సెక్రటరీ జనరల్ సహా సుప్రీంకోర్టు అధికారులు నెలకు 1750 రూపాయలు వాషింగ్ అలవెన్స్‌గా అందుకోబోతున్నారు.

నాన్ క్లరికల్ ఉద్యోగులకు నెలకు రూ.1350, ఇతర సిబ్బందికి నెలకు 1250 రూపాయల బట్టల భత్యం లభిస్తుందని ఆర్ధిక శాఖ జారీ చేసిన సర్క్యూలర్‌లో ఉంది.

2017 డిసెంబర్ 14 నుంచే ఇది అమలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

ముఖ్యమైన కథనాలు

కరోనావైరస్: వైరల్ లోడ్ అంటే? ఎక్కువ మంది వైద్య సిబ్బంది అనారోగ్యానికి గురవ్వడానికి కారణం ఏంటి?

కేసీఆర్ చెప్పినా ఆగని వలసలు

లాక్‌డౌన్ ఏప్రిల్ 15తో ముగుస్తోందా?

కరోనావైరస్: ఆంధ్ర ప్రదేశ్‌లో 143, తెలంగాణలో 154కు చేరిన కేసులు

డేనియల్ పెర్ల్ హత్యకేసులో దోషికి మరణశిక్షను రద్దుచేసిన పాకిస్తాన్

మద్యం దొరక్క మందుబాబుల వింత ప్రవర్తన, ఎర్రగడ్డ ఆస్పత్రికి పెరిగిన రద్దీ

కరోనావైరస్‌: రెండు వ్యాక్సీన్లపై పరీక్షలు మొదలుపెట్టిన శాస్త్రవేత్తలు

కరోనావైరస్: భారత మీడియా చైనాను ఎందుకు లక్ష్యంగా చేసుకుంది.. చైనా కుట్ర సిద్ధాంతంపై ఏమంటోంది

కరోనా లాక్‌డౌన్: ఉత్తరప్రదేశ్‌లో వలస కార్మికులపై రసాయనాలు చల్లిన వీడియోలో ఏముంది