పంటకు దిష్టిబొమ్మగా సన్నీ లియోని ఫొటో

సన్నీ లియోన్

'వెనక పచ్చని పంట చేను. దాని ముందు బికినీలో సన్నీ లియోని'

నెల్లూరు జిల్లా బండకిందిపల్లెకు చెందిన రైతు అంకినపల్లి చెంచురెడ్డి తన పొలం వద్ద ఈ సెక్సీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

అలాగని చెంచురెడ్డి సన్నీ లియోని వీరాభిమానేం కాదు.

మరి చేను ముందు ఆమె ఫ్లెక్సీ ఎందుకు పెట్టారు?

'పంటకు నరదిష్టి తగలకుండా సన్నీలియోని ఫ్లెక్సీ'

చెంచురెడ్డి 10 ఎకరాల్లో కూరగాయల సాగు చేశారు.

ఈ ఏడాది పంట బాగా వచ్చింది. కాలిఫ్లవర్, క్యాబేజీ, బెండ, మిరప దిగుబడి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది.

పంట బాగా ఏపుగా పెరిగి, ఆ దారిన వెళ్లే ప్రతీ ఒక్కరిని విపరీతంగా ఆకర్షి‌స్తోంది.

పైగా పొలం రోడ్డు పక్కనే ఉండటంతో, వచ్చిపోయేవాళ్లు ఈ పంటను చూసి ఈర్ష్య పడుతున్నారని చెంచురెడ్డి చెబుతున్నారు.

దాంతో పంటకు నరదిష్టి తగలకుండా శృంగార తార సన్నీలియోని పోస్టర్‌ను పెట్టానని చెంచురెడ్డి అంటున్నారు.

ఈ పోస్టర్‌పై తెలుగులో 'ఒరేయ్ నన్ను చూసి ఏడవకురా' అని కూడా రాయించారు.

'ఈ చిట్కా బాగా పనిచేసింది. నా పంటను ఎవరూ చూడటం లేదు!'

దారినపోయే వాళ్లు ఇప్పుడు ఎవరూ కూడా తన పంటను చూడటం లేదని ఆయన చెప్పారు.

జనం దృష్టి పంటపై కాకుండా సన్నీపై పడిందంటున్నారు చెంచురెడ్డి. అందరూ బికినీలో ఉన్న సన్నీలియోని ఫొటోనే చూస్తూ వెళ్తున్నారని అన్నారు.

జనం దృష్టి మరల్చేందుకే సన్నీలియోని పోస్టర్ పెట్టినట్లు ఆయన బీబీసీ హైదరాబాద్ ప్రతినిధి దీప్తితో చెప్పారు.

తన పంట చేనును కాపాడుకునేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని వివరించారు.

'దిష్టిబొమ్మలు పెడితే నరదిష్టి తగలదా?’

దిష్టిబొమ్మలు ఏర్పాటు చేసుకుంటే ఇంటికి, పంటలకు నరదిష్టి తగలకుండా ఉంటుందని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం ఉంది.

రాక్షసుడి అవతారంలో అందరినీ భయపెట్టేలా ఆ దిష్టిబొమ్మ ఉంటుంది.

పక్షుల నుంచి పంటను కాపాడుకునేందుకు కొందరు రైతులు గడ్డితో దిష్టిబొమ్మ తయారు చేసి తమ పొలాల్లో పెడతారు.

తల భాగంలో ఒక కుండపెట్టి, పెద్ద పెద్ద కళ్లు, కోరలతో దాన్ని భయంకరంగా ఉండేలా తయారు చేస్తారు.

దీంతో పక్షులు పంటను నాశనం చేయకుండా ఉంటాయని, నరదిష్టి కూడా తగలదని కొందరు భావిస్తారు.

అధిక దిగుబడి వస్తుంటే పక్కవాళ్ళ దృష్టి పడి పంట దిగుబడి పడిపోతుందన్న నమ్మకంతో చాలామంది ఈ పద్ధతి పాటిస్తుంటారు.

పంటలకు రక్షణగా నటుల ఫ్లెక్సీలు!

చెంచురెడ్డి మరో అడుగు ముందుకేసి నరదిష్టి తగలకుండా సన్నీ లియోని పోస్టర్ పెట్టారు.

పంట చేలో సన్నీ ఫోటొ చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు.

నిజానికి పంటలకు రక్షణగా హీరోలు, హీరోయిన్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో ఉంది.

అయితే, సన్నీ లియోని ఫొటో పెట్టడం మాత్రం ఇదే తొలిసారి.

పంటపై పిట్టలు వాలకుండా కొందరు చీరలను కూడా కప్పేవారు.

'నర దిష్టి' అనేది మూఢ నమ్మకం!

అయితే, 'నర దిష్టి తగులుతుంది' అనేది పూర్తిగా మూఢ నమ్మకం అని ప్రముఖ హేతువాది బాబు గోగినేని బీబీసీతో అన్నారు.

'ఒక మనిషి దృష్టి పడి ఎదుటివారికి మంచిగానీ, చెడుగానీ జరుగుతుందని అనుకోవడం పూర్తి అజ్ఞానం' అని ఆయన చెప్పారు.

ఒకవేళ నరదిష్టి నిజమైతే, అందరి దృష్టి పడిన సన్నీలియోనికి ఏమైనా అయిందా? అని బాబు గోగినేని ప్రశ్నించారు. రైతు చెంచురెడ్డిపై సన్నీలియోన్ కేసు పెడితే ఏం చేస్తారు అని కూడా ఆయన అడిగారు.

పైగా ఇలాంటి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్ల చేనుకొచ్చే ఆడవాళ్లు సిగ్గుతో తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.

మగవాళ్ల దిష్టి తగలకుండా సన్నీ లియోని ఫ్లెక్సీ పెట్టారు..మరి, ఆడవాళ్ల కోసం షారూఖ్, ఆమిర్‌ఖాన్‌ లాంటి వాళ్ల పోస్టర్లు ఏర్పాటు చేస్తారా? అని అడిగారు.

దేశమంతా జోకర్లతో నిండిపోయిందని, అజ్ఞానంతో పిచ్చి పనులు చేస్తున్నారని బాబు గోగినేని అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.