'అదే తొలిసారి నేను శ్రీదేవిని చూడటం'!

  • అనిల్ అట్లూరి
  • బీబీసీ కోసం

నాకు గుర్తున్నంతవరకు అయ్యప్పన్ గారు క్రిమినల్ లాయర్. మద్రాసు హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తుండేవారు.

అప్పట్లో సినీ నిర్మాత టి. సి సుబ్బన్నగారి స్నేహితుడాయన. సుబ్బన్న గారి ద్వారానే నాకు పరిచయం.

మా అమ్మ చౌదరాణి, మద్రాసులోని పాండి బజార్లో మొదలు పెట్టిన తెలుగు పుస్తకాల దుకాణం, రాణీ బుక్ సెంటర్. తెలుగు వారిది, తెలుగువారు ఎక్కువమంది ఉన్న సౌత్ మద్రాసులో ఉంది కాబట్టి తెలుగు వారందరికి సుపరిచితం.

ఆనాటి చలన చిత్ర ప్రముఖులందరికీ కూడ పరిచయమే! మరీ ముఖ్యంగా తెలుగువారికి.

మా నాన్న అట్లూరి పిచ్చేశ్వరరావు కూడ ఒక స్క్రిప్ట్ రైటర్‍గా చలనచిత్ర రంగంలోనే ఉండి కీర్తిశేషులయ్యారు. కాబట్టి చలనచిత్ర రంగంతో అమ్మకి పరిచయాలు బాగానే ఉండేవి.

పాండి బజార్లో ఉంది కాబట్టి అందరికి అనువుగా ఉండేది కలవడానికి.

అదే తొలిసారి నేను శ్రీదేవిని చూడటం!

అందులో భాగంగానే అయ్యప్పన్ గారు, సుబ్బన్న గారు వారి మిత్రులు కలవాలనుకున్నప్పుడల్లా షాపు దగ్గరికి వచ్చేవారు.

ఒక రోజు సాయంత్రం. మూడు, నాలుగు గంటల సమయం. షాపు తెరిచిందప్పుడే!

'నాన్న గారు వచ్చారా?' అంటూ ఒక పదిహేనేళ్ల అమ్మాయి లోపలికి వచ్చి అమ్మని అడిగింది.

పరికిణి, ఓణి, ఎర్రగా కాస్త బొద్దుగా ఉందా అమ్మాయి.

'ఎవరు?' అని అమ్మ నా వంక చూస్తూ అడిగింది.

'నేను అయ్యప్పన్ గారి అమ్మాయిని'.

నాన్న ఫోన్ చేసారు...ఇక్కడికి వస్తానని!" అని అంది.

అప్పటిదాక నాకు గాని, అమ్మకి గాని తెలియదు అయ్యప్పన్ గారి పిల్లల గురించి.

"ఇంకా రాలేదే" అంటూ బయటికి చూస్తే, బయట రిక్షాలో ఒక మధ్యతరగతి మహిళ కూర్చుని ఉంది.

ప్రశ్నార్ధకంగా చూస్తుంటే ఆవిడ చిరునవ్వుతో పలకరించారు. "మా అమ్మ" అంటూ పరిచయం చేసింది.

"రమ్మనమ్మా లోపలికి...ఇక్కడ కూర్చొవచ్చు" అని మా అమ్మ ఆహ్వానించింది.

ఈ అమ్మాయి వెళ్లి చెప్పడంతో ఆవిడ వచ్చి, షాపు లోపల స్టీల్ ఫోల్డింగ్ కుర్చీలో కూర్చుంది.

పక్కనే చెక్క స్టూల్ మీద ఈ అమ్మాయి కూర్చుంది.

కాసేపటికి అయ్యప్పన్ గారు వచ్చారు.

ఆవిడని, ఆ అమ్మాయిని చూసి, "వచ్చేశారా?" అంటూ నవ్వుతూ పలకరించారు.

"ఈమేనమ్మా, రాణమ్మ, నా మిసెస్ రాజేశ్వరి. ఈ పాప నా కూతురు శ్రీదేవి" అని అమ్మకి పరిచయం చేశారు.

అదే తొలిసారి, నేను శ్రీదేవిని చూడటం.

ఆ తరువాత చాలాసార్లు, మా షాపు ముందుండే అరుగు మీద అయ్యప్పన్ గారు నేను, లేదా ఆయన మిత్రులతో కూర్చున్నప్పుడల్లా ఆయన కోసం వాళ్లిద్దరు రావడం, లేదా శ్రీదేవి ఒక్కతే రావడం జరుగుతూ ఉండేది.

ఒక్కోసారి, శ్రీదేవి తన చెల్లెలు శ్రీలతతో కూడా కలిసి వచ్చేది.

షాపింగ్‍కి వచ్చినప్పుడు రాజేశ్వరి గారు షాపులో వెయిట్ చేస్తుంటే తండ్రీ, కూతుళ్లు వచ్చి వారిని తీసుకుని వెళ్ళేవారు.

కాలక్రమేణా శ్రీదేవి బిజీ అయిపోయింది. అయినా ఆయ్యప్పన్ గారు వీలున్నప్పుడల్లా వచ్చేవారు.

ఆయన నిరాడంబరి. దాదాపుగా ఎప్పుడు తెల్ల దుస్తులే ధరించేవారు. అది లుంగీ అయినా పాంటు, షర్ట్ అయినా!

ఇద్దరం కలిసి మా షాపుకి ఎదురుగా ఉండే హమీదియా హోటల్‍కి వెళ్ళి టీ తాగేవాళ్ళం.

నేను స్మోకర్‍ని. ఆయనకి పాన్ ఇష్టం. నములుతూ ఉండేవారు.

"ఫరవాలేదు, నువ్వు సిగరెట్ కాల్చుకో," అనేవారు.

అవును, ఆయన పదహారణాల తెలుగు వాడు.

దీపావళికి బాణాసంచా తయారుచేసే శివకాశి ఊరు ఆయన స్వస్థలం.

పూర్వీకులెప్పుడో అక్కడ స్థిర పడ్డట్టున్నారు. కొంచెం తమిళ యాస ఉండేది కాని, స్పష్టమైన తెలుగులో మాట్లాడేవారు.

అప్పట్లో తెలుగు చలనచిత్ర రంగం మద్రాసులో ఉండేది.

డిస్ట్రిబ్యూషన్ రోజులవి. చెక్కులు, టిటి రోజులు. లావాదేవీలకు ఆంధ్రాబ్యాంక్ వారి, టీనగర్ బ్రాంచ్ ప్రముఖమైనది.

మా బాంక్ లావాదేవీలు కూడా అందులోనే. అక్కడ కలిసేవారిని అయ్యప్పన్ గారిని.

అప్పటికే ఇంకా బిజీ అయిపోయింది శ్రీదేవి. డబ్బు లావాదేవిలు ఆయనే చూసుకునేవారనుకుంటాను.

ఒకసారి అక్కడ కలిసినప్పుడు ఆయనే పలకరించి, "అనిల్, మూడ్రాంపిరై చూసావా? శ్రీదేవి బాగా చేసింది! చూడకపోతే చూడు" అని చెప్పారు.

మరోసారి, అదే ఆంధ్రాబాంక్‍లో కలిసినప్పుడు, "అమ్మాయి, అళ్వార్‌పేట ఇల్లు కొనింది, నువ్వు అమ్మ రావాలి ఇంటికి" అని అహ్వానించారు.

ఆయన నిగర్వి. శ్రీదేవి కూడా అంతే. నవ్వుతూ పలకరించేది. రాజేశ్వరి గారు కూడా అమ్మని ఎక్కడ కలిసినా నవ్వుతూ పలకరించేవారు.

ఆ తర్వాత శ్రీదేవి పెద్ద స్టార్ అయిపోయారు.

చాలా ఏళ్ల తర్వాత ఒకసారి వెంకట్రామన్ వీధిలో, దర్శకుడు వేదాంతం రాఘవయ్య గారి కుమార్తె, నటి శుభ కోసం ఒక అంబాసిడర్ కారులో వెయిట్ చేస్తున్నారు.

తల తిప్పుకుని వెళ్ళిపోబోతున్న నన్ను గుర్తించి, 'బాగున్నారా?' అని శ్రీదేవి నవ్వుతూ పలకరించింది.

అదే నిరాడంబరత! అప్పటికే ఆమె బాలీవుడ్‍కి చేరిపోయింది.

అదే ఆఖరు సారి నేను ఆమెని సజీవంగా చూడటం.

ఇప్పుడు ఒక తెలుగు వారికి కాదు, భారతదేశ చలన చిత్రరంగానికే ఒక ధ్రువతారగా నిలిచిపోయింది!

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.