ప్రెస్‌రివ్యూ: అవిశ్వాసంపై ముందుకా.. వెనక్కా?

ఫొటో సోర్స్, Getty Images
పార్లమెంట్ సమావేశాలు చివరి వారానికి చేరుకున్నాయి. టీడీపీ, వైసీపీ వ్యూహ ప్రతివ్యూహాలతో దిల్లీలో రాజకీయం వేడెక్కిందని సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు పలు కథనాలు రాశాయి. వాటి ప్రకారం..
అవిశ్వాస తీర్మానంపై చర్చకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు పట్టుబడుతుండగా.. అన్నాడీఎంకే ఆందోళనతో కొన్ని రోజులుగా లోక్‌సభ వాయిదా పడుతూ వస్తోంది.
ఈ సారి కూడా టీడీపీ, వైసీపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. సోమవారం వాటిపై చర్చ జరుగుతుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి, ఏపీ భవన్‌లో ఆమరణదీక్ష చేస్తారని ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా పార్లమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తే, అదే రోజు స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామాలు చేయాలని వైసీపీ ఎంపీలు భావిస్తున్నారు.
రాజీనామాలతో పాటు వైసీపీ ఎంపీలు ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష చేపడతారని పేరేచర్ల బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
ఏపీ ఎంపీలందరూ రాజీనామాలు చేస్తే కేంద్రం దిగిరాదా అని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రాజీనామాలకు అన్ని పార్టీలు వారూ కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.
మోదీ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆంధ్రజ్యోతి కథనం రాసింది.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చేలా ఇతర పార్టీల మద్దతు కూడగట్టేందుకు సోమవారం రాత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. మంగళ, బుధవారాలు అక్కడే ఉంటారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ముందుకొచ్చిన పలు పార్టీల నేతలతో ఆయన సమావేశమవుతారు.
ఫొటో సోర్స్, tdp.ncbn.official/facebook
అమరావతి నిర్మాణానికి ప్రజాధనం!
అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి నిధులు సమీకరించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
రాష్ట్ర ప్రజలు, ప్రవాసాంధ్రుల నుంచి నిధులు సమీకరించేందుకు ఒక విధానాన్ని ఏపీ ప్రభుత్వం రూపొందించనుంది.
విరాళాలు, సంస్థాగత, రీటెయిల్ బాండ్లు, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ద్వారా డిపాజిట్‌లు స్వీకరించడం వంటి మార్గాలను పరిశీలిస్తోంది.
విధివిధానాల రూపకల్పనకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు అధ్యక్షతన కమిటీ నియమించింది. ప్రభుత్వ పరిశీలనలో ఉన్న మార్గాలు ఇవి.
1. అమరావతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్లు:
ఈ బాండ్ల పేరుతో ప్రజల నుంచి (రీటెయిల్ ఇన్వెస్టర్స్) పెట్టుబడులు స్వీకరించే ఆలోచనలో ఉంది. దీనిపై సీఆర్‌డీఏ ఇది వరకు ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది.
అప్పట్లో ఈ బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్లు వరకు సమీకరించాలని భావించింది. ఇప్పుడు దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.
బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఇస్తున్న వడ్డీ కంటే ఎక్కువ శాతం వడ్డీ ఇవ్వడం ద్వారా ప్రజల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వం ఆలోచన.
2. విరాళాలు: రాజధాని నిర్మాణం కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించడం ఒక విధానం.
'నా అమరావతి-నా ఇటుక' పేరుతో ఇలాంటి ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది.
ఆర్‌బీఐ అనుమతులు లేకపోవడంతో ఇది వరకు ప్రవాసాంధ్రులు దీనిలో పాలుపంచుకోలేకపోయారు.
ఇప్పుడు వారి నుంచీ విరాళాలు సేకరించేందుకు అవసరమైన విధానం రూపొందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
3. ప్రత్యామ్నాయ పెట్టబడి నిధి: దీనిలో కేటగిరీ-1, కేటగిరీ-2 ఉన్నాయి. మొదటి కేటగిరీ డెట్ ఫండ్. అంటే అప్పు రూపంలో మాత్రమే నిధులు తీసుకోగలుగుతారు.
రెండోది డెట్ కం ఈక్విటీ ఫండ్. ఈ కేటగిరీలో ఈక్విటీల (పెట్టుబడులు) రూపంలో నిధులు సమీకరించవచ్చు.
రాజధానిలో చేసేది ప్రధానంగా మౌలిక వసతుల నిర్మాణం కాబట్టి, వాటిపై తిరిగి వచ్చే ఆదాయం ఏమీ ఉండదు.
ఇక్కడ డెట్ ఫండ్ ద్వారా నిధుల సమీకరణకే ఎక్కువ అనుకూలం.
ఇందులో ఇక్కడి ప్రజలతో పాటు, ప్రవాసాంధ్రులూ పెట్టుబడులు పెట్టొచ్చు.
4. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎన్‌బీఎఫ్‌సీ):
ప్రభుత్వం ఏదైనా ఎన్‌బీఎఫ్‌సీని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించవచ్చు. సేకరించిన నిధుల్ని ఎన్‌బీఎఫ్‌సీ రాజధాని నిర్మాణానికి ప్రభుత్వానికి అప్పుగా ఇస్తుంది.
ఫొటో సోర్స్, NOAH SEELAM
స్థిరాస్తి రంగంలో హైదరాబాద్ నంబర్ 1
స్థిరాస్తి వ్యాపార వృద్ధి అవకాశాలపరంగా హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని రియల్టీ కన్సల్టింగ్ కంపెనీ జెఎల్‌ఎల్ నివేదిక చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం రాసింది. దాని ప్రకారం..
ప్రపంచ స్థిరాస్తి వ్యాపారంలో స్వల్పకాలికంగా శరవేగ వృద్ధి నమోదు చేసుకునేందుకు అవకాశమున్న 30 నగరాల జాబితాను జెఎల్‌ఎల్ విడుదల చేసింది.
ఈ జాబితాలో హైదరాబాద్ నంబర్ వన్‌గా నిలిచింది. బెంగళూరుకు రెండో స్థానం దక్కింది. పుణె 4, కోల్‌కతా 5, ఢిల్లీ 8వ స్థానాల్లో ఉన్నాయి.
అంటే, టాప్ టెన్‌లో ఐదు స్థానాలు భారతదేశానికి చెందినవే. ఇక చెన్నైకి 14వ స్థానం లభించగా.. ముంబై 20వ స్థానాన్ని చేజిక్కించుకుందని జెఎల్‌ఎల్ వెల్లడించింది.
మానవ వనరులు, కనెక్టివిటీ, రియల్టీ పెట్టుబడులు, ప్రాపర్టీ ధరలు, పారిశ్రామిక ప్రగతి, కార్పొరేట్ రంగ కార్యకలాపాలు, నిర్మాణం, రిటైల్ వ్యాపార విక్రయాల వంటి అంశాల్లో భారత నగరాలు అద్భుతమైన పనితీరు కనబర్చాయి.
వేగంగా విస్తరిస్తున్న భారత నగరాలకు భవిష్యత్‌లో కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చని జెఎల్‌ఎల్ నివేదిక పేర్కొంది.
మౌలిక సదుపాయాలు, స్థానిక వసతుల పరంగా ఒత్తిడితోపాటు ఆర్థిక అసమానతలు, గృహాల ధరలు, పర్యావరణ కాలుష్యం భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఐటి, ఐటీఈఎస్, బి.పి.ఒ రంగాల్లో హైదరాబాద్, బెంగళూరు దేశంలోనే మేటి నగరాలని జెఎల్‌ఎల్ పేర్కొంది.
ఫొటో సోర్స్, Scott Olson/Getty Images
హెచ్1బీ వీసా ప్రక్రియ షురూ!
అమెరికాలో ఉద్యోగానికి అవకాశం కల్పించే హెచ్1బీ వీసా దరఖాస్తులు చేసే ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. దీనిపై ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..
మునుపెన్నడూ లేనంతగా ట్రంప్ యంత్రాంగం హెచ్1బీ దరఖాస్తులను కఠినతరం చేయనుంది.
చిన్న చిన్న తప్పులను కూడా ఉపేక్షించబోమని అమెరికా పౌర, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్) నుంచి గట్టి సంకేతాలు వస్తున్నాయి.
ప్రత్యేక వృత్తుల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న విదేశీ సిబ్బందిని అమెరికా కంపెనీలు నియమించుకోవడానికి హెచ్1బీ వీసా వీలు కల్పిస్తుంది.
భారత్, చైనా వంటి దేశాలకు చెందిన వేల మంది ఉద్యోగులను ఈ వీసాల కింద ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి. ఏటా 65వేల వీసాలకు మించి ఇవ్వకూడదన్న పరిమితి ఉంది.
లాటరీ ద్వారా ఎంపిక కావడానికి ఎక్కువ అవకాశాలుంటాయని భావిస్తూ ఆయా సంస్థలు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేయడం పరిపాటిగా వస్తోంది.
ఇలా ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే తిరస్కరణ తప్పదని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేస్తోంది.
దరఖాస్తులకు కంప్యూటర్ ద్వారా లాటరీ తీసే విషయమై ఇంకా స్పష్టతనివ్వలేదు.
దరఖాస్తులోని అన్ని అంశాలను సరిగ్గా పూర్తి చేయాలని, లబ్ధిదారుకు చెందిన చెల్లుబాటయ్యే పాస్‌పోర్టు ప్రతిని కూడా జతపర్చాలని దరఖాస్తు చేసే కంపెనీలకు సూచించింది.
వీసా ఇంటర్వ్యూ, పాస్‌పోర్టుపై స్టాంపింగ్ నిమిత్తం దరఖాస్తుదారు అమెరికా దౌత్య కార్యాలయాలకు హాజరయినప్పుడు గత ఐదేళ్ల కాలంలోని సోషల్ మీడియా ప్రొఫైల్ వివరాలు, ఈమెయిళ్లు, ఫోన్ నంబర్లకు సంబంధించిన వివరాలతో సిద్ధంగా ఉండాలి.
ఉద్యోగాలకు సంబంధించిన వీసాల ప్రక్రియలో అవకతవకలను నివారించి అమెరికా సిబ్బంది ప్రయోజనాలను కాపాడడం తమకు ముఖ్యమని యూఎస్‌సీఐఎస్ స్పష్టం చేసింది.
ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్‌లో కాల్పుల కల్లోలం
కశ్మీర్‌లో ఆదివారం మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో భద్రతాబలగాలు 13 మంది తీవ్రవాదుల్ని మట్టుబెట్టాయని నమస్తే తెలంగాణ కథనం రాసింది. దాని ప్రకారం..
ఎదురుకాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు చనిపోయారు. ఈ కాల్పుల్లో నలుగురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి ఇటీవలికాలంలో జరిగిన అతిపెద్ద ఘటన ఇదేనని జమ్ము కశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తెలిపారు.
మూడు ఎన్‌కౌంటర్లతో కశ్మీర్‌లోయలో హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తాయిబా సంస్థలకు కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పారు.
శనివారం రాత్రి ప్రారంభమైన ఎదురుకాల్పులు ఆదివారం సాయంత్రం వరకు కొనసాగాయి. ఈ ఘటనలతో కశ్మీర్ అంతటా హైఅలర్ట్ ప్రకటించారు.
ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్, షోపియాన్ జిల్లాల్లో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో ఈ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.