ప్రెస్‌రివ్యూ : రంగస్థలం క్రెడిట్ అంతా రామ్‌చరణ్‌దే

రంగస్థలం

రంగస్థలం చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌మీట్‌ని నిర్వహించింది.

రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్‌గా వచ్చిన రంగస్థలం సినిమాకు సుకుమార్‌ దర్శకత్వం వహించారు.

ఈ చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో థ్యాంక్స్‌మీట్‌ని నిర్వహించింది. దీనిపై ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించాయి. వాటి ప్రకారం..

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ నేనెప్పుడూ అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని సినిమాలు ఒప్పుకోలేదు. దర్శకుడు చెప్పే కథ ముందు నాకు నచ్చితే అది అందరికీ నచ్చుతుంది' అన్నారు.

సుకుమార్‌ మాట్లాడుతూ 'నాకు, రామ్‌చరణ్‌కీ రంగ అనే ఓ స్నేహితుడు ఉన్నాడు. అతని ద్వారానే చరణ్‌ని కలిశా. చిట్టిబాబు పాత్రలో వేరే ఎవ్వరినీ ఊహించుకోలేదు. ఒకవేళ ఆయన ఈ కథ ఒప్పుకోకపోతే మరో కథని రాసుకొనేవాణ్నంతే. అయితే చరణ్‌ ఇలాంటి పాత్రని ఒప్పుకోవడం సాహసం. ఈ విజయం తాలూకు క్రెడిట్‌ అంతా ఆయనకే దక్కుతుంది అన్నారు.

సమంత పరిశ్రమలో ఉన్న రూల్స్‌ని మార్చింది. కథానాయికలకి పెళ్లయితే వాళ్ల సినిమాల్ని ప్రేక్షకులు చూడరని అంటుంటారు. కానీ సమంత విషయంలో మాత్రం అలా జరగలేదు అని సుకుమార్ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

టీజేఎస్ పార్టీ పేరును ప్రకటిస్తున్న కోదండరామ్

త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి తెలంగాణ జన సమితి-టీజేఎస్‌ పేరును కోదండరామ్ ఖరారు చేశారు. దీనిపై ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

తెలంగాణ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకుల వల్లే తాము పార్టీ పెట్టాల్సి వచ్చిందని కోదండరామ్ అన్నారు.

ప్రత్యామ్నాయ రాజకీయాల ప్రచారానికి తాము ప్రయత్నించినపుడల్లా ప్రభుత్వం అడ్డుకోవడం వల్లే తాము పార్టీ ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.

'అప్రజాస్వామిక, అవినీతికరమైన పాలన మారాల్సిందేనని ప్రచారం చేశాం. మేం ఆశించిన స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయాల వ్యక్తీకరణను ముందుకు తీసుకెళ్లే వేదిక కనిపించలేదు. అందుకే, పార్టీ పెడుతున్నాం. జేఏసీ అలాగే ఉంటుంది' అని కోదండరామ్ అన్నారు.

'రాజకీయం ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలా మారిపోయింది. పెట్టుబడి పెట్టడం, తర్వాత రాబట్టుకునే ప్రయత్నాలు చేయడం పెరిగిపోతోంది. రాజకీయ ప్రక్రియ లేకుండా మేం కోరుకున్న మార్పు సంపూర్ణం కాదని భావించే పార్టీ పెడుతున్నాం'' అని కోదండరామ్ వివరించారు.

పార్టీ జెండాను రేపు ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈ నెల 29న ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని వివరించారు.

స్వతంత్రంగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని కోదండరాం చెప్పారు.

అయితే, ఏ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాననే విషయం ఇప్పుడే చెప్పలేనని ఆయన అన్నారు.

ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై వివరిస్తా-చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని అన్ని పార్టీలకు వివరించేందుకే దిల్లీకి వెళ్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

మోదీ సర్కారు ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం గురించి ప్రతిపక్ష నేతలందరికీ చంద్రబాబు వివరించనున్నారు.

ఆయా నాయకులను పార్లమెంటులోనే కలుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. సుమారు 20కిపైగా పార్టీల నాయకులను కలుసుకుని రాష్ట్రానికి ఏవిధంగా అన్యాయం జరిగిందో వివరించనున్నారు.

మోదీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి పలు పార్టీలు మద్దతు పలుకుతున్నాయి. ఏపీ ఎంపీలు నిత్యం పార్లమెంటులో, బయటా దీనిపై ఆందోళన చేస్తూనే ఉన్నారు.

ఇప్పుడు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి తమ పోరాటానికి ఆయా పార్టీల మద్దతు కూడగట్టనున్నారు.

జాతీయ స్థాయిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మోదీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ... తమ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చేస్తున్న వైనాన్ని వివరించే అవకాశముందని తెలిసింది.

నకిలీ వార్తలు పుట్టిస్తే జర్నలిస్టు గుర్తింపు రద్దు

నకిలీ వార్తలు పుట్టించినా, ప్రచారం చేసినా సంబంధిత పాత్రికేయుడి గుర్తింపు (అక్రిడిటేషన్‌)ను ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేయనున్నట్లు ఈనాడు ఒక కథనం ప్రచురించింది. దాని ప్రకారం..

విలేఖర్ల గుర్తింపునకు సంబంధించి మార్గదర్శకాలను కేంద్రం సవరించింది.

నకిలీ వార్తలను ప్రచురించినట్లు లేదా ప్రసారం చేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత విలేఖరి గుర్తింపును తొలి ఉల్లంఘన కింద 6 నెలల పాటు రద్దు చేస్తారు.

రెండోసారీ అదే పని చేస్తే గుర్తింపు సంవత్సరం పాటు రద్దు చేస్తారు.

మూడోసారీ తప్పు చేస్తే గుర్తింపును శాశ్వతంగా రద్దు చేస్తామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలియజేసింది.

నకిలీ వార్తలపై వచ్చే ఫిర్యాదులను పత్రికలకు సంబంధించినవయితే ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) పరిశీలనకు, ఎలక్ట్రానిక్‌ మీడియాకు సంబంధించినవయితే న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌బీఏ) పరిశీలనకు పంపిస్తామని తెలిపింది.

ఫిర్యాదు నమోదు చేసినప్పటి నుంచి నిర్ణయం వెలువడేంతవరకు ఆ జర్నలిస్టు గుర్తింపును నిలిపివేస్తామని చెప్పింది.

టీటీడీ డిపాజిట్లలో గోల్‌మాల్!

తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోట్లాది రూపాయల డిపాజిట్ల విషయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారంటూ సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు కథనాలు రాశాయి. వాటి ప్రకారం..

టీటీడీకి చెందిన రూ.4000 కోట్ల డిపాజిట్లను అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులకు కట్టబెట్టారని తిరుపతికి చెందిన శ్రీవారి భక్తుడు, రాయలసీమ పోరాట కమిటీ కన్వీనర్‌ నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును పక్కన పెట్టి దానికంటే తక్కువ కొటేషన్‌ దాఖలు చేసిన ఆంధ్రా బ్యాంకుకు రూ.3000 కోట్లు, ప్రైవేటు బ్యాంకు ఇండస్‌కు రూ.1,000 కోట్లు డిపాజిట్లు ఇవ్వడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇందులో పెద్దఎత్తున అవకతవకలు ఉన్నాయని నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

టీటీడీకి చెందిన రూ.10,589 కోట్ల డిపాజిట్లలో ఈ మార్చి 31 నాటికి రూ.4 వేల కోట్ల విలువైన డిపాజిట్ల కాలపరిమితి ముగిసింది.

వీటిని తిరిగి డిపాజిట్‌ చేసే క్రమంలో టీటీడీ అధికారులు వివిధ బ్యాంకుల నుంచి వడ్డీ రేట్లు కోరుతూ సీల్డు బిడ్‌ కొటేషన్లు ఆహ్వానించారు.

తొమ్మిది ప్రభుత్వరంగ బ్యాంకులు, నాలుగు ప్రైవేటు బ్యాంకులు సమర్పించిన సీల్డు బిడ్‌ కొటేషన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రా బ్యాంకులో రూ.3 వేల కోట్లు (వడ్డీ 7.32 శాతం), ఇండస్‌ బ్యాంకులో రూ.1,000 కోట్లు (వడ్డీ 7.66 శాతం) డిపాజిట్లు చేశారు.

దీంతో కొటేషన్ల స్వీకరణ, బ్యాంకుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని ఆరోపణలు వెల్లు వెత్తాయి. ఎక్కువ వడ్డీ ఇస్తామన్న విజయా బ్యాంకును కాదని దానికంటే తక్కువ వడ్డీ కోట్‌ చేసిన బ్యాంకులకు డిపాజిట్లు అప్పగించారని నవీన్‌కుమార్‌రెడ్డి ఆరోపణలు చేశారు.

అయితే, టీటీడీ నగదును డిపాజిట్‌ చేసే విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టంచేశారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.