ప్రెస్‌రివ్యూ: ‘తాతగారి బయోపిక్‌’లో జూనియర్ ఎన్‌టీఆర్ నటిస్తారా?

ఎన్టీఆర్

ఎన్టీఆర్ బయోపిక్‌లో నటించాలంటూ తనకు పిలుపు రాలేదని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు ఆంధ్రజ్యోతి రాసింది.

ఐపీఎల్ తెలుగు బ్రాండ్ అంబాసిడర్‌గా తారక్ నియమితులయ్యారు.

హైదరాబాద్‌లో ఐపీఎల్ ప్రమోషన్ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ తెరకెక్కించబోతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' గురించి మీడియా అడిగిన కొన్ని ప్రశ్నలకు తారక్ సమాధానాలిచ్చారు.

మీరు 'ఎన్టీఆర్ బయోపిక్' సినిమాలో నటించబోతున్నారా..? అని పాత్రికేయులు ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించి నాకు ఎటువంటి పిలుపు రాలేదు. ఒకవేళ అక్కడి నుంచి పిలుపు వస్తే మాత్రం తప్పకుండా తాతగారి బయోపిక్‌లో నటిస్తాను'' అంటూ తెలిపారు.

రాజమౌళి దర్శకత్వంలో నేనూ, రాంచరణ్‌ చెయ్యబోతున్న సినిమా గురించి మొన్నీ మధ్యనే చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు. అదే నా మాట కూడా. రాజమౌళి పూర్తిగా కథ చెప్పలేదు. మమ్మల్ని మాత్రం రెడీ అవ్వమన్నారు. ఆయనే పూర్తి వివరాలు వెల్లడిస్తారు. ఇద్దరు హీరోలు చేస్తున్న సినిమా కాబట్టి తప్పకుండా కాంపిటీషన్‌ ఉంటుంది. మా ఇద్దరి మధ్యలో రాజమౌళి ఉన్నారు కాబట్టి నువ్వా-నేనా అన్నట్లు త్రీవే కాంపిటీషన్‌ ఉంటుంది. కానీ అది చాలా హెల్దీగా ఉంటుంది'' అని ఎన్టీఆర్‌ అన్నారు.

ఇక బీజేపీతో సంబంధాలు ఉండవు!

ఇకమీదట బీజేపీతో తాము ఎలాంటి సంబంధాలు కొనసాగించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జాతీయ మీడియా ప్రతినిధులతో అన్నట్లు ఈనాడు ఒక కథనం రాసింది.

బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తనకు రాసిన లేఖ పూర్తి తప్పుల తడక అని, అందులో ఒక్కటికూడా వాస్తవం లేదని చంద్రబాబు అన్నారు.

కేసుల నుంచి బయటపడటం కోసం వైసీపీ పూర్తిగా కేంద్రానికి లొంగిపోయిందని, దాన్ని అలుసుగా తీసుకొనే కేంద్ర ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు.

ఏపీకి సాయం చేసే ఉద్దేశం కేంద్రానికి ఉంటే టీడీపీ మంత్రులను ఉపసంహరించినప్పుడే చెప్పేవాళ్లని, ఇంకా వాళ్లు సాయం చేస్తారనుకోవడం భ్రమే అని ఏపీ సీఎం అన్నారు.

'ఇక భాజపాతో మాకు సంబంధాలు ఉండవు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందా? చతుర్ముఖ పోటీ ఉంటుందా? అన్నది నాకు తెలియదు. కూటముల గురించి ఇప్పుడు వ్యాఖ్యానించదలచుకోలేదు' అని చంద్రబాబు పేర్కొన్నారు.

ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి ఇవాళ జాతీయ, తెలుగు మీడియా ముందు ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తారని టీడీపీ ఎంపీలు చెప్పారు.

కేసీఆర్ లక్ష్యంగా పంచతంత్రం

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేందుకు ఇతర విపక్ష పార్టీలు కూటమి ఏర్పాట్లలో ఉన్నాయని సాక్షి పత్రిక పేర్కొంది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఢీకొనేందుకు కాంగ్రెస్ పంచతంత్రాన్ని సిద్ధం చేసుకుంటోంది.

టీడీపీతో పాటు సీపీఐ, కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ జన సమితి, ఎమ్మార్పీఎస్‌ నేత మంద కృష్ణలను ఒక్కతాటి పైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్‌ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌తో జత కట్టేందుకు సీపీఐ సిద్ధమైంది.

ఎస్సీ వర్గీకరణే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపేందుకు ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం.

'తెలంగాణ జన సమితి'ని కూడా తమ కూటమిలో చేర్చుకోవాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.

త్వరలోనే కోదండరాంతోపాటు జనసమితి నేతలతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.

అధికార పక్షానికి వ్యతిరేకంగా ఉండే ఓట్లు చీలకుండా టీడీపీని కూడా కలుపుకుని పోవాలనే ఆలోచనతో ఉన్న కాంగ్రెస్‌ నేతలు అడపాదడపా ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నారు.

ముందుగా ఓ అవగాహనకు వచ్చిన తర్వాతే ఏ పార్టీతో అయినా సీట్ల పంపకాలపై చర్చలు జరుగుతాయని కాంగ్రెస్‌ పెద్దలు చెబుతున్నారు.

త్వరలో మెట్రో రైళ్లు డబుల్!

హైదరాబాద్ మెట్రోరైళ్ల సంఖ్య త్వరలో రెండింతలు కాబోతోందని నమస్తే తెలంగాణ కథనం రాసింది.

ప్రస్తుతం నాగోల్ నుంచి మియాపూర్ వరకు 30 కిలోమీటర్ల మార్గంలో 16 రైళ్లను నడిపిస్తున్నారు.

ఇందులో 14 రైళ్లు ప్రయాణికులను నిత్యం గమ్యస్థానాలకు చేరుస్తుండగా, మిగిలిన రెండు రైళ్లను అత్యవసరం కోసం ఉంచుతున్నారు.

ప్రయాణికుల నుంచి వస్తున్న డిమాండ్‌తో వీటి సంఖ్యను రెండింతలు చేయనున్నారు. రైళ్ల సంఖ్యతోపాటు వాటి వేగమూ పెరగనుంది.

ప్రస్తుతం అమీర్‌పేట-మియాపూర్ మార్గంలో 8 నిమిషాలకో రైలు నడుస్తుండగా, నాగోల్- అమీర్‌పేట మధ్య 15 నిమిషాలకో మెట్రోరైలు నడుస్తున్నది.

ప్రస్తుతం నడుస్తున్న మెట్రోరైళ్లలో 15 రోజుల్లో మార్పులు రానున్నాయి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.