ప్రెస్‌రివ్యూ: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ధనం దుర్వినియోగం: కాగ్

అమరావతి, రాజధాని, ఆంధ్రప్రదేశ్

ఫొటో సోర్స్, Naveen

ఆంధ్రప్రదేశ్‌లో కేటాయింపులకు-ఖర్చులకు పొంతనే లేదని కాగ్ నివేదిక పేర్కొన్నట్లు ఈనాడు ఒక కథనం రాసింది.

'రాష్ట్రంలో వ్యయ నియంత్రణ, పర్యవేక్షణ బలహీనంగానే ఉన్నాయి. హడావుడిగా నిధులు ఖర్చు చేస్తున్నారు. ఆఖరి త్రైమాసికంలోనే సగానికి పైగా నిధులు ఖర్చు చేసేస్తున్నారు' అని భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ -కాగ్‌ నివేదిక తెలిపింది.

ప్రాథమిక విద్యకు మౌలిక వసతులే కరవయ్యాయని, బాలల సంఖ్యపై సరైన మదింపు లేదని నిందించింది. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడమేమిటని ప్రశ్నించింది.

రాబోయే ఏడేళ్లలో ఏకంగా రూ.76,888 కోట్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉందని, ఈ భారం బడ్జెట్‌లపై ఎంతో ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల్లో కూరుకుపోయి ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో శుక్రవారం కాగ్‌ నివేదికలను ప్రవేశపెట్టారు.

''ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ గ్రామీణ తాగునీటి పథకంలో ఏకంగా రూ.491.83 కోట్ల నిధులు నిష్ఫలమయ్యాయి. రాష్ట్రంలో 271 చిన్న, మధ్య, భారీ తరహా ప్రాజెక్టుల్లో ఏకంగా రూ.28 వేల కోట్లకు పైగా అంచనాలు పెంచేశారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. 64 ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల ఊబిలో చిక్కుకుపోయాయి. రూ.25,367 కోట్ల మేర నష్టాల్లో చిక్కుకున్నాయి. ఇదంతా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే'' అని కాగ్‌ నివేదిక తప్పుపట్టింది.

రాష్ట్రంలోని వివిధ శాఖల్లో అనేక లోటుపాట్ల వల్ల రూ.607.51 కోట్ల ఆదాయానికి గండి పడింది.

ఫొటో సోర్స్, NAra chandrababu Naidu/Facebook

జనంలోకి ప్రత్యేక హోదా ఉద్యమం

ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జనంలోకి తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించింది.

శుక్రవారం జరిగిన తెలుగుదేశం శాసనసభాపక్ష సమావేశంలో కేంద్రంపై భవిష్యత్‌ పోరాటానికి సంబంధించిన కార్యాచరణపై చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.

ఎంపీలు రాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత వారితో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తామని, పర్యటన రూట్‌ మ్యాప్‌ను కూడా వెంటనే ఖరారు చేస్తామని తెలిపారు.

దీనికి సమాంతరంగా ఢిల్లీకి కూడా ప్రభుత్వం తరపున బృందాలను పంపుతానని ఆయన చెప్పారు.

పార్లమెంటు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం ద్వారా కేంద్రానికి వద్దకు పంపుతామని తెలిపారు.

''రాష్ట్రానికి బీజేపీ నమ్మక ద్రోహం చేసింది. తన అవసరాల కోసం వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోంది. ఎవరి వైఖరి ఏమిటో ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి'' అని నేతలకు సూచించారు.

కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తోందన్న బీజేపీ ప్రచారంలో నిజం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

జగన్‌ మాదిరిగా పవన్‌ను కూడా వాడుకొని విభజన తేవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. పవన్‌లో అవగాహనారాహిత్యం కనిపిస్తోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

''రాజధానికి రెండు వందల ఎకరాలు సరిపోతాయని ఆయన అంటున్నారు. ఇప్పుడున్న తాత్కాలిక సచివాలయమే రెండు వందల ఎకరాల్లో ఉంది. దానితోనే రాజధాని అయిపోతుందా'' అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, iStock

జియోతో వినియోగదారులకు ఏటా 65వేల కోట్లు ఆదా!

రిలయన్స్‌ జియో ప్రవేశంతో భారత్‌లో వినియోగదారులకు ఏడాదికి 64వేల కోట్ల రూపాయలు ఆదా అయినట్టు ఐఎఫ్‌సీ నివేదిక పేర్కొంది. దీనిపై ఈనాడు ఒక కథనం రాసింది.

ఈ విషయాన్ని హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌- ఐఎఫ్‌సీ తెలిపింది.

జియో సేవల వల్ల, సమయంతో పాటు వ్యయాల రూపేణ ప్రజలకు భారీఎత్తున ఆదా అవుతోందని ఐఎఫ్‌సీ తన నివేదికలో వెల్లడించింది.

2016 సెప్టెంబరులో రిలయన్స్‌ జియో కార్యకలపాలు ప్రారంభమమైనప్పటి నుంచి వినియోగదారులకు ఏడాదికి రూ.65000 కోట్లు (1000 కోట్ల డాలర్లు) ఆదా అయినట్లు అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Dan Kitwood/getty images

బిట్ కాయిన్ సంస్థలతో డీల్స్ వద్దు!

వర్చువల్‌ కరెన్సీలతో లావాదేవీలు జరిపే సంస్థలతో సంబంధాలను తక్షణం తెంచుకోవాలని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపు సేవల సంస్థలను ఆర్‌బీఐ ఆదేశించిందని సాక్షి పేర్కొంది.

ఈ ఆదేశాలు అన్ని వాణిజ్య, సహకార, చెల్లింపు బ్యాంక్‌లకు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లకు కూడా వర్తిస్తాయని పేర్కొంది.

వర్చువల్‌ కరెన్సీలతో రిస్క్‌ పొంచి ఉన్నదని హెచ్చరించిన మరుసటి రోజే ఆర్‌బీఐ ఈ ఆదేశాలు జారీ చేయడం విశేషం.

క్రిప్టో కరెన్సీలు చట్టబద్ధం కావని, వీటి వినియోగాన్ని తొలగించాలని బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ గతంలోనే పేర్కొన్నారు.

మధురవాణి బీఏ గోల్డ్‌మెడల్

నటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న మహానటి సినిమాలో సమంత ఫస్ట్ లుక్ విడుదలైంది. దీనిపై నమస్తే తెలంగాణ ఒక కథనం రాసింది.

కన్యాశుల్కంలో సావిత్రి పోషించిన మధురవాణి పాత్ర పేరుతోనే సమంత ఈ సినిమాలో నటిస్తున్నారు.

ఆమె పేరు మధురవాణి. బీఏలో గోల్డ్ మెడలిస్ట్. వృత్తిరిత్యా పాత్రికేయురాలిగా పనిచేస్తుంటుంది.

ఈ ఫస్ట్‌లుక్‌లో పుస్తకాల దొంతరల మధ్య పొడవాటి జడతో కళద్దాలు, ముక్కుపుడక ధరించి అలనాటి యువతిగా కనిపించి ఆకట్టుకుంటున్నది.

ఓ గొప్ప నటి జీవితాన్ని అన్వేషించే మహత్తరమైన కార్యానికి శ్రీకారం చుట్టింది. ఆ నటి గురించి మధురవాణి తెలుసుకున్న నిజాలేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు నాగ అశ్విన్.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.