అభిప్రాయం: పదకొండో ఐపీఎల్ పక్కా లోకల్!

  • 8 ఏప్రిల్ 2018
విరాట్ Image copyright Getty Images

ఐపీఎల్ జరిగే రెండు నెలల పాటు రోజూ సాయంత్రమయ్యే సరికి టీవీకి కళ్లప్పగించడం మినహా మనకు వేరే పనే లేదు. గడచిన పదేళ్లుగా ఇదే తంతు. ఇప్పుడూ అదే.

ఎన్నో వివాదాలు చెలరేగాయి. మ్యాచ్ ఫిక్సింగ్ భూతం ఈ లీగ్‌ను ఓ కుదుపు కుదిపింది.

అయినా ఆ ఆటుపోట్లన్నిటినీ తట్టుకోవడమే కాదు, ప్రతి ఏటా మరిన్ని హంగులు జోడించుకుని కొత్త బ్లాక్‌బస్టర్ సినిమాలా రిలీజ్ అవుతూనే ఉంది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మొత్తంలో ఐపీఎల్‌ను మించిన గ్లామర్ ఈవెంట్ మరొకటి లేనే లేదంటే అతిశయోక్తి కాదు.

పదకొండో ఏట అడుగుపెడుతున్న ఐపీఎల్‌ కొంచెం స్పెషల్. రెండేళ్ళ సస్పెన్షన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల రీఎంట్రీ ఈసారి ముఖ్యమైన విశేషం.

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని సీఎస్‌కే అభిమానులకు సెంటిమెంటల్ ఫేవరేట్ కాబట్టి ఆ జట్టు చేరికతో ఈ లీగ్ పూర్వ వైభవం అందుకుంటుంది.

Image copyright Getty Images

జట్లు పాతవే.. ఆటగాళ్లే కొత్త!

ఈసారి జట్లు పాతవే అయినా ఆటగాళ్లంతా దాదాపు కొత్త వాళ్లే. ఎక్కువ డబ్బులు చెల్లించి కొంతమంది ముఖ్యుల్ని అట్టిపెట్టుకోవడం తప్ప మిగతా ప్లేయర్లందరినీ కొత్తగా వేలంపాటలో కొనుక్కోవాల్సి వచ్చింది.

గత పదేళ్లలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ప్రతి టీం కూడా సమతూకంతో కూడిన జట్టును సిద్ధం చేసుకున్నాయి.

అందుకే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు మరింత పోటాపోటీగా సాగే చాన్సుంది.

అంపైర్ల నిర్ణయాలను సవాలు చేసే డీఆర్‌ఎస్. ప్రవేశపెట్టడం, ఫుట్‌బాల్ లీగ్స్‌లోని మిడ్ సీజన్ ట్రాన్స్‌ఫర్ తరహాలో సీజను మధ్యలో యువ ఆటగాళ్ల బదిలీ వెసులుబాటు ఐపీఎల్‌-11 ప్రత్యేకతలు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐపీఎల్ వేలానికి వస్తున్న పంజాబ్ కింగ్స్ XI అధినేత

11వ ఐపీఎల్ పక్కా లోకల్

పదకొండో ఐపీఎల్‌ పక్కా లోకల్. ఒక్క సన్‌రైజర్స్‌కు మినహా మిగతా 7 జట్లకు భారత ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉండడం ఈసారి కనిపిస్తున్న ముఖ్యమైన మార్పు.

ఇంపోర్టెడ్ వస్తువుల మీద మనకున్న మోజు ఇక్కడ కూడా చూడొచ్చు. ఒకప్పుడు విదేశీ ఆటగాళ్లకు కెప్టెన్సీ అప్పజెప్పడం ఐపీఎల్‌ ట్రెండ్.

జేమ్స్ హోప్స్, కేమరొన్ వైట్, డేవిడ్ హసీ లాంటి సాదాసీదా ఆటగాళ్లు కూడా ఐపీఎల్‌ జట్లకు గతంలో సారథ్యం వహించారంటే వింతగానే ఉంటుంది.

అయితే మూడు సందర్భాలు మినహా భారత ఆటగాళ్లు కెప్టెన్‌గా ఉన్న జట్లే ఐపీఎల్‌ టైటిల్స్ గెలుచుకున్నాయి.

తెలుగు సినిమాలో హీరో కచ్చితంగా తెలుగు వాడై ఉంటాడు. హీరోయిన్, విలన్ లాంటి వాళ్లు బయటివారైనా పెద్ద ఇబ్బంది ఉండదు.

ఐపీఎల్‌లో కూడా ఇప్పుడు అదే ట్రెండ్. కెప్టెన్ మనవాడే అయినప్పుడు కొత్త కుర్రాళ్లకు బెరుకు ఉండకపోవడమే కాక భాషా సమస్యలు కూడా ఉండవు.

టైటిల్ గెలవాలన్న కసి కూడా మన కెప్టెన్లకున్నంత విదేశీ ఆటగాళ్లకు ఉండదు.

క్రిస్ గేల్, మలింగా, ఆంద్రె రస్సెల్, సునిల్ నరైన్ లాంటి విదేశీ క్రీడాకారులు ఐపీఎల్‌లో చాలా సందడి చేశారు.

అయినా ఇండియన్ స్టార్స్‌కు పెద్ద పీట వేసే ముంబై, చెన్నై, కోల్‌కతా లాంటి జట్లే ఈ లీగ్‌లో విజేతలుగా నిలిచాయి.

గేల్, డివిలియెర్స్, మిచెల్ స్టార్క్, షేన్ వాట్సన్ లాంటి యోధానుయోధులున్నా కూడా రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేక పోయింది.

Image copyright Getty Images

దుమ్ము రేపనున్న అఫ్ఘాన్ కుర్రాళ్లు!

మొన్నీమధ్యనే ప్రపంచ కప్ ఆడడానికి అర్హత సంపాదించిన అఫ్ఘానిస్తాన్‌ నుంచి వచ్చిన కుర్రాళ్లు ఈసారి ఐపీఎల్‌లోనూ సంచలనం రేపనున్నారు.

రషీద్ ఖాన్ బౌలింగ్ పదును క్రితం సీజన్‌లోనే చూశాం. ఇప్పుడు ఇంకో ఇద్దరు కుర్రాళ్ళు - పదిహేడేళ్ళ ముజీబ్ జద్రాన్ (కింగ్స్ లెవెన్), పంతొమ్మిదేళ్ళ జహీర్ ఖాన్ పక్టీన్ (రాజస్థాన్) తమ స్పిన్ బౌలింగ్ విన్యాసాలు ప్రదర్శించబోతున్నారు.

వేరే దేశాలకు చెందిన కొత్త ఆటగాళ్లలో జోఫ్రా ఆర్చర్, డి ఆసి షార్ట్ (రాజస్థాన్), ఎవిన్ లూయిస్ (ముంబై), నేపాల్ ఆటగాడు సందీప్ లమిచానె (ఢిల్లీ) ఈ సీజన్‌లో మన దృష్టిని ఆకర్షించబోతున్నారు.

ఇక ఇండియా కొత్త కుర్రాళ్ల విషయానికొస్తే మయాంక్ మార్కండే, రాహుల్ చహర్ (ముంబై), ఖలీల్ అహ్మద్ (సున్రైసెర్స్), మహిపాల్ లొమ్రోర్ (రాజస్థాన్) ధ్రువ్ షోరే (చెన్నై), కమలేష్ నగర్కోటి, శుభ్‌మన్ గిల్, శివం మావి (కోల్‌కత), నవదీప్ సైనీ (బెంగుళూరు), పృథ్వీ షా (ఢిల్లీ) లాంటి వారు ఈసారి ఐపీఎల్‌లో హైలెట్ కావొచ్చు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఐపీఎల్ 2018 క్రీడాకారుల వేలానికి వస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ సహ యజమాని జూహీచావ్లా

ఈసారి విజేతలను ఊహించడం కష్టం!

ఇక ఈసారి విజేత ఎవరు అవుతారన్నది చెప్పడం చాలా కష్టం. ముందే చెప్పినట్టు ఈ సీజన్లో అన్ని జట్లు సరైన హోంవర్కు చేసి, అన్ని విభాగాల్లో బలంగా ఉండేలాగ జట్లను ఎంపిక చేసుకున్నాయి.

అన్ని జట్లలోనూ అసాధారణ ప్రతిభ ఉన్న ఆటగాళ్లు కనిపిస్తున్నారు. అయితే వ్యక్తిగత ప్రతిభ కన్నా టీం స్పిరిట్ ముఖ్యం.

కొత్తగా ఏర్పడిన ఈ కలగూరగంప కాంబినేషన్లలో ఏ జట్టు ఒక్క తాటిపై నడిచి కలిసికట్టుగా ఆడగలుగుతుందో అదే గెలుస్తుందన్నది నిస్సందేహం.

అయినా కూడా జట్ల కూర్పును బట్టి చూస్తే ముంబై, చెన్నై మిగతా వాటికన్నా బలంగా కనిపిస్తున్నాయి.

కోల్‌కతా, కింగ్స్ లెవెన్ జట్లలో బ్యాటింగ్ బలహీనంగా ఉంది.

డేవిడ్ వార్నర్ లేని వెలితి సన్‌రైజర్స్‌కు అంత తేలికగా తీరేది కాదు.

రాజస్థాన్, ఢిల్లీ కొత్త కాంబినేషన్లతో బరిలోకి దిగుతున్నాయి.

మిగతా జట్లను షాక్‌కు గురిచేసే సత్తా ఉన్న జట్లు ఇవి.

ఇక విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు మూడుసార్లు ఫైనల్ కొచ్చినా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు.

సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ మరి ఈసారైనా జట్టును గెలిపించడానికి ఒక బ్రహ్మాండమైన గేమ్‌ప్లాన్ సిద్ధం చేసుకునే ఉంటాడు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)