ప్రెస్ రివ్యూ: ‘మహిళలకు 33% రిజర్వేషన్.. నెలకు రూ.3వేలు - పవన్ హామీలు’

ఫొటో సోర్స్, Janasena Party/facebook
మహిళలకు 33% రిజర్వేషన్లు: పవన్ కల్యాణ్
జనసేన వరాల మూట విప్పింది అని ఈనాడు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులో.. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హామీలను గుప్పించారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, రేషన్ బదులు నగదును బదిలీ చేస్తామని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని, చట్ట సభల్లో మహిళలకు 33శాతం కోటా దక్కేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, పెనుమంట్ర మండలం మార్టేరులలో శనివారం నిర్వహించిన బహిరంగసభల్లో ఆయన మాట్లాడారు.
పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీల్లో ప్రధానంగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం ఉన్నాయి.
రూపాయికి ఇచ్చే బియ్యం తినడానికి అనుకూలంగా లేవని, దానికి బదులు మహిళల ఖాతాలకు 2,500 నుంచి 3 వేల రూపాయలు జమ చేస్తామని అన్నారు.
ఇక కులాల విషయంలో.. కాపుల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టించేందుకు కృషి, ఎస్సీ వర్గీకరణకు సామరస్య పరిష్కారం చూపుతామని పవన్ కల్యాణ్ అన్నట్లు ఈనాడు కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, KCR/facebook
‘కేసీఆర్‌పై గద్దర్ పోటీ’
బహుజనులు కోరుకుంటే 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై బడుగుల అభ్యర్థిగా ప్రజా గాయకుడు గద్దర్‌ను పోటీకి దింపాలని ఆలోచిస్తున్నామని కంచ ఐలయ్య తెలిపినట్లు సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం మేరకు..
వనపర్తిలో టీ మాస్ ఆధ్వర్యంలో 'బహుజనులకు రాజ్యాధికారం - ఉద్యోగుల పాత్ర' అనే అంశంపై శనివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
అగ్రవర్ణ పాలకులు బహుజనులకు బతుకుదెరువు లేకుండా చేయడాన్ని సహించలేకే ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో టీ మాస్ కూటమిని ఏర్పాటు చేసినట్లు ఐలయ్య చెప్పారు.
బహుజనులు రాజ్యాధికారం దక్కించుకునేలా గ్రామగ్రామానా ప్రజలను చైతన్యం చేయడంతోపాటు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రశ్నించేలా సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు.
రానున్న ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు లేదా మహిళా అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా టీ మాస్ 119 నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని కంచ ఐలయ్య వివరించారు.
పోటీ విషయంలో గద్దర్‌ను ఇప్పటికే ఒప్పించగా.. అరుణోదయ నాయకురాలు విమలక్కను కూడా ఎన్నికల బరిలో నిలిపేందుకు ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు ఐలయ్య అన్నారంటూ సాక్షి కథనం పేర్కొంది.
ఫొటో సోర్స్, ISC105.Org
‘ఉస్మానియా నిషేధిత ప్రాంతమా?’
‘ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వకపోవడం కుట్ర..’ అని జానారెడ్డి కామెంట్ చేశారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనం ప్రచురించింది. అందులో..
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటనకు ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సీఎల్పీ నేత కె.జానారెడ్డి అన్నారు.
కానీ, అలా కాకుండా ప్రభుత్వమే వెనక ఉండి రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాహుల్ పర్యటించనున్న నేపథ్యంలో సీఎల్పీ కార్యాలయంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు.
ఓయూలో సభకు అనుమతి ఇవ్వకపోవడానికి అదేమైనా నిషేధిత ప్రాంతమా? అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఓయూ విద్యార్థులేమైనా నిషేధిత వ్యక్తులా? అని అన్నారు.
విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వస్తున్న రాహుల్ పర్యటనకు ఎందుకు అనుమతివ్వరని నిలదీశారు. గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజల కోసం తెలంగాణను ఇచ్చిందే తప్ప.. కేసీఆర్ కుటుంబంలోని నలుగురి కోసం కాదన్నారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. కంచెలు దాటుకొని మరీ ఓయూలోకి అడుగుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతోందని మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
ఫొటో సోర్స్, Getty Images
‘ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది’
తెలగాణ ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందంటూ సాక్షి తెలంగాణ ఎడిషన్ ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
2017-18 విద్యాసంవత్సరంతో పోల్చితే ప్రస్తుతం 2.09 లక్షల ప్రవేశాలు అధికంగా నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల్లో విద్యార్థుల నమోదుకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ తాజా గణాంకాలు విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 29,343 విద్యాసంస్థలున్నాయి. ఇందులో 26,040 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, 475 కేజీబీవీలు, 1,771 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయంటూ సాక్షి కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)