ప్రెస్‌రివ్యూ: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ నిర్ణయం?

  • 13 ఆగస్టు 2018
కేసీఆర్, మోదీ Image copyright facebook/KCR

తెలంగాణలో అసెంబ్లీని ముందుగానే రద్దుచేసి.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లతో పాటు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా సిఫారసు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నిర్ణయించినట్లు 'ఫస్ట్‌పోస్ట్' న్యూస్ వెబ్‌సైట్ ఒక కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది.

ఆ కథనం ప్రకారం.. కేసీఆర్ ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఇటీవల సమావేశమైనప్పుడు చర్చించారని తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నతస్థాయి వర్గాలు చెప్పాయి. 'ఒకే దేశం - ఒకేసారి పోలింగ్' ఆలోచనకు కేసీఆర్ తన మద్దతును పునరుద్ఘటించారు. సాధారణ ఎన్నికలు 2019 ఫిబ్రవరి లోగా పూర్తయ్యేట్లయితే అప్పటివరకూ అసెంబ్లీ ఎన్నికల కోసం వేచి ఉండటానికి ఆయన సంసిద్ధత వ్యక్తంచేశారు.

'ఒకే దేశం - ఒకేసారి పోలింగ్' ఆలోచనకు మద్దతు ఇచ్చినందుకు గాను కేసీఆర్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మార్చడానికి ప్రధాని విముఖత వ్యక్తంచేశారు. దీంతో.. త్వరలో జరగబోయే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించాలని తాను కోరుకుంటున్నట్లు సూచించారు.

కేసీఆర్ ముందస్తుకు వెళ్లడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయని 'ఫస్ట్‌పోస్ట్' కథనం పేర్కొంది.

ఒకటి.. జమిలి ఎన్నికలకు కేసీఆర్ మద్దతు తెలుపుతున్నప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్రమోదీ - రాహుల్‌గాంధీల ప్రచారం వల్ల మత ప్రాతిపదికన ఓటర్లలో విభజన వచ్చే అవకాశముందని.. అందులో తను చిక్కుకుంటే ముస్లింల మద్దతు కోల్పోయే పరిస్థితి రావచ్చునని కేసీఆర్ భావిస్తున్నట్లు చెప్తున్నారు.

వ్యవసాయానికి సంబంధించి రుణ మాఫీ, నీటిపారుదల పథకాల వంటి చర్యలతో పాటు ఎకరానికి రూ. 4,000 చొప్పున అందిస్తున్న రైతు బంధు పథకం విజయవంతం కావటం.. వర్షాలు బాగా పడి, పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు సంతోషంగా ఉన్నపుడే ఎన్నికలకు వెళితే గ్రామీణ ప్రాంతాల్లో తమ పార్టీకి ఆదరణ పెరుగుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇక.. స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత ముందస్తు ఎన్నికల ప్రకటనచేయటం ద్వారా.. ఎన్నికలకు కాంగ్రెస్ సంసిద్ధంగా లేకపోవటం, ఆ పార్టీ నేతల మధ్య ఉన్న అనైక్యత.. వంటి వాటి నుంచి లబ్ధి పొందాలన్నది కేసీఆర్ ఆలోచనగా 'ఫస్ట్‌పోస్ట్' కథనం పేర్కొంది.

Image copyright facebook/NaraChandrababuNaidu

చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ?

ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెలాఖరులో కానీ, సెప్టెంబరు మొదటివారంలో కానీ మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చంటూ 'ఈనాడు' పత్రిక కథనం ప్రచురించింది. ముస్లిం మైనారిటీ వర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడానికి కసరత్తు చేస్తున్నానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా రాసిన ఈ కథనంలో.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన శాసన మండలి సభ్యుడు షరీఫ్‌, విజయవాడ నగరం నుంచి శాసన సభ్యుడు జలీల్‌ఖాన్‌, అనంతపురం జిల్లాకు చెందిన శాసన సభ్యుడు చాంద్‌బాషాల్లో ఎవరో ఒకరికి పదవి దక్కొచ్చని రాశారు.

''వీరిలో జలీల్‌ఖాన్‌, చాంద్‌బాషా వైకాపా తరఫున గెలిచి తెదేపాలోకి వచ్చారు. వైకాపా నుంచి ఇలా వచ్చిన వారిలో నలుగురికి గతంలో మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ... ఇప్పుడా పరిస్థితి ఏ మేరకు ఉందన్నది సందేహాస్పదమేనని పార్టీవర్గాలు భావిస్తున్నాయి. అప్పట్లో తెదేపా ఎన్‌డీఏ భాగస్వామిగా ఉండటం, గవర్నరు సహకరించడంతో వారికి పదవులు రావడంలో ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది. మారిన రాజకీయ పరిణామాలతో వైకాపా నుంచి గెలిచిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవడం అంత సులువు కాదని పార్టీ ముఖ్య నేత ఒకరు అభిప్రాయపడ్డారు. తెదేపాలో మొదటి నుంచీ ఉన్న వారిలో నంద్యాలకు చెందిన ఫరూక్‌ అత్యంత సీనియర్. ఇప్పుడు ఆయన శాసన మండలి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫరూక్‌ను కదపకుండా ఎమ్మెల్సీ షరీఫ్‌కే అవకాశమిస్తారన్న భావన ఉంది. ఆ జిల్లా నుంచి ఇటీవలి వరకూ ముగ్గురు మంత్రివర్గంలో ఉండేవారు. భాజపాకు చెందిన మాణిక్యాలరావు రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. కిందటి ఎన్నికల్లో శాసనసభ, లోక్‌సభ స్థానాలన్నింటినీ గెలిచిన ఏకైక జిల్లా కావడంతో అక్కడి నుంచి మూడో వారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని భావిస్తున్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright facebook/RajaSingh
చిత్రం శీర్షిక గోవును నమస్కరిస్తున్న ఎమ్మెల్యే రాజాసింగ్

బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

గో సంరక్షణ ఉద్యమం కోసం బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని గోషామహల్‌ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్‌ ప్రకటించారంటూ ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది.

గోవుల అక్రమ వధపై అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నోసార్లు మాట్లాడానని, కానీ, పార్టీ నుంచి మద్దతు లభించలేదని రాజాసింగ్ తప్పుబట్టారు. గో రక్షణ గురించి తాను మాట్లాడిన ప్రతి సందర్భంలో కొంతమంది ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తున్నారని, గోరక్షణకు తాను చేపట్టిన ఉద్యమం కారణంగా పార్టీకి నష్టం కలగరాదన్న ఉద్దేశంతోనే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాజీనామా లేఖను నాలుగు రోజుల కిందటే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు అందజేశానని రాజాసింగ్ చెప్పారని ఆ కథనంలో ప్రస్తావించారు.

''గో రక్షణ కోసం పోలీసు బుల్లెట్లను ఎదుర్కోవడానికి సైతం సిద్ధంగా ఉన్నామని.. బక్రీద్‌ సందర్భంగా, నగరంలోకి ఇప్పటికే 3 వేలకుపైగా ఆవులను తరలించారని, వాటి రక్షణకు తాను రంగంలోకి దిగక తప్పదని చెప్పారు. దీనిపై ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం స్పందించకపోతే మేం ఏమైనా చేస్తాం. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం పడుకుంటే.. మేం లేస్తాం. అదే జరిగితే ఏమైనా కావొచ్చు. అన్నింటికీ మేం రెడీ.. చావడానికి కూడా సిద్ధం'' అని రాజాసింగ్ ప్రకటించారంటూ ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొన్నారు.ఎస్వీ మెడికల్ కాలేజీలో మరో ఎంబీబీఎస్ విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతి ఎస్వీ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్‌ శిల్ప ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అదే కళాశాలకు చెందిన మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిందని 'సాక్షి' పత్రిక కథనం ప్రచురించింది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై రాసిన కథనంలో వివరాలివీ...

వైఎస్సార్‌ జిల్లా కడప నగరంలోని మారుతీనగర్‌కు చెందిన హరితాదేవి తన కుమార్తె గీతికతో కలిసి తిరుపతి శివజ్యోతినగర్‌లో ఉంటున్నారు. గీతిక ఎస్వీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సోమవారం కాలేజీలో పాథాలజీ ఇంటర్నల్‌ పరీక్షకు హాజరు కావాల్సి ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఎప్పటిలాగే ఇంట్లో భోజనం చేశాక గదిలోకి వెళ్లి చదువుకునేందుకు తలుపు వేసుకుందని ఆమె తల్లి హరితాదేవి తెలిపారు. కానీ, సాయంత్రం ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో అనుమానం కలిగి తలుపు తీసి చూస్తే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు.

కొన ఊపిరితో ఉన్న ఆమెను హుటాహుటిన 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందిందన్నారు. గీతిక మృతికి కారణాలు తెలియలేదు. కానీ, తమ కుమార్తె వ్యక్తిగత కారణంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని హరితాదేవి తెలిపారు. కాగా, గీతిక తండ్రి వైఎస్సార్‌ కడప జిల్లాలో న్యాయవాదిగా పనిచేస్తూ రెండేళ్ల క్రితమే మృతిచెందారు. తల్లి హరితాదేవి కూడా కడపలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసేవారు. అయితే, కుమార్తె మెడిసిన్‌ చదువు కోసమని రెండేళ్ల క్రితం టీచర్‌ వృత్తిని వదులుకుని తిరుపతిలో ఉంటున్నారు. పోస్టుమార్టం నిమిత్తం గీతిక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

Image copyright facebook/kcr

తెలంగాణలో మూడు కొత్త పథకాలు

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు పథకాలను ప్రారంభిస్తున్నారని 'నమస్తే తెలంగాణ' పత్రిక రాసింది. పేదప్రజలందరికి కంటిచూపు సమస్యలు లేకుండా చూసే కంటి వెలుగు, రైతుకు దన్నుగా ఉండే బీమా, స్వయం ఉపాధి పొందాలని భావించే బీసీలకు అండగా ఆర్థికసహాయం అందించే కార్యక్రమాలను బుధవారం నుంచి చేపడుతున్నారని పేర్కొంది.

''రాష్ట్రంలోని ఏ ఒక్కరు కూడా కంటి చూపు సమస్యలతో బాధపడకూడదని భావించిన సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, ప్రజలకు కండ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. రైతులు ఏ కారణంతో మరణించినా ఆయా కుటుంబాలకు అండగా నిలువాలని నిర్ణయించిన సీఎం.. కొత్తగా బీమా పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 28 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగనుంది. రైతు ఏ కారణంవల్ల మరణించినా పది రోజుల్లో, పెద్ద కర్మ పూర్తయ్యేలోగా ఐదు లక్షల రూపాయల చెక్కు అందించేలా ఈ పథకానికి రూపకల్పన చేశారు.వివిధ స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి పొందాలని భావించే బడుగులకు బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో రూ.50 వేల వరకు వంద శాతం సబ్సిడీ'' అంటూ ఆ కథనంలో వివరాలు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)