మృత్యు ఘంటికలు మోగిస్తున్న స్వైన్‌ఫ్లూ: ప్రెస్ రివ్యూ

  • 13 అక్టోబర్ 2018
Image copyright Getty Images

తెలంగాణ రాష్ట్రంలో స్వైన్‌ ఫ్లూ మళ్లీ మృత్యు ఘంటికలు మోగిస్తోందని సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

''గురువారం ఒక్కరోజే ఇద్దరు మహిళలు స్వైన్‌ ఫ్లూతో మృత్యువాత పడటం వ్యాధి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం మరో 20 మందికిపైగా బాధితులు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకు 140కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. వీటిలో వందకుపైగా గ్రేటర్‌లోనే నమోదయ్యాయి. ప్రస్తుత ఫ్లూ బాధితుల్లో పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువగా ఉన్నారు'' అని ఆ కథనంలో వివరించారు.

Image copyright Ncbn.in

టార్గెట్ ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా... ఆయన సన్నిహితులపై ఐటీ శాఖ గురి పెడుతున్నట్లు తెలుస్తోందంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక ఒక కథనం ప్రచురించింది.

''రాజకీయ వ్యూహంలో భాగంగానే వరుస సోదాలు జరుగుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయి. రాజకీయంగా ముఖ్యమంత్రికి సన్నిహితులుగా ఉన్న వారు, పార్టీకి ఆర్థికంగా సేవలందించిన వారిపై ఐటీ కన్ను వేసినట్లు తెలుస్తోంది. తొలుత నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావుపై ఐటీ గురి పెట్టింది. తర్వాత ఒకేసారి 19 బృందాలు విరుచుకుపడ్డాయి. ఆపై... రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఇప్పుడు... సీఎం రమేశ్‌ వంతు! ఇదే క్రమంలో త్వరలోనే రెండు ప్రముఖ కాంట్రాక్టు కంపెనీలపైనా దాడులు జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

సోదాల్లో ఏం గుర్తించారు, ఏం స్వాధీనం చేసుకున్నారనే విషయాలపై ఐటీ అధికారులు గోప్యత పాటిస్తున్నారు. వీటిపై ఎలాంటి అధికారిక ప్రకటనలూ విడుదల చేయడంలేదు. ఆయా నేతలు, కాంట్రాక్టు కంపెనీలకు చంద్రబాబుతో ఉన్న సంబంధాలపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీకి ఆర్థికంగా అండగా ఉన్న వారు, ఈ ఎన్నికల్లో సహకారం అందించే అవకాశమున్న వారితో 'హిట్‌ లిస్ట్‌' తయారైనట్లు సమాచారం. ఆయా కంపెనీలకు చెందిన సమస్త సమాచారాన్ని ఐటీ శాఖ ముందుగానే తెప్పించుకున్నట్లు తెలిసింది. కర్ణాటక ఎన్నికల నాటినుంచే తాము ఎంచుకున్న లక్ష్యానికి అనుగుణంగా సమాచార సేకరణను ఐటీ శాఖ ప్రారంభించిందని అంటున్నారు. వాటి ఆధారంగా దాడులు జరపడం, ఏవైనా దొరికితే మరింత ముందుకెళ్లడం లక్ష్యంగా ఎప్పటికప్పుడు వ్యూహరచన చేసుకుంటోందని తెలిసింది. రాష్ట్రంలో మంత్రి నారాయణ విద్యా సంస్థలపై ఐటీ దాడి చేయాలనుకున్నా... విమర్శలు రావడంతో తాత్కాలికంగా వ్యూహం మార్చారు'' అంటూ ఆ కథనంలో తాజా పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషించింది.

అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి మూడో స్థానం

దేశంలో అవినీతి తక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ మూడో స్థానంలో నిలిచిందని ‘ఈనాడు’ కథనం రాసింది.

‘‘ఈ అంశంలో గుజరాత్‌, కేరళలు మొదటి రెండు స్థానాల్లో ఉండగా.. తమిళనాడు, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌లు అట్టడుగు స్థానంలో నిలిచాయి. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్‌ ఇండియా, లోకల్‌ సర్కిల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఇండియన్‌ కరప్షన్‌ సర్వే-2018 ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించారు. అవినీతి నిరోధక బిల్లు (సవరణ) - 2018 ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రజాభిప్రాయసేకరణ చేపట్టారు. అవినీతి తక్కువగా, ఎక్కువగా ఉన్న తొలి మూడు రాష్ట్రాలను ప్రకటించారు’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

తెలంగాణ మ్యాప్ Image copyright Getty Images

తెలంగాణలో మొత్తం 2.73 కోట్ల ఓటర్లు

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 2.73 కోట్ల ఓటర్లు ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం తేల్చిందని 'నమస్తే తెలంగాణ' కథనం ప్రచురించింది.

‘‘తెలంగాణలో 2018 ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తిచేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఓటరు జాబితాను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపింది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఓటర్ల వివరాల జాబితా ముసాయిదాను శుక్రవారం రాత్రి 10.45 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 2,73,18,603 మంది ఓటర్లు నమోదైనట్టు పేర్కొన్నారు. ఇందులో పురుష ఓటర్లు 1,37,87,920, మహిళా ఓటర్లు 1,35,28,020, థర్డ్ జెండర్ ఓటర్లు 2,663గా నమోదైనట్టు తెలిపారు'' అని ఆ కథనంలో వివరించారు.

తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి Image copyright facebook/Uttam Kumar Reddy

దసరా తరువాతే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితాను దసరా తర్వాతే ప్రకటించనున్నారని 'సాక్షి' పత్రిక తన కథనంలో పేర్కొంది.

''మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, టీజేఎస్, సీపీఐ మధ్య సీట్ల సర్దుబాట్లు కొలిక్కి వచ్చాకే తొలి జాబితాను విడుదల చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం భావిస్తోంది. సర్దుబాటుకు ముందే ఈ నిర్ణయం తీసుకుంటే కూటమిలో నిరసన వ్యక్తమయ్యే అవకాశం లేకపోలేదనే ఈ నిర్ణయం తీసుకున్నారు.

తొలుత.. ఈ నెల 15, 16 తేదీల్లో 40 మందితో తొలి జాబితా విడుదల చేయాలని కాంగ్రెస్‌ భావించింది. ఈలోగా కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముగించాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం టీపీసీసీ నాయకత్వానికి సూచించింది. కానీ చర్చలపై ప్రతిష్టంభన తొలగకపోవడమే ఆలస్యానికి కారణంగా తెలుస్తోంది. కూటమి తరఫున ఉమ్మడి ప్రణాళికను విడుదల చేయడం, కూటమికి భాగస్వామ్యపక్షాల్లో ఒకరిని చైర్మన్‌గా నియమించడం వంటివి వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కాంగ్రెస్‌ భావిస్తోంది.

కాగా, కూటమి నిర్మాణంలో భాగంగా టీడీపీ 12 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ నియోజకవర్గాలతో కూడిన జాబితాను కాం గ్రెస్‌కు ఇచ్చింది. వీటిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్, రాజేంద్రనగర్‌తో పాటు మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర, మక్తల్, నల్లగొండ జిల్లా కోదాడ, కరీంనగర్‌ జిల్లా కోరుట్ల ఉన్నట్లు తెలిసింది. మరో ఎనిమిది నియోజకవర్గాల పేర్లు ఇచ్చి వాటిలో 4 కచ్చితంగా ఇవ్వాలని కోరినట్లు సమాచారం.

టీజేఎస్‌కు 5 స్థానాలు కేటాయించేందుకు అంగీకరించిన కాంగ్రెస్‌ ఆయా నియోజకవర్గాలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు కూడా ఇవ్వాలని కోరింది. టీజేఎస్‌ చీఫ్‌ కోదండరామ్‌ ఈ ఎన్నికల్లో పోటీచేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్‌ కోరుతోంది. దానికి ఆయన సమ్మతించినట్లు తెలుస్తోంది. ఇకపోతే సీపీఐకి 2 స్థానాలు మాత్రమే ఇస్తామని కాంగ్రెస్‌ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.

కాంగ్రెస్‌‌కు సంబంధించి ఇప్పటివరకు 40 నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యింది. ఈ నియోజకవర్గాలకు ఒక్కో పేరునే పార్టీ స్క్రీనింగ్‌ కమిటీ కూడా ఆమోదించింది. ఈ జాబితానే పండగ తర్వాత విడుదల చేసే అవకాశం ఉందని.. పార్టీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు'' అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)