‘నరేంద్ర మోదీని చంపుతాం’.. దిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఈమెయిల్: ప్రెస్ రివ్యూ

  • 14 అక్టోబర్ 2018
మోదీ Image copyright Getty Images

ప్రధాన మంత్రి నరేంద్రమోదీని చంపుతామని హెచ్చరిస్తూ దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్‌కు ఈమెయిల్ వచ్చిందంటూ 'సాక్షి' పత్రికలో వార్తాకథనం ప్రచురితమైంది.

దిల్లీ పోలీస్ కమిషనర్ అధికారిక ఈమెయిల్‌కే ఇది వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఏకవాక్య మెయిల్‌లో మోదీని ఎప్పుడు హత్య చేస్తారో తేదీ కూడా వారు తెలిపారు. అసోం నుంచి మెయిల్ వచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. దిల్లీ పోలీసులు దీనిపై దర్యాప్తు జరుపుతున్నారు.

Image copyright facebook/kalvakuntlaTarakaRamaRao-KTR

చంద్రబాబు కాంగ్రెస్‌ను కొనేశారు: కేటీఆర్

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీని కొనేసి రాజకీయం నడిపిస్తున్నారని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారంటూ 'ఈనాడు'లో వార్తాకథనం ప్రచురితమైంది. కేటీఆర్ విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో ఆయన మాట్లాడిన పలు అంశాలను ఇందులో ప్రస్తావించారు.

''చంద్రబాబునాయుడు మళ్లీ ఓటుకు నోటు తరహా కుట్రలు ప్రారంభించారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బాబు ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తెలంగాణలో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ నేతలు బాబు చేతుల్లో తోలుబొమ్మలని, ఆయన ఆడించినట్లు ఆడుతున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీకి డబ్బులిచ్చి, ఏపీ ఇంటెలిజెన్స్‌ను ఇక్కడే మోహరించి రాజకీయాలు చేస్తున్నారు. రూ.500 కోట్లను కాంగ్రెస్‌కు సమకూర్చిన విషయాన్ని ఇప్పటికే కేసీఆర్‌ బయటపెట్టారు. సీఎం రమేశ్‌, కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి, ఏపీలో తెదేపా నేత మస్తాన్‌రావుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగితే చంద్రబాబుకు ఉలికిపాటు ఎందుకు? తెలంగాణలో మా పార్టీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సీబీఐ డైరెక్టర్‌ విజయరామారావు కుమారుడి ఇళ్లపై సీబీఐ దాడులు జరిగితే మేమేమీ రాద్ధాంతం చేయలేదు. తెలంగాణలో చంద్రబాబుకు ఉనికి లేదని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రుజువైంది. తెలంగాణలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 లేఖలు రాశారు. చీటికిమాటికీ హైదరాబాద్‌ను అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్నారు. అంత చేసేవాడివైతే అమరావతిని నాలుగున్నరేళ్లలో ఎందుకు అభివృద్ధి చేయలేదు? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. ఇంటికో ఉద్యోగమన్నారు. పది లక్షల మందికి రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అని, ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రెండు లక్షల మందికి రూ.వేయి అని ప్రకటించారు. బాబు మాదిరిగా మేం ఎన్నికల కోసం ప్రకటనలు చేయలేదు. నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి చూపిస్తాం. ఇంకా ఎవరైనా నిరుద్యోగులు మిగిలి ఉంటే వారికి భృతి ఏమివ్వాలని చర్చిస్తున్నాం. గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ను తెలంగాణ ప్రజలు గొప్పగా ఆదరించారు. ఇప్పుడు కేసీఆర్‌పైనా ప్రజల్లో అలాంటి ఆరాధ్యభావన ఏర్పడింది.'' అని కేటీఆర్ చెప్పారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright facebook/CMRamesh
చిత్రం శీర్షిక ఏపీలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ నివాసం, ఆయన సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు.

ఐటీ టెర్రర్

ఐటీ సోదాల కారణంగా ఏపీలో చాలామంది జాగ్రత్త పడుతున్నారంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రిక కథనం ప్రచురించింది. ''ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న, బడా కంపెనీలపైనే ఐటీ ఫోకస్‌ పెట్టినప్పటికీ... వీరితో ఎలాంటి సంబంధంలేని వ్యక్తులు, సంస్థల్లోనూ ఎన్నడూ లేనంత అప్రమత్తత కనిపిస్తోంది. 'ఎందుకైనా మంచిది' అంటూ ఎవరికి వారు జాగ్రత్త పడుతున్నారు. భారీ లావాదేవీల మాటెత్తడానికే భయపడుతున్నారు. ఐటీ సోదాలు జరగడం కొత్తేమీ కాదు. ఒక వ్యక్తి లేదా సంస్థ లావాదేవీలకు... కడుతున్న పన్నుకూ మధ్య పొంతన లేదని భావిస్తే, తగిన సమాచారాన్ని సేకరించి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటారు.

కానీ... రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది వేరు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బృందాలను రంగంలోకి దించుతున్నారు. ఇటీవల 200 మంది సిబ్బంది 19 బృందాలుగా విడిపోయి వీర విహారం చేశారు. ఒకరోజు, రెండు రోజులు కాకుండా... రోజుల తరబడి అదే పనిగా వేడి కొనసాగిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంతో సంబంధం లేని వారు కూడా బెంబేలెత్తుతున్నారు. పలువురు రియల్టర్లు, వ్యాపారులు అసలు ఇప్పుడేమీ కొత్త లావాదేవీలు వద్దు, ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు వద్దే వద్దు అన్న స్థాయికి వెళ్లిపోయారు. పెద్ద మొత్తంలో లావాదేవీలు నిర్వహించేవాళ్లే కాకుండా... ఒక మాదిరిగా వ్యాపారాలు చేసేవారూ టెన్షన్‌ పడుతున్నారు.

ఐటీ శాఖ చాలా లోతుల్లోకి వెళ్లి మరీ లావాదేవీలపై ఆరా తీస్తోంది. ''గత నాలుగేళ్లుగా భారీగా లావాదేవీలు జరిగిన ఖాతాల వివరాలన్నీ మాకు చెప్పండి' అంటూ బ్యాంకులకు ఐటీ నుంచి లేఖలు వెళ్లినట్లు తెలిసింది. ఇటీవలికాలంలో జాగ్రత్త పడినప్పటికీ... పాత లెక్కలను తీసి పక్కాగా పట్టుకోవచ్చునని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.

మరీ ముఖ్యంగా... తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ కంపెనీలు, సంస్థలు నిర్వహించిన లావాదేవీల వివరాలను పలు బ్యాంకులనుంచి ఐటీ శాఖ సేకరిస్తున్నట్లు తెలిసింది. లక్ష్యంగా నిర్ణయించుకున్న కంపెనీల బ్యాంకు ఖాతాలపై దృష్టి సారించారు. ఒకచోట తీగ దొరికితే గొలుసుకట్టుగా డొంకను కదిలించుకుంటూ వెళ్లిపోతున్నారు. ఈ వ్యవహారం క్రమంగా వ్యాపార వర్గాల్లోకి చేరుతుండడంతో గుబులు మొదలైంది'' అంటూ ఆ కథనం పేర్కొంది.

Image copyright janasena
చిత్రం శీర్షిక నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్

తెలంగాణలో పోటీపై త్వరలో నిర్ణయం: పవన్ కల్యాణ్

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీచేయాలా? లేదా? అనే విషయాన్ని నాలుగైదు రోజుల్లో తేల్చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ చెప్పినట్లుగా 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం వెల్లడించింది. పవన్ శనివారం విజయవాడలో మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి జనసేన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీలో పారిశ్రామికవేత్తలపై ఐటీ దాడులు జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉలిక్కిపడుతోందని పవన్ ప్రశ్నించారంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)