నారా చంద్రబాబునాయుడు: ఆంధ్రను ఫినిష్‌ చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారు: ప్రెస్‌రివ్యూ

చంద్రబాబు

ఫొటో సోర్స్, chandrababu/fb

'నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని.. గుజరాత్‌ రాష్ట్రం ఒక్కదానికే కాదు. గుజరాత్‌లో ఏ ప్రాజెక్టును నిర్మిస్తున్నా.. ప్రారంభిస్తున్నా ఆయన ఆనందంగా వెళ్తారు. సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టుకైతే వెళ్తారు. కానీ జాతికి, దేశానికి అత్యంత గర్వకారణమైన.. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నా ఇటువైపు చూడరు. దానిని పట్టించుకోరు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినా నిధులు మంజూరు చేయడం లేదు. తెలుగువారంటే అంత చులకనా' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారని ఆంధ్రజ్యోతి పేర్కొంది.

‘పూర్వకాలంలో రాజులు ప్రజాక్షేమం కోరుతూ యజ్ఞాలు చేసేవారని.. వాటిని రాక్షసులు భగ్నం చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందకుండా చేసేవారని.. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌, పవన్‌ కల్యాణ్‌ పోలవరం సహా.. అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.’

మోదీ-బీజేపీ, టీఆర్‌ఎస్‌, జగన్‌, పవన్‌ అంతా కలిసి నాటకాలాడుతున్నారని.. వారికి బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపిచ్చారు.ఓవైపు కేంద్రం రాక్షసంగా వ్యవహరిస్తుంటే.. మరో వైపు తెలంగాణ, ఒడిశా కూడా రాష్ట్రం పట్ల కక్షపూరితంగా కుట్రలు పన్నుతున్నాయని దుయ్యబట్టారు.

సోమవారం పోలవరం ప్రాజెక్టులో తొలి రేడియల్‌ గేట్‌ బిగింపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కాఫర్‌ డ్యాం పనులను పరిశీలించారు. తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.

'ఆంధ్రను ఫినిష్‌ చేయాలని కేసీఆర్‌ చూస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలూ అభివృద్ధి సాధించాలనేది నా ఆకాంక్ష. కేసీఆర్‌ మాత్రం ఆంధ్ర అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారు. ఇందుకోసం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు.పోలవరం పూర్తికాకపోతే.. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలేవీ జరగడం లేదని.. పాలన బాగాలేదని చెప్పే ఎత్తుగడలో ఉన్నారు. ఈ ప్రాజెక్టు కడితే ఒడిశాకు, తెలంగాణకు నష్టమేమీ లేదు. కానీ ఒడిశా ప్రయోజనాల కోసమే పోలవరాన్ని అడ్డుకుంటున్నానని చెప్పుకొనేందుకు ఆ రాష్ట్ర సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రయత్నిస్తున్నారు’ అని చంద్రబాబు చెప్పారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, kcr/fb

పక్కా ప్రాంతీయ వ్యూహం

కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా సమాఖ్య కూటమి ఏర్పాటుపై త్వరలోనే సమగ్ర వ్యూహం, పక్కా ప్రణాళికతో ముందుకొస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారని ఈనాడు వెల్లడించింది.

ఒక బృహత్తర లక్ష్యంతో వచ్చే కూటమి ఆదరాబాదరాగా చేయాల్సింది కాదని కేసీఆర్ అన్నారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి వచ్చే వారందరినీ కలుపుకొని, కూటమిని బలోపేతం చేస్తామన్నారు.

సమాఖ్య కూటమి ఏర్పాటు సన్నాహాల్లో భాగంగా సోమవారం పశ్చిమబెంగాల్‌ వెళ్లిన కేసీఆర్‌ కోల్‌కతాలోని సచివాలయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు ఇద్దరి మధ్య చర్చ జరిగింది. సమాఖ్య కూటమి, జాతీయ రాజకీయాలు, పరస్పర సహకారం ఇతర అంశాల గురించి మాట్లాడుకున్నారు.

అనంతరం కేసీఆర్‌ మమతతో కలిసి విలేకరులతో మాట్లాడారు. 'సమాఖ్య కూటమి ఏర్పాటుపై ఆదివారం నుంచి చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చించాను. ఈ రోజు మమతా బెనర్జీని కలిశాను. జాతీయ రాజకీయాలపై మాట్లాడాను. ఇక ముందు కూడా చర్చలు కొనసాగుతాయి. దీదీ (మమతా బెనర్జీ)తో చర్చలు ఎప్పుడూ సానుకూలంగానే జరుగుతాయి. మున్ముందు కూడా చర్చలు కొనసాగుతాయి. చర్చల అనంతరం పూర్తి స్థాయి ఫలితాలు వస్తాయి. దేశవ్యాప్తంగా పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఇది. ఇద్దరు నేతలు కలిసినప్పుడు సాధారణంగా పరస్పర ప్రయోజనాలు, జాతీయ రాజకీయాలు సహా అన్ని అంశాలపైనా చర్చ జరుగుతుంది. అతి త్వరలోనే నిర్మాణాత్మకమైన ప్రణాళికతో ముందుకు వస్తాం' అని కేసీఆర్‌ తెలిపారు.

మీరు కాంగ్రెస్‌, భాజపాయేతర కూటమిని ఆశిస్తున్నారా? అని విలేకర్లు ప్రశ్నించగా.. 'నా మిషన్‌ అదే. ఇందుకోసం నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఇది ఇప్పటికిప్పుడు అయ్యేంత చిన్న విషయం కాదు. మేం చర్చలు కొనసాగిస్తాం. ఫలితం వస్తుంది. సమయం వచ్చే వరకు వేచిచూడాలి. త్వరలోనే కార్యాచరణ మొదలవుతుంది. మీకు శుభవార్త అందిస్తాం' అని తెలిపారు. విలేకరుల సమావేశంలో మమత ఏమీ మాట్లాడలేదని ఈనాడు తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

బాబోయ్‌.. బిచ్చగాళ్లు!

హైదరాబాద్‌లో యాచకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది. విశ్వనగరం లక్ష్యంలో భాగంగా అధికారులు హైదరాబాద్‌ను 'బెగ్గర్‌ ఫ్రీ' నగరంగా మారుస్తామని సంకల్పం చెప్పుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా భాగ్యనగరాన్ని సందర్శించినప్పుడు ఆమె ప్రయాణించే మార్గాలు, మరికొన్ని ముఖ్యకూడళ్లలో యాచకులను నిరోధించి..వారికి పునరావాసంగా చర్లపల్లి జైలుకు తరలించారు. కొన్నాళ్లపాటు నగరవాసులకు వీరి బెడద తగ్గినా..మళ్లీ వారి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. మళ్లీ ప్రధాన కూడళ్లలో వారు రెచ్చి పోతున్నారు.

నగరంలో దందా సాగిస్తున్నవారంతా దుర్భర పరిస్థితుల దృష్ట్యా యాచన చేసేవారు కారు. హరియాణా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి నగరానికి కుటుంబ సమేతంగా వచ్చి శివారుల్లో చిన్న చిన్న గుడారాలు వేసుకొని యాచన పేరిట దందా నడిపేదే వీరిలో అధికులు. వీరిలో పురుషులు ముందుగా రద్దీ కూడళ్లను ఎంపిక చేసుకొని భిక్షాటన కోసం తమవారు ఎవరు ఎక్కడ వెళ్లాలి అనేది నిర్ధారిస్తారు. మహిళలు, మధ్య వయస్కులు కీలక రహదారుల్లో వాహనాలను అడ్డగించి తమకు లేని కృత్రిమ వైకల్యాన్ని చూపి యాచిస్తుంటారు.

కొంతమంది తమ చిన్నారులకు వైట్‌నర్‌ మత్తులో పెట్టి వారిని ఎత్తుకొని దీనంగా డబ్బులు అడుగుతుంటారు. ఒక్కోసారి ఎవరైనా విసుగెత్తి ద్విచక్ర వాహన దారులు వారి చర్యలను వ్యతిరేకిస్తే..వారిని తీవ్ర స్థాయిలో దూషించడమో, పరిస్థితులను బట్టీ తిరగ బడడమో చేస్తుంటారు. తమ చేతులకు కాళ్లకు ఉత్తుత్తి కట్లు, కాలినట్లు ఆయింట్‌మెంట్‌ పూతలు వేసుకొని జుగుప్సాకరంగా వాటిని ప్రదర్శిస్తూ ఇవతల వారిపై ఒత్తిడి తెస్తుంటారు.తమ కట్లు, లేదా దెబ్బలకు రుజువుగా వైద్య చీటీలు కూడా చూపి యాచన చేస్తున్నారు. ఇలా షాపుల వద్ద, చౌరస్తాల్లో వీరి ఆగడాలు పెరుగుతున్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా నగరంలో పర్యటించినప్పుడు అధికార యంత్రాం గం ప్రతిష్టాత్మకంగా భావించి ఓ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా యాచకులను నిరోధించింది. వారిని పోలీసులు పట్టుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. అనంతరం జీహెచ్‌ఎంసీ ఉన్నత అధికారులు కూడా బెగ్గింగ్‌ ఫ్రీ సిటీ కోసం కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. అయినా నగరంలో వారి సంఖ్య తగ్గలేదు. పునరావాస చర్యలు లేవు అని సాక్షి వెల్లడిచింది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ వరికి 'నాసి' రోగం

తెలంగాణ సోనా రకం వరి విత్తనాల్లో మొలకెత్తని వాటిని రాష్ట్ర వ్యవసాయశాఖ గుర్తించిందని సాక్షి పేర్కొంది. సోనమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ తయారు చేసిన (లాట్‌ నంబర్‌: 150480) విత్తనాలు నాసిరకమైనవని తేలింది. దీంతో వాటిని సీజ్‌ చేయాలని జిల్లా వ్యవసాయాధికారులను ఆదేశించింది.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆర్‌ఎన్‌ఆర్‌-15048 అనే తెలంగాణ సోనా రకం వరి విత్తనాన్ని కనుగొన్నది. ఈ వరిలో గ్‌లైపోసేట్‌ శాతం తక్కువ ఉండటంతో ఇది షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరమన్న ప్రచారం ఉంది. దీంతో ఈ వరి బియ్యాన్ని అనేకమంది ఉపయోగిస్తున్నారు.

ఈ వరిపై పలు రాష్ట్రాలూ ఆసక్తి చూపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా మరికొన్ని రాష్ట్రాల్లో దీని సాగు పెరిగింది. దీంతో అనేక కంపెనీలకు విత్తనోత్పత్తి చేసే అవకాశం కల్పించారు. కానీ, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా ఉండటంతో నాసిరకపు విత్తనాలు వెలుగు చూస్తున్నాయని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.

సోనమ్‌ కంపెనీ పంపిణీ చేసిన లాట్‌లోని కొన్ని విత్తనాలను పరీక్ష నిమిత్తం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల వ్యవసాయాధికారి లెబొరేటరీకి పంపారు. పరీక్షల్లో ఆ లాట్‌ విత్తనాలకు 55 శాతం మొలకెత్తే స్థాయి మాత్రమే ఉందని నిర్ధారించారు.

ఒక అంచనా ప్రకారం ఈ లాట్‌ నంబర్‌ కలిగిన నాసిరకపు విత్తనాలను దాదాపు 50 నుంచి వంద క్వింటాళ్ల వరకు రైతులకు అమ్మేందుకు జిల్లాలకు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే, ఎంతమేరకు ఇప్పటికే ఈ లాట్‌ నంబర్‌ కలిగిన తెలంగాణ సోనా విత్తనాలను రైతులు కొనుగోలు చేశారో మాత్రం తెలియదు.

ఈ లాట్‌ నంబర్‌ కలిగిన విత్తనాలను జిల్లాలకు సరఫరా చేయడానికి ముందే నాణ్యతను ఎందుకు కనుగొనలేదన్న ప్రశ్నలు రైతుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విత్తనాన్ని సరఫరా చేసిన కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశముంది. తెలంగాణ సోనా విత్తనంలో జన్యుపరమైన లోపాలున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని వ్యవసాయశాఖ వర్గాలు ప్రకటించాయిని సాక్షి తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)