ఈడీ విచారణకు రేవంత్ రెడ్డి.. ఓటుకు నోటు కేసులో దర్యాప్తు ముమ్మరం : ప్రెస్ రివ్యూ

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, revanthofficial/facebook

సంచలనం సృష్టించిన 'ఓటుకు - కోట్లు'కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసిందని ‘సాక్షి’ పత్రిక కథనం తెలిపింది.

‘‘డబ్బు ఎక్కడ నుంచి వచ్చిం దన్న విషయంపై టీడీపీ నేత వేం నరేందర్‌రెడ్డి, ఆయన కుమారులను ఈడీ ఇంతకు ముందే విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం ఈడీ విచారణకు కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయసింహా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందే తయారు చేసిన ప్రశ్నల జాబితా(బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఏసీబీ ఇచ్చిన అధారాలు)ను ఆయన ముందుంచి అధికారులు ప్రశ్నించినట్లు తెలిసిం ది.

ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు లంచంగా ఇవ్వజూపిన రూ.50 లక్షలను మాజీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చేరవేసారని ఉదయసింహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ వీడియోలో త్వరలోనే మరో రూ.4.5 కోట్లు ఇస్తామని రేవంత్‌ చెప్పారు. మిగతా నగదు ఎవరు ఇచ్చేవారని ప్రశ్నించినట్లు సమాచారం.

ఈడీ డైరెక్టర్‌ రాజశేఖర్‌ బృందం సుమారు 9 గంటల పాటు ఈ విచారణ జరిపినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద ఈసీఐఆర్‌ నమోదు చేసిన ఈడీ.. 19న విచారణకు రావాలంటూ రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఏపీ, తెలంగాణల్లో 10 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు

ఏపీ, తెలంగాణల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసినలు ‘నమస్తే తెలంగాణ’ వార్తాకథనం వెల్లడించింది.

‘‘తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనున్నది. ఈ స్థానాలను భర్తీచేసేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి రాహుల్‌శర్మ షెడ్యూల్ విడుదలచేశారు. మార్చి 12న పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, ఫలితాలు వెల్లడిస్తారు.

15వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తున్నట్టు రాహుల్‌శర్మ పేర్కొన్నారు.

పదవీకాలం ముగుస్తున్న ఎమ్మెల్సీలలో మహమూద్ అలీ (టీఆర్‌ఎస్), మహ్మద్ సలీం (టీఆర్‌ఎస్), టీ సంతోష్‌కుమార్ (టీఆర్‌ఎస్), షబ్బీర్ అలీ (కాంగ్రెస్), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) ఉన్నారు.

ఏపీలో కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల స్థానాల ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల పదవీకాలం మార్చి 29తో ముగుస్తున్నదని, వీటి కి ఎన్నికలు తెలంగాణతోపాటే నిర్వహించేందుకు విడుదల చేసిన షెడ్యూల్‌లో పేర్కొన్నా రు.

ఏపీలో పీ నారాయణ, లక్ష్మీశివకుమారి, పామిడి శమంతకమణి, యనమల రామకృష్ణుడు, ఆదిరెడ్డి అప్పారావు పదవీకాలం మార్చి 29తో ముగుస్తున్నద’’ని ఆ కథనం తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

బీసీలపై జగన్‌ మొసలి కన్నీళ్లు: చంద్రబాబు

తెదేపా జయహో బీసీ సభ విజయవంతం కావడంతో వైకాపా బెంబేలెత్తిందని, దాన్ని జీర్ణించుకోలేకే తెదేపాపై విమర్శలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మండిపడ్డారంటూ ‘ఈనాడు’ కథనం పేర్కొంది.

‘‘ తీవ్ర నిరాశానిస్పృహల్లో కూరుకుపోయిన వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, నిస్పృహతోనే ఏలూరులో బీసీ సభ పెట్టారని పేర్కొన్నారు. ఎవరెన్ని పన్నాగాలు చేసినా బీసీలు తెదేపా వెంటే ఉంటారని వివరించారు. ‘జగన్‌ మొసలికన్నీళ్లను బీసీలు నమ్మరు. జగన్‌ తండ్రి వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలను అణచివేశారు. దీనిపై తెదేపా చాలా పోరాటాలు చేసింది. ఇప్పుడు జగన్‌ బీసీలను ఏదో ఒకలా మచ్చిక చేసుకోవాలని చూస్తున్నారు. బీసీ ఉపప్రణాళికకు తెదేపా ప్రభుత్వం చట్టబద్ధత తెస్తే మళ్లీ చట్టం చేస్తాననడం జగన్‌ అవివేకానికి నిదర్శనం' అని సోమవారం పార్టీ నాయకులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం అన్నార’’ని ఆ కథనంలో తెలిపారు.

తెలంగాణ కొత్త కేబినెట్‌‌లో ఎవరికి ఏ శాఖ

తెలంగాణలో మంగళవారం ఉదయం 11:30 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుందని.. 9 మంది నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారని ‘ఆంధ్రజ్యోతి’ తన కథనంలో వెల్లడించింది.

‘‘మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసానికి మళ్లీ కేబినెట్‌‌లో అవకాశం వచ్చింది. ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్‌లు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే కాబోయే మంత్రులకు జీఏడీ ఆహ్వానాలు పంపింది.

మరోవైపు సీఎం కేసీఆర్‌ కూడా ప్రమాణం చేయబోయే మంత్రులంతా ప్రగతి భవన్‌కు రావాలంటూ ఫోన్‌ చేశారు.

డిప్యూటీ స్పీకర్‌గా మాజీమంత్రి పద్మారావు గౌడ్, చీఫ్ విప్‌గా దాస్యం వినయ్ భాస్కర్ ‌ప్రమాణం చేయనున్నారు.

లోక్ సభ ఎన్నికల తర్వాత మరో 6గురు నేతలతో తుది విస్తరణ జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

కేసీఆర్: నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖలు

నిరంజన్ రెడ్డి : ఆర్థిక శాఖ

శ్రీనివాస్ గౌడ్ : ఎక్సైజ్, సంక్షేమ శాఖ

తలసాని శ్రీనివాస్: పశు సంవర్ధక శాఖ

ఎర్రబెల్లి దయాకర్ రావు : రోడ్లు భవనాల శాఖ

జగదీశ్వర్ రెడ్డి : విద్యా, విద్యుత్ శాఖలు

ప్రశాంత్ రెడ్డి : వ్యవసాయం, మార్కెటింగ్

కొప్పుల ఈశ్వర్ : పంచాయితీ రాజ్‌ శాఖ(కొప్పులకు ఏ శాఖ అనేదానిపై పూర్తి స్పష్టత లేదు)

మల్లారెడ్డి : రవాణా శాఖ

ఇంద్రకరణ్ రెడ్డి : వైద్యం, ఆరోగ్యశాఖలు వరించనున్నాయ’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)