తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల జాబితా: జగన్ సొంత జిల్లాలో ఏడుగురు ఖరారు - ప్రెస్ రివ్యూ

జగన్, చంద్రబాబు

ఫొటో సోర్స్, facebook/NaraChandrababuNaidu/YSJaganmohanReddy

కడప జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో ఏడుచోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఖరారు చేశారని 'ఆంధ్రజ్యోతి' తన కథనంలో తెలిపింది.

'ఇప్పటికే పులివెందులకు సతీష్‌రెడ్డిని, జమ్మలమడుగుకు రామసుబ్బారెడ్డిని ప్రకటించారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులకోసం జిల్లా నేతలతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెండు రోజులుగా చర్చలు సాగిస్తున్నారు. గురువారం మరో ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

రాజంపేటకు బత్యాల చెంగల్రాయులుకు, రైల్వేకోడూరుకు నర్సింహప్రసాద్‌కు, రాయచోటికి రమేష్‌కుమార్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయింది.

మైదుకూరు, కమలాపురం స్థానాలకు సైతం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇక్కడ పుట్టా సుధాకర్‌యాదవ్‌, పుత్తా నరసింహారెడ్డి పేర్లను ఖరారు చేశారు.

బద్వేలు, ప్రొద్దుటూరు నేతలతో గురువారం అర్ధరాత్రి వరకూ సీఎం చర్చలు సాగించారు. కడప అభ్యర్థి ఎంపికను మాత్రం వాయిదా వేశారని సమాచారం. అయితే రాజంపేట పార్లమెంటు అభ్యర్థి ఎవరన్నది ఇంకా తేలలేదు. చిత్తూరు జిల్లాలోని బలిజ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామిక వేత్త లేదా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు గానీ ఉంటారని సమాచారం' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, EPFO

పీఎఫ్‌పై వడ్డీ 8.65శాతం

భవిష్యనిధి(పీఎఫ్‌) డిపాజిట్లపై 2018-19 సంవత్సరానికి గానూ వడ్డీరేటును 8.65శాతానికి పెంచుతూ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) నిర్ణయం తీసుకుందని 'ఈనాడు' కథనం వెల్లడించింది.

'గురువారం జరిగిన ఈపీఎఫ్‌వో కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో వడ్డీరేటును పెంచేందుకు సభ్యులు ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి సంతోష్‌ గాంగ్వర్‌ తెలిపారు. ఈ ప్రతిపాదనను త్వరలోనే ఆర్థికమంత్రికి పంపించనున్నట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం తెలిపిన తర్వాతే చందాదారుల ఖాతాల్లో జమ అవుతుంది.

2017-18 సంవత్సరానికి పీఎఫ్‌ వడ్డీరేటును ఐదేళ్ల కనిష్ఠానికి తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 8.55శాతం వడ్డీనే ఇస్తున్నారు. అంతకుముందు 2016-17సంవత్సరానికి 8.65శాతం, 2015-16సంవత్సరానికి 8.8శాతం, 2014-15,2013-14 సంవత్సరాలకు 8.75శాతం, 2012-13 సంవత్సరానికి 8.5శాతం వడ్డీ ఇచ్చారు.

2018-19 సంవత్సరానికి కూడా 8.55శాతాన్నే కొనసాగించే అవకాశాలున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వడ్డీరేట్లను పెంచేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయ'ని ఆ కథనంలో వివరాలందించారు.

ఫొటో సోర్స్, facebook/Bahujana Left Front

సీపీఐ, జనసేనతో కలసి వెళ్దాం

లోక్‌సభ ఎన్నికల్లో సీపీఐ, జనసేనతో కలిసి పోటీ చేయాలని బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌) నిర్ణయించిందని 'సాక్షి' పత్రిక తన కథనంలో వెల్లడించింది.

''తమతోపాటు కలిసేందుకు ముందుకు వస్తే ఆ రెండు పార్టీలతోపాటు తెలంగాణ జనసమితి, ఇతర వామపక్షాలు, సామాజిక న్యాయం కోసం పాటుపడే పార్టీలు, సంస్థలను కూడా కలుపుకొని వెళ్లాలని భావిస్తోంది. సామాజిక న్యాయ సాధనే ప్రధాన ఎజెండాగా ఎన్నికల బరిలో దిగాలని యోచిస్తోంది.

గురువారం బీఎల్‌ఎఫ్‌ భాగస్వామ్యపక్షాల సమావేశం జరిగింది. సీపీఎం, ఎంసీపీఐ, బీఎల్‌పీ, మహాజన సమాజ్‌పార్టీ, టీబీఎస్‌పీ, టీ లోక్‌సత్తా పార్టీల నాయకులు దీనికి హాజరయ్యారు. రాష్ట్రంలో వామపక్ష, సామాజిక శక్తుల బలాన్ని పెంచుకోవాలని.. ఓటు శాతం, కేడర్‌ పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

సీపీఐతో ప్రాథమిక చర్చలు జరిపిన నేపథ్యంలో మరోసారి చర్చించి స్పష్టత పొందాలని భావిస్తున్నారు. సీపీఐ, జనసేనలతో చర్చల తర్వాత ఏ పార్టీ ఏ సీటు నుంచి పోటీ చేయాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. కాగా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో రెండు మూడు రోజుల్లో చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.

కాగా.. బీఎల్‌ఎఫ్‌ ప్రయోగాన్ని ఇక ముందు కూడా కొనసాగించనున్నట్టు సీపీఎం నేతలు ప్రకటించడం పట్ల సీపీఐ అసంతృప్తి చెందుతున్నట్టు సమాచారం. తమతో చర్చించినప్పుడు బీఎల్‌ఎఫ్‌ కాకుండా వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల బలోపేతానికి కృషిచేద్దామని చెప్పి.. ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శికి సీపీఐ నాయకత్వం వర్తమానం పంపించినట్టు తెలిసింద''ని ఆ కథనంలో రాశారు.

ఫొటో సోర్స్, DEA / P. JACCOD/GettyImages

ఫొటో క్యాప్షన్,

కిలమంజారో

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఓరుగల్లు యువకుడు

ఓరుగల్లుకు చెందిన పర్వతారోహకుడు కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం వెల్లడించింది.

''బుధవారం మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో 5895 మీటర్ల ఎత్తుఉన్న పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగురవేశాడు. జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని పాండవులగుట్ట, యాదాద్రి భువనగిరి ఖిల్లా వంటి కొండలపై సాధారణంగా ట్రెక్కింగ్‌చేసే అలవాటున్న అఖిల్.. కిలిమంజారో వంటి సాహసోపేతమైన పర్వతారోహణ చేశాడు.

తెలంగాణకు చెందిన పర్వతారోహకులు ఆనంద్‌కుమార్, పూర్ణలతో గతంలోనే స్నేహసంబంధాలున్న అఖిల్ వారి ప్రేరణతోనే ఈ ఘనత సాధించాడని అఖిల్ తండ్రి రవీందర్ తెలిపారు.

ఆఫ్రికానుంచి తిరుగు పయనమైన అఖిల్ శుక్రవారం సాయంత్రానికి రాష్ర్టానికి వస్తారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపార''ని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)