నిఘా వైఫల్యంతోనే పుల్వామా దాడి.. ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా?: చంద్రబాబు - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, NAra chandrababu naidu/facebook
''మేం దేశం కోసం మాట్లాడాం.. మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. మన నిఘా వైఫల్యంతోనే పుల్వామా ఉగ్రదాడి జరిగింది'' అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు రాసిన ఒక లేఖలో మండిపడ్డట్లు 'ఈనాడు' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తాను భారత ప్రధానిపై విశ్వాసం లేకుండా మాట్లాడుతున్నానని, పాకిస్థాన్ ప్రధానమంత్రిని విశ్వసిస్తున్నానని షా చేసిన వ్యాఖ్యలను సీఎం ఖండించారు.
''2013లో బీహార్, కశ్మీర్‌లలో జరిగిన ఉగ్రదాడులపై అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ రాజీనామా చేయాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు మీకు దేశద్రోహంలా కనిపించలేదా? నిఘా వైఫల్యంతో ఉగ్రదాడులు జరుగుతుంటే ప్రధాని ఎందుకు రాజీనామా చేయరంటూ అప్పట్లో మోదీ ప్రశ్నించలేదా?'' అని చంద్రబాబు గుర్తుచేశారు.
''ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడికి బాధ్యతగా ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తారా?'' అని ప్రశ్నించారు. ''మోదీ మాట్లాడితే దేశభక్తి ఉన్నట్లు? నేను మాట్లాడితే లేనట్లా? మీరు చేస్తే గొప్ప రాజకీయం, మేము చేస్తే నీచ రాజకీయమా?'' అని మండిపడ్డారు.
దేశభక్తి, భద్రతల గురించి అమిత్ షాతో పాఠాలు చెప్పించుకునే స్థితిలో లేనని, రక్తంలో దేశభక్తి ఉందని చెప్పే వాళ్లే రఫేల్ యుద్ధ విమాన కొనుగోళ్ల కుంభకోణంతో దేశ ప్రతిష్ఠను జాతీయంగా, అంతర్జాతీయంగా దెబ్బ తీశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
ఒకవైపు 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం దేశ ప్రజల హృదయాలను గాయపరిస్తే ప్రధాని మోదీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. మోదీ తనకేమీ పట్టని రీతిలో డిస్కవరీ ఛానెల్ చిత్రీకరణలో 3 గంటలు గడిపినట్లు వెలువడిన వార్తలపై జాతికి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఫొటో సోర్స్, AFP
దేశంలో మరో పది మార్గాల్లో బుల్లెట్ రైళ్లు...
దేశంలోని పది ప్రధాన మార్గాల్లో బుల్లెట్లు రైళ్లను ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని 'ఆంధ్రజ్యోతి' దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. దేశంలోని పది మార్గాల్లో ఆరువేల కిలోమీటర్ల మేర బుల్లెట్ రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ రూపొందించిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర కేబినెట్ దీనిపై సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
ప్రస్థుతం అహ్మదాబాద్ - ముంబయి హైస్పీడ్ రైల్వే కారడార్ నిర్మాణం చేపట్టగా, మరో పది మార్గాల్లో బుల్లెట్ రైళ్లు నడిపేందుకు వచ్చే పదేళ్లలో పది లక్షల కోట్ల పెట్టుబడి అవసరమని రైల్వేశాఖ అంచనా వేసింది.
ఢిల్లీ -ముంబయి, ఢిల్లీ - కోల్‌కతా, ఢిల్లీ- వారణాసి, ఢిల్లీ - భోపాల్, ఢిల్లీ - అమృతసర్, ఢిల్లీ - అహ్మదాబాద్, నాగపూర్ - ముంబయి, పాట్నా- కోల్‌కతా, చెన్నై- బెంగళూరు, చెన్నై- మైసూర్ మార్గాల్లో బుల్లెట్ రైళ్లు నడిపేందుకు వీలుగా కొత్త మార్గాలు నిర్మించాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది.
ఈ బుల్లెట్ రైళ్లను 2025-26లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచబ్యాంకు, జైకా, ఆసియా అభివృద్ధి బ్యాంకు రుణంతో ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలన రైల్వే శాఖ నిర్ణయించింది. బుల్లెట్ రైలు ప్రాజెక్టులు రెండు తెలుగు రాష్ట్రాలు లేక పోవడం తెలుగు ప్రజలకు నిరాశ కలిగిస్తున్నాయి.
ఫొటో సోర్స్, Reuters
కశ్మీరీల రక్షణ చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం
పుల్వామాలో ఉగ్రదాడి ఘటన తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో కశ్మీరీలపై జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని 'నవ తెలంగాణ' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. దేశంలోని 11 రాష్ట్రాల డీజీపీలు, ప్రధాన కార్యదర్శులకు ఈ ఆదేశాలిచ్చింది. పుల్వామా ఘటన తర్వాత కశ్మీరీలు పలుచోట్ల వేధింపులు, దాడులకు గురైన నేపథ్యంలో బాధితుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్‌గొగోరు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది.
గతంలో మూకదాడుల నియంత్రణ కోసం రాష్ట్రాలలో నియమించిన నోడల్ అధికారులకు కశ్మీరీల రక్షణ పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని పోలీస్ అధికారులకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ నోడల్ అధికారుల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని కేంద్ర హౌంశాఖను ఆదేశించింది.
ఇప్పటికే సంఘటనలు జరిగిన ఈ 11 రాష్ట్రాల అధికారుల నుంచి తమకు నివేదికలు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కశ్మీరీలపై దాడులు జరిగిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, బీహార్, జమ్మూకాశ్మీర్, హర్యానా, బెంగాల్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి. ఇప్పటివరకూ ఏపీ, తెలంగాణ, కేరళలాంటి రాష్ట్రాల్లో ఎలాంటి ఘటనలూ జరగకపోవడం గమనార్హం.
ఫొటో సోర్స్, EPA
2019 ఎన్నికల ఖర్చు రూ. 71,025 కోట్లు దాటే అవకాశం
రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి కాబోతున్నాయని అమెరికాకు చెందిన నిపుణుడు మిలాన్ వైష్ణవ్ అంచనా వేశారని.. ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి దాకా జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కూడా ఇవి నిలిచే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారని 'సాక్షి' దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.
''2016లో అమెరికా అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలకు అయిన వ్యయం 6.5 బిలియన్ డాలర్లు (రూ. 46,166 కోట్లు). భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల ఖర్చు సుమారు 5 బిలియన్ డాలర్లు (రూ. 35,512 కోట్లు). ఈసారి వ్యయం దానికి రెట్టింపు (రూ. 71,025 కోట్లు) అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో భారత ఎన్నికలే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా నిలవబోతున్నాయి'' అని రాజకీయ నిపుణుడు వైష్ణవ్ అభిప్రాయపడ్డారు.
ఆయన ప్రస్తుతం వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ దక్షిణాసియా డైరెక్టర్, ఫెలోగా పనిచేస్తున్నారు. ఈసారి బీజేపీ, ఇతర విపక్షాల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖర్చుకు రాజకీయ పక్షాలు ఏమాత్రం వెనకాడబోవని మిలాన్ చెప్పారు.
భారత్‌లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానంలో పారదర్శకత లేకపోవడం పెద్ద లోపమని పేర్కొన్నారు. దీనివల్ల ఏ పార్టీ ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని సేకరిస్తోందో తెలుసుకోవడం కష్టమవుతోందని తెలిపారు. తాము ఫండింగ్ చేసిన పార్టీ అధికారంలోకి రాకపోతే వేధింపులు తప్పవన్న భయంతో చాలా మంది విరాళాలను బహిర్గతం చేయడంలేదని అన్నారు. తాజాగా అమల్లోకి వచ్చిన ఎన్నికల బాండ్ల విధానం వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తెలిపారు.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)