చంద్రబాబు దారుణంగా ఓడిపోతారు... జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయం - కేటీఆర్ : ప్రెస్ రివ్యూ

కేటీఆర్, జగన్

ఫొటో సోర్స్, facebook/TrsParty

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారంటూ 'ఈనాడు' పత్రిక తన వార్తాకథనంలో వెల్లడించింది.

''దిల్లీని శాసిద్దాం.. తెలంగాణ హక్కులను సాధించుకుందాం అనే నినాదంతో తెరాస లోక్‌సభ ఎన్నికలకు వెళ్తోందని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణలో 16 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తే దిల్లీని డిమాండ్‌.. కమాండ్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో తెరాస నిర్ణయాత్మక పాత్ర పోషించనుందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ నైరాశ్యంలో ఉందని, ఇప్పట్లో కోలుకోలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి చంద్రబాబు దారుణంగా ఓడిపోతారని ఆయన నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. నిద్రలో కూడా ఆయన కేసీఆర్‌నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీలో వైకాపా ఘనవిజయం సాధిస్తుందని, ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. శనివారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో కేటీఆర్‌ విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు'' అని ఆ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్,

గొంగడి సునీత, పద్మాదేవేందర్ రెడ్డి, ఆకుల లలిత, రేఖా నాయక్, సత్యవతి రాథోడ్

ఎవరా ఇద్దరు మహిళలు

కేబినెట్‌లో ఇద్దరు మహిళలకు చోటు కల్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించడంతో ఈ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోందని.. మంత్రివర్గంలో స్థానం దక్కించుకునే ఇద్దరు మహిళలు ఎవరనే అంచనాలు మొదలయ్యాయని 'సాక్షి' పత్రిక తన కథనంలో తెలిపింది.

''టీఆర్‌ఎస్‌ తరఫున ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి (మెదక్‌), గొంగిడి సునీత (ఆలేరు), అజ్మీరా రేఖానాయక్‌ (ఖానాపూర్‌) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఆకుల లలిత ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజాగా ఎన్నికలు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సత్యవతి రాథోడ్‌ ఉన్నారు. మొత్తం ఐదుగురు సభ్యుల్లో ఇద్దరికి మంత్రులుగా అవకాశం దక్కనుంది.

గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేసిన పద్మాదేవేందర్‌రెడ్డి తాజా విస్తరణలో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఈసారి పదవి లభించపోవడంతో తదుపరి విస్తరణలో అవకాశం ఉంటుందని ఆమె భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో విప్‌గా పని చేసిన గొంగిడి సునీత సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. మరోవైపు బీసీల్లోని ప్రధాన సామాజికవర్గమైన మున్నూరు కాపుల నుంచి మంత్రివర్గంలో ఎవరికీ అవకాశం దక్కలేదు.

ఎమ్మెల్సీ ఆకుల లలిత ఈ వర్గం వారే కావడంతో ఈ కోటాలో సీఎం గుర్తిస్తారని భావిస్తున్నారు. మరోవైపు 2014 ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌లో చేరిన సత్యవతి రాథోడ్‌ డోర్నకల్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి డి.ఎస్‌. రెడ్యానాయక్‌ చేతిలో ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌లో చేరిన సమయంలోనే ఆమెకు మంత్రి పదవి హామీ లభించిందనే ప్రచారం జరుగుతోంది.

రాష్ట్రంలో సీఎం కాకుండా 17 మంది మంత్రులుగా ఉండేందుకు అవకాశం ఉండగా ప్రస్తుతం 11 మంది (సీఎం కాకుండా) మంత్రులు ఉన్నారు. వారిలో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ రెండు కోటాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో సత్యవతి రాథోడ్‌కు మంత్రిగా అవకాశం దక్కుతుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాకు గత ప్రభుత్వంలో రెండు మంత్రి పదవులు వచ్చాయి. ఇదే లెక్కన తదుపరి విస్తరణలో తనకు అవకాశం ఉంటుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ భావిస్తున్నారు'' అని ఆ కథనంలో విశ్లేషించారు.

ఫొటో సోర్స్, facebook/MVenkaiahNaidu

రాజకీయాలకు సెలవు

తనతో పాటు తన కుటుంబసభ్యులూ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారంటూ 'ఆంధ్రజ్యోతి' పత్రికలో కథనం వెలువడింది.

''రాజకీయాలకు, ఎన్నికలకు నేను, నా కుటుంబం దూరంగా ఉంటాం. మా కుటుంబ సభ్యులంతా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం. నిత్యం ప్రజల మధ్యలో ఉండటానికి అలవాటు పడిన నాకు ఉపరాష్ట్రపతి పదవి మొదట్లో కష్టంగానే అనిపించింది. అయితే ప్రస్తుతం సంతృప్తిగానే ఉంది. క్రమశిక్షణ, సమయపాలన నాకు ప్రాణం. దీనివల్లే నేను ఉపరాష్ట్రపతి పదవిని చేపట్టగలిగా. ఆర్‌ఎ్‌సఎ్‌సలో మెలగడం వల్లనే నాకు క్రమశిక్షణ అలవడింది'' అని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. శనివారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్‌ ట్రస్టులో ఆయన మీడియాతో ముచ్చటించారు'' అని అందులో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, facebook

ఫొటో క్యాప్షన్,

బద్ధం బాల్ రెడ్డి

బీజేపీ సీనియర్ నాయకుడు బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి (73) శనివారం కన్నుమూశారని 'నమస్తే తెలంగాణ' పత్రిక తన వార్తాకథనంలో వెల్లడించింది.

''కొంతకాలంగా చిన్నపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు ఈ నెల 13న కేర్ హాస్పిటల్‌లో శస్త్రచికిత్స నిర్వహించారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య యాదమ్మ, కుమారులు గోపాల్‌రెడ్డి, శివపాల్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, కూతురు అరుణ ఉన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.

1945 మార్చి 7న జన్మించిన బద్దం బాల్‌రెడ్డి విద్యార్థి దశలోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరి బాల స్వయంసేవక్‌గా పనిచేశారు. 1962లో జనసంఘ్‌లో చేరి.. అనంతరం బీజేపీలో అగ్రనేతగా ఎదిగారు. 1965-75 మధ్య జనసంఘ్ యాకత్‌పుర అసెంబ్లీ ప్రధానకార్యదర్శిగా, 1978లో చాంద్రాయణగుట్ట అసెంబ్లీ కన్వీనర్‌గా పనిచేశారు. 1986-88 మధ్య బీజేపీ ప్రధానకార్యదర్శిగా ఉన్నారు. 1985, 1989, 1994లలో కార్వాన్ నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1991, 1998, 99లలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంనుంచి పోటీచేసి ఓడిపోయారు. 2009లో చేవెళ్ల నుంచి లోక్‌సభకు, 2014లో కార్వాన్ అసెంబ్లీకి పోటీచేసి ఓటమిని చవిచూశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పరాజితులయ్యారు. హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు, బోనాల నిర్వహణలో టైగర్ నరేంద్రకు తోడుగా నిలిచారు. 1975-77 ఎమర్జెన్సీకాలంలో బాల్‌రెడ్డిని జైలులో పెట్టడంతో వాజపేయి స్వయంగా హైదరాబాద్ వచ్చి బెయిల్‌కోసం అఫిడవిట్ దాఖలుచేశారు. అలియాబాద్‌లోని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను ఓదార్చారు. 40ఏండ్ల క్రితం చార్మినార్ వద్ద జరిగిన టెర్రరిస్టుల దాడుల నుంచి బాల్‌రెడ్డి గాయాలతో బయటపడ్డారు'' అంటూ ఆయన ప్రస్థానాన్ని వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)