తెలంగాణలో మళ్ళీ రోడ్డెక్కిన రైతు :ప్రెస్ రివ్యూ

పంట

పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ప్రకటించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం తెలంగాణలో జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల రైతులు మరోసారి రోడ్డెక్కారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

రైతులు అర్ధనగ్న ప్రదర్శనలు, బైఠాయింపులు, రాస్తారోకోలతో ఆందోళన తీవ్రతరం చేశారు. రోడ్డుమీదనే వంటా-వార్పు చేపట్టారు. జగిత్యాల జిల్లా పసుపు రైతులు జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై మహా ధర్నా చేపట్టారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు క్వింటాల్‌ పంటకు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో పసుపు రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఉదయమే పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలినడకన వెళ్లి ధరూర్‌ వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు.

అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్సారెస్పీ కాకతీయ మెయిన్‌ కెనాల్‌ వద్ద రాస్తారోకో, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. రోడ్డుపై బైఠాయించి వంటావార్పు చేపట్టారు. ఈ తరుణంలో తమ సమస్యను ఎన్నిమార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదనతో మల్యాల మండలం రాంపూర్‌కు చెందిన రైతు రమేష్‌ ఆవేదనతో కాకతీయ కెనాల్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేయగా రైతులు కాపాడారు.

జగిత్యాల-కరీంనగర్‌ ప్రధాన రహదారిపై దాదాపు 6 గంటలకు పైగా మహా ధర్నా చేపట్టడంతో కరీంనగర్‌ వైపు, ఇటు జగిత్యాల వైపు కిలో మీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించేవరకు ధర్నాను విరమించేది లేదంటూ రైతులు భీష్మించుకొని కూర్చున్నారు. చివరికి రాత్రి 7.30 గంటలకు ఆందోళనను విరమించారు.

మెట్‌పల్లిలో పసుపు రైతులతో పాటు ఎర్రజొన్న రైతులు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వ్యవసాయ మార్కెట్‌ ఎదురుగా జాతీయ రహదారిపై భారీ ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

రాస్తారోకోకు వెళ్లని రైతులకు జరిమానా విధిస్తామని చెప్పడంతో ప్రతీ రైతు తరలివచ్చాడు. ఒక్క గ్రామంలో రానివారికి రూ.500 జరిమానా విధిస్తామని చెప్పగా, మరో గ్రామంలో రూ.1,300 జరిమానా విధిస్తామని చెప్పారు. ఇంతకు ముందు కూడా ఇలాగే తీర్మానించుకున్నారు.

రాస్తారోకోకు అధికార పార్టీ టీఆర్ఎస్నాయకులు, రైతు సమన్వయ సమితి నాయకులు కూడా రావడం గమనార్హం. కొంత మంది దూరం దూరంగా ఉండగా, మరికొందరు మీడియా కంట పడకుండా జాగ్రత్త వహించారు.

మామిడిపల్లి చౌరస్తాలో రైతుల రాస్తారోకోతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. లారీలు, ఇతర వాహనాలను మళ్లించినప్పటికీ ఆర్టీసీ బస్సులు నడవలేదు. మారుమూల గ్రామాలకు వెళ్లే బస్సులతో పాటు నిర్మల్‌, కరీంనగర్‌ వెళ్లే బస్సులు నడవలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు.

నేడు హైదరాబాద్‌కు పాదయాత్ర

ఎర్రజొన్నలు, పసుపును కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్రగా వెళ్లాలని రైతులు నిర్ణయించారు. ప్రగతి భవన్‌కు వెళ్లి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కలిసి విన్నవిస్తామని రైతు ప్రతినిధి దేగాం యాదాగౌడ్‌ తెలిపారు. రైతులందరూ ఉదయం 10 గంటల వరకు మామిడిపల్లి మానస హైస్కూల్‌ వద్దకు చేరుకోవాలని, హైదరాబాద్‌ ఏ రోజు చేరితే ఆ రోజు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నిస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

కేసీఆర్-భట్టి... నడుమ శబరి

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మధ్య సోమవారం ఆసక్తికర సంవాదం చోటుచేసుకుందని సాక్షి తెలిపింది. ఖమ్మం జిల్లాలోని శబరి నది విషయంలో వీరిద్దరి మధ్య సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ- కాంగ్రెస్‌ హయాంలో ఇందిర స్రవంతి, రాజీవ్‌ స్రవంతి అంటూ సమైక్య సీఎంలు కుట్రలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.

దుమ్ముగూడెం టెయిల్‌పాండ్‌ - నాగార్జునసాగర్‌కు నీటి మళ్లింపు కోసం తెలంగాణ వారిని మైమరిపించేందుకు ఈ ప్రాజెక్టులు తెచ్చారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. నాడు కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలే ఉన్నా, మహారాష్ట్రతో నీటి ఒప్పందం చేసుకోలేకపోయారన్నారు. దీంతో అంబేడ్కర్‌ సుజల స్రవంతి కాస్తా కాగితం స్రవంతిగా మారిపోయిందన్నారు. ఇందిరాసాగర్‌ దుమ్ముగూడెంలో కొట్టుకుపోయిందని విమర్శించారు.

తుమ్మిడిహెట్టి దగ్గర తట్టెడు మట్టి తవ్వకుండా ఎక్కడో చేవెళ్ల దగ్గర కాలువ తవ్వడం కాంగ్రెస్‌ వాళ్ల తెలివి అని కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో, బయటా టీఆర్‌ఎస్‌ పోరాడిందన్నారు.

2014లో అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల రీ-డిజైన్‌పై అసెంబ్లీలో ప్రజెంటేషన్‌ ఇస్తే దానికి కాంగ్రెస్‌ సభ్యులు ఎందుకు హాజరుకాలేదని సీఎం ప్రశ్నించారు. గోదావరి నుంచి 160 టీఎంసీలే కాదు 400 టీఎంసీలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. 15-20 రోజుల్లోనే మేడిగడ్డ పనులు చేపడతామన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ అన్యాయంగా కేసులు వేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై 200 కేసులు వేశారని, వారిలో కాంగ్రెస్‌ ఆఫీస్‌ బేరర్లు ఉన్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు ఒక కంటితుడుపుగానే మిగిలిందన్నారు. సీతారామప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు పటిష్టం చేయడం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ వర్షాకాలం జూన్, జూలైలలో నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు గోదావరి జలాలిచ్చి.. మధిరతో పాటు వివిధ నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు. తాను ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ను కాకపోయినా తెలియని విషయాలు తెలుసుకున్నానని నీటిపారుదలరంగంపై పట్టుసాధించానని, ఈ విషయంలో కాంగ్రెస్‌ నాయకులు బాధ్యతారహిత ప్రకటనలు చేయొద్దని తెలిపారు.

నిజాంసాగర్, శ్రీరాంసాగర్‌లను పునర్వ్యవస్థీకరిస్తామని, గ్యాప్‌ ఆయకట్టును పూర్తిచేయడం తమ కమిట్‌మెంట్‌ అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. అంబేడ్కర్‌ సుజల స్రవంతి ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని, ఈమేరకు మహారాష్ట్రతో ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు వస్తే, రాకపోతే అనే రెండుపద్ధతుల్లో ఆలోచించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఖమ్మం జిల్లా రుద్రమకోట దగ్గర శబరి నదిలో ఏడాదంతా అందుబాటులో ఉండే 4.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవాలన్నారు. గోదావరిలో ఆ పాయింట్‌ను తెలంగాణ కోల్పోవద్దని విభజన చట్టంలోనూ ఉన్న ఈ హక్కును చేజారుకోవద్దన్నారు. దుమ్ముగూడెం, సీతారామప్రాజెక్టుల ద్వారా 2.5 లక్షల నుంచి 8లక్షల ఎకరాల దాకా నీరు ఇవ్వొచ్చునన్నారు. రాజీవ్‌సాగర్‌కు రూ.200 కోట్ల నిధులు కేటాయిస్తే పూర్తి అవుతుందని దాని ద్వారా ప్రయోజనం చేకూరుతుందన్నారు.

కోర్టులో కేసు వేసిన సత్యనారాయణ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని, ఆయన భార్య చేవెళ్ల జడ్పీటీసీ టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారని భట్టి పేర్కొన్నారు. గతంలో సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చినపుడు, తమ వాదన వినిపించేందుకు తమకు ప్రజెంటేషన్‌ అవకాశమివ్వాలని సీఎల్‌పీ తరఫున లేఖ ఇచ్చినా స్పీకర్‌ నుంచి స్పందన లేకపోవడం వల్లే తాము హాజరుకాలేదని స్పష్టం చేశారు.

ఎక్కడీ శబరి?

కేసీఆర్‌ జోక్యం చేసుకుంటూ భట్టి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో వద్దని.. కమిటీ హాల్లో ప్రజెంటేషన్‌ పెట్టాలని వితండవాదం చేసింది కాంగ్రెస్‌ వాళ్లేనన్నారు. రుద్రమకోట, శబరి నది ఎక్కడ? ఈ విషయంలోనూ సభను తప్పుదోవ పట్టిస్తారా అని విమర్శించారు. శబరినది గోదావరిలో కలిసే స్థానం ఏపీలో ఉందని, భౌగోళిక వాస్తవాలు తెలుసుకోకుండా ఎలా మాట్లాడతారని సీఎం ప్రశ్నించారు. పాపికొండల దగ్గర శబరి కలుస్తుందన్నారు. మరోసారి ధ్రువీకరించుకోవాలని భట్టికి సూచించారు. ఖమ్మం జిల్లాకు రెండేళ్లలో నీళ్లిచ్చి భట్టిని వెంట తీసుకెళతామన్నారు.

సీఎం ఖమ్మం జిల్లాకు వచ్చి గతంలోని ప్రాజెక్టుల పాయింట్లను చూడాలని భట్టి అన్నారు. రుద్రంపేట, శబరి దగ్గర చెబుతున్న ప్రాంతాలు మునిగిపోతాయని, పోలవరం పూర్తయితే అది 30 మీటర్ల అడుగుకు పోతుందన్నారు. ఆ ప్రాంతం ప్రాజెక్టుల నిర్వహణకు ఏమాత్రం ప్రయోజనకరం కాదన్నారు.

భట్టి కంటే తానే ఆ ప్రాంతంలో ఎక్కువ పర్యటించానని సీఎం చెప్పారు. కాంగ్రెస్‌ వారి కంటే ఎక్కువ శ్రద్ధ తీసుకుని రక్షణశాఖను బతిమిలాడి లైడర్‌ సర్వే చేయించానన్నారు. గోదావరికి సంబంధించి అక్షాంశాలు, రేఖాంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు సీఎం తెలిపారు.

పోలవరం ముంపుప్రాంతాలే కాకుండా తీసుకున్న ఇతర ప్రాంతాల గురించి గతంలో సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌తో దోస్తీ కట్టాక భిన్నంగా ప్రవర్తిస్తున్నారని కేసీఆర్ చెప్పారు. రెండున్నరేళ్లలో పదిలక్షల ఎకరాలకు (సాగర్‌ ప్రాంతం సహా) నీళ్లు అందించాక.. భట్టి వెంట రాకపోయినా లాక్కెళ్తానని చమత్కరించారు. తాను పిలిస్తే వస్తానని, బలవంతంగా తీసుకెళ్లాల్సిన అవసరంలేదని భట్టి కూడా అదే రీతిలో స్పందించారు. మరోసారి రుద్రమకోట గురించి పరిశీలించాలని సీఎంకు సూచించారు. అయితే.. ఈ అంశంపై తాను చెప్పేదేమీ లేదని కేసీఆర్‌ పేర్కొనడంతో వీరిద్దరి మధ్య సంవాదం ముగిసింది.

కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలే: భట్టి

శాసనసభలో చర్చ సందర్భంగా కేసీఆర్‌ చెప్పినవన్నీ అబద్ధాలేనని, కేసీఆర్‌ అబద్ధాలను నిర్భయంగా చెబుతారని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. శబరి నది గురించి కేసీఆర్‌ సభలో చెప్పింది అబద్ధమని నిరూపిస్తానన్నారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎల్పీ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే మీడియాను శబరి నది వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను కూడా తీసుకెళ్లి శబరి నది ఎక్కడ ఉందో చూపిస్తానన్నారు. పాత ప్రాజెక్టులను కొనసాగిస్తూనే శబరి నీటిని వాడుకునే వీలుందని చెప్పారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images

మా అనుమతి లేకుండా ఎవరూ ఓట్లు తీసేయలేరు: సీఈవో గోపాలకృష్ణ ద్వివేది

కొత్త ఓటర్లుగా నమోదు కోసం 10 లక్షల మంది, జాబితా నుంచి తొలగింపు కోసం 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది చెప్పారని 'ఈనాడు' తెలిపింది.

ప్రత్యేక సమగ్ర సవరణ- 2019కు సంబంధించి జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రచురించిన తర్వాత సోమవారం (ఫిబ్రవరి 25)వరకూ ఈ దరఖాస్తులొచ్చాయని, మార్చి 7లోగా వీటి పరిశీలన ప్రక్రియ పూర్తి చేయనున్నామని గోపాలకృష్ణ వెల్లడించారు. సోమవారం ''ఈనాడు''తో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ముగిసేంతవరకూ కూడా ఓటు హక్కు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, జాబితాలో పేర్లు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మార్చి 7 నాటికి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలన చేయించి...ఇప్పటికే ప్రచురించిన తుది ఓటర్ల జాబితాకు అనుబంధ జాబితాను ప్రచురిస్తామన్నారు.

''ప్రత్యేక సమగ్ర సవరణ-2019 చేపట్టిన తర్వాత కొత్తగా 21,24,525 మంది ఓటర్లు చేరగా, 3,86,694 మందిని జాబితా నుంచి తొలగించాం. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదు. తగిన పరిశీలన చేసి ఈఆర్‌వోలు జాబితాలో పేర్లను మాత్రమే చేర్చగలరు. తొలగించాలంటే మాత్రం ఈఆర్‌వోలు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి జిల్లా కలెక్టర్‌కు పంపితే ఆ వివరాలను కలెక్టర్లు ఎన్నికల సంఘానికి పంపించాలి. వాటిని పరిశీలించి మేం అనుమతిస్తేనే తొలగింపు సాధ్యపడుతుంది. ఓట్ల తొలగింపు, డూప్లికేషన్‌పై ఆధారాలు సమర్పిస్తే వాటిపైనా విచారణ చేయిస్తాం'' అని గోపాలకృష్ణ వివరించారు.

ఓటరు గుర్తింపు కార్డు ఉన్నంత మాత్రాన జాబితాలో పేరుంటుందని కాదు. అందుకే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఓటరు జాబితాలో పేరుందా? లేదా అన్నది చూసుకోవాలి. రాష్ట్ర స్థాయి కాల్‌ సెంటర్‌ నెంబర్‌ 1950కు ఫోన్‌ చేసి వివరాలు చెప్పి తెలుసుకోవచ్చు. లేదా ఆంగ్లంలో (AP (SPACE) VOTE (SPACE) VOTER ID NUMBER) టైప్‌ చేసి సంక్షిప్త సందేశాన్ని 9223166166కు లేదా 51959కు పంపించి జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ తెలుసుకోవచ్చు. సీఈవో ఆంధ్ర, నేషనల్‌ ఓటరు సర్వీసు పోర్టల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా చూసుకోవచ్చు. పేరు లేకపోతే వెంటనే ఫారం-6లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి. బూత్‌స్థాయి అధికారులకు నేరుగా దరఖాస్తు ఇవ్వొచ్చు, లేదా ఆన్‌లైన్‌లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు.

సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల గడువు ముగిసేంతవరకూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే, అంతకంటే వారం రోజుల ముందే దరఖాస్తు చేసుకుంటే త్వరగా పరిశీలన చేపట్టడానికి వీలవుతుంది.

ఒంగోలులో టీడీపీ, వైసీపీ బాహాబాహీ

ఒంగోలులో సోమవారం స్థానిక కమ్మపాలెంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) ఎన్నికల కార్యాలయం ఏర్పాటుకు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారితీసిందని, స్థానిక రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ సాక్షిగా టీడీపీ, వైసీపీ వర్గాలు బాహాబాహీకి దిగాయని ఈనాడు తెలిపింది.

కమ్మపాలేనికి చెందిన ఆలూరి హరి, అన్నాబత్తిన సీతారామయ్య అనే వ్యక్తులు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సమాయత్తమయ్యారు. తమకు పట్టున్న ప్రాంతంలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరవుతున్న మాజీ మంత్రి, వైసీపీ ఒంగోలు పార్లమెంట్‌ నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని అడ్డుకోవాలని టీడీపీ నిర్ణయించింది. సోమవారం ఉదయం కొత్తపట్నం బస్టాండ్‌ సెంటర్‌లో కమ్మపాలేనికి దారితీసే మార్గాన్ని టీడీపీ కార్యకర్తలు మూసివేసి.. అక్కడే బైఠాయించారు. పోలీసు స్టేషన్‌ పక్కనే వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న బాలినేనిని నిలువరించేందుకు పలుమార్లు పోలీసులు ప్రయత్నించారు.

ఒకవైపు ఈ వ్యవహారం సాగుతుండగానే రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద రెండు వర్గాలు రచ్చ చేశాయి. ఒకరి ఫ్లెక్సీలపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. రాళ్ల దాడులకు దిగారు. ఈ దాడిలో ఓ స్పెషల్‌ పార్టీ కానిస్టేబుల్‌తోపాటు మహిళా కానిస్టేబుల్‌ గాయపడ్డారు. వైసీపీ అభిమాని సాధిక్‌ ఒంటిపై డీజిల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పక్కనున్న కార్యకర్తలు, పోలీసులు అతడిని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు స్పల్పంగా లాఠీఛార్జి చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మధ్యాహ్నం 12 గంటల సమయానికి కొత్తపట్నం బస్టాండు ప్రాంతానికి వచ్చిన బాలినేనిని పోలీసులు నిలువరించారు. సాయంత్రం నాలుగు గంటల వరకూ ఇరువర్గాలు అక్కడే మోహరించాయి. చివరకు టీడీపీకి చెందిన కొందరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మాజీ మంత్రి బాలినేని.. ఆయన అనుచరులను అదుపులోకి తీసుకుని టంగుటూరు తరలించారు. గుమికూడిన వారినీ చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)