భారత్-పాకిస్తాన్ సరిహద్దులో కాల్పులు.. చిగురుటాకుల్లా వణికిపోతున్న సామాన్యులు.. జమ్మూలో వారం రోజులుగా ఆకలి, చలిలో చిక్కుకుపోయిన వేలాది మంది జనం: ప్రెస్ రివ్యూ

  • 1 మార్చి 2019
జమ్మూలో బంకర్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక జమ్మూలో సరిహద్దు గ్రామాల్లోనే ఉండిపోయిన జనం కమ్యూనిటీ బంకర్లలో తలదాచుకుంటున్నారు

పాకిస్థాన్‌ వైపు నుంచి జమ్మూకశ్మీర్‌ సరిహద్దు పొడవునా ఎడతెరిపిలేకుండా జరుగుతున్న కాల్పులు భయానక వాతావరణం సృష్టిస్తున్నాయని.. సామాన్య ప్రజలు చిగురుటాకులా వణికిపోతున్నారని ‘ఈనాడు’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు 'ఈనాడు-ఈటీవీ' బృందం ఆర్‌.ఎస్‌.పూరా, అక్నూర్‌, పుల్వామా, నౌషారా, పూంఛ్‌ తదితర సెక్టార్లలో పర్యటించింది. ఆర్‌.ఎస్‌.పూరా మినహా మిగతా సరిహద్దు పొడవునా భయానక వాతావరణం కొనసాగుతూనే ఉంది. కాల్పుల మోతలు నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి.

సరిహద్దుకు ఆవలివైపు సుదూర తీరం నుంచి కాల్పులు జరిపే స్నైఫర్లతో పాకిస్థాన్‌ మోహరించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దాంతో భద్రతా సిబ్బంది అనేక చోట్ల బంకర్ల నుంచే పాకిస్థాన్‌ కాల్పులకు బదులిస్తున్నారు.

సరిహద్దు గ్రామాల్లో ప్రజల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పశువులు ఉన్నవారు మాత్రం ఒకరిద్దరు ఇళ్ళలో ఉండి మిగతా వారంతా సమీపంలోని గ్రామాల్లో తలదాచుకుంటున్నారు.

ముందు జాగ్రత్తగా సరిహద్దుల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దాంతో చాలామంది తల్లిదండ్రులు తమపిల్లలతో కలిసి దూరంగా ఉన్న బంధువుల ఇళ్ళకు తరలి వెళ్ళారు. గ్రామాల్లో ఎక్కడా పెద్దగా జనసంచారం కనిపించడంలేదు.

పాకిస్థాన్‌ దళాలు ప్రయోగిస్తున్న మోర్టార్‌షెల్స్‌ పొలాల్లో పడుతున్నాయని కన్‌చక్‌ క్యాంప్‌ గ్రామానికి చెందిన కుల్‌దీప్‌రాజ్‌ తెలిపారు. ఇవి ఎప్పుడు మీదపడతాయోనని భయంభయంగా బతుకుతున్నామన్నారు. ప్రతిరోజూ ఈ శబ్దాలు వింటూనే ఉన్నామని, వ్యవసాయం, పశువులు వదిలి వెళ్ళలేకపోతున్నామని ఆయన తెలిపారు.

మరోవైపు.. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ-కశ్మీర్‌ రహదారిలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. దాంతో కశ్మీర్‌ లోయలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారు వారం రోజులుగా జమ్మూలోనే చిక్కుకుపోయారు. వైద్యం కోసం, ఉపాధి పనుల కోసం అనేక మంది శ్రీనగర్‌, పుల్వామా, కుప్వారా, పూంఛ్‌, రాజౌరీ తదితర జిల్లాల నుంచి జమ్మూ వస్తుంటారు.

జమ్మూలో మిట్టమధ్యాహ్నం కూడా ఉష్ణోగ్రత పది డిగ్రీలు దాటడంలేదు. రాత్రయ్యేసరికి ఇది మరింత పడిపోతోంది. ఇళ్ళు, కార్యాలయాల్లో హీటర్లు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వేలాది మంది ప్రజలు చిన్నపిల్లలతో చలికి గజగజ వణుకుతూ బస్‌ స్టాండులో పడిగాపులుపడుతున్నారు.

ఎముకలు కొరికే చలి. తినడానికి తిండిలేదు. కప్పుకోడానికి దుప్పటి లేదు. చేతిలో ఉన్న కాస్త డబ్బు ఖర్చయిపోయింది. సొంతిళ్ళకు వెళ్ళే దారిలేక వేలాది మంది కశ్మీరీలు జమ్మూ బస్‌ స్టాండ్‌లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏడెనిమిది వేలమంది ప్రజలు జమ్మూ బస్టాండులో చిక్కుకున్నారు.

వేలమంది ప్రజలకు దగ్గర్లోని హోటళ్ళే దిక్కవడంతో దీన్ని ఆసరాగా తీసుకొని తినుబండారాల ధరలు అమాంతం పెంచారు. మామూలుగా రూ. 20 ఉండే ప్లేట్‌ పూరీ ధర రూ. 50 చేశారని కుప్వారాకు చెందిన నసీర్‌ తెలిపారు.

వేలమందితో జమ్మూ బస్‌ స్టాండ్‌ శరణార్థి శిబిరాన్ని తలపిస్తున్నా ఆదుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం ముందుకు రావడంలేదు. చాలినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రజల బహిరంగ మూత్ర విసర్జనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.

'పైలట్‌' ప్రాజెక్టు ముగిసింది.. ఇది కేవలం ప్రాక్టీసు మాత్రమే: మోదీ నర్మగర్భ వ్యాఖ్యలు

'పైలట్‌ ప్రాజెక్టు ముగిసింది. ఇది జస్ట్‌ ప్రాక్టీసు మాత్రమే. ఇక, ఇప్పుడు అసలు పని చేయాల్సి ఉంది. మరింత ఉధృతం చేయాల్సిన సమయం వచ్చింది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. అభినందన్‌ను శుక్రవారం విడిచి పెడతామని పాక్‌ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ప్రకటన చేసిన తర్వాత మోదీ ఈ వ్యాఖ్య చేశారు.

శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసిన పలువురు శాస్త్రవేత్తలకు గురువారం ఆయన విజ్ఞాన్‌ భవన్లో శాంతి స్వరూప్‌ భట్నాగర్‌ అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభినందన్‌ను విడిచిపెడతామని పాక్‌ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.

బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరంపై వాయుసేన దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

''మీరంతా మీ జీవితాలను ల్యాబొరేటరీల్లోనే గడుపుతూ ఉంటారు. పైలట్‌ ప్రాజెక్టులు నిర్వహించడమనే సంప్రదాయం అక్కడ ఉంటుంది. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందనుకోండి.. ఇక అప్పుడు ఉధృతంగా చేస్తారు.’’

‘‘అలాగే.. ఒక పైలట్‌ ప్రాజెక్టు పూర్తయింది. అది కేవలం ప్రాక్టీసు మాత్రమే. ఇక ఇప్పుడు అసలు పని మిగిలి ఉంది'' అని వ్యాఖ్యానించారు. దేశ ప్రజలకు కొత్త విశ్వాసం వచ్చిందని, అసాధ్యం సుసాధ్యమైందని భావిస్తున్నారని చెప్పారు.

మోదీ వ్యాఖ్యలు పూర్తవగానే సైంటిస్టులంతా లేచి నిల్చొని (స్టాండింగ్ ఒవేషన్) చప్పట్లు కొట్టారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలను బీజేపీ ట్వీట్ కూడా చేసింది.

Image copyright NAra chandrababu naidu/facebook

విశాఖ రైల్వే జోన్ మసిపూసి మారేడు కాయ: చంద్రబాబు

విశాఖ రైల్వేజోన్‌ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారని ‘ప్రజాశక్తి’ దినపత్రిక ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. టిడిపి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లోనూ, రేషన్‌ డీలర్ల అవగాహన సదస్సులోనూ ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. ఎక్కువ ఆదాయం పోగొట్టారని, తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర చేశారని ఆరోపించారు.

125 సంవత్సరాల చరిత్ర ఉన్న వాల్తేరును పక్కనున్న ఒడిషా రాష్ట్రంలో కలిపి మోడీ ఎపికి అన్యాయం చేశారన్నారు. దీని వల్ల ఎపి రవాణా సర్వీసుల వల్ల వచ్చే ఆదాయాన్ని కోల్పోతుందని, కేవలం ప్రయాణీకుల ఛార్జీల ద్వారా వచ్చే ఆదాయం మాత్రమే దక్కుతుందని వివరించారు.

దీనిని నరేంద్రమోడీ రాష్ట్రానికి చేసిన మరోమోసంగా ఆయన అభివర్ణించారు. 'ఆదాయం తగ్గించారు 7 వేల కోట్ల రాబడి పోయింది. రిక్రూట్‌మెంట్లలోనూ ఒడిషాకే ఎక్కువ ప్రయోజనం. ఎవరిని మోసం చేయడానికి ఈ ప్రకటన?' అని ఆయన ప్రశ్నించారు.

దీనికి నిరసనగా శుక్రవారం నల్లబెలూన్లు, నల్ల చొక్కాలతో ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. ఎపి విభజన చట్టంలో పొందుపర్చిన హామీలన్నింటిని అమలు చేశాకే నరేంద్రమోడీ రాష్ట్రానికి రావాలని, అంతవరకు రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కులేదని అన్నారు.

బ్రిటిష్‌ హయాంలో ఏర్పడి, 125 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి, ప్రాధాన్యత లేని ప్రత్యేక రైల్వేజోన్‌ను ప్రకటించడం వల్ల తెలుగు ప్రాంతానికి, ప్రజలకు ఒనగూరిందేమీ లేదని సిపిఎం విశాఖ జిల్లా కమిటీ పేర్కొంది.

వాల్తేరు డివిజన్‌ ఎత్తేసి విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదని పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి విమర్శించారు.

ఒడిశా నుంచి అభ్యంతరాలు ఉండడం వల్లే విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ప్రకటనలో ఆలస్యమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లకీëనారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించి మాట నిలుపుకున్నా, రాజకీయ లబ్ధి కోసమే టిడిపి ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని విమర్శించారు.

Image copyright Getty Images

ఆదివాసీలను తరలించొద్దు.. త్వరితగతిన గుర్తించండి: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

అడవుల్లో ఏండ్లుగా నివసిస్తున్న గిరిపుత్రులను చట్ట ప్రకారం త్వరగా గుర్తించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలను ఆదేశించిందని.. ఇందుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని ‘నవ తెలంగాణ’ దినపత్రిక ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. సరైన పత్రాలు లేకుండా అడవిలో నివసిస్తున్న వారిని అక్కడి నుంచి పంపివేయడంపై గతంలో సుప్రీంకోర్టే ఇచ్చిన ఆదేశాలను తాత్కలికంగా నిలిపివేసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు స్టే విధించింది.

సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అందులో గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల నుంచి వెళ్లగొట్టాలని లేదని, కేవలం పరిశీలించాలని ఉన్నదని కేంద్రం పేర్కొంది.

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇప్పటి వరకు కేంద్రం ఏం చేసిందని, అర్డర్‌ ఇచ్చిన తరువాత ఎందుకు స్పందించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అయితే ఇందుకు సంబంధించిన లెక్కలు తమకు సమర్పించాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించింది.

గతంలో వెల్లడించిన ఉత్తర్వుల ప్రకారం కోర్టు ఆదేశాలతో రాష్ట్రాల్లోని సుమారు 11 లక్షల మంది గిరిజనులు సరైన ధృవీకరణ పత్రాలను ఇవ్వని కుటుంబాలు వెళ్లాల్సి ఉంటుంది. అటవీ హక్కు చట్టం -2006 చెల్లుబాటుపై ఒక స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు, భూ యాజమాన్య హక్కు దరఖాస్తులు తిరస్కరణకు గురైన వారిని అటవీ ప్రాంతం నుంచి తొలగించకుండా ప్రభుత్వాలు ఎందుకు ఉపేక్షిస్తున్నాయని నిలదీసింది.

ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, గోవా, గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జార్ఖండ్‌, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్‌, అసోం, రాజస్థాన్‌, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మణిపూర్‌ రాష్ట్రాలు తమ అఫిడవిట్లు ఇచ్చాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 66,350, తెలంగాణలో 80,000 మంది ఆదివాసీలు నివసిస్తున్నారు. అందులో రెండు రాష్ట్రాల్లో భూ యాజమాన్య హక్కులు కోరిన 66,351 మంది దరఖాస్తులను తిరస్కరించినట్టు పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 11,72,931 దరఖాస్తులను తిరస్కరించారు.

కానీ మరో అంచనా ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా 44 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా అందులో 20.5 లక్షల దరఖాస్తులను పక్కనబెట్టారు. వీటిలో మధ్యప్రదేశ్‌, కర్నాటక, ఒడిషాల్లోనే దాదాపు 20 శాతం ఉన్నాయి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలో వ‌రుస పడవ ప్ర‌మాదాలు... ఎందుకిలా జ‌ర‌ుగుతోంది? ఎవరు బాధ్యులు?

పాకిస్తాన్‌లో హిందూ విద్యార్థిని అనుమానాస్పద మరణం

ఏరియా 51: అమెరికాలో రెండు పట్టణాలను గడగడలాడిస్తున్న 'ఏలియన్స్ జోక్'..

కశ్మీర్: పీఎస్ఏ చట్టం కింద ఫారూక్ అబ్దుల్లా నిర్బంధం... ఏమిటీ చట్టం? ఎంత కఠినం?

ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?

గుజరాత్ 2002 అల్లర్ల ముఖ చిత్రాలైన వీళ్లను గుర్తుపట్టారా.. వీళ్లు ఇప్పుడేం చేస్తున్నారు

హైదరాబాద్ ఖజానా నుంచి పాకిస్తాన్‌కు చేరిన 3.5 కోట్ల పౌండ్ల సొమ్ము దక్కేది ఎవరికి

గోదావరి బోటు ప్రమాదం: 20కి చేరిన మృతులు.. మరో 27 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు