‘విజయసాయిరెడ్డి సీఏ చదివినా కూడా లెక్కలు ఎలా తప్పుతున్నాయో అర్థం కావడం లేదు’ - ప్రెస్ రివ్యూ

వీవీ లక్ష్మీనారాయణ

ఫొటో సోర్స్, Twitter/@VVL_Official

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి లెక్కలు తప్పుతున్నాయని జనసేన విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి, సీబీఐ మాజీ ఉన్నతాధికారి వీవీ లక్ష్మీనారాయణ('జేడీ') విమర్శించారని 'ఈనాడు' తెలిపింది.

విజయసాయిరెడ్డి సీఏ చదివినా కూడా లెక్కలు ఎలా తప్పుతున్నాయో అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ట్విటర్‌లో విజయసాయి చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం అదే వేదికపై లక్ష్మీనారాయణ బదులిచ్చారు.

"జనసేన సొంతంగా పోటీచేసిందే 65 సీట్లలో కాగా, 88 స్థానాల్లో గెల్చి జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ జోస్యం చెబుతున్నారు. లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసిన కేసుల్లోనూ ఇలాగే లేనివి ఉన్నట్టు రాశారు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా" అని విజయసాయి ట్వీట్ చేశారు.

దీనిపై లక్ష్మీనారాయణ స్పందిస్తూ- "మీ లెక్కలు సరిచూసుకోండి. ఎందుకంటే మేం సత్యం, న్యాయం మీద ఆధారపడి పనిచేసేవాళ్లం. మీ తప్పుడు లెక్కల వల్ల ఎంతో మంది ఇరుక్కున్నారు. ఇప్పటికైనా మంచి లెక్కలు నేర్చే విధానాన్ని మొదలుపెట్టండి. జనసేన పోటీచేసింది 140 స్థానాలు. మిత్రపక్షాలైన బీఎస్‌పీ 21, సీపీఐ, సీపీఎం 14 స్థానాల్లో పోటీచేశాయి. మొత్తం 175 స్థానాలకు జనసేన కూటమి పోటీచేసింది. మా లెక్కలు కచ్చితంగా ఉంటాయి" అంటూ సమాధానమిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు: సర్జ్‌పూల్‌లో పెరుగుతున్న నీటిమట్టం

తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలక అంకం సజావుగా, విజయవంతంగా కొనసాగుతోందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఎల్లంపల్లి నుంచి విడుదల చేసిన నీరు ఎలాంటి ఆటంకాలు లేకుండా నందిమేడారం సర్జ్‌పూల్‌కు చేరుతుండటంతో తొలిసారిగా ఈ ప్రాజెక్టులోని భారీ మోటర్లకు ఈ నెల 24న వెట్న్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ పంప్ హౌస్

ఫొటో సోర్స్, MEILTEAM.IN/FACEBOOK

ఫొటో క్యాప్షన్,

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ పంప్ హౌస్

మూడ్రోజుల క్రితం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విడుదలచేసిన గోదావరి జలాలు 1.1 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ, సుమారు 9.54 కిలోమీటర్ల చొప్పున ఉన్న జంట సొరంగాలను దాటి నందిమేడారం సర్జ్‌పూల్‌లోకి చేరుతున్నాయి. ఈ మార్గంలో సాంకేతికంగా ఎలాంటి సమస్య లేకుండా జలాలు సాఫీగా సాగిపోయాయని నిర్ధరించుకున్న అధికారులు సర్జ్‌పూల్‌ను నింపడంలో నిమగ్నమయ్యారు.

నందిమేడారం సర్జ్‌పూల్ 25 మీటర్ల వెడల్పుతో, 67.5 మీటర్ల లోతుతో ఉంటుంది. సర్జ్‌పూల్‌లో దిగువన సొరంగాలు కలిసే ప్రాంతం ఎఫ్‌ఆర్‌ఎల్ 109 మీటర్లుగా ఉన్నది. అంటే సముద్రమట్టానికి 109 మీటర్ల ఎత్తులో సొరంగాలు కలిసే ప్రాంతం ఉందన్నమాట. సొరంగాల ద్వారా అందులోకి జలాలు వస్తుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటివరకు సర్జ్‌పూల్‌లో నీటిమట్టం 124.5 మీటర్ల వరకు వచ్చినట్టు ఈఎన్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. అంటే 109 మీటర్ల నుంచి దాదాపు 16 మీటర్ల మేర నీళ్లు నిండాయి.

ఇలా 133 మీటర్ల వరకు నీటిమట్టం చేరితే నందిమేడారం పంపుహౌజ్‌లోని మోటర్ల వెట్ రన్‌కు మార్గం సాంకేతికంగా సాధ్యమవుతుందని ఇంజినీర్లు తెలిపారు.

సర్జిపూల్‌లో ప్రతి గంటకు 0.6 మీటర్ల మేర నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటివరకు క్కడా ఒక్క లీకేజీ కూడా లేకపోవడంపై అధికారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.

ఈ నెల 24న పంపుహౌజ్‌లోని 124.4 మెగావాట్ల సామర్థ్యం ఉన్న మోటర్ల వెట్న్ మొదలుపెట్టాలని తాజాగా నిర్ణయించారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణాలను మహారాష్ట్ర ఇంజినీర్లు శుక్రవారం పరిశీలించారు.

హైదరాబాద్: హైకోర్టు భవనానికి నేటితో వందేళ్లు

హైదరాబాద్‌లో మూసీ నది ఒడ్డున కొలువుదీరిన హైకోర్టు భవనానికి నేటితో వందేళ్లని ఆంధ్రజ్యోతి ఒక కథనంలో పేర్కొంది.

నాడు బ్రిటీషు పాలిత దేశంలోని 543 సంస్థానాల్లో తొలిగా ఉన్నత న్యాయస్థానానికి ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించిన ఘనత నిజాం ప్రభుత్వానికే దక్కుతుంది.

హైదరాబాద్ హైకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

సైఫాబాద్‌లోని ఒక అద్దె భవనంలో ఇరుకు గదుల్లో హైదరాబాద్‌ ఉన్నత న్యాయస్థానం కార్యకలాపాలు సాగేవి. ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ పూనికతో 1915, ఏప్రిల్‌ 15న హైకోర్టు భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

జైపూర్‌కు చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్‌ శంకర్‌లాల్‌ డిజైన్‌ గీశారు. నిజాం ప్రభుత్వ చీఫ్‌ ఇంజినీరు అక్బర్‌ బేగ్‌, మరొక ఇంజినీరు మెహర్‌ అలీ ఫజిల్‌ నేతృత్వంలో నిర్మాణం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ శిష్యుల్లో ఒకరైన ఎంఎల్‌ ఆదయ్య పర్యవేక్షణాధికారిగా పనిచేశారు.

'గులాబీ, బూడిదరంగు గ్రానైట్‌ రాళ్లతో, ఇండో సార్సనిక్‌ శైలితో నిర్మితమైన హైకోర్టు భవనంలో రాజస్థానీ ఆర్కిటెక్చర్‌ కూడా కనిపిస్తుంది'' అంటారు సీనియర్‌ ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణమూర్తి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఫతేపూర్‌ సిఖ్రీలో మొగల్‌ చక్రవర్తి అక్బర్‌ కట్టించిన బులంద్‌ దర్వాజా దేశంలోనే అతి పెద్దదని అంటారు. ఈ హైకోర్టు ముఖద్వారం అంతకన్నా పెద్దదని చరిత్ర అధ్యయనకారులు సఫీవుల్లా చెబుతున్నారు.

హైకోర్టు భవనాన్ని శంషాబాద్‌ వద్ద గగన్‌పహాడ్‌ ప్రాంతంలోని కొండలను తొలిచి తవ్విన రాళ్లతో కట్టారు. భవన నిర్మాణం 1919, మార్చి 31 నాటికే పూర్తయింది. కానీ 1920 ఏప్రిల్‌ 20న మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్: ఆరుగురు అధికారులపై చర్యలకు ఈసీ ఆదేశం

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆరుగురు అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో)ని భారత ఎన్నికల కమిషన్ ఆదేశించిందని సాక్షి తెలిపింది.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మొత్తం 12 మంది అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ సీఈవో నాలుగు రోజుల ఈసీని కోరారు.

భారత ఎన్నికల కమిషన్ కార్యాలయ ప్రాంగణం

ఫొటో సోర్స్, Ravisankar Lingutla

ఈసీ స్పందిస్తూ- నూజివీడు, సూళ్లూరుపేట, కోవూరు ఆర్వోలపై అభియోగాలు నమోదు చేయాలని ఆదేశించి, ముగ్గురు ఏఆర్వోలపై సస్పెన్షన్‌ వేటు వేసింది.

ఇప్పటికే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడమే కాకుండా సస్పెండ్‌ చేసింది. మరికొంత మంది అధికారులకు షోకాజ్‌ నోటీసులను జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)