తెలంగాణ: మూడు రోజుల్లో 12 మంది ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య - ప్రెస్‌రివ్యూ

క్లాస్ రూం

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు తప్పిదాలతో శనివారం మరో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మూడ్రోజుల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 12కు చేరిందని 'సాక్షి' ఒక కథనంలో చెప్పింది.

‘‘విద్యార్థులు పరీక్షకు హాజరైనా గైర్హాజరయ్యారంటూ ఫెయిల్‌ చేయడం, ప్రథమ సంవత్సరంలో 90 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులను ద్వితీయ సంవత్సరంలో తొమ్మిదిలోపు (సింగిల్‌ డిజిట్‌) మార్కులకు పరిమితం చేయడం లాంటి తప్పిదాలెన్నో ఒక్కొక్క టిగా బయటపడుతున్నాయి.

ఇంటర్మీడియట్‌ ఫలితాలను పూర్తి పారదర్శకంగా ప్రకటించినట్లు బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ శుక్రవారం చెప్పారు. ముగ్గురు విద్యార్థుల విషయంలో పొరపాట్లు జరిగాయని అంగీకరిస్తూ, వాటిని సరిచేస్తామని వెల్లడించారు.

కానీ ఇలాంటి వారి సంఖ్య వేలల్లోనే ఉందంటూ పెద్దసంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం హైదరాబాద్‌ నాంపల్లిలో బోర్డు కార్యాలయం ముందు నిర్వ హించిన ఆందోళనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మూల్యాంకనంలో పొరపాట్లు చేసి వాటికి విద్యార్థులను బలిచేస్తున్నారని విమర్శించారు. జవాబుపత్రాల మూల్యాంకనం అడ్డగోలుగా, అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు..

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రం నలుమూలల నుంచి బాధిత విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్దయెత్తున నాంపల్లికి చేరుకోవడంతో విద్యార్థులను అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది.

ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మేనల్లుడు ధర్మారామ్ ఉన్నట్లు ఈనాడు తెలిపింది. రమేష్ సోదరి విజయలక్ష్మి కుటుంబం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటోంది.

ధర్మారామ్ అమీర్‌పేటలోని నారాయణ కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసి, లెక్కల్లో తప్పాడు. అతడు అపార్ట్‌మెంటు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాష్ట్రాల రుణ సేకరణపై కేంద్రం షరతులు

బహిరంగ మార్కెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న రుణాలపై కేంద్ర ప్రభుత్వం షరతులు విధించిందని ఈనాడు తెలిపింది.

ఆర్థిక లోటును అధిగమించడానికి ప్రతి రాష్ట్రం బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకోవడం పరిపాటి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకోసారి ఇందుకు అనుమతిస్తుంది. దీని ప్రకారం ప్రభుత్వం ఆ 3 నెలల్లో తనకు అవసరమైనప్పుడు ఒకేసారో, లేదంటే నెలకోసారో బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సేకరణకు వెళ్లడం సహజం. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై షరతులు విధించింది.

ఈ రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి 3 నెలల్లో సమానంగా తీసుకోవాలి తప్పితే అవసరమైనప్పుడు ఒక రోజులో గంపగుత్తగా (బల్క్‌) తీసుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్‌బీఐ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది. దీనివల్ల అవసరం ఉన్నా లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి నెలా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణ సేకరణకు వెళ్లాలి తప్పితే తనకు అవసరమైనప్పుడు అవసరమైనంత మొత్తాన్ని ఒక్కసారిగా తీసుకోవడానికి వీలులేకుండా పోయిందని నిపుణులు పేర్కొన్నారు.

ఈ షరతులవల్ల ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ట్రాలు భవిష్యత్తులో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అన్నదాతా సుఖీభవ, పసుపు- కుంకుమ, విద్యార్థుల ఫీజు రీఇంబర్స్‌మెంటు లాంటి పథకాలకు ఒకేసారి నిధులు చెల్లించాల్సి వచ్చినప్పుడు రుణసేకరణ కష్టతరం అవుతుంది.

ఫొటో సోర్స్, AFP

హైదరాబాద్‌లో 'ఇస్లామిక్ స్టేట్' కలకలం: ముగ్గురిని విచారించిన ఎన్‌ఐఏ

ఆగస్టులో అరెస్టు చేసిన ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ అబ్దుల్లా బాసిత్, అతని అనుచరుడు మహ్మద్‌ అబ్దుల్‌ ఖదీర్‌ విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) శనివారం మహారాష్ట్రలోని వార్దాతోపాటు హైదరాబాద్‌లోని షహీన్‌ నగర్, శాస్త్రీపురంలోని కింగ్స్‌ కాలనీ, మైలార్‌దేవ్‌పల్లిలలో ఏకకాలంలో దాడులు చేసిందని 'సాక్షి' తెలిపింది.

అబ్దుల్లా బాసిత్‌ రెండో భార్య మోనాతోపాటు అతడి స్నేహితులు, అనుచరులైన జీషాన్, మసూద్‌ తాహాజ్, షిబ్లీ బిలాల్‌లను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుంది. మోనాను మహారాష్ట్రలో, మిగిలిన ముగ్గురినీ హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎన్‌ఐఏ కార్యాలయంలో ప్రశ్నించింది. ఆదివారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

వారి నుంచి 13 సెల్‌ఫోన్లతోపాటు 11 సిమ్‌కార్డులు, ఐపాడ్, ఎక్స్‌టర్నల్‌ హార్డ్‌డిస్క్, రెండు ల్యాప్‌టాప్‌లు, ఆరేసి పెన్‌డ్రైవ్‌లు, ఎస్డీ కార్డులు, మూడు వాకీటాకీ సెట్‌లు, కీలక పత్రాలను ఎన్‌ఐఏ స్వాధీనం చేసుకుంది.

వీటిని ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో అధ్యయనం చేస్తున్నారు. ఈ విశ్లేషణలో సాంకేతిక ఆధారాలు లభిస్తే అరెస్టులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

మసూద్ తాహాజ్, షిబ్లీ బిలాల్‌ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డారు. మసూద్‌ హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.

ఎన్నికల కోడ్ ఒక్క ఏపీకేనా: నారా లోకేశ్

ఎన్నికల కోడ్‌ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఉందా, ఎన్నికల కమిషన్‌ ఆంక్షలన్నీ ఒక్క తెలుగుదేశం పార్టీకి వర్తిస్తాయా అంటూ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ శనివారం ట్విటర్‌లో ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Facebook/Nara Lokesh

"ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపోతే ప్రజల పరిస్థితి ఏంటని ఆలోచించరా? కోడిగుడ్డు మీద ఈకలు పీకే బుద్ధి మారదా? తెలంగాణలో కోడ్‌ వర్తించదా? ఏమిటీ పక్షపాతం" అని ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)