టిక్‌టాక్ వీడియోలో కేసీఆర్‌ను దూషించిన ఏపీ యువకుడి అరెస్టు- ప్రెస్ రివ్యూ

జేబులో మొబైల్

ఫొటో సోర్స్, Getty Images

టిక్‌టాక్ యాప్‌లో తెలంగాణ ప్రజలపై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై నోరుపారేసుకున్న ఆంధ్రప్రదేశ్ యువకుడిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.

తాగారం నవీన్ అలియాస్ చంటి అనే ఈ యువకుడిని ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అతడిని బుధవారం రిమాండ్‌కు తరలించారు.

పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కేసు వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.

నవీన్ ఈ నెల 14న తన స్నేహితులతో కలిసి తిరువూరు శివారులోని ఓ తోటలో విందు చేసుకున్నాడు. ఆ సందర్భంగా రాజకీయ అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలో నవీన్ తన ఫోన్ నుంచి టిక్‌టాక్ యాప్‌లోకి లాగిన్ అయ్యి తెలంగాణ ప్రజలను, సీఎం కేసీఆర్‌ను రాయలేని భాషలో దూషించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. అది వైరల్ అయ్యింది.

స్నేహితులు వారించడంతో అతడు వెంటనే సిమ్‌కార్డును ధ్వంసం చేశాడు. ఆ స్థానంలో మరో సిమ్‌కార్డు తీసుకున్నాడు.

నవీన్ వ్యాఖ్యలు విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం నేత నర్సింహగౌడ్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

పోలీసులు టిక్‌టాక్ వీడియోలో ఉన్న చంటి స్నేహితుల్లో ఒకరి ఫేస్‌బుక్ ఐడీ దొరకడంతో దాని ఆధారంగా విచారణ జరిపారు. చంటి జాడ కనిపెట్టారు. నేరుగా అతడి ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.

నవీన్‌పై సెక్షన్ 153 (ఏ), సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌లో అభియోగాలను నమోదుచేసి బుధవారం రిమాండ్‌కు పంపారు.

ముఖ్యంగా యువతతోపాటు సోషల్ మీడియాలో తరచుగా ఉండే వారు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే చట్టపరంగా కఠిన శిక్షలు ఉన్నాయని పోలీసు కమిషనర్ హెచ్చరించారు.

వైసీపీ నేతల ఫోన్ల ట్యాపింగ్ నిజమేనన్న ఏపీ ప్రభుత్వం

వైసీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ నిజమేనని హైకోర్టు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందని, టెలిగ్రాఫ్‌ చట్టం 1885లోని సెక్షన్‌ 5(2)ను అనుసరించే ఆ పని చేశామని తెలిపిందని సాక్షి రాసింది.

ఈ వివరాలను కౌంటర్‌ రూపంలో లిఖితపూర్వకంగా తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

తనతోపాటు తమ పార్టీ నాయకుల ఫోన్లను అధికార పార్టీ కోసం పోలీసులు ట్యాపింగ్‌ చేస్తున్నారంటూ వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారో జాబితాను సమర్పించేలా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్‌ కార్యదర్శి, వొడాఫోన్‌ ఏపీ, తెలంగాణ నోడల్‌ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు.

డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ డీజీలను టెలిగ్రాఫ్‌ చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.

ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్‌ చేయవచ్చో సెక్షన్‌ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ- సెక్షన్‌ 5(2)ను అనుసరించే ఫోన్‌ ట్యాపింగ్‌ చేశామని చెప్పారు. తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని వివరించారు. ఈ వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

కేసు విచారణ జూన్‌ 6కి వాయిదా పడింది.

కేసీఆర్ సమీక్ష ముందే చేసుంటే ఆ 15 మంది బతికేవారు: విజయశాంతి

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల్లో అవకతవకలపై నాలుగు రోజుల ముందే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించి ఉంటే 15 మంది విద్యార్థులు బతికేవారని తెలంగాణ పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్‌ ఫలితాల తప్పిదాల నుంచి ప్రభుత్వం ఇప్పటికీ తప్పించుకోవాలని చూడటం సిగ్గుచేటని ఆమె బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు.

ఒకేరోజు 490 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్

ఫైనాన్స్‌, ఇంధన, ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ ఒక్కరోజు 490 పాయింట్ల లాభాన్ని కూడగట్టుకుందని, నిఫ్టీ మళ్లీ కీలకమైన 11700 పాయింట్ల స్థాయి ఎగువకు చేరిందని ఈనాడు తెలిపింది.

వరుసగా మూడు రోజుల పాటు కీలక స్థాయిలను కోల్పోతూ మదుపరిని బెంబేలెత్తించిన సూచీలు బుధవారం ఒక్కసారిగా విజృంభించాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఏప్రిల్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు ముగింపు దగ్గరపడటంతో మదుపర్లు షార్ట్‌కవరింగ్‌ కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ముఖ్యంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో తమ వంతు సహకారం అందించాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు దన్నుగా నిలిచాయి.

అంతర్జాతీయంగా చూస్తే.. ఆసియా షేర్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

ఆంధ్రప్రదేశ్: బ్యాంక్‌, ఈవీఎంలు పేల్చేస్తామన్న మహిళ అరెస్టు

బ్యాంక్‌తోపాటు ఈవీఎంలను బాంబులతో పేలుస్తామని మెసేజ్ పంపిన ఒక మహిళను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పోలీసులు అరెస్టు చేశారని ఈనాడు తెలిపింది.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లి ఏపీజీవీ బ్యాంక్‌ మేనేజర్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లకు ఆ మహిళ సందేశం వెళ్లింది.

అనకాపల్లి డీఎస్పీ ఎస్‌వీవీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం- ఏపీజీవీ బ్యాంక్‌ను బాంబులతో పేలుస్తామంటూ ఈ నెల 23న మేనేజర్‌ గాలి కిరణ్‌కుమార్‌ ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. ఆయన అనకాపల్లి పోలీసులను ఆశ్రయించారు. ఈవీఎంలను కూడా పేలుస్తామంటూ అనకాపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో ఆర్వోగా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, గుంటూరులోని ఓ పోలీసు ఉన్నతాధికారి ఫోన్లకు ఒకే నంబర్‌ నుంచి మెసేజ్‌లు వెళ్లాయి.

సుమారు 20 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టగా, అనకాపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందిన రాజేపల్లి వీర శివరంజని అనే మహిళ ఫోన్‌ నుంచి ఈ మెసేజ్‌లు వెళ్లినట్లు గుర్తించారు.

శివరంజని వెలుగు విభాగంలో వీఏవోగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళలకు పసుపు- కుంకుమ కింద ఇవ్వాల్సిన నగదును బ్యాంక్‌ మేనేజర్‌ పాత బకాయిల కింద తీసుకుంటున్నారని, అందుకే బెదిరించాలని బ్యాంక్‌ మేనేజర్‌కు ఇలా మెసేజ్ పంపినట్లు శివరంజని విచారణలో వెల్లడించినట్లు డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు.

ఆమెను అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)