"కేసీఆర్ ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేయాలి"... గవర్నర్‌కు కాంగ్రెస్ డిమాండ్ - ప్రెస్ రివ్యూ

  • 26 ఏప్రిల్ 2019
Image copyright KalvakuntlaChandrashekarRao/facebook

తెలంగాణలో రాజ్యాంగబద్ధ పాలన సాగడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించిందని, స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారని గవర్నర్‌ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిందని ఆంధ్రజ్యోతి తెలిపింది.

తక్షణమే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలనను పునరుద్ధరించాలని గవర్నర్‌ను కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఏకంగా సీఎం అధికార నివాసానికి పిలిపించి, కండువాలు వేసి పార్టీలో చేర్చుకున్నారని విమర్శించింది.

సీఎం రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌ను ఉల్లంఘించడమే కాకుండా, పదో షెడ్యూల్‌లోని ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించారని కాంగ్రెస్ ఆరోపించింది. కేసీఆర్‌ బెదిరింపులకు భయపడి శాసనసభ స్పీకర్‌ శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో తమ రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించకుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించింది. కాంగ్రెస్‌ శాసనసభా పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్లు ప్రకటించేందుకు కుట్ర జరుగుతోందని, దాన్ని అడ్డుకోవాలని గవర్నర్‌ను కోరింది.

గురువారం కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ నేతలు గవర్నర్‌ నరసింహన్‌ను కలిశారు. కాంగ్రెస్‌ తరపున గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కందాల ఉపేందర్‌రెడ్డి, హరిప్రియ నాయక్‌, జాలాల సురేందర్‌లను అనర్హులుగా ప్రకటించేందుకు రాజ్యాంగ బద్ధంగా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫిరాయింపుదార్లంతా కలిసి శాసనసభాపక్షం విలీనం కోసం స్పీకర్‌కు విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని, తాము ఇచ్చిన ఫిర్యాదు మీద నిర్ణయం తీసుకున్న తర్వాతే ఇతర విజ్ఞప్తులను పరిశీలించేట్లు స్పీకర్‌ను ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు.

గవర్నర్‌ను కలిసిన అఖిలపక్షంలో కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ, టీడీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు ఎల్‌.రమణ, సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర సహకార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, టీజేఎస్‌ అధినేత కోదండరాం, మన ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ ఉన్నారు.

Image copyright FB/Bhatti Vikramarka Mallu

ఇంటర్ అవకతవకలపై మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి: అఖిలపక్షం

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు, ఫలితాల్లో అవకతవకలకు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బాధ్యుడని ఆరోపిస్తూ, ఆయన్ను బర్తరఫ్‌ చేయాలని గవర్నర్‌ను అఖిలపక్షం కోరింది. మార్కుల అవకతవకలపై హైకోర్టు జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్‌ చేసింది. బాధ్యులైన ఇంటర్‌బోర్డు కార్యదర్శితోపాటు ఉన్నతాధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరింది.

Image copyright yschowdary/fb

సుజనాచౌదరికి సీబీఐ తాఖీదులు

బ్యాంకులను మోసగించారనే కేసులో విచారణకు హాజరు కావాలంటూ తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరికి సీబీఐ గురువారం తాఖీదులు జారీచేసిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

శుక్రవారం బెంగళూరులోని తమ కార్యాలయంలో హాజరు కావాలని ఆయన్ను సీబీఐ ఆదేశించింది.

విద్యుత్ పరికరాలను ఉత్పత్తి చేసే బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (బీసీఈపీఎల్) సంస్థ వ్యవహారంలో బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు నష్టం చేకూర్చినట్టు సుజనాచౌదరిపై 2017లో కేసు నమోదైంది. ఆ సంస్థ ఎండీ కాకులమర్రి శ్రీనివాస్ కల్యాణ్‌రావు సహా ఐదుగురు డైరెక్టర్లపైనా సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

మోసం, నేరపూరిత కుట్ర, ఫోర్జరీకి సంబంధించిన సెక్షన్లతో వారిపై అభియోగాలు మోపింది.

ఈ కేసుకు సంబంధించి సుజనా చౌదరికి చెందిన రూ.315 కోట్ల విలువైన ఆస్తులను ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది.

సంస్థతో సంబంధం లేదన్న సుజనాచౌదరి

బీసీఈపీఎల్‌తో తనకు సంబంధం లేదని సుజనాచౌదరి గురువారం చెప్పారు. 2003 నుంచి తాను సుజనా గ్రూప్‌నకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, స్పెండ్లెడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, న్యూయాన్ టవర్స్ లిమిటెడ్ కంపెనీల్లో కేవలం నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానాల్లో మాత్రమే ఉన్నానని, 2014 అక్టోబర్ నుంచి ఆ మూడు కంపెనీల నుంచి కూడా పూర్తిగా తప్పుకున్నానని ఆయన వెల్లడించారు.

డీజిల్ కార్ల విక్రయాలు నిలిపివేయనున్న మారుతీ సుజుకీ

2020 ఏప్రిల్‌ 1 నుంచి డీజిల్‌ వర్షన్‌ కార్ల విక్రయాలను నిలిపివేస్తున్నట్లు దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారు మారుతీ సుజుకీ ఇండియా ప్రకటించిందని సాక్షి రాసింది.

బీఎస్‌6 ఉద్గార నియమావళికి అనుగుణం గా ఆటోమొబైల్‌ పరిశ్రమ మారుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం కంపెనీ దేశీయ కార్ల విక్రయాల్లో డీజిల్‌ కార్ల వాటా 23 శాతం ఉంది.

గత ఆర్థిక సంవత్సరం కంపెనీ మొత్తం 4.63 లక్షల డీజిల్‌ వాహనాలను అమ్మింది. కంపెనీ ఉత్పత్తి చేసే విటారా, బ్రెజా, ఎస్‌క్రాస్‌ వంటి కొన్ని మోడళ్లు కేవలం డీజిల్‌ వర్షన్‌లో మాత్రమే లభిస్తాయి. స్విఫ్ట్, బాలెనో, సియాజ్, ఎర్టిగా లాంటి మోడళ్లు రెండు వెర్షన్లలోనూ లభిస్తా యి.

2020 ఏప్రిల్‌ నుంచి ఎల్‌సీవీ సూపర్‌ క్యారీ డీజిల్‌ వర్షన్‌ విక్రయాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు మారుతీ ప్రకటించింది. ఇకపై సూపర్‌క్యారీ కేవలం పెట్రో ల్, సీఎన్‌జీ వెర్షన్లలో మాత్రమే లభిస్తుంది.

డీజిల్‌ వాహనాలపై మీడియా అడిగిన ప్రశ్నకు మారుతీ చైర్మన్‌ ఆర్‌సీ భార్గవ బదులిస్తూ- బీఎస్‌6 డీజిల్‌ కార్లకు డిమాండ్‌ బాగా పెరిగితే అప్పుడు అందుకు తగ్గ మోడల్‌ను తయారు చేస్తామన్నారు. భవిష్యత్తులో డీజిల్‌ ఇంజిన్లతో కూడిన కార్లను తయారు చేయాల్సి వస్తే 1500 లీటర్లకు పైబడిన డీజిల్‌ ఇంజిన్లనే తయారుచేస్తామని భార్గవ చెప్పారు. చిన్న డీజిల్‌ కార్లు పెద్దగా లాభదాయకం కాదన్నారు.

ప్రధాని హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన ఐఏఎస్‌ సస్పెన్షన్‌ నిలుపుదల

ప్రధాని నరేంద్రమోదీ హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన నేపథ్యంలో ఐఏఎస్‌ అధికారి మహమ్మద్‌ మొహిసిన్‌ను సస్పెండ్‌ చేస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను బెంగళూరులోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) గురువారం నిలిపివేసిందని ఈనాడు తెలిపింది.

ఈసీ ఉత్తర్వులపై క్యాట్ స్టే మంజూరు చేసింది. ఈసీకి, మరో నలుగురికి నోటీసుల జారీకి ఆదేశాలిచ్చింది.

కేసు తదుపరి విచారణను ధర్మాసనం జూన్‌ ఆరో తేదీకి వాయిదా వేసింది.

మొహిసిన్‌ సస్పెన్షన్‌పై బెంగళూరులో 'క్యాట్‌' స్టే ఇచ్చిన రోజునే(గురువారం) తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకూ మొహిసిన్‌ను ఎన్నికల విధులు నిర్వహించకుండా నిషేధిస్తూ ఈసీ గురువారం దిల్లీలో ఉత్తర్వులు చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)