తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి: 'భద్రాచలాన్ని ఏపీకి ఇచ్చే ప్రతిపాదన లేదు' - ప్రెస్ రివ్యూ

  • 14 జూన్ 2019
భద్రాచలం ఆలయం Image copyright telanganatourism.gov.in

భద్రాచలాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలనే ప్రతిపాదన ఎక్కడా లేదని తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇంద్రకరణ్‌రెడ్డి గురువారం తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ- ఐదేండ్ల వ్యవధి ఉన్నప్పటికీ హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ భవనాలను తెలంగాణకు కేటాయించడం అభినందనీయమన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించామని ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ సహకారాలు అందించుకొని అభివృద్ధికి కృషిచేయాలన్నారు.

ఆర్టీసీ విలీనంపై మూడు కమిటీలు

ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆ ప్రక్రియ ఎలా ఉండాలనే అంశంపై అధ్యయనం చేసేందుకు మొత్తం 3 కమిటీలను నియమించనుందని ఈనాడు రాసింది.

ఈ కమిటీల్లో ఒకటి ఆర్థిక, రవాణాశాఖ మంత్రుల నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం. రెండోది ఏపీఎస్‌ఆర్టీసీ మాజీ ఎండీ నేతృత్వంలోని నిపుణుల కమిటీ. వీటితోపాటు ఆర్టీసీలో పెద్ద ఎత్తున విద్యుత్తు బస్సులను ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకవసరమైన నిధుల సమీకరణ ఎలా చేయాలనే దానిపై అధ్యయనం చేసి అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకుగానూ సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) నిపుణుల నేతృత్వంలో మూడో కమిటీని ఏర్పాటు చేయనుంది.

వీటికి సంబంధించి ఒకటి రెండు, రోజుల్లో ఉత్తర్వులు విడుదల కానున్నాయి.

మంత్రివర్గ ఉపసంఘం, నిపుణుల కమిటీ సంయుక్తంగా చర్చించి విలీన ప్రక్రియ ఎలా ఉండాలనే అంశంపై అత్యుత్తమ విధానాన్ని రూపొందిస్తాయి.

నెలకు రూ.100తో రూ.3 వేలు పింఛను

ప్రధానమంత్రి కిసాన్‌ పెన్షన్‌ యోజన కింద రైతులు నెలకు రూ.100 చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపిందని ఆంధ్రజ్యోతి రాసింది.

Image copyright Getty Images

ఎల్‌ఐసీ నిర్వహిస్తున్న ఈ స్కీంలో కేంద్రం కూడా అంతే మొత్తంలో జమ చేస్తుంది. ఈ పథకం కింద 60 ఏళ్లు దాటిన రైతులకు నెలకు కనీసం రూ.3 వేల పింఛను అందిస్తారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవల కేబినెట్‌ సమావేశంలోనే రైతులకు ఈ ప్రత్యేక పింఛను పథకాన్ని ఆమోదించింది.

ఏడాదికి రూ.10,774.5 కోట్ల వ్యయంతో కూడిన ఈ స్కీంలో తొలి మూడేళ్లలో 5 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారు.

పథకంపై 18-40 ఏళ్లలోపు రైతులకు అవగాహన కల్పించాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ సూచించారు.

పీఎం కిసాన్‌ స్కీం కింద చిన్నకారు రైతులకు ఏడాదికి రూ.6 వేలు (రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో) చెల్లించే పథకాన్ని కూడా వేగవంతం చేయాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది.

తెలంగాణ: 'అడవి నుంచి గిరిజనులను బలవంతంగా తరలించిన అధికారులు'

తెలంగాణలోని కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొలాంగొంది గిరిజనులను అటవీ అధికారులు అడవి నుంచి గెంటేశారని, నివాసాలను కూల్చివేసి సామగ్రితో సహా పంపేయడంతో కలప డిపోలో గిరిజనులు తలదాచుకుంటున్నారని సాక్షి రాసింది.

20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ సమీపంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ నివాసముంటున్న మొత్తం 16 గిరిజన కుటుంబాలను రిజర్వు ఫారెస్టు భూమి పేరుతో అధికారులు ఖాళీ చేయించారు. గిరిజనులు ఉంటున్న స్థలం రిజర్వు ఫారెస్టు భూమిగా పేర్కొంటూ అటవీ అధికారులు గతంలో చాలాసార్లు సర్వేలు నిర్వహించారు. గతంలోనే ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన అధికారులు ప్రత్యామ్నాయంగా వేరే చోట వ్యవసాయ భూమి, డబుల్‌ బెడ్‌రూం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ సమయంలోనే గిరిజనుల నుంచి సంతకాలు కూడా తీసుకున్నారు. మరోవైపు అటవీ శాఖ భూమిలో పోడు వ్యవసాయం చేస్తున్నారని పేర్కొంటూ 2017లో 13 మంది గిరిజనులపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

గతంలో సర్వేలు చేసిన అటవీ అధికారులు ఖాళీ చేయాలని గిరిజనులకు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై గిరిజనులు అప్పట్లో కాగజ్‌నగర్‌కు చెందిన న్యాయవాదిని సంప్రదించడంతో ఆయన వారి తరుఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. చట్ట ప్రకారం గిరిజనులకు పునరావాసం కల్పించాలని ఈ ఏడాది మార్చి 25న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అటవీ అధికారులు కౌంటర్‌ ఫైల్‌ దాఖలు చేశారు. 2013 నుంచి మాత్రమే గిరిజనులు ఇక్కడ నివాసముంటున్నారని కోర్టుకు నివేదిక అందజేశారు. చట్ట ప్రకారం 2006కు ముందు నుంచి ఉంటున్న వారికే హక్కులు వర్తిస్తాయని పేర్కొన్నారు. కొలాంగొంది గిరిజనులకు ఎలాంటి హక్కులు లేవని అటవీ అధికారులు వాదించారు.

బుధవారం ఉదయం కొలాంగొందికి వచ్చిన అటవీ అధికారులు గిరిజనులను బలవంతంగా జీపులో ఎక్కించి కాగజ్‌నగర్‌ కలప డిపోకు తరలించారు. వారికి సంబంధించి పూరి గుడిసెలను ధ్వంసం చేశారు. అధికారులు అక్రమంగా తమను ఖాళీ చేయించారని, కలప డిపోలో తిండి లేక గోస పడుతున్నామని వాపోతున్నారు.

కోర్టు ఆదేశాల మేరకే గిరిజనులను తరలించామని, గిరిజనుల మాటల్లో వాస్తవం లేదని కాగజ్‌నగర్‌ ఎఫ్‌డీవో రాజరమణారెడ్డి చెప్పారు. "హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చట్ట పరిధిలో చర్యలు తీసుకున్నాం. పునరావాసం కోసం ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో క్రిష్ణ ఆదిత్యకు నివేదిక పంపాం. అప్పటి వరకూ గిరిజనులకు ఇబ్బందులు కలగకుండా చూస్తాం" అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)