చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో ఊహించని అనుభవం - ప్రెస్ రివ్యూ

  • 15 జూన్ 2019
Image copyright Twitter

గన్నవరం విమానాశ్రయంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఊహించని అనుభవం ఎదురైందని ఈనాడు తెలిపింది.

శుక్రవారం సాయంత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరిన చంద్రబాబుకు గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు వాహనం నేరుగా వీఐపీ మార్గం నుంచి విమానం వరకు వెళ్లే వెసులుబాటు ఉంది. తాజాగా దీనిని సవరించిన అధికారులు చంద్రబాబును సాధారణ ప్రయాణికులు వెళ్లే మార్గంలో పంపించటంతోపాటు అణువణువూ తనిఖీ చేశారు.

విమానాశ్రయంలో లాంజ్ నుంచి విమానం వరకు ప్రత్యేక వీఐపీ వాహనం కేటాయించకుండా అందరూ వెళ్లే బస్సులోనే పంపించారు.

వీఐపీ, జడ్ ప్లస్ భద్రతలో ఉన్న చంద్రబాబుకు ప్రత్యేక వాహనం కేటాయించకపోవటం పట్ల టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

రాష్ట్రంలోనూ చంద్రబాబు వాహన శ్రేణికి పైలట్‌ క్లియరెన్స్‌ తొలగించారు. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రతాపరంగా శ్రేయస్సు కాదని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

చంద్రబాబును విమానాశ్రయంలో తనిఖీలు చేసి ఈ విధంగా అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 2014కు ముందు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడూ ఇలాంటి ఘటన ఎదురు కాలేదన్నారు. కక్షసాధింపు చర్యలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భద్రత పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరారు.

నైరుతి వానలు మరింత ఆలస్యం

నైరుతి రుతుపవనాల మందగమనంతో వానల రాక మరింత ఆలస్యమవుతోందని నమస్తే తెలంగాణ రాసింది.

Image copyright AFP

ఈ నెల 8న కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు ఇంకా తమిళనాడు రాష్ట్రాన్ని కూడా దాటలేదు. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాన్ కచ్ వైపు మళ్లడంతో గాలిలో తేమశాతం తగ్గి రుతుపవనాల కదలిక మందకొడిగా సాగుతోంది.

రుతుపవనాలు ఈ నెల 16 నుంచి 18 లోపు తెలంగాణను తాకవచ్చని ముందుగా భావించినప్పటికీ, వాయు తుఫాన్‌వల్ల రుతుపవనాల కదలికలో పెద్దగా మార్పు కనిపించడంలేదని వాతావరణశాఖ అధికారులు గుర్తించారు.

మెల్లగా కదులుతున్న రుతువపనాలు 17న లేదా 18న రాయలసీమ, కోస్తాంధ్రలో ప్రవేశించే అవకాశముందని అధికారులు అంచనావేశారు. అవి తెలంగాణను ఈ నెల 20న తాకవచ్చని అంటున్నారు.

మరో మూడు రోజులవరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారి రాజారావు తెలిపారు.

హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కానీ ఉక్కపోత మాత్రం జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలిలో తేమ తగ్గడంతో మరో రెండు రోజుల వరకు రాజధానిలో వేడిగాలులు వీచే అవకాశముంది.

దేశంలోని అన్ని మెట్రో రైళ్లకు ఒకే స్మార్ట్ కార్డు

దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లోని మెట్రోరైళ్లలో ప్రయాణానికి వీలుగా కొత్తగా ఒకటే స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టాలని కేంద్రప్రభుత్వం తాజాగా నిర్ణయించిందని ఆంధ్రజ్యోతి రాసింది.

మెట్రో Image copyright FACEBOOK/HYDERABAD METRO

'ఒన్ నేషన్ ఒన్ కార్డు' నినాదంతో కేవైసీ గుర్తింపు డెబిట్, క్రెడిట్ కార్డుల తరహాలో మెట్రోరైళ్లలో ప్రయాణానికి ఒకటే కార్డును తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. దేశంలోని ప్రయాణికులకు ఆధార్ కార్డు, విదేశీయులకు వారి పాస్ పోర్టు ఆధారంగా మెట్రో రైలు ప్రయాణ కార్డులు జారీ చేయాలని నిర్ణయం తీసుకొంది.

ఈ కొత్త కార్డును ఆరు నెలల్లోగా ప్రవేశపెట్టాలని కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ మెట్రోరైలు విభాగాలను ఆదేశించింది.

ఈ కార్డు క్యూఆర్ కోడ్ సాయంతో వచ్చే పేపరు స్లిప్పులు పొంది ప్రయాణించవచ్చు.

ఏటీఎంలలో నగదు నింపకపోతే బ్యాంకులకు జరిమానా

నగదు కోసం ఏటీఎంల చుట్టూ తిరిగి ఉసూరుమనే ఖాతాదారులకు ఆర్‌బీఐ ఊరట కల్పించిందని, రోజుల తరబడి నగదు నింపకుండా ఏటీఎంలను ఖాళీగా ఉంచే బ్యాంకులు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ బ్యాంకులకు స్పష్టం చేసిందని సాక్షి తెలిపింది.

Image copyright Ravisankar Lingutla

మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఉండరాదని, అలా ఉంచిన బ్యాంకుల నుంచి జరిమానా వసూలు చేస్తామని, ప్రాంతాన్ని బట్టి జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ పేర్కొంది.

చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎంల్లో నగదు లేకపోవడంతో గంటల కొద్దీ ఖాతాదారులు వేచిచూడాల్సిన దుస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల ఏటీఎంల్లో రోజుల తరబడి నగదు నింపకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఏటీఎంలలో నెలకొల్పే సెన్సర్ల ద్వారా వాటిలో ఎం‍త నగదు ఉందనేది ఆయా బ్యాంక్‌లకు సమాచారం ఉంటుంది. నగదు లేని ఏటీఎంల గురించి పూర్తి సమాచారం ఉన్నా సకాలంలో నగదును నింపేందుకు బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)