నరేంద్ర మోదీది ఓ గెలుపా? ఏంపనిచేసి గెలిచారు?: కేసీఆర్ - ప్రెస్ రివ్యూ

  • 18 జూలై 2019
Image copyright FB/Telangana CMO

ప్రధాని నరేంద్ర మోదీ ఏం పనిచేసి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారని తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి తెలిపింది.

''అభివృద్ధి చేస్తే గెలుస్తారా? ప్రజలు ఓట్లు వేస్తారా? అలా అయితే మోదీ ఏం పని చేసి గెలిచారు? దేశానికి మోదీ ఏం చేశారు? ఆయన పనితీరుపై చర్చ జరిగిందా? గెలిస్తే ఏం చేస్తామో చెప్పారా? ఎన్నికలనే యుద్ధం చేసి గెలిచారు. దేశభక్తి, జాతీయత అనే భావోద్వేగాలను రెచ్చగొట్టి, బీజేపీ లేకపోతే దేశానికి భద్రత, రక్షణ లేదనే అభద్రతా భావాన్ని సృష్టించి గెలిచారు. అదో గెలుపా!?'' అని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

బుధవారం తొలుత తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యులతో గంటకుపైగా జరిగిన సమావేశంలో, తర్వాత ప్రగతి భవన్‌లో నాలుగు గంటలకుపైగా సాగిన కేబినెట్‌ భేటీలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ గెలుపు అంశాన్ని ప్రస్తావించారు.

''ఎన్నికలంటే వార్‌ (యుద్ధం). యుద్ధాన్ని యుద్ధం చేసే గెలవాలి. అభివృద్ధి చేస్తాం. కానీ, ఒక్కోసారి అభివృద్ధి చేసినా ఎన్నికల్లో ఓడిపోతాం. ఎన్నికలనే యుద్ధంలో గెలిచే నైపుణ్యం వేరుగా ఉంటుంది'' అని కేసీఆర్ అన్నారని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఎన్నికలు, అభివృద్ధి అనేవి వేర్వేరు అంశాలని, దేని దారి దానిదేనని ఆయన చెప్పారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ పోటీయే కాదని, తెలంగాణలో అతిపెద్ద, శక్తిమంతమైన పార్టీగా టీఆర్‌ఎస్‌ ఇప్పటికే అవతరించిందని, రాజకీయంగా రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు వాతావరణం అనుకూలంగా ఉందని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు.

Image copyright FB/rapaka.varaprasadrao.1
చిత్రం శీర్షిక జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగన్: జనసేన ఎమ్మెల్యే

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రైతులకు పెద్దపీట వేసిందని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారని సాక్షి తెలిపింది.

వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకొస్తే తమ బతుకులు బాగుపడతాయని రైతులు ఆశించారని, అలాంటి బడ్జెట్‌నే ముఖ్యమంత్రి జగన్‌ రూపొందించారని ఆయన చెప్పారు.

బుధవారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ- "కోరిన కోర్కెలు తీర్చే దేవత గంగమ్మ తల్లి అయితే కోరని కోర్కెలు కూడా తీర్చే దేవుడు జగనన్న అని మత్య్సకారులు చెబుతున్నారు. మత్స్యకారులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిధులు కేటాయించడం సంతోషం. బడ్జెట్‌లో అన్ని వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారు" అని చెప్పారు.

నామినేటెడ్‌ పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం కల్పించారని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు.

"108, 104లతో ప్రజల ఆరోగ్య భద్రత పెరిగింది. గత ప్రభుత్వం ఆ వాహనాలు తుప్పు పడుతున్నా పట్టించుకోలేదు. ఈ బడ్జెట్‌ కేవలం 50 రోజుల్లో తయారు చేసింది కాదు. పాదయాత్రలో అన్ని వర్గాల కష్టాలను చూసి జగన్ ఈ బడ్జెట్‌ రూపొందించారు" అని ఆయన ప్రశంసించారు.

Image copyright FB//MahmoodAliTRS

బక్రీద్‌కు ఆవులను కాదు గొర్రెలనే త్యాగం చేయండి: మహమూద్ అలీ

ఆగస్టులో వచ్చే బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులను కాకుండా గొర్రెలను త్యాగంచేయాలని తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ ముస్లింలకు పిలుపునిచ్చారని నమస్తే తెలంగాణ రాసింది.

హిందువులు ఆవును ఎంతో గౌరవిస్తారని, అందుకే ఆవులను త్యాగానికి వాడొద్దని, గొర్రెలు, ఇతర జంతువులను త్యాగంచేయాలని ఆయన బుధవారం చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

తెలంగాణలో ప్రశాంతమైన వాతావరణం ఉందని హోంమంత్రి తెలిపారు. చార్మినార్‌లోని నాలుగు మినార్లు హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మతాలకు ప్రతీకలన్నారు.

కులీ కుతుబ్‌షా నిర్మించిన చార్మినార్ అన్ని మతాలను ఒక దగ్గరకు చేర్చిందని ఆయన చెబుతూ. కుతుబ్‌షాహీ తర్వాత అన్ని మతాలను, వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన నేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అని కొనియాడారు.

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ Image copyright Getty Images
చిత్రం శీర్షిక కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌

'ఉపాధి హామీ' శాశ్వత కొనసాగింపు ఉండదు: కేంద్రం

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని శాశ్వతంగా కొనసాగించాలని ప్రభుత్వం కోరుకోవడం లేదని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారని ఈనాడు రాసింది.

ఇది పేదల కోసం ఉద్దేశించిన పథకమని, పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం భావిస్తున్నందున దీని అవసరం ఉండకపోవచ్చని ఆయన తెలిపారు.

బుధవారం లోక్‌సభలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి శాఖ పద్దులపై చర్చల సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.

తీసుకున్న రుణాలను మహిళా సహాయ సంఘాలు సక్రమంగా చెల్లిస్తున్నాయని, వీటిని చూసి కార్పొరేట్‌ సంస్థలు నేర్చుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు.

రాజ్యసభలో జీరో అవర్ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు మానస్‌ రంజన్‌ భునియా మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 100 నుంచి 200కు పెంచాలని కోరారు.

దేశంలో మహిళలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని సీపీఎం సభ్యురాలు ఝర్నా దాస్‌ బైద్య చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

గూగుల్ యాప్స్ లేకుండా హువావే కొత్త ఫోన్లు.. మేట్ 30 ప్రోలో సినీ కెమెరా సహా నాలుగు కెమెరాలు

ఇన్‌స్టాగ్రాంలో ‘బ్రౌన్ గర్ల్స్’... దక్షిణాసియా అమ్మాయిల సరికొత్త గ్యాంగ్

గోదావరి పడవ ప్ర‌మాదాలు: ఇన్నేళ్ళుగా ప్ర‌భుత్వం తీసుకున్న చర్యలేంటి? వాటి ఫలితాలేమిటి?

నిర్మలా సీతారామన్: కార్పొరేట్ పన్ను రేట్ల తగ్గింపు... లాభాలతో ఉరకలెత్తిన సెన్సెక్స్

గోదావరిలో ప్రమాదం: ఈరోజు కూడా బోటు బయటకు వచ్చే అవకాశాలు లేనట్లే

అత్యాచారం ఆరోపణలపై బీజేపీ నేత చిన్మయానంద అరెస్టు

20 ఏళ్లుగా 200 విష సర్పాలతో కాటేయించుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా

టీటీడీ పాలకమండలిలోకి మళ్లీ శేఖర్ రెడ్డి.. ప్రత్యేక ఆహ్వానితులుగా ఏడుగురు

వాజినిస్మస్: 'నా శరీరం సెక్స్‌కు సహకరించదు'