యువతి కిడ్నాప్: రవిశేఖర్‌ను పట్టిస్తే రూ.లక్ష- తెలంగాణ పోలీసులు - ప్రెస్ రివ్యూ

  • 29 జూలై 2019
Image copyright FB/@dgptelangana

నాలుగు రాష్ట్రాల్లో 'మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌'గా ఉన్న ఐతం రవిశేఖర్‌ అలియాస్‌ రవి (45)ని పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారని 'సాక్షి' రాసింది.

అతడి ఆచూకీ కోసం వారు కడప జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారు ఆదివారం కడపలో మీడియాతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన రవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. ఈ నాలుగు రాష్ట్రాల్లో అతనిపై 30 కేసులకు పైగా నమోదయ్యాయి.

అతను వైజాగ్‌ కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తూ, ఈ ఏడాది మే 21న కోర్టుకు ఎస్కార్ట్‌తో వాయిదాకు వెళుతున్న సమయంలో కన్నుగప్పి పరారయ్యాడు.

కర్ణాటకలో ఐ20 కారును దొంగిలించి, దానికి నకిలీ నంబర్‌ (ఏపీ 39 ఏక్యూ 1686) వేసుకుని ఫార్మసీ చదువుతున్న తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రంగన్నగూడ యువతి సోని (21)ని కిడ్నాప్‌ చేశాడు.

అంతకుముందు ఈ నెల 23న ఉదయం సోని తల్లిదండ్రులు నడుపుతున్న హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లి వారితో మాటలు కలిపాడు. సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రితో కలిసి తన కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం వరకు తిరిగారు. తరువాత ఆమె తండ్రిని కుమార్తెకు సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్‌ చేయించుకు రమ్మని పంపాడు. ఆయన తిరిగి వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. అందులో తన కుమార్తెను తీసుకుని వెళ్లాడని, ఆమె కిడ్నాప్‌నకు గురైందని రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు.

24వ తేదీన కడపలో ప్రవేశించిన కారు ఉదయం ఒంటిమిట్ట హరిత హోటల్‌ వరకు వెళ్లిన వీడియో దృశ్యాలు కనిపించాయి.

కారు వెనుక సీటులో సోని ఉన్నట్లుగా కడపలో ఓ సీసీ కెమెరా ఫుటేజీలో పోలీసులు గుర్తించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక సింబాలిక్ ఫొటో

తెలంగాణ: అన్ని జబ్బులకూ ఆరోగ్యశ్రీ

ఏ జబ్బుతో ఆసుపత్రికెళ్లినా ఆరోగ్యశ్రీ వర్తించేలా తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుందని ఈనాడు రాసింది.

ఆరోగ్యశ్రీ కింద ప్రస్తుతం సుమారు వెయ్యికి పైగా జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. వీటిల్లో సుమారు 200 వరకే దాదాపు 70 శాతం చికిత్సలు పొందుతున్నట్లుగా నమోదవుతున్నాయి.

సుమారు 100 వరకు జబ్బులకు ఒక్కసారి కూడా ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించినట్లుగా గత పదేళ్లలో నమోదవలేదు.

ఇలా ఒక్కసారి కూడా చికిత్సకు నమోదవని జబ్బులను ఆరోగ్యశ్రీ పరిధి నుంచి తొలగించాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు కొందరు ఇటీవల వైద్య మంత్రి ఈటల రాజేందర్‌ వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రతిపాదించారు.

ఇప్పటికే జాబితాలో పొందుపర్చిన జబ్బులను తొలగిస్తే.. భవిష్యత్‌లో వాటి చికిత్సలు అవసరమైన సందర్భాల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఉన్న జాబితాను కొనసాగిస్తూ అదనంగా జబ్బులను చేర్చే విషయాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. కొన్నిరకాల జబ్బులకు ఇప్పటికీ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స లభించడం లేదనే అంశం చర్చకొచ్చింది.

ఉదాహరణకు మూత్రపిండాల వైఫల్యంతో చికిత్సకు వస్తే.. రోగికి అప్పటి పరిస్థితుల దృష్ట్యా రక్తశుద్ధి (డయాలసిస్‌) అవసరం లేకపోవచ్చు. ఇప్పుడున్న ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రక్తశుద్ధి చికిత్స పొందితేనే ఆ రోగికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. మరికొంతకాలం ఆ రోగి రక్తశుద్ధి చికిత్స వరకు తన ఆరోగ్యం దిగజారకుండా కాపాడుకోవడానికి సాధారణ మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ వర్తింపజేయకపోతే ఆ రోగి పరిస్థితి ఏమిటి?

అలాగే ఛాతీలో నొప్పితో ఆసుపత్రికి వస్తే.. యాంజియోగ్రామ్‌ చేయాల్సి వస్తుంది. కానీ యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్‌ అప్పుడే వేయాల్సిన పరిస్థితులు అన్నిసార్లూ ఉండవు. ఇలాంటప్పుడు స్టెంట్‌ వేయలేదు కాబట్టి ఆ రోగికి ఆరోగ్యశ్రీ వర్తించదంటే ఎలా?

ఈ తరహాలో సుమారు వందకుపైగా రకల జబ్బులు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాకుండా ఉండడంతో రోగులు సొంతంగా తమ జేబుల్లోంచి ఖర్చుపెట్టుకోవాల్సిన దుస్థితులున్నాయి.

వైద్యమంత్రి వద్ద భేటీలో ఉన్నతాధికారులు ఈ విషయాలు సవివరంగా చర్చించారు. చివరకు ఆరోగ్యశ్రీ జాబితాలో లేని జబ్బులకూ ఉచితంగా చికిత్స అందించాలని తీర్మానించారు.

అన్నిరకాల జబ్బులనూ ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి, జాబితాలో లేని జబ్బులకు పరిమిత పరిధి మేరకు కనీస ఖరీదును నిర్ణయించాలని ప్రతిపాదించారు.

జాబితాలో లేని జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందించే విధానాన్ని తొలుత ప్రభుత్వ ఆసుపత్రులకే వర్తింపజేయాలని సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారు.

Image copyright TWITTER/ANDHRAPRADESHCM

"గ్రామ సచివాలయాలతో అసలైన పాలన ప్రారంభం"

నవరత్నాల అమలు గ్రామ సచివాలయాలతోనే ప్రారంభమవుతుందని, ఈ వ్యవస్థ సంపూర్ణంగా పనిచేసిన నాటినుంచే అసలైన ప్రభుత్వ పాలన మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేస్తున్నారని ఆంధ్రజ్యోతి రాసింది.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో తనను కలిసే ప్రజా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు వాలంటీర్ల వ్యవస్థ ప్రాధాన్యాన్ని ఆయన వివరిస్తున్నారు.

ఇప్పటివరకూ సేవల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం రివాజుగా వస్తోందని, కానీ గ్రామ సచివాలయాలు ప్రారంభమైన తర్వాత ఇంటివద్దకే పాలన, పౌర సేవలు చేరతాయని చెబుతున్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ లబ్ధిని చేరవేసేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తూ, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా నిలుస్తుందని జగన్ అంటున్నారు.

అనిల్ కుంబ్లే Image copyright Getty Images

బౌండరీల లెక్కింపుపై ఐసీసీ సమీక్ష

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలోని కమిటీ బౌండరీలను లెక్కించే నిబంధనను తదుపరి సమావేశంలో సమీక్షించనుందని ఐసీసీ తెలిపిందని నమస్తే తెలంగాణ రాసింది. ప్రపంచకప్ ఫైనల్‌లో తుది స్కోర్లు సమం కావడం సహా సూపర్ ఓవర్ టై అయిన సందర్భంలో బౌండరీల లెక్క ఆధారంగా ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తమైందని, ఈ నిబంధనను సమీక్షించాలని మాజీ, ప్రస్తుత ఆటగాళ్లు చాలా మంది డిమాండ్ చేశారని చెప్పింది.

వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ఈ సమావేశం జరుగుతుంది. ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా నిబంధనలపై వ్యక్తమైన అభ్యంతరాలను క్రికెట్ కమిటీ తదుపరి సమావేశంలో పరిగణనలోకి తీసుకుంటుంది.

"మ్యాచ్ టై అయిన సందర్భంలో ఫలితం తేల్చడానికి 2009 నుంచి ఐసీసీ టోర్నీల్లో సూపర్ ఓవర్ నిర్వహిస్తున్నాం. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా టై అయితే బౌండరీలు లెక్కించాలన్న నిబంధన ఉంది. ఆ మ్యాచ్‌లో అదే జరిగింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల టీ20 లీగ్‌ల్లో ఇదే నిబంధన ఉంది. ప్రొఫెషనల్ క్రికెట్‌లో ఎక్కువగా అదే నిబంధన ఉన్నందున కొనసాగించాం. దీనికి మరేదైనా ప్రత్యామ్నాయం ఉంటే క్రికెట్ కమిటీ పరిశీస్తుంది" అని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అలార్‌డైస్ తెలిపారు.

టై అయిన సందర్భంలో భవిష్యత్తులో టైటిల్‌ను ఇరు జట్లకు పంచాలన్న విషయంపై ఐసీసీ వార్షిక సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని అలార్‌డైస్ స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)