"జగన్ ప్రభుత్వాన్ని నడపడం ఇంకా నేర్చుకోవాలి" - రోశయ్య: ప్రెస్ రివ్యూ

  • 30 జూలై 2019
Image copyright Getty Images/APCMO

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతుపట్టకుండా ఉందని, ప్రభుత్వాన్ని నడపడం ఆయన ఇంకా నేర్చుకోవాలని మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అభిప్రాయపడ్డారని ఆంధ్రజ్యోతి ఓ వార్తలో రాసింది.

"ముఖ్యమంత్రి జగన్ తెలివైనవారు. కానీ ఆయన ఆలోచన ఏమిటో తెలియడం లేదు. కేంద్రంతో సఖ్యతగా లేరు. రాష్ట్రంలో ఇతర పక్షాలతో కలసి నడవడం లేదు" అని రోశయ్య విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఖర్చులు తగ్గించుకుని, పొదుపు పాటించాలని సూచించారు. సంక్షేమ పథకాల అమలులో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

జగన్ వ్యవహారశైలి గురించి మాట్లాడాలంటే ఇంకాస్త క్లారిటీ రావాలని ఆయన అన్నారు.

Image copyright Getty Images

రసగుల్లా ఒడిశాదే

రసగుల్లాపై భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) ఒడిశాకు దక్కింది. ఈ విషయాన్ని జీఐ రిజిస్ట్రేషన్ సంస్థకు చెందిన చెన్నై కార్యాలయం ప్రకటించిందని ఈనాడు ఓ వార్త రాసింది.

రసగుల్లా తమ రాష్ట్రానికి చెందిన ప్రత్యేకమైన మిఠాయి అని, జీఐ ట్యాగ్ హక్కు తమకే దక్కాలని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వాదించగా, మిఠాయి తయారీ ముందుగా తమ రాష్ట్రంలోనే ప్రారంభమైందని ఒడిశా ప్రభుత్వం వాదించింది.

వందల సంవత్సరాల నుంచి పూరీ జగన్నాథునికి రసగుల్లా మిఠాయిని నైవేధ్యంగా సమర్పిస్తున్నామని, ఇది తమదేనని ఒడిశా పేర్కొంటోంది.

దీంతో కొన్నేళ్లుగా రసగుల్లాపై హక్కుల కోసం రెండు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది.

2018లో దీనిపై హక్కులను ఇవ్వాలంటూ జీఐ రిజిస్ట్రేషన్ సంస్థను ఒడిశా కోరింది. దర్యాప్తు జరిపిన సంస్థ ఒడిశాకు జీఐ ట్యాగ్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది.

Image copyright Getty Images

ప్రాణం మీదకు తెచ్చిన టిక్‌టాక్

వినూత్న రీతిలో టిక్‌టాక్ చేద్దామనుకుని అడవిలోకి వెళ్లిన ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని సాక్షి ఓ వార్త ప్రచురించింది.

చిత్తూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో టిక్‌టాక్ చేయడానికి ఉదయం శేషాచలం అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఉత్సాహంగా తనకు కావలసిన వీడియోలను షూట్ చేసుకున్నాడు.

కానీ, తిరిగి వస్తూ దారి తప్పాడు. 5 గంటలపాటు అడవిలో అటూఇటూ తిరిగాడు. తెచ్చుకున్న నీళ్లు, స్నాక్స్ అయిపోయి, నీరసించిపోయాడు.

రాత్రి 9 గంటలకు స్నేహితులకు వాట్సాప్‌లో తన లొకేషన్ షేర్ చేయగా, వారు పోలీసులకు సమాచారమిచ్చారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించిన పోలీసులు స్పృహ తప్పి పడి ఉన్న మురళీకృష్ణ ఆచూకీ కనుక్కొని అతడిని భుజాలపై 5 కిలోమీటర్లు మోసుకొచ్చి, 108 వాహనంలో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

విమాన సేవలు Image copyright Getty Images

వరంగల్‌కు త్వరలో విమాన సేవలు!

వరంగల్ నగర శివారులోని మామునూర్ విమానాశ్రయ ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయని నమస్తే తెలంగాణ పేర్కొంది.

పౌర విమానయాన శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తున్న విజ్ఞప్తులకు స్పందన వస్తున్నట్లుగా ఉంది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధులు సోమవారం మామునూరు విమానాశ్రయ స్థలాన్ని పరిశీలించారు.

నిజాం హయాంలో ఇక్కడ విమానాల రాకపోకలు జరిగేవి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ శంకుస్థాపన సమయంలో సీఎం కేసీఆర్ దీని ఏర్పాటుపై హామీనిచ్చారు.

ప్రస్తుతం 706 ఎకరాల భూమి ఉండగా మరో 475 ఎకరాలు అవసరమని, భూసేకరణ చేయాలని అథారిటీ... రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

బుధవారం ఈ బృందం కేసీఆర్‌ను కలిసి సాధ్యాసాధ్యాలపై చర్చించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కశ్మీర్ నుంచి లద్దాఖ్ ప్రజలు ఎందుకు విడిపోవాలనుకున్నారు? - లేహ్ నుంచి గ్రౌండ్ రిపోర్ట్

కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా

ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?

కేరళ వరదలు: 'మా వాళ్ళు ఏడుగురు చనిపోయారు.. నేను ఎక్కడికి పోవాలి...'

నడి సంద్రంలో తిండీ నీరూ లేక 14 మంది చనిపోయారు... ఒకే ఒక్కడు బతికాడు

అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది

"డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్‌లో విమర్శలు

శాండ్‌విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు