తెలంగాణలో నేడే గణేశ్ నిమజ్జనం... ప్రశాంతంగా జరిగేలా పక్కా ఏర్పాట్లు : ప్రెస్ రివ్యూ

  • 12 సెప్టెంబర్ 2019
ఖైరతాబాద్ వినాయకుడు Image copyright Namaste Telangana
చిత్రం శీర్షిక ఖైరతాబాద్ వినాయకుడు

తెలంగాణలో గురువారం గణేశ నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి తెలిపారంటూ 'నమస్తే తెలంగాణ' పత్రిక వార్తాకథనం ప్రచురించింది.

''డీజీపీ బుధవారం తన కార్యాలయంలో శాంతిభద్రతల అదనపు డీజీ జితేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష విగ్రహాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మూడు, ఐదు, తొమ్మిది రోజు వరకు మొత్తం 50 వేల విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, గురువారం అన్ని జిల్లాల్లో మొత్తం 50 వేల వరకు విగ్రహాలను నిమజ్జనం అవుతాయని చెప్పారు. ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా సన్నాహాలు చేశామన్నారు.

రాజధాని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 50 ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లుచేశామని పేర్కొన్నారు. ప్రతి నిమజ్జనం పాయింట్ వద్ద ఊరేగింపుదారుల్లో నిఘా కెమేరాలు పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 20 వేల మంది, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,600, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 5,500 మంది పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. డీజీపీ కార్యాలయంతోపాటు అన్ని పోలీస్ స్టేషన్లలో, కమిషనరేట్లలో కమాండ్ కంట్రోల్ సెంటర్లను ఏర్పాటుచేశామని వివరించారు.

అంతరాయం కలుగకుండా వివిధ మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని.. రూట్‌మ్యాప్‌లు రూపొం దించి ప్రచారం చేశామని చెప్పారు. సామాన్యులు, దవాఖానలకు ఇతర ఎమర్జెన్సీ పనులపై వెళ్లేవారికి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఎవరైనా సోషల్‌మీడియాలో వందతులు వ్యాప్తిచేసినా, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పోస్టులు పెట్టినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి గురువారం ఉదయం 5 గంటల నుంచే ఏర్పాట్లు ప్రారంభిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. ద్వాదశాదిత్యుడి ఊరేగింపు 7 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిమజ్జనం పూర్తిచేసేలా చర్యలు తీసుకొంటున్నామన్నారు'' అని ఆ కథనంలో తెలిపారు.

Image copyright facebook

‘బీజేపీలోకి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి’

టీడీపీ మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరికకు రంగం సిద్ధమైందంటూ 'ఆంధ్రజ్యోతి' ఒక కథనం ప్రచురించింది.

'ఆదినారాయణరెడ్డి బుధవారం రాత్రి హుటాహుటిన దిల్లీ వెళ్లారు. గురువారం అమిత్ షా సమక్షంలో ఆదినారాయణ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. 2014లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆది నారాయణ రెడ్డి తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సీటు రామసుబ్బారెడ్డికి అధిష్టానం కేటాయించడంతో ఆది కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Buggana Rajendranath Reddy
చిత్రం శీర్షిక సింగపూర్‌లో బుగ్గన

అమరావతి నిర్మాణానికి నిధుల్లేవు: ఆర్థిక మంత్రి బుగ్గన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధులు లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారంటూ 'ఈనాడు' ఒక కథనం ప్రచురించింది.

'అభివృద్ధిని ఒక నగరానికే పరిమితం చేయడం కాక అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడం, అందరికీ సుస్థిర జీవనం, అన్నిచోట్లా ఉత్సాదకరంగ అభివృద్ధికి అవసరమైన మౌలిక సౌకర్యాల కల్సనే ప్రభుత్వ ప్రాధమ్యాలని తేల్చి చెప్పారు.

భారత్‌- సింగపూర్‌ వ్యాపార, ఆవిష్కరణల సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌ తరపున హాజరైన ఆయన అక్కడి ఆంగ్ల పత్రిక 'ద స్ట్రెయిట్స్ టైమ్స్‌'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అమరావతిలో ఆర్థిక నగరం అభివృద్ధికే సింగపూర్‌ సంస్థలు పరిమితమని తెలిపారు. వ్యవసాయాధారిత రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు ద్వారా ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారించామని చెప్పారు' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright facebook/TSRTC

ఆర్టీసీలో సమ్మె సైరన్

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగిందని 'సాక్షి' కథనం తెలిపింది.

''ఇప్పటికే ఎంప్లాయీస్‌ యూనియన్, టీజేఎంయూ సమ్మె నోటీసు ఇవ్వగా, గుర్తింపు కార్మిక సంఘమైన టీఎంయూ, మరో ప్రధాన సంఘం ఎన్‌ఎంయూలు బుధవారం నోటీసులిచ్చాయి. టీఎంయూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు బస్‌భవన్‌లో ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఎన్‌ఎంయూ నేతలు కూడా మంత్రి సమక్షంలోనే ఇన్‌చార్జి ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చారు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బస్‌భవన్‌లో అత్యవరసర భేటీ అయ్యారు. అయితే, రవాణా శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించడంతో ఆర్టీసీ, రవాణ శాఖలపై అవగాహన, అధికారులతో పరిచయం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని చెబుతున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితి, అప్పులు, వాటిపై చెల్లిస్తున్న వడ్డీ, వేతనాలకు డబ్బుల్లేని పరిస్థితి ఉందని అధికారులు వివరించారు. ఆర్టీసీలో సమ్మె మొదలైతే తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు.

వీటిపై తాను ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఆర్టీసీకి ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ నుంచి రావాల్సిన పెండింగ్‌ బకాయిలు విడుదలయ్యేలా చూస్తానని పేర్కొన్నారు. కార్మిక సంఘాల డిమాండ్లపై తాను సీఎంతో మాట్లాడతానని, ఎవరూ తొందరపడొద్దని కార్మిక సంఘాల నేతలకు మంత్రి హామీ ఇచ్చార'ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు

LIVE: బోటు ప్రమాదంలో 12 మంది మృతి, 26 మంది సురక్షితం.. మిగతా వారి కోసం గోదావరిలో కొనసాగుతున్న గాలింపు చర్యలు

ప్రెస్ రివ్యూ: గోదావరి పడవ ప్రమాదంపై యజమాని సమాధానమిదే

కమలీ: ఆస్కార్ 2020 బరిలో నిలిచిన ఈ అమ్మాయి జీవిత కథేంటంటే..

11 త‌రాలుగా ఈ ఆలయంలో అర్చకులంతా దళితులే.. వివక్షను పారదోలిన చెన్నకేశవ ఆలయం ప్రత్యేకతలివీ

గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'

9/11 పుట్టిన తేదీ, 9.11 గంటలు పుట్టిన సమయం, పాప బరువు 9.11 పౌండ్లు.. ఏమిటీ చిత్రం

పచ్చరాళ్ళ వేట కోసం డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు... ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు

యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎలాంటి అనుమతీ ఇవ్వలేదు.. ఇవ్వదు - కేటీఆర్