కేటీఆర్ ట్వీట్‌కు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ - ప్రెస్ రివ్యూ

  • 14 సెప్టెంబర్ 2019
రేవంత్, కేటీఆర్ Image copyright facebook/RevantReddy/KTR

నల్లమల యురేనియం తవ్వకాల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

''కేటీఆర్ గారూ.. సురభి నాటకాలు కట్టిపెట్టి యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయండి'' అని పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్ ట్వీట్ చేశారు.

యురేనియం తవ్వకాల అంశంలో ప్రజల ఆవేదనను పరిగణనలోకి తీసుకుంటామని, వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే రేవంత్ కూడా ట్విటర్ ద్వారా స్పందిస్తూ అనుమతులు రద్దు చేయాలని కోరారు.

Image copyright APCMO

ఏపీలో బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తున్నాయి.. నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెవెన్యూ లోటు ఆందోళనకరంగా ఉందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారంటూ 'ఈనాడు' పత్రిక కథనం వెలువరించింది.

''నీతి ఆయోగ్ బృందంతో సచివాలయంలో ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి, అధికారులు సమావేశమయ్యారు. రంగాలవారీగా రాష్ట్ర పరిస్థితులపై అధికారులు వివరించారు. రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడ్జెటేతర ఖర్చులు పెరిగినట్లు కనిపిస్తున్నాయన్నారు. పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టిపెట్టాలని సూచించారు.

బడ్జెట్లో సగానికిపైగా మానవ వనరుల వృద్ధి కోసమే ఖర్చు చేస్తున్నారని.. ముఖ్యమంత్రి ఆలోచనలు, ప్రణాళికలు చాలా బాగున్నాయని అన్నారు. మూణ్నాలుగు నెలల్లోనే పనితీరు చూపించారని ప్రశంసించారు. సీఎం అంకిత భావం, విజన్ తనను ఆకట్టుకున్నాయన్నారు.

Image copyright Getty Images

అదరహో.. అరకు కాఫీ

అరకు వ్యాలీ సేంద్రియ కాఫీ ఘుమఘుమలు ఇక ఉత్తర, ఈశాన్య భారతానికి వ్యాపించనున్నాయి. ఆ దిశగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) పక్కా ప్రణాళికతో సిద్ధమైందని 'సాక్షి' పత్రిక కథనం తెలిపింది.

''రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అమ్మకాల విస్తరణపైనే జీసీసీ ఎక్కువ దృష్టి సారించింది. కార్పొరేట్‌ తరహాలో బహుముఖ వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేసింది. అవన్నీ ఓ కొలిక్కిరావడంతో ఇప్పుడు కాఫీ సాగులేని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల మార్కెట్‌పై కన్నేసింది. ఈ ప్రాంతాలకు ప్రస్తుతం కర్ణాటక నుంచే కాఫీ ఎగుమతి అవుతోంది. అక్కడి కాఫీ సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు విరివిగా వాడుతున్నారు. అందుకు భిన్నంగా అరకువ్యాలీ కాఫీ పూర్తిగా సేంద్రీయ విధానంలోనే సాగు అవుతోంది. దీనికి బాగా ఆదరణ లభిస్తోంది. దాంతో అక్కడి వారికి సేంద్రీయ కాఫీ రుచి చూపించడానికి జీసీసీ సన్నద్ధమవుతోంది.

ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్‌ రాష్ట్రాలతో సహకార వ్యాపారానికి జీసీసీ తెరతీసింది. ఝార్ఖండ్‌లో కాఫీ సాగు లేదు. కానీ తేనె విరివిగా దొరుకుతోంది. ఆ రాష్ట్రంలో జీసీసీ కాఫీ వ్యాపారం చేస్తూ మరోవైపు తేనెను కొనుగోలు చేస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లో 40 శాతం అటవీ ప్రాంతమే. అక్కడ జీడిమామిడి సేంద్రీయ విధానంలో సాగవుతోంది. అక్కడ జీడిపప్పును జీసీసీ మార్కెటింగ్‌ చేయనుంది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Eatala Rajender

డెంగీని నిర్ధారించే అధికారం ప్రైవేట్ వైద్యులకు లేదు: మంత్రి ఈటల

అనవసర భయాలు కల్పిస్తూ, అవసరం లేని పరీక్షలు నిర్వహిస్తూ వైద్యం చేస్తున్న కొందరు ప్రైవేట్ వైద్యులను నియంత్రించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారని.. అలాంటి వారిపై దృష్టిపెట్టాలని ఆదేశించారని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం తెలిపింది.

''వైద్యారోగ్య శాఖ కమిషనర్ డాక్టర్ అశోక్‌తో కలిసి శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మున్సిపల్, పంచాయతీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం పెద్దపల్లి కలెక్టరేట్‌లో చిన్నారులకు రోటా వైరస్ వ్యాక్సిన్ వేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో ఎన్టీపీసీ సీఎస్‌ఆర్ నిధులు రూ.7.8 కోట్లతో చేపట్టనున్న 50 పడకల అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఆయాచోట్ల మంత్రి ఈటల మాట్లాడుతూ.. డెంగీని నిర్ధారించే అధికారం ప్రైవేట్ వైద్యులకు లేదన్నారు. ప్రభుత్వ వైద్యులు మాత్రమే ఈ వ్యాధిని నిర్ధారించాలని, అదీ కూడా అనుమానం ఉన్నట్టుగానే స్పష్టం చేయాలన్నారు. కొందరు ప్రైవేట్ వైద్యులు అనవసరమైన వైద్య పరీక్షలు చేయిస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని, అలాంటిది ఉంటే వైద్యారోగ్య శాఖ అధికారులు నియంత్రించాలని సూచించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Getty Images

గుంటూరులో 'న్యూదిల్లీ బ్యాక్టీరియా'.. 55ఏళ్ల మహిళలో గుర్తింపు.. ఏపీలో ఇదే తొలి కేసు

అత్యంత ప్రమాదకరమైన న్యూదిల్లీ మెటల్లో బీటా ల్యాక్టమేజ్‌(ఎన్‌డీఎం-1) బ్యాక్టీరియా తొలిసారిగా ఏపీలో కలకలం రేపిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''గుంటూరుకు చెందిన 55 ఏళ్ల మహిళకు ఈ బ్యాక్టీరియా సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఆమె ఈ నెల 3న జ్వరం, నీరసం, కామెర్లు, మూత్ర సమస్యలతో అరండల్‌పేటలోని శ్రీ హాస్పిటల్‌లో చేరారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు న్యూరోపెనిమ్‌ రెసిస్టెన్స్‌ ఎంజైమ్‌ కలిగిన ఎన్‌డీఎం-1 ఇన్‌ఫెక్షన్‌ అని తేల్చారు. ఉమ్మడి ఏపీలో 2011లో తెలంగాణ ప్రాంతంలో తొలి కేసు నమోదైందని.. ఆ తర్వాత మళ్లీ ఇది వెలుగు చూడటం ఇదే తొలిసారని అంటువ్యాధుల వైద్యనిపుణుడు డాక్టర్‌ కోగంటి కల్యాణ్‌ చక్రవర్తి తెలిపారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

''తెలంగాణలో లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి'': ఆదివాసీల హక్కుల పోరాట సమితి

అత్యాచారం చేస్తే 21 రోజుల్లోనే శిక్ష పడేలా చట్టం చేస్తాం: వైఎస్ జగన్

‘వారం రోజుల్లో నిందితులకు శిక్ష పడాలి.. లేదంటే సీఎం ఇంటి ముందు కాల్చుకుంటా’

ఒలింపిక్స్‌తో సహా ప్రధాన క్రీడల ఈవెంట్లలో పాల్గొనకుండా నాలుగేళ్ల పాటు రష్యాపై నిషేధం

కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు: కొనసాగనున్న యడ్యూరప్ప ప్రభుత్వం.. బీజేపీకి 12 స్థానాల్లో గెలుపు

లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు.. కాంగ్రెస్ మతం పేరుతో దేశాన్ని విభజించిందన్న అమిత్ షా

చిన్న వయసులో ఫిన్‌లాండ్ ప్రధాని పదవి చేపట్టనున్న సనా మారిన్

న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి