గోదావరి బోటు ప్రమాదంపై యజమాని సమాధానమిదే - ప్రెస్ రివ్యూ

  • 16 సెప్టెంబర్ 2019
Image copyright GOOGLE/BBC

ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి నదిలో మునిగిపోయిన లాంచీ యజమాని కోడిగుడ్ల వెంకటరమణ స్పందిస్తూ- డ్రైవర్లు లాంచీని అదుపు చేయలేకపోయారని చెప్పారని ఈనాడు తెలిపింది.

ఆదివారం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు, కచ్చులూరు మధ్య 'రాయల వశిష్ట' అనే ఈ లాంచీ మునక మృతుల్లో, గల్లంతైనవారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వారు ఉన్నారు.

కచ్చులూరు వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుందని, ఫలితంగా డ్రైవర్లు బోటును అదుపు చేయలేకపోయారని వెంకటరమణ చెప్పారు. ఆ ప్రాంతంలో పెద్ద సుడిగుండం ఉంటుందని తెలిపారు.

ఈ లాంచీలో 90 మంది పర్యాటకులు ప్రయాణించవచ్చని, అందులో 150 మందికి పైగా సరిపడా లైఫ్ జాకెట్లు ఉన్నాయని ఆయన చెప్పారు. లాంచీ మునిగిన చోట మొబైల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవని తెలిపారు.

Image copyright FB/TELANGANA CMO

మరో రెండు పర్యాయాలు నేనే సీఎం: కేసీఆర్

తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని, మరో రెండు పర్యాయాలు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్ అధ్య క్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదివారం శాసనసభలో చెప్పారని సాక్షి తెలిపింది.

"నాకు చాలామంది మిత్రులున్నరు. కేసీఆర్‌ ఆరోగ్యం ఖతమైందట గదా.. అమెరికాకు పోతడట గదా.. అని ఇరవై ఏళ్ల నుంచి చెప్తున్నరు. నేను సచ్చిపోబట్టి 20 ఏళ్లు అయె. నేనేం సావలె. ఇప్పుడు కూడా నాకేమైంది.. దుక్కలా ఉన్న. కేసీఆర్‌ దిగిపోయి కేటీఆర్‌ను దించుడు పక్కానేనా అని ఇప్పుడు కూడా అడుగుతున్నరు. నేనెందుకు చేస్తా. నాకర్థం కాదు. నాకు పాణంవాటం లేదా? ఏమైందని?

మంచి పనులు చేస్తున్నం. వంద శాతం ప్రజల కోసం తిప్పలు పడుతున్నం. ఇంకా పడ్తం. కచ్చితంగా 100కు 100 శాతం టీఆర్‌ఎస్‌ ఈ రాష్ట్రంలో ఈ టర్మ్‌ ఆవల కూడా రెండు టర్ములుంటది.

ఇప్పుడు నాకు 66 ఏండ్లు. ఇంకా పదేళ్లు అయినా చేయనా? ఈ టర్మ్‌ నేనే ఉంటా. వచ్చే టర్మ్‌ కూడా నేనే ఉంటా. యాడికి పోను. నేను చెప్పినవన్నీ జరిగినవి. ఇది కూడా జరుగతది'' అని కేసీఆర్ చెప్పారు.

'నల్లమలలో యురేనియం తవ్వకాలకు అనుమతివ్వం'

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతిచ్చేది లేదని సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీలో సాధారణ చర్చ సందర్భంగా ప్రకటించారని నమస్తే తెలంగాణ రాసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎవరికీ ఏవిధమైన అనుమతిని ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా యురేనియం తవ్వకాలకు అనుమతులిచ్చే ఆలోచన తమకు లేదని ఆయన చెప్పారు.

Image copyright FB/@tvshilpa

బిగ్‌బాస్: ఎలిమినేట్ అయిన శిల్పా చక్రవర్తి

రియాలిటీ షో బిగ్‌బాస్ 3లో ఈ వారం ఎలిమినేష‌న్‌లో యాంక‌ర్ శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అయ్యారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఇటీవ‌ల వైల్డ్ కార్డ్ ద్వారా శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎంట్రీ ఇచ్చారు.

తొలి వారం ఆమెకు ఎలిమినేష‌న్ నుంచి మిన‌హాయింపు ద‌క్కింది. ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారం పున‌ర్న‌వి, మ‌హేశ్ విట్టా, హిమ‌జ‌, శ్రీముఖి, శిల్పా చ‌క్ర‌వ‌ర్తి నామినేట్ అయ్యారు. అందులో త‌క్కువ ఓట్ల‌ను ద‌క్కించుకున్న శిల్పా చ‌క్ర‌వ‌ర్తి ఎలిమినేట్ అయిన‌ట్లు హోస్ట్ నాగార్జున వెల్ల‌డించారు.

మేడ్చల్‌లో పాముల సంరక్షణ కేంద్రం

పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషించే పాములను సంరక్షించేందుకు తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా పరిధిలోని బౌరంపేట్ రిజర్వు ఫారెస్ట్‌లో రూ.1.30 కోట్లతో సర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఈ కేంద్రం నిర్మాణం పనులు స్లాబ్ దశలో ఉన్నాయని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని జిల్లా అటవీ అధికారి సుధాకర్‌రెడ్డి చెప్పారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రంలో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకొన్న పాములను సంరక్షిస్తామని, అలాగే వివిధ రకాల పాములను చూసేందుకు వీలుగా ఏర్పాట్లుచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఏటా ఐదు వేల నుంచి ఎనిమిది వేల పాములను చంపేస్తుండగా.. పాముకాటు కారణంగా దేశంలో ఏటా 50 వేల మంది చనిపోతున్నారని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.

పాముల సంఖ్య తగ్గి ఎలుకలు, కప్పల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటోందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)