‘మహారాష్ట్రలో టీఆర్ఎస్ పోటీ.. 8 చోట్ల ఎన్నికల బరిలో’ - ప్రెస్‌రివ్యూ

  • 18 సెప్టెంబర్ 2019
నాందేడ్ ప్రాంత నాయకులతో కేసీఆర్ Image copyright facebook/KCR

త్వరలో మహారాష్ట్రలో జరిగే శాసనసభ ఎన్నికల్లో పోటీచేసేందుకు టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకుంటోందని 'ఈనాడు' పత్రిక ఒక వార్తాకథనం ప్రచురించింది.

'నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, ఇతర ప్రాంతాల్లోని మరో 3 నియోజకవర్గాలు కలిపి మొత్తం 8 చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో దిగే అవకాశముంది.

నాందేడ్ జిల్లా నేతలు మంగళవారం హైదరాబాద్‌లోని శాసనసభ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి, తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లో అమలు చేయాలని, అలా చేయని పక్షంలో ఈ రాష్ట్రంలోనే కలపాలనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు.

తమకు టికెట్లు ఇవ్వాలని వారు కోరగా కేసీఆర్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. నాందేడ్ జిల్లాకు చెందిన నయ్‌గావ్, భోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్‌గావ్ నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులు బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో మంగళవారం అసెంబ్లీలో కేసీఆర్‌ను కలిశార''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright facebook/UGC

'పీవీ సింధుతో నాకు పెళ్లి చేయండి'.. ప్రజాదర్బార్‌లో కలెక్టరుకు అర్జీ ఇచ్చిన వృద్ధుడు

వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజేత, తెలుగు తేజం పీవీ సింధుతో తనకు వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వృద్ధుడొకరు ఏకంగా జిల్లా కలెక్టర్‌కే వినతి పత్రం ఇచ్చాడని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక కథనం తెలిపింది.

‘‘పీవీ సింధుతో పెళ్లి చేయాలని ఓ వృద్ధుడు కలెక్టర్‌ను కోరాడు. అంతటితో ఆగకుండా.. సింధుతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు కూడా సిద్ధమని వ్యాఖ్యలు చేశాడు.

ఈ ఘటన తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో జరిగింది. మలైస్వామి అనే వృద్ధుడు.. తనకు పీవీ సింధుతో పెళ్లి చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చాడు. సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించి అయినా పెళ్లి చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక సమావేశంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

సింధు ఆటతీరు తనను ఎంతో ఆకట్టుకున్నదని, ఆమెను తన జీవిత భాగస్వామిని చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ పేర్కొన్న మలైస్వామి ... తమ ఇద్దరి ఫొటోలను జతచేసి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు.

ఆ అర్జీలో తన వయసు కేవలం 16 ఏళ్లని తెలిపాడు’’ అని ఆ కథనంలో రాశారు.

Image copyright facebook/Swami Paripoornananda

కేసీఆర్‌..హిందువా.. రజాకారా?: పరిపూర్ణానంద స్వామి

‘హిందుగాళ్లు... బొందుగాళ్లు’ అన్న కేసీఆర్‌..హిందువా లేక రజాకారా? అని పరిపూర్ణానంద స్వామి ప్రశ్నించారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక కథనం తెలిపింది.

‘బైరాన్‌పల్లిలో అమరవీరుల స్థూపం వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ ''సాధారణ ప్రజలు తూటాలకు మరణిస్తే నయా నిజాం కోటలో బతుకుతున్నారు. తెలంగాణ అంతా తిరుగుతా..అమరవీరుల ఇంటికి వెళ్తా. నాకు ప్రధాని పదవి వడ్లగింజతో సమానం.'' అని అన్నారు’’ అంటూ ఆ కథనంలో పేర్కొన్నారు.

రాయలసీమలో భారీ వర్షాలు.. నీట మునిగిన మహానంది ఆలయం

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని.. ఆయా జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని ‘సాక్షి’ పత్రిక కథనం తెలిపింది.

‘‘ఒంగోలు, గుంటూరు, ఏలూరు నగరాల్లో లోతట్టు, శివారు ప్రాంతాలు నీటమునిగాయి. కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందితోపాటు నంద్యాల పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంది. పశ్చిమ గోదావరిలో పిడుగుపడి మహిళ మృతి చెందగా.. ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కామనూరు వంకలో ఆటో కొట్టుకుపోవడంతో అందులో ఉన్న దంపతులతోపాటు రెండేళ్ల చిన్నారి గల్లంతైంది.

కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది దేవాలయం వరద నీటితో నిండిపోయింది. మహానంది కోనేరులు సైతం నీటమునిగాయి. మహానందిలోని రుద్రగుండం కోనేరులో అతిపురాతనమైన పంచలింగాల మండపంలోని ఐదు శివలింగాలు నీట మునిగిపోయాయి. గర్భాలయంలో వెలిసిన మహానందీశ్వరుడి ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో నీళ్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి. రెండు కోనేరులు నిండిపోవడం, నీరంతా రాజగోపురం మార్గం ద్వారా బయటికి రావడంతో ఆలయ ప్రాంగణం జలదిగ్బంధంలో చిక్కుకుంది.

కర్నూలు జిల్లా కానాల గ్రామానికి చెందిన ఓబులేసు, రవి, నాగిరెడ్డి పాలేరు వాగు దాటేందుకు వెళ్లి వరద ఉధృతికి కొట్టుకుపోయారు. అయితే వారు సురక్షితంగా బయటపడ్డారు.

సత్తెనపల్లి-హైదరాబాద్‌ మార్గంలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెం వద్ద ప్రధాన రహదారిపై వాగు పొంగిపొర్లడంతో వందల్లో వాహనాలు ఆగిపోయాయి.

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం పొదలకుంటపల్లిలో పిడుగుపడటంతో ముగ్గురు కూలీలు తీవ్ర గాయాలపాలయ్యారు. దిగువ మెట్ట వద్ద కాచిగూడ రైలు నిలిచిపోయింది. గాజులపల్లె సమీపంలో రైల్వే ట్రాక్‌పై నీరు చేరడంతో పలు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరులో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కుక్కునూరు మండలం కొండపల్లిలో పొలం పనిలో ఉన్న సుజాత అనే మహిళ పిడుగు పడి మృతి చెందింది.

నెల్లూరు జిల్లా, విజయనగరం జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది. కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం కలగర పంచాయతీ పరిధిలో పిడుగు పడటంతో 20 గొర్రెలు మృతి చెందాయి.

కోడూరు మండలం పాలకాయతిప్పలో మత్స్యకారులు వేటకు వెళ్లగా వరద ఉధృతికి బోటు తిరగపడింది. దీంతో ఐదుగురు మత్స్యకారులు బోటుపైకి ఎక్కి సమాచారం ఇవ్వటంతో పాలకాయతిప్ప మత్స్యకారులు, మెరైన్‌ పోలీసులు వారిని ఒడ్డుకు తీసుకువచ్చారు.

వైఎస్సార్‌ జిల్లాతోపాటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలతో పెన్నా, కుందూ నదులు పొంగి ప్రవహించాయి. జమ్మలమడుగు, కడప ప్రాంతాలకు పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాగులు, వంకలు ఉప్పొంగాయి. పలు చెరువులు తెగిపోయాయి. రోడ్లు కోతకు గురయ్యాయి.

భారీ వర్షాలకు ప్రొద్దుటూరు డివిజన్‌లో 150 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. 60 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా సుమారు రూ.8 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు.

భారీ వర్షాలతో కడప జిల్లావ్యాప్తంగా 660 హెక్టార్లలో పత్తి, 906 హెక్టార్లలో వరి, 120 హెక్టార్లలో జొన్న, 25 హెక్టార్లలో మొక్కజొన్నతోపాటు అరటి, పూలు, కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి.

అనంతపురం జిల్లాలో విస్తారంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. 63 మండలాల పరిధిలో ఒక్క రోజులోనే 25 మి.మీ సగటు వర్షపాతం నమోదు కావడం గమనార్హం.

కర్నూలు జిల్లా నంద్యాల రెవెన్యూ డివిజన్‌ పరిధిలో భారీ వర్షాలతో పరిస్థితి అతలాకుతలంగా మారింది. నంద్యాల పట్టణంతోపాటు గ్రామాలను, పంట పొలాలను, రహదారులను వరద నీరు ముంచెత్తుతోంది.

నంద్యాలలో శ్యామకాలువ ఉప్పొంగడంతో 30 గృహాలు నీట మునిగాయి. అందులో 40 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. సంజామల మండలం ముదిగేడు, కమలపురి గ్రామాల మధ్య వాగులో 40 మందితో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో సమీప గ్రామాల ప్రజలు బస్సు వెనుకవైపు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు.

చాగలమర్రి మండలం నేలపాడులో గొర్రెల కాపరులను తీసుకొచ్చేందుకు వెళ్లిన కొండయ్య, దావీదు, మహేష్, వినోద్‌ అనే వ్యక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు కాపాడార’’ని ఆ కథనంలో వివరాలు అందించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ముఖ్యమైన కథనాలు