కేసీఆర్‌నే జైలుకు పంపుతామంటున్నారు.. ఆయన తప్పు చేస్తే వాళ్లు వదిలిపెట్టేవాళ్లా: కేటీఆర్ - ప్రెస్ రివ్యూ

  • 21 సెప్టెంబర్ 2019
Image copyright FB/@KTRTRS

శాసనసభ ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు తగ్గాయని, హడ్డీమార్‌ గుడ్డి దెబ్బగా దారి తప్పి బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వ్యాఖ్యానించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

''నాలుగు సీట్లు గెలవగానే ఎగిరెగిరి పడుతున్నారు. దుంకుతున్నారు. ఎంపీ సీట్లు నాలుగు గెలిచారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్ని గెలిచారు? ఏడు సీట్లకు మించి గెలవలేకపోయారు. దారి తప్పి గెలవగానే ఆగడం లేదు. చారణా కోడికి బారణా మసాల అన్నట్టు ఉంది వాళ్ల పరిస్థితి. నువ్వెంత? ఆయనెంత? అంటూ లొల్లి ఎక్కువుంది. రేపు కార్పొరేషన్‌ ఎన్నికలు వస్తే తెలుస్తుంది'' అంటూ ఆయన ఎద్దేవా చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావునే జైలుకు పంపుతామంటూ కొంత మంది మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ప్రస్తావించారు. ''ఇలాంటి వాళ్లను 18 ఏళ్లలో చాలా మందిని చూశాం. రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చూశాం. నిజంగా తప్పు చేస్తే వాళ్లు వదిలి పెట్టేవాళ్లా? ఎప్పుడో జైలుకు పంపేవాళ్లు. కానీ, నిన్న, ఇవాళ వచ్చినవాళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు'' అని ఆయన విమర్శించారు.

కరీంనగర్‌ జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు కర్ర రాజశేఖర్‌, ఆయన అనుచరులు శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నివాసాన్ని వారంలోగా తొలగించాలి, లేదంటే మేమే తొలగిస్తాం: సీఆర్‌డీఏ

గుంటూరు జిల్లా ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నివసిస్తున్న భవనంలోని అక్రమ కట్టడాలను వారం రోజుల్లోగా తొలగించాలని, లేకపోతే తామే వాటిని తొలగిస్తామని ఆ భవన యజమని లింగమనేని రమేశ్‌కు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) నోటీసు జారీచేసిందని ఈనాడు రాసింది.

భవనం గోడలకు గురువారం రాత్రి సీఆర్‌డీఏ ఈ నోటీసును అతికించింది.

"కృష్ణా నది గరిష్ఠ వరదనీటి మట్టం(ఎంఎఫ్‌ఎల్) లోపల మీ భవనాన్ని 1.318 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, గ్రౌండ్ ఫ్లోర్‌లో డ్రెస్సింగ్ రూమ్ తదితర నిర్మాణాలన్నింటినీ నియమ, నిబంధనలను అతిక్రమించి చేపట్టారు. వీటికి అనుమతులు లేవు. ఈ అక్రమ నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో చెప్పాలని గతంలోనే మేం షోకాజ్ నోటీసు జారీచేశాం. తగిన అనుమతులు ఉన్నాయని, వాటి పత్రాలు సమర్పిస్తామని చెప్పి, నిర్దేశిత గడువులోగా అందజేయలేదు. సీఆర్‌డీఏ కమిషనర్‌కు మీ నుంచి అందిన వివరణ సంతృప్తికరంగా లేదు. అందుకే ఈ అక్రమ నిర్మాణాలను వారం రోజుల్లోగా తొలగించాలి. లేకపోతే మేమే వాటిని తొలగిస్తాం. లేకపోతే మేమే వాటిని తొలగిస్తాం" అని ఆ నోటీసుల్లో సీఆర్‌డీ‌ఏ చెప్పింది.

తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ బదిలీ

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఎ. అశోక్‌ను ప్రభుత్వం బదిలీ చేసిందని, ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన తప్పిదాలు, గందరగోళం బదిలీకి ప్రధాన కారణంగా తెలుస్తోందని ఆంధ్రజ్యోతి చెప్పింది.

నూతన కార్యదర్శిగా ఉమర్‌ జలీల్‌ను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అశోక్‌కు పోస్టింగ్‌ ఇవ్వలేదు.

2018-19 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ఫలితాల్లో గందరగోళం, తప్పిదాల ప్రభావం లక్షల మంది విద్యార్థులపై పడింది. మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పలు రాజకీయ పార్టీలు తీవ్రంగా స్పందించాయి.

ఫలితాల నిర్వహణ బాధ్యతను సాఫ్ట్‌వేర్‌ సంస్థ గ్లోబరీనాకు అప్పగింత విషయంలో అశోక్‌పై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అర్హత, అనుభవంలేని ఈ సంస్థ మూల్యాంకనంలో, ఫలితాల వెల్లడిలో ఘోరంగా విఫలమయ్యిందనే ఆరోపణలు వచ్చాయి.

ఇంటర్‌ ఫలితాల వెల్లడిలో గందరగోళంతో రాష్ట్రవ్యాప్తంగా అట్టుడికిపోవడంతో ప్రభుత్వం స్పందించింది. దీనిపై విచారణ జరిపేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది. టెండర్ల నుంచి ఫలితాలు వెల్లడి దాకా జరిగిన అన్ని ఘటనలపై ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపింది. ఫలితాల్లో జరిగిన పొరబాట్లలో, ఇంటర్‌ బోర్డులో జరిగిన తప్పులలో గ్లోబరీనాకు బాధ్యత ఉందని తేల్చింది.

అమిత్ Image copyright FB/Amit Panghal
చిత్రం శీర్షిక అమిత్ పంఘాల్

బాక్సింగ్: 45 ఏళ్లలో ఎన్నడూ లేని ఘనత సాధించిన భారత బాక్సర్

45 ఏళ్ల బాక్సింగ్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఏ భారత బాక్సర్‌కు సాధ్యం కాని ఘనతను అమిత్‌ పంఘాల్‌ సాధించాడని, ఇప్పటివరకు కాంస్యాలకే పరిమితమైన మన బాక్సింగ్‌ ఘనత స్థాయిని తొలిసారి పెంచాడని సాక్షి రాసింది.

చాంపియన్‌షిప్‌ చరిత్రలో ఫైనల్‌ చేరిన తొలి భారత బాక్సర్‌గా నిలిచి అమిత్ కనీసం రజతం ఖాయం చేసుకున్నాడు. అతడు 52 కేజీల విభాగంలో ఫైనల్ చేరాడు.

శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 3-2 తేడాతో ప్రత్యర్థి సాకెన్‌ బిబోసినోవ్‌(కజకిస్తాన్‌)ను అతడు ఓడించాడు. శనివారం జరిగే ఫైనల్లో ప్రస్తుత ఒలింపిక్‌ చాంపియన్‌ షఖోబిదీన్‌ జొయిరోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)తో తలపడనున్నాడు. తుది పోరులోనూ సత్తా చాటితే భారత్‌కు పసిడి ఖాయం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)