చిరంజీవి: రాజమౌళి 'బాహుబలి' తీయకపోతే 'సైరా నరసింహారెడ్డి' వచ్చేది కాదు -ప్రెస్ రివ్యూ

  • 23 సెప్టెంబర్ 2019
Image copyright FB/Sye Raa Narasimha Reddy

తన 151వ సినిమాగా 'సైరా' చేస్తే ఎలా ఉంటుందన్న తమ ఆలోచనకు శ్రీకారం చుట్టింది, పరోక్షంగా మద్దతు ఇచ్చింది ప్రముఖ దర్శకుడు రాజమౌళేనని 'సైరా' కథానాయకుడు చిరంజీవి చెప్పారని సాక్షి తెలిపింది.

"రాజమౌళి 'బాహుబలి' తీసి ఉండకపోతే ఈ రోజు 'సైరా' వచ్చుండేది కాదు. మన తెలుగు సినిమాకు భారతదేశమంతా ఓ దారి వేశారాయన. ఇన్ని వందల కోట్లు మనం ఖర్చు పెట్టినా సంపాదించుకోవచ్చు, నిర్మాతలకు నష్టం లేకుండా చూడొచ్చు అనే భరోసా ఇచ్చాడు రాజమౌళి. శభాష్‌.. హ్యాట్సాఫ్‌ టు రాజమౌళి" అని చిరంజీవి ప్రశంసించారు.

"ఇంతఖర్చు పెట్టి రిస్క్‌ చేయమని ఎవరికైనా ఎందుకు మనం చెప్పాలి, రాజీ పడకుండా మనమే చేద్దాం'' అని తన కుమారుడు రామ్ చరణ్ అనడంతో తాను సై అన్నానని ఆయన వివరించారు.

ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన 'సైరా' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి, నయనతార జంటగా అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, తమన్నా, సుదీప్, విజయ్‌ సేతుపతి, రవికిషన్‌ ముఖ్య పాత్రధారులుగా రామ్‌చరణ్‌ నిర్మించిన 'సైరా నరసింహారెడ్డి' అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.

సైరా సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన పవన్‌ కల్యాణ్‌ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ- ''సైరా' ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు ఒక అతిథిగా నన్ను పిలవడం నా అదృష్టం. బయట నా పేరు.. ఇమేజ్‌.. ఇవన్నీ నాకు తెలియదుగానీ అన్నయ్య(చిరంజీవి) దగ్గరకు వచ్చే సరికి నేను ఒక అభిమానిని" అని చెప్పారు.

Image copyright FB/Kishan Reddy Gangapuram
చిత్రం శీర్షిక ఆదివారం కాకినాడలో జరిగిన సభలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి

ఈసారి యుద్ధమంటూ వస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈ దఫా పాకిస్తాన్‌తో యుద్ధమంటూ వస్తే, ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి హెచ్చరించారని, సమయం వచ్చినప్పుడు పీవోకే సంగతి తేలుస్తామని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారని ఈనాడు తెలిపింది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తాటాకు చప్పుళ్లకు జడిసే ప్రభుత్వం భారత్‌లో లేదని, తమకు దేశమే ముఖ్యమని, ఆ తర్వాతే పార్టీ అని ఆయన చెప్పారు.

ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన జాగరణ్ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు.

పర్యటక బోట్ల ప్రమాదాల నివారణకు చట్టాలను సవరించైనా కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉందని, తాను దిల్లీ వెళ్లాక నిపుణులతో సమావేశమై విమానయానం తరహాలో బోటు ప్రయాణ నిబంధనలకు చట్టం రూపొందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Image copyright FB/KALVAKUNTLACHANDRASHEKARRAO

ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఉండదు.. వాళ్లకు భయపడేది లేదు: కేసీఆర్

ఉద్యోగులకు భయపడేది లేదని, తొలగించాల్సి వస్తే వీఆర్వో వ్యవస్థను తప్పకుండా తొలగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలపై కేసీఆర్ మాట్లాడుతూ- ''చట్టాలు మార్చొద్దు. కొత్తవి తేవొద్దు అంటే నడుస్తదా? అవసరమైతే కొత్త చట్టాలు తేవాల్సిందే. ఉద్యమంలో ఎవరికీ భయపడలేదు కాబట్టే తెలంగాణ సాధ్యమైంది" అన్నారు.

తెలంగాణలో లంచం లేని పరిస్థితి రావాలని, ఇందుకు దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవెన్యూ చట్టం తెస్తామని, దీనిపై నలుగురు ఉద్యోగులకో, వారికో వీరికో భయపడేది లేదని ఆయన చెప్పారు.

చట్టాలు రూపొందించేది ఉద్యోగులు కాదని, వారు ప్రభుత్వం చెప్పిన పని మాత్రమే చేయాలని, ఉద్యోగులు ప్రభుత్వాన్ని నిర్దేశించే పరిస్థితి ఉండొద్దని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఉండదని, ఉద్యోగులే ప్రభుత్వాన్ని శాసించి చట్టాలు చేస్తే ఇక శాసనసభ ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు.

మంది మాటలు పట్టుకుని సమ్మెలు చేస్తే మీరే నష్టపోతారని వీఆర్వోలను ఉద్దేశించి కేసీఆర్‌ హెచ్చరించారు.

ఆదివారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు సమాధానం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజా సంక్షేమం కోసం అవసరమైతే ఇంకా అప్పులు తెస్తామని తేల్చి చెప్పారు.

Image copyright FB/Chandrababu Naidu

'జగన్! మీరే రాజీనామా చేస్తారా, మంత్రులతో చేయిస్తారా?': చంద్రబాబు

గత నాలుగు నెలల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజలకు ఎదురైన ఇబ్బందులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అనుభవ రాహిత్యం, చేతగానితనం, ఆశ్రిత పక్షపాతం, మూర్ఖత్వం, కక్ష సాధింపు వైఖరే కారణమని టీడీజీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారని ప్రజాశక్తి తెలిపింది.

గ్రామ సచివాలయ ఉద్యోగాల పరీక్షపత్రాల నిర్వహణ, ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనికి ముమ్మాటికీ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు.

ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆదివారం ఆయన ఓ లేఖ రాశారు.

"గ్రామ వాలంటీర్లలో 90 శాతం ఉద్యోగాలు మన కార్యకర్తలకే వచ్చాయి. నా దగ్గర వాటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగాలు కూడా కార్యకర్తలకే వచ్చాయి" అని దిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత బాహాటంగానే ప్రకటించిన వీడియో క్లిప్పింగులే ఈ పరీక్ష నిర్వహణా లోపాలు, అక్రమాలకు ప్రబల సాక్ష్యమని చంద్రబాబు తన లేఖలో వ్యాఖ్యానించారు.

గతంలో శాసనసభ సాక్షిగా మీరు చేసిన ప్రసంగం ప్రకారం జరిగిన దానికి బాధ్యత వహించి మీరే రాజీనామా చేస్తారో లేక పంచాయతీరాజ్‌, విద్యాశాఖ మంత్రులే రాజీనామా చేయాలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నానని ముఖ్యమంత్రినుద్దేశించి ఆయన చెప్పారు. ఈ పరీక్షలను రద్దు చేసి పారదర్శకంగా తిరిగి పరీక్షలను నిర్వహించాలన్నారు.

అక్బరుద్దీన్ ఒవైసీ Image copyright FB/@ALHAJAKBARUDDINOWAISI

తెలంగాణ: పీఏసీ ఛైర్మన్‌గా 'ఎంఐఎం' అక్బరుద్దీన్

తెలంగాణలో ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) ఛైర్మన్‌గా ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ నియమితులయ్యారని నమస్తే తెలంగాణ తెలిపింది. పీఏసీ ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని, ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఎంఐఎంకు పీఏసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని చెప్పింది.

శాసనసభ, మండలి కమిటీలను అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం శాసనసభలో ప్రకటించారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) సహా 21 కమిటీలను ప్రకటించారు.

పీఏసీలో సభ్యులుగా ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్‌, రమావత్‌ రవీంద్రకుమార్‌, బిగాల గణేశ్‌గుప్తా, గాదరి కిశోర్‌కుమార్‌, పీ విఠల్‌రెడ్డి, డీ శ్రీధర్‌బాబు, సండ్ర వెంకటవీరయ్య; ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సుంకరి రాజు, జాఫ్రీ, డీ రాజేశ్వర్‌రావు ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

గోదావరిలోంచి బయటపడ్డ రాయల్‌ వశిష్ట బోటు.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు

ఇన్ఫోసిస్: సీఈఓ, సీఎఫ్ఓ‌లపై వచ్చిన ఆరోపణలపై విచారణను ప్రారంభించిన ఐటీ సంస్థ

#100Women: ప్రపంచ మతాన్ని పిల్లలే నడిపిస్తారు - గినా జుర్లో

ఆల్కహాల్‌తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ

చెడ్డ విధానాలను ప్రొఫెషనల్‌గానే విమర్శిస్తా.. నాకు రాజకీయాలేవీ లేవు - అభిజిత్ బెనర్జీ

భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ప్యాంటు విప్పి, కాలిపర్స్ తీసి స్కానర్‌లో పెట్టాలి.. వికలాంగ ఉద్యమకారులకు విమానాశ్రయంలో అవమానం

కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?