ఆంధ్రప్రదేశ్: హైవేలో ఇసుక అక్రమ తరలింపునకు పోలీసులే కారణమన్న మంత్రి బొత్స - ప్రెస్ రివ్యూ

  • 9 నవంబర్ 2019
Image copyright Facebook/vzmgoap
చిత్రం శీర్షిక మంత్రి బొత్స సత్యనారాయణ

హైవేలో రాజమార్గంలో అక్రమంగా ఇసుక తరలిపోతోందని, దీనికి పోలీసులే కారణమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలో అన్నారని ఆంధ్రజ్యోతి తెలిపింది. జిల్లా ఎస్పీ దీనిపై చర్యలు తీసుకోకపోతే తామే అందుకు పూనుకోవాల్సి వస్తుందని ఆయన చెప్పారు.

శుక్రవారం విజయనగరం కలెక్టరేట్‌లో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో మంత్రి బొత్స, ఎస్పీ రాజకుమారిని ఉద్దేశించి మాట్లాడారు.

''ఇఫ్‌ యూ డోంట్‌ మైండ్‌... హైవేలో ఇసుక అక్రమంగా తరలిపోవడానికి మీ పోలీసులే కారణం. లారీకి రూ.10 వేలో, రూ.5 వేలో, రూ.2 వేలో ఇస్తే తీసుకొని ఆ ఇన్‌స్పెక్టర్లో, సబ్‌ ఇన్‌స్పెక్టర్లో ఫ్రీగా వదిలేస్తున్నారు. ఇప్పుడే ఈ లైనులో కూర్చున్న మా వాళ్లు చెపుతున్నారు'' అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఎస్పీ రాజకుమారి స్పందిస్తూ దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదూ రాలేదన్నారు. మంత్రి బొత్స వెంటనే స్పందిస్తూ- ''రిపోర్ట్‌ ఏంటి? హైవేపై సీసీ కెమెరాలా ఫుటేజ్‌ పరిశీలిస్తే తెలిసిపోతుంది. మీరు పరిష్కరిస్తారా? లేదా మమ్మల్నే పరిష్కరించుకొమ్మంటారా? ఇది ఎన్నోసార్లు నా దృష్టికి వచ్చినా మీకు చెప్పడం బాగోదని ఊరుకున్నా. చెప్పండి మీ ఏఎస్పీలకూ, డీఎస్పీలకూ'' అన్నారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Image copyright Getty Images

5,100 రూట్ల ప్రైవేటీకరణపై తదుపరి చర్యలు వద్దు: హైకోర్టు

తెలంగాణలో 5,100 రూట్లను ప్రైవేటీకరించాలన్న రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాన్ని హైకోర్టు ఆక్షేపించిందని సాక్షి తెలిపింది.

"ప్రస్తుతం రాష్ట్రం కార్మిక సంఘాల సమ్మె గుప్పిట్లో ఉంది. దీనిపై పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని ప్రభుత్వాన్ని మేం కోరాం. ఈ సంక్షోభ పరిస్థితులు ఉండగా కార్మిక సంఘాలు, ప్రజల మనసులను ఆందోళన వైపు పురిగొల్పేలా మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. పరిస్థితి దిగజారకుండా ఉండేందుకు కేబినెట్‌ నిర్ణయంపై తదుపరి చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశిస్తున్నాం" అని న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.

కేబినెట్‌ నిర్ణయానికి సంబంధించిన కాపీని 'రహస్యమైనది'గా ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు విస్మయం వ్యక్తంచేసింది.

ఆ నిర్ణయాన్ని సవాల్‌ చేసిన దృష్ట్యా ఆ నిర్ణయం చట్టానికి లోబడి ఉందా, చట్ట వ్యతిరేకమైనదా అన్నది తాము తేలుస్తామని, ఆ కాపీని తమ ముందుంచాలని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.

5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ ఈ నెల 2న కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన పిల్‌పై ధర్మాసనం విచారణ జరిపింది.

Image copyright EMMANUEL DUNAND/GETTY

భారత్ రేటింగ్‌ను తగ్గించిన మూడీస్

ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారత ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను తగ్గించిందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ఇప్పటివరకు దేశ ఆర్థిక వ్యవస్థ రేటింగ్‌ను నిలకడగా ఇచ్చిన మూడీస్.. దీనిని ప్రతికూలానికి తగ్గించింది. గతంలో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. విదేశీ కరెన్సీ రేటింగ్‌ను బీఏఏ2-కి తగ్గించింది. పెట్టుబడులకు సంబంధించిన మూడీస్ ఇచ్చే రేటింగ్‌లో ఇదే రెండో అత్యల్పం.

2020 మార్చి నాటికి ద్రవ్యలోటు 3.7 శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. ప్రభుత్వం నిర్దేశించుకున్న 3.3 శాతం లక్ష్యం కంటే ఇది అధికం.

మందగమన పరిస్థితులకు తోడు కార్పొరేట్ పన్ను వసూళ్లు పడిపోవడంపై మూడీస్ ఆందోళన వ్యక్తంచేసింది. ఆర్థిక, సంస్థాగత బలహీనతల్ని పరిష్కరించడంలో మూడీస్ అంచనా వేసిన దానికంటే ప్రభుత్వం నెమ్మదిగా స్పందిస్తోందని అభిప్రాయపడింది.

నిరాదరణ భరించలేక వృద్ధ దంపతుల ఆత్మహత్య

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం ఎలికేశ్వరం గ్రామంలో, నిరాదరణ భరించలేక వృద్ధ దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఈనాడు తెలిపింది.

76 ఏళ్ల రాళ్లబండి సాలయ్య, 66 ఏళ్ల రాధమ్మ అప్పులన్నీ తీర్చేసి, అంతిమ సంస్కారాల కోసం కొంత సొమ్ము ఉంచి, 'మంచి రోజు' ఎప్పుడో కనుక్కొని మరీ ఆత్మహత్య చేసుకున్నారని గ్రామస్థులు చెప్పారు.

వారి కథనం ప్రకారం- ఈ దంపతులకు కూలిపనులే ఆధారం. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరందరికీ సాలయ్య దంపతులు పెళ్లిళ్లు చేశారు.

తమను ఆదరించాల్సిన వారి నుంచే నిత్యం ఎదురవుతున్న ఛీత్కారాలు ఆ దంపతులను ఆత్మహత్యకు పురికొల్పాయి. వాళ్లు చేసిన కొద్దిపాటు అప్పులను తీర్చేశారు. తమ దహన సంస్కారాల కోసం రూ.20 వేల నగదును అల్మారాలో ఉంచారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)