కేసీఆర్‌ను చూసి నేర్చుకోండి - ప్రెస్‌ రివ్యూ

  • 11 నవంబర్ 2019
Image copyright janasena

తెలుగు భాష, సంస్కృతిని ఎలా కాపాడాలో టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసి వైసీపీ నాయకత్వం నేర్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సూచించారంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని నిషేధిస్తూ జగన్‌ ప్రభుత్వం నిర్ణయిస్తే అధికార భాషాసంఘం ఏం చేస్తోందని మండిపడ్డారు. తెలుగు భాష విలువేంటో వైసీపీ నాయకత్వానికి తెలిస్తే ఇంత అర్థరహితమైన నిర్ణయం తీసుకోదన్నారు. ఈ నిర్ణయం చూశాక తన గ్రంథాలయంలోని తెలుగు పుస్తకాలను ప్రేమాభిమానాలతో ఒకసారి చూసుకున్నానని చెప్పారు. పెదబాలశిక్ష, తెలుగు వ్యాకరణం, శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు, దేవరకొండ బాలగంగాధరతిలక్‌ సాహిత్యం, సమగ్ర ఆంధ్ర సాహిత్యం, ఆంధ్రుల సాంఘిక జీవిత చరిత్ర, శివారెడ్డి కవిత, 2017లో హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ రూపొందించిన 'తొలిపొద్దు' పుస్తకాన్ని పవన్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Sakshi.com
చిత్రం శీర్షిక సందీప్

పెళ్లి హాలులోనే వరుడి ఆత్మహత్య

మరికొద్ది గంటల్లో తాళి కట్టాల్సిన చేతులతో ఓ వరుడు తనమెడకే ఉరితాడు బిగించుకున్నాడని 'సాక్షి' వార్తా కథనం ప్రచురించింది. హైదరాబాద్‌లోని పేట్‌ బషీర్‌బాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం జరిగిన ఆ సంఘటన వివరాలివీ..

''మలక్‌పేటకు చెందిన రిటైర్డ్‌ లెక్చరర్‌ నక్కెర్తి శ్రీనివాస్‌చారి, పద్మజ రాణిల కుమారుడు సందీప్‌ (24). చిన్నతనంలోనే సందీప్‌ తల్లి మృతి చెందింది. దీంతో శ్రీనివాస్‌చారి రెండో వివాహం చేసుకోవడంతో సందీప్‌ చిన్నతనం నుంచి తాతయ్య జాగేశ్వరరావు వద్ద పెరిగాడు. బీటెక్‌ వరకు చదువుకున్న సందీప్‌కు బోయిన్‌పల్లికి చెందిన ఓ యువతితో ఏప్రిల్‌ నెలలో నిశ్చితార్థం చేశారు. అయితే చిన్నప్పటి నుంచి తనను అల్లారుముద్దుగా పెంచిన తాతయ్య జాగేశ్వరరావు నెలక్రితం మృతి చెందడంతో సందీప్‌ బాగా కుంగిపోయాడు. తాతయ్య చనిపోయి నెల కూడా గడవకుండానే తనకు పెళ్లి ఏమిటంటూ వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయినప్పటికీ పెద్దలు ఈనెల 10న కొంపల్లి టీ-జంక్షన్‌లో ఉన్న శ్రీకన్వెన్షన్‌లో పెళ్లి నిశ్చయించారు.

సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంట్లో పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా సందీప్‌ దీన్ని వ్యతిరేకించాడు. 'తన తల్లి చనిపోయిన ఇంట్లో నేను 'పెళ్లి కొడుకు' కార్యక్రమాన్ని చేసుకోలేను' అని సందీప్‌ చెప్పడంతో ఆ కార్యక్రమానికి ఓ ఇంటిని అద్దెకు కూడా తీసుకుని నిర్వహించారు. ఈ క్రమంలో తండ్రి సందీప్‌ వైఖరిని తప్పుపట్టగా.. ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి వివాదం చెలరేగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సందీప్‌ ఆదివారం తెల్లవారుజామున కొంపల్లిలో ఉన్న వివాహ వేదిక వద్దకు వచ్చి తనకు కేటాయించిన గదిలోకి వెళ్లిపోయాడు.

సందీప్‌ కోపాన్ని కుటుంబ సభ్యులు అంతగా పట్టించుకోలేదు. గదిలోకి వెళ్లిన సందీప్‌ను చూసి అంతా సర్దుకుపోతుందనుకుని ఒంటరిగా వదిలేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు వివాహ వేడుకలకు సిద్ధం చేసేందుకు సందీప్‌ గది తలుపును తట్టగా ఎంతకీ స్పందన లేదు. దీంతో మాస్టర్‌ కీతో తలుపులు తెరిచి చూడగా సీలింగ్‌కు వేలాడుతూ సందీప్‌ కనిపించాడు. వెంటనే సందీప్‌ను సుచిత్ర సర్కిల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సందీప్‌ ఆత్మహత్యకు గల ప్రధాన కారణం తాతయ్య మరణమేనా, మరేదైనా వ్యవహారం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. సందీప్‌ ఫోన్‌ తెరిచిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగుచూసే అవకాశముందని పేట్‌ బషీర్‌బాద్‌ సీఐ మహేశ్‌ తెలిపారు'' అని ఆ కథనంలో వివరించారు.

Image copyright Getty Images

ఉల్లి కిలో రూ. 75.. సామాన్యుడికి తప్పని భారం

ఉల్లి ధర అంతకంతకూ పెరుగుతోందని, రైతు బజార్లలో కిలో రూ. 36 ఉంటే బయట మార్కెట్లో రూ. 50 నుంచి రూ. 75 వరకు పలుకుతోందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''వినియోగదారులు ఓ వైపు కష్టాలు పడుతుంటే మరోవైపు రైతులు పండించిన పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు యార్డుకు వస్తే నాలుగైదు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. నవంబరు 11 వరకు సరకు తేవొద్దని, అవసరమైతే తాడేపల్లి గూడెం, హైదరాబాద్ తీసుకెళ్లి అమ్ముకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదనపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సరకును మార్కెట్లోకి పంపిస్తే అటు రైతుకు మెరుగైన ధర లభించడంతో పాటు మార్కెట్లోనూ ధరలు దిగొచ్చే అవకాశం ఉంది.

గతంలో మార్కెటింగ్ శాఖ ద్వారా ఉల్లి తెప్పించి కిలో రూ. 25 చొప్పున రైతు బజార్లలో విక్రయించారు. ఆదివారం నుంచి మార్కెటింగ్ శాఖ ద్వారా రైతు బజార్లలో ఉల్లి విక్రయాలకు చర్యలు తీసుకున్నట్లు ఆ శాఖ కమిషనర్ పీఎస్ ప్రద్యుమ్న తెలిపారు'' అని ఆ కథనంలో తెలిపారు.

శ్రీశైలం

కృష్ణాబేసిన్‌కు పెరిగిన వరద

కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు నీటి రాక పెరుగుతోందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''ఆదివారం ఉదయం కూడా ఎగువన ఆల్మట్టి మొదలు దిగువన పులిచింతల వరకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టికి 22 వేల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. కరెంటు ఉత్పత్తి ద్వారా అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. నారాయణపుర జలాశయానికి 33 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో దాదాపు 34 వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి 3 నుంచి 4 వేల క్యూసెక్కుల వరద ప్రధాన కృష్ణాలోకి చేరుతోంది. జూరాల జలాశయానికి ఆదివారం ఉదయం 80 వేల పైచిలుకు క్యూసెక్కుల వరద నమోదవ్వగా.. సాయంత్రానికి 62 వేలకు చేరుకుంది. స్పిల్‌వే ద్వారా 40వేలు, కరెంటు ఉత్పత్తి ద్వారా 35 వేలకుపైగా క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు.

తుంగభద్ర నుంచి కూడా 15 వేల క్యూసెక్కుల వరకు వరద వస్తోంది. ఈ క్రమంలో శ్రీశైలం జలాశయానికి 51వేల పైచిలుకు క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. తెలంగాణ పరిధిలోని విద్యుత్ కేంద్రం ద్వారా దాదాపు 28 వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో నాగార్జునసాగర్‌కు 52,301 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 589.90 అడుగుల వద్ద 311.7462 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాల్వలు, కరెంటు ఉత్పత్తి ద్వారా అంతే మొత్తంలో నీరు దిగువకు విడుదల అవుతోంది. పులిచింతల ప్రాజెక్టు వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 43 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బరాజ్ వద్ద ఇన్‌ఫ్లో 20 వేల పైచిలుకు క్యూసెక్కులుగా నమోదైంది. తాజా నీటి సంవత్సరంలో ఇప్పటివరకు 792 టీఎంసీల కృష్ణాజలాల్ని సముద్రంలోకి వదిలినట్లయింది'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)