తెలంగాణలో స్తంభించిన సర్కారు - ప్రెస్ రివ్యూ

  • 14 నవంబర్ 2019
Image copyright facebook/kcr

తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిగా వివిధ కారణాల వల్ల పాలన స్తంభించిందంటూ 'ఆంధ్రభూమి' పత్రిక కథనం ప్రచురించింది.

''గత ఏడాది ముందస్తు ఎన్నికల వల్ల కొంతకాలం ఆపద్ధర్మ ప్రభుత్వం, ఆ తర్వాత శాసనసభ, గ్రామ పంచాయతీ, పార్లమెంట్, పరిషత్ ఎన్నికలతో వరుసగా ఎన్నికల కోడ్. ఆ వెంటనే కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపు ఇలా ఏదో ఒక ప్రతిబంధకంతో పాలన స్తంభించింది.

వీటన్నిటినీ ఒక్కటొక్కటిగా అధిగమించాక పాలనను పట్టాలు ఎక్కిద్దామంటే కోర్టుల్లో కేసులతో ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి. కొత్త సచివాలయ నిర్మాణం, మున్సిపల్ ఎన్నికలు, ఆర్టీసీ సమ్మె, ఇలా దేనిపైనా నిర్ణయం తీసుకోకుండా కోర్టుల్లో కేసులు తేలకపోవడంతో ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి. చివరగా మున్సిపల్ ఎన్నికలను కూడా పూర్తిచేస్తే ఒక పని అయిపోతుందనుకుంటే దానికి కోర్టు బ్రేక్. ఫలితంగా గత ఏడాది సెప్టెంబర్‌లో ఆరంభమైన ముందస్తు ఎన్నికలు మొదలు తాజాగా మున్సిపల్ ఎన్నికల వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితి.

ఇక మిగిలిన ఒక్క మున్సిపల్ ఎన్నికలను కూడా ముగించేస్తే పరిపాలనను వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటించినా కేసులు కొన్ని కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో సీఎం ఆలోచన కార్యరూపం దాల్చకుండా పోయింది.

కొంతకాలంపాటు ముందస్తు ఎన్నికల వల్ల ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వల్ల పూర్తిస్థాయి బడ్జెట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అది కూడా పూర్తయ్యాక కొత్త సచివాలయ నిర్మాణం కోసం పాత సచివాలయం తరలింపుతో ప్రభుత్వ కార్యకలాపాలకు బ్రేక్ పడింది. ఈ అంశం కూడా కోర్టు వివాదంలో చిక్కుకోవడంతో తాత్కాలిక సచివాలయం నుంచి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు జరపలేని పరిస్థితి. ఇప్పటికీ ఏ మంత్రి చాంబర్ ఎక్కడుందో తెలియని అయోమయం.

శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అక్టోబర్ మధ్యలో శాసనసభను ఒకటి, రెండు రోజులు సమావేశపరిచి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్టు కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. అయితే ఉహించని విధంగా అక్టోబర్‌లో ఆర్టీసీ కార్మికులు మెరుపు సమ్మెకు దిగడం, ఈ అంశం కూడా కోర్టుకు ఎక్కడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకొని ఆర్థిక శాఖ కార్యదర్శి వరకు కోర్టు మెట్లు ఎక్కడం, దిగడంతోనే సరిపోయింది. ఈ సమ్మె అంశంపైనే సీఎంకు దాదాపు అనునిత్యం ఉన్నతాధికారులు, న్యాయనిపుణుల సమీక్షలతోనే సరిపోయింది.

మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇతర బెంచీల వద్ద ఉన్న కేసులు కూడా వీగిపోతే ఎన్నికలు ముగియగానే రాష్టవ్య్రాప్తంగా పర్యటించి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించనున్నట్టు సీఎం చెప్పిన విషయం తెలిసిందే.

ప్రధానంగా ఉత్తర తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్న పోడు భూముల సమస్యను పరిష్కరించనున్నట్టు సీఎం ప్రకటించారు. కానీ, ఆ తర్వాత రాష్ట్రంలోని పరిస్థితులు, కోర్టు వివాదాలు చుట్టుముట్టడంతో ముఖ్యమంత్రి కూడా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దరిమిలా గత ఏడాది సెప్టెంబర్‌లో ముందస్తు ఎన్నికల ప్రక్రియతో మొదలుకొని తాజాగా ఆర్టీసీ సమ్మె వరకు రాష్ట్రంలో ప్రభుత్వ పాలన స్తంభించింది.'' అంటూ అందులో వివరించారు.

సింబాలిక్ ఇమేజ్ Image copyright Getty Images

పర్సనల్ లోన్ తీసుకుని మరీ సైబర్ మోసగాడికి డబ్బు సమర్పణ.. లింకెడ్ఇన్‌ స్నేహితుడి చేతిలో మోసపోయిన హైదరాబాద్ యువతి

హైదరాబాద్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగిని సైబర్‌ నేరగాళ్ల మాయలో పడి ఏకంగా రూ.94 లక్షలు పోగొట్టుకున్నారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''మల్కాజిగిరికి చెందిన ఐటీ ఉద్యోగినికి నెలకు రూ.రెండు లక్షల జీతం. మూడునెలల క్రితం ఆమెకు లింక్‌డ్‌ఇన్‌ యాప్‌లో ఓ వ్యక్తి ఫ్రెండ్‌గా పరిచయమయ్యాడు. తాను బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌లో పైలట్‌గా చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్నాడు. దానిని స్వాగతించిన యువతి అతడితో చాటింగ్‌ ప్రారంభించింది.

కొన్నిసార్లు వాయిస్‌ ఓవర్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్‌ (వీవోఐపీ)లోనూ మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా అతడు ప్రేమిస్తున్నానంటూ ప్రతిపాదించగా యువతి ఓకే చెప్పింది. త్వరలోనే ఇండియాకు వస్తున్నానని, రూ. 10 కోట్ల విలువైన బహుమతులు, బంగారు ఆభరణాలు తీసుకువస్తున్నానని చెప్పడంతో ఆమె నిజమేనని నమ్మింది.

ఇంతలో ఒకరోజు ఫోన్‌చేసి, 'మా తండ్రికి అత్యవసరంగా క్యాన్సర్‌ చికిత్స చేయించాలి.. డబ్బులన్నీ బహుమతుల కోసం ఖర్చు చేశాను. సాయం చేయాలి' అని అడిగాడు. నిజమేనని నమ్మిన ఆమె అతడు చెప్పిన ఖాతాలో డబ్బులు వేసింది. పలుమార్లు అలాగే చేసింది. తండ్రి పదవీవిరమణ చేసిన నగదును కూడా పెట్టుబడుల కోసమంటూ తీసుకుని అతడికే పంపింది. ఇది సరిపోక పర్సనల్‌ (వ్యక్తిగత రుణం) లోన్‌ను కూడా తీసుకున్నది. మొత్తం రూ.94 లక్షలు అతడు చెప్పిన ఖాతాల్లో జమచేసింది.

సైబర్‌ నేరగాడు మొత్తం కోటి రూపాయలకు ఆ యువతిని టార్గెట్‌ చేసినట్టు తెలుస్తున్నది. రూ.94 లక్షలు లాగేసుకున్న అతడు ఇంకా ఆరు లక్షలు కావాలంటూ ఫోన్‌ చేశాడు. చివరకు యువతి నిలదీయడంతో డబ్బులు ఇవ్వకపోతే నా దగ్గర డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నావంటూ పోలీసులకు చెప్తానంటూ బెదిరింపులకు దిగాడు.

దీంతో, దిక్కుతోచని ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై ప్రాథమికంగా విచారించిన రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు బాధితురాలి నుంచి డబ్బులు కొట్టేసింది నైజీరియన్‌గా తేలింది.

సైబర్‌ నేరగాడు తన ఆచూకీ దొరకకుండా యువతితో వీవోఐపీ మీద మాట్లాడాడు. ఒకే ఒక్కసారి వాట్సాప్‌లో మాట్లాడటంతో పోలీసులు దాని ఐపీ అడ్రసును కూపీ లాగగా నైజీరియా దేశం ఆచూకీ లభించింది. మొత్తం ఆరు ఖాతాల్లో డబ్బులను జమచేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆగ్రా, అసోం, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాల్లోని బ్యాంక్‌ ఖాతాల నుంచి మరో 10 ప్రాంతాలకు నగదు బదిలీ అయినట్టు తేలింది. ఈ ఖాతాలను కూడా నైజీరియాలో ఉన్న సైబర్‌ నేరగాడు సేకరించినట్టు సమాచారం. దీనిపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నార''ని ఆ కథనంలో వివరించారు.

పెట్రోలు బాటిళ్లతో తహసీల్దార్‌ కార్యాలయాలకు

తమ సమస్యలు పరిష్కరించడం లేదంటూ తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తున్న సంఘటనలు పెరిగిపోతున్నాయని 'సాక్షి' పత్రిక ఒక కథనంలో తెలిపింది.

''తాజాగా బుధవారం కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్థల వివాదాన్ని పరిష్కరించాలని ఎన్నో ఏళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని మనస్తాపానికి గురైన దంపతులు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించారు. బత్తలూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బారెడ్డి తన స్థలాన్ని వేరే వ్యక్తులు ఆక్రమించుకున్నారని, దాన్ని తిరిగి ఇప్పించాలంటూ సుమారు 20 ఏళ్లుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. బుధవారం భార్యను వెంటబెట్టుకుని పెట్రోలు బాటిల్‌తో వచ్చి తహసీల్దార్‌ శివరాముడుతో వాగ్వాదానికి దిగారు.

ఈ క్రమంలో పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించారు. అక్కడే ఉన్న ప్రజలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా తహసిల్దార్‌ మాట్లాడుతూ తమ పరిధిలో ఉన్న నిబంధనల ప్రకారం ధ్రువీకరణ చేసి ఇచ్చామని, ఆర్డీఓ వద్దకు కానీ, కోర్టుకు కానీ వెళ్లి పరిష్కరించుకోవలసిందిగా సూచించామన్నారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని దయ్యాలవారిపల్లెకు చెందిన డి.నరసింహారెడ్డి బుధవారం ఇలాగే తహసీల్దార్‌ కార్యాలయం వద్ద పెట్రోలు పోసుకుని నిప్పంటించుకోబోయాడు. తండ్రి పేరిట ఉన్న భూములకు వన్‌బీ చేయాల్సిందిగా రెండేళ్లుగా తిరుగుతున్నా ఆధికారులు పట్టించుకోవడం లేదనే మనస్తాపంతో బుధవారం పెట్రోల్‌ బాటిల్‌తో తహసీల్దార్‌ కార్యాలయం చేరుకున్నాడు. భూములు ఆన్‌లైన్‌ చేస్తారా.. చచ్చిపోమంటారా? అంటూ పెట్రోలు పోసుకున్నాడు. గమనించిన పోలీసు పరుగున వెళ్లి అడ్డుకున్నాడు. మీ-సేవలో దరఖాస్తు చేసుకుంటే వన్‌బీకి సిఫారసు చేస్తామని, రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని తహసిల్దార్ హామీ ఇవ్వడంతో రైతు వెనుదిరిగాడ'ని అందులో వివరించారు.

Image copyright Andhrajyothi

ఇంత బుల్లిదూడ పుట్టుకతో అంతా సంచలనం..

తూర్పు గోదావరి జిల్లా గుమ్మలేరు రైతు ముత్యాల వీరభద్రరావుకు చెందిన ఆవుకు అతిచిన్న పుంగనూరు దూడ జన్మించిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది. ''ఈ అరుదైన సంఘటన ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదైంది. దూడ ఎత్తు 15.6 అంగులాల పొడవు, 22 అంగులాల వెడల్పు, 7.4 కిలోల బరువు ఉంది. దీనిని రికార్డులలో నమోదు చేశారు.

ఇది ఎంతో అరుదైన విషయంగా భావిస్తున్నారు. ఈ పుంగనూరు ఆవు దూడను భారత బుక్ ఆఫ్ రికార్డు, ఆంధ్రా బుక్ ఆఫ్ రికార్డులలో నమోదు చేస్తున్నట్లు భారత బుక్ ఆఫ్ రికార్డు చీఫ్ ఎడిటర్ అన్నపూర్ణ ప్రకటించారు'' అని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)