'జగన్‌తోనే నా ప్రయాణం... చంద్రబాబు ఇసుకదీక్ష సరికాదు' - టీడీపీ ఎమ్మెల్యే వంశీ :ప్రెస్ రివ్యూ

  • 15 నవంబర్ 2019
Image copyright vamsi/facebook

తెలుగుదేశం పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గుడ్‌బై చెప్పారని, ఇకపై తన ప్రయాణం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనేనని ప్రకటించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

గురువారం ఆయన కృష్ణా జిల్లా గన్నవరంలో మీడియాతో మాట్లాడారు.

''జగన్‌కు నా మద్దతు తెలియజేస్తున్నా. దీనివల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభమూ లేదు. పేద ప్రజలకు మంచి జరగాలని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. దీనికి శాసనసభ సభ్యత్వమే అడ్డు అనుకుంటే రాజీనామా చేస్తాను'' అని వంశీ ప్రకటించారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిపై, ఆయన తనయుడు లోకేశ్‌పై వంశీ విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా సమర్థంగా పోషించలేకపోతున్నారని విమర్శించారు.

45 సంవత్సరాల రాజకీయ అనుభవమున్న చంద్రబాబు, అధికారం లేకపోతే ఐదారు నెలలు కూడా ఆగలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. ఇసుక కోసం దీక్షలు చేయటం సరికాదన్నారు.

ఏ ప్రభుత్వం వచ్చినా మంచి పనిచేస్తే సమర్థించాలని, అలాకాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు మీరు వ్యతిరేకించగానే, మీ వెనుక దూడల్లాగా అనుసరిస్తే అభాసుపాలవుతామని వంశీ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వైఖరి ఇలాగే ఉంటే ప్రతిపక్ష హోదా కూడా పోయి, పార్టీకి తెలంగాణలో వచ్చిన పరిస్థితే ఇక్కడా వస్తుందని చెప్పారు.

బీజేపీతో ఘర్షణ వద్దని సుజనా చౌదరి వంటి ప్రముఖులు చెప్పినా వినకుండా ధర్మ పోరాట దీక్షలు చేయటమే టీడీపీ దుస్థితికి కారణమని ఆయన వ్యాఖ్యానించారు.

Image copyright FB/JANGAONDEPOT

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్‌ వాయిదా: అశ్వత్థామరెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్‌ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆర్టీసీ ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ అశ్వత్థామ‌రెడ్డి ప్రకటించారని ఈనాడు తెలిపింది. ప్రభుత్వం తమతో చర్చలు జరిపి మిగిలిన సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు.

గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. తర్వాత విలేఖరుల సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ- ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని చెప్పారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కూడా ఇంతమందిని అరెస్టు చేయలేదని ఆయన పేర్కొన్నారు. అరెస్టు చేసిన కార్మిక నేతలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానంతోపాటు ప్రజలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా ప్రభుత్వం నుంచి కనీసం ప్రకటన రాకపోవడం దారుణమన్నారు. ఎవ్వరూ ఆత్మహత్యలు పాల్పడవద్దని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేతలంతా ఆర్టీసీ అంశంపై వెంటనే స్పందించాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5,100 రూట్లకు ప్రైవేటుకు పర్మిట్లు ఇస్తే వెనకబడిన వర్గాల వారికి ఇబ్బందులు తప్పవని చెప్పారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె గురువారం 41వ రోజుకు చేరుకుంది. గురువారం 6,198 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ తెలిపింది. వీటిలో 4,322 ఆర్టీసీ బస్సులు, 1,876 అద్దెబస్సులు ఉన్నాయని చెప్పింది.

Image copyright Twitter/JaiTDP

వైసీపీ నేతల ఇసుక దాహానికి నిర్మాణ కార్మికుల బలి: చంద్రబాబు

''ఒక్క చాన్స్‌ అని ప్రాధేయపడి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇదే ఆఖరి చాన్స్‌ చేసుకుంటున్నారు. ఇంత దుర్మార్గం, బరితెగింపు ఎప్పుడూ చూడలేదు'' అని జగన్‌ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు విమర్శలు చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.

వైసీపీ నేతల ఇసుక దాహానికి భవన నిర్మాణ కార్మికుల బతుకులు బలయ్యాయని ఆయన ఆరోపించారు. మళ్లీ ఉచిత ఇసుక విధానం తేవాలని, అప్పటిదాకా తమ పోరాటం ఆగదని చెప్పారు.

గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు విజయవాడలో 'ఇసుక దీక్ష' చేశారు. భవన నిర్మాణ కార్మికులు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇసుక విధానంతోపాటు అమరావతి, పరిశ్రమలు, రాజకీయ వేధింపులు తదితర అంశాలపై మాట్లాడారు.

"రాష్ట్రంలో ఈ ఐదు నెలల్లోనే ఇసుక కొరత ఎందుకొచ్చింది? ఇది వైసీపీ నేతలు సృష్టించిన సమస్యే. దేవుడు ఇచ్చిన, ప్రకృతి ఇచ్చిన ఇసుకపై మీ పెత్తనం ఏంటి? మా పొలంలో మట్టిపై మీ పెత్తనం ఏంటని ప్రజలు అడుగుతున్నారు. ఇసుకను కబ్జా చేశారు. మాఫియాను ప్రోత్సహించారు. వారి ఇసుక దాహానికి పేదల బతుకులు బలయ్యాయి. ఒక మంత్రి టీడీపీ వాళ్లే ఇసుక మాఫియా చేస్తున్నారని అన్నారు. ఇంకో మంత్రి పోలీసులపై నేరం వేస్తున్నారు. పోలీసులను దొంగలుగా చిత్రిస్తున్నారు. ఇంటి దొంగలు, అసలు దొంగలు మీరే. వాహనాలకు వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లు పెట్టుకుని మరీ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు" అని ఆయన ఆరోపించారు.

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ Image copyright www.vodafoneidea.com

వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లకు 74 వేల కోట్ల నష్టాలు

ఏజీఆర్‌(సవరించిన స్థూల ఆదాయం)పై సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారిందని, ఈ తీర్పు కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో వొడాఫోన్‌ ఐడియా 50,921 కోట్ల రూపాయలు, ఎయిర్‌టెల్‌ కంపెనీ 23,045 కోట్ల రూపాయలు నికర నష్టాల్ని ప్రకటించాయని సాక్షి తెలిపింది. ఈ రెండు కంపెనీల నష్టాల మొత్తం సుమారు 74 వేల కోట్ల రూపాయలకు చేరింది.

టెలికం వ్యాపారేతర ఆదాయాలూ టెల్కోల స్థూల ఆదాయం (ఏజీఆర్‌) కిందే పరిగణించాలన్న ప్రభుత్వ వాదనలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెలికం సంస్థలు చెల్లించాల్సి ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు కారణంగా స్పెక్ట్రం వినియోగ చార్జీలు, లైసెన్స్‌ ఫీజు తదితర అంశాలకు సంబంధించి రెండో త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌పై రూ.28,450 కోట్ల భారం పడింది. దీంతో కంపెనీ నికర నష్టాలు 23,045 కోట్ల రూపాయలకు పెరిగాయి. కంపెనీ చరిత్రలో ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం. ఏజీఆర్‌ భారం లేకుంటే కంపెనీ నికర నష్టాలు 1,123 కోట్ల రూపాయలుగా ఉండేవి.

ఏజీఆర్‌ ప్రభావంతో వొడాఫోన్‌ ఐడియా భారీ నష్టాలను ప్రకటించింది. ఇంతవరకూ ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించలేదు.

స్టాక్ మార్కెట్‌ సమయం ముగిసిన తర్వాత ఈ రెండు కంపెనీల ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలపై ప్రతికూల అంచనాలతోనే వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి. ఎయిర్‌టెల్‌ షేర్‌ బీఎస్‌ఈలో 1.5% నష్టంతో రూ.363 వద్ద ముగిసింది. వొడాఫోన్‌ ఐడియా షేర్‌ 20 శాతం క్షీణించి రూ.2.95 వద్దకు చేరింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

పార్లమెంటుపై దాడికి 18ఏళ్లు: మిలిటెంట్ల బులెట్లు దూసుకొస్తున్నా, ప్రాణాలకు తెగించి గేటు నంబర్ 1 మూసేశాడు

బ్రిటన్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మెజారిటీ: ఎగ్జిట్ పోల్ అంచనా

దొంగలు పడ్డారు.. డబ్బులు వదిలేసి, ఉల్లిగడ్డలు ఎత్తుకెళ్లారు

అస్సాంలో ఆందోళనలు: పౌరసత్వ సవరణ బిల్లుపై పెరిగిన నిరసనలు... ఇద్దరు మృతి

ముస్లింలలో ఆందోళన కలిగిస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ మూడు నిర్ణయాలు

నా చిన్నప్పుడే మా అమ్మను నాన్న చంపేశాడు... ఎందుకంటే?

పౌరసత్వ సవరణ బిల్లు: ఇతర దేశాల్లో మైనారిటీల గురించి భారత్ వాదనలో నిజమెంత...

ఆంధ్రప్రదేశ్: అత్యాచార కేసుల్లో ‘21 రోజుల్లో’ మరణశిక్ష... ఇంకా 'దిశ' బిల్లులో ఏముంది?