శబరిమలకు 10 మంది విజయవాడ మహిళలు.. వెనక్కి పంపిన పోలీసులు - ప్రెస్ రివ్యూ

  • 17 నవంబర్ 2019
Image copyright Getty Images
చిత్రం శీర్షిక 2018లో శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన మానితి గ్రూప్ మహిళలు

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని వార్షిక మండల-మకరవిళక్కు పూజ కోసం శనివారం తెరిచారని, విజయవాడ నుంచి వచ్చిన 10 మంది మహిళలను కేరళ పోలీసులు వెనక్కు పంపించారని 'ఈనాడు' కథనం తెలిపింది.

"కేరళ, తమిళనాడు సహా పొరుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విజయవాడ నుంచి వచ్చిన 10 మంది మహిళలను ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలోని పంబ నుంచి పోలీసులు వెనక్కు పంపించారు. వారంతా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసువారు కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శబరిమలలో ప్రస్తుత పరిస్థితిని వివరించడంతో వారంతా వెనుదిరిగారని పోలీసులు చెప్పారు.

శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించే అంశాన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు ఇటీవల నిర్ణయించడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఏ వయసు మహిళలైనా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లొచ్చని గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం స్టే లేనప్పటికీ ఆలయం వద్ద ఎలాంటి ఉద్రిక్తతలకు తావివ్వరాదన్న ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు రావొద్దని కోరింది.

ప్రచారం కోసం ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలను ప్రోత్సహించరాదని నిర్ణయించింది... ఆలయాన్ని సందర్శించాలనుకుంటున్న మహిళలు కోర్టు నుంచి అనుమతి ఉత్తర్వులు తీసుకుని రావాలని కేరళ దేవాదాయ మంత్రి సురేంద్రన్ స్పష్టం చేశారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Getty Images

ఫ్లెక్సీలపై కొరడా

అనధికారికంగా ఏర్పాటుచేసే ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్‌ఎంసీ కొరడా ఝుళిపించనుందని 'నమస్తే తెలంగాణ' పత్రిక కథనం తెలిపింది.

''అనుమతిలేని ఒక్కో బ్యానర్, ఫ్లెక్సీకి రూ.5 వేలు, వాల్‌పోస్టర్‌కు రూ.2000, దుకాణాల ముందు చెత్తవేస్తే రూ.వెయ్యి ఫైన్ వేయాలని నగర సమన్వయ సమావేశంలో నిర్ణయించారు. ప్రారంభోత్సవాలు, వేడుకల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ల వెంబడి, కార్యాలయాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేయొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ ఆదేశించారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

విధించే జరిమానాలు ఇలా..

కుండీలో కాకుండా రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్తవేస్తే: రూ.100

డ్రెయిన్లలో చెత్తవేస్తే: రూ.1000

షాప్‌ల ముందు చెత్తవేస్తే: రూ.1000

రోడ్లపై బల్క్ గార్బేజ్ డంప్‌చేస్తే: రూ.2000

బహిరంగ మూత్రవిసర్జన: రూ.100

గోడరాతలు: రూ.1000 (ప్రతి ఒక రాతకు)

ఒక్కో వాల్‌పోస్టర్: రూ.2000

అక్రమ బ్యానర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు: రూ.5000 (ఒక్కోదానికి)

హానికారక పదార్థాలు, నిర్మాణవ్యర్థాల అక్రమ రవాణాపై మొదటిసారి: రూ.25 వేలు

రెండోసారి అదే నేరానికి పాల్పడితే: రూ.50 వేలు

మూడోసారి పాల్పడితే: రూ.లక్ష జరిమానా, వాహనం స్వాధీనం

Image copyright AFP

ఉల్లి ఘాటు

ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ప్రభావం, పంట దిగుబడి గణనీయంగా తగ్గడం వంటి కారణాలతో ఉల్లిధరలు పెరిగాయని 'సాక్షి' కథనం తెలిపింది.

''రిటైల్‌ మార్కెట్లో కిలో రూ.60-70 వరకు ఉండటంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి తక్కువ ధరకే ఉల్లిని అందించే ఏర్పాట్లు చేయడం వల్ల కాస్త వెసులుబాటు లభించినా, రాష్ట్రంలో ఉల్లి ధరల ఘాటు మాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో 95 శాతం ఉల్లి పంట ఒక్క కర్నూలు జిల్లాలోనే సాగవుతోంది. తక్కిన 5 శాతం మాత్రమే ఇతర జిల్లాల్లో పండుతోంది. కర్నూలు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి ఏటా 87,500 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు సగటున 60 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ లెక్కన ఏటా 5.25 లక్షల టన్నుల ఉల్లి కర్నూలు జిల్లా నుంచి ఉత్పత్తి అవుతోంది. అయితే ఈ ఏడాది జులై నుంచి అక్టోబర్‌ వరకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు 40-45 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. పండిన గడ్డల్లోనూ ఎక్కువ శాతం కుళ్లిపోయాయి.

మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఉల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉత్తర భారత దేశంలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడంతో మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో 48 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తారు. ఈ ఒక్క జిల్లాలోనే 6.5 -7 లక్షల టన్నుల ఉల్లి పండుతుంది. ఈ ఏడాది వరదల ప్రభావంతో పంట బాగా దెబ్బతింది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. దేశ వ్యాప్తంగా వరదల దెబ్బకు ఒక్కసారిగా పంట దిగుబడి తగ్గడం, ఎగుమతులు కొనసాగడంతో కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి'' అని ఆ కథనంలో వివరించారు.

పోలవరం

పోలవరానికి బడ్జెట్‌ లేదు

పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు జరగలేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసిందంటూ 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''ప్రాజెక్టు పనులకు జరిగిన చెల్లింపుల్లో అక్రమాలు జరగలేదని, నిపుణుల కమిటీ నివేదించేదానిని బట్టే భవిష్యత్‌లో నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి శాఖకు తేల్చిచెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల ప్రవాహం పెంచాలని.. ఇంతవరకు తాను ఖర్చుపెట్టిన రూ.5,486 కోట్లను తిరిగి చెల్లించాలని ఏపీ ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రూ.1,850 కోట్లను నాబార్డు ద్వారా రుణసాయం తీసుకుని విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అకస్మాత్తుగా ఇలాంటి అభిప్రాయాన్ని వెల్లడించడంతోపాటు మళ్లీ 2014కి ముందు చేసిన ఖర్చుల తాలూకు ఆడిట్‌ నివేదికను సమర్పించాలని షరతు విధించింది. దీంతో రాష్ట్రప్రభుత్వం ఒక్కసారిగా డీలా పడిపోయింది. ఇలాగైతే ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందని మల్లగుల్లాలు పడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వ్యయం చేసిన మొత్తాన్ని రీయింబర్స్‌ చేసేందుకు నాబార్డు నుంచి రూ.3,000 కోట్ల రుణం తీసుకోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిని కోరుతూ జలశక్తి శాఖ ఇటీవల లేఖ రాసింది. దీనికి స్పందిస్తూ ఈ నెల 8న ఆర్థిక శాఖ 'ఆఫీసు మెమొరాండం' పంపింది. జలశక్తి శాఖ వినతిని పరిశీలించామంటూనే కొన్ని నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. '2018-19 సంవత్సరానికి నాబార్డు నుంచి రూ.1,850 కోట్లు తీసుకుని పోలవరం ప్రాజెక్టుకు అదనంగా ఇచ్చేందుకు జలశక్తి శాఖకు అనుమతి ఇచ్చాం. అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వ్యయ గణాంకాలను సంబంధిత అధికారి ఆడిట్‌ చేసి ఆమోదించాల్సి ఉంది.

అలాగే భవిష్యత్‌లో నిధులు విడుదల చేయాలంటే 2014 ఏప్రిల్‌ 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించి ఆడిట్‌ నివేదిక, అప్పటి తుది అంచనా వ్యయం నివేదికను సమర్పించాలి. అదీగాక, పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా ప్రాజెక్టుకు ఎలా ఖర్చు చేయాలో కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. దీనిపై బడ్జెట్‌ విభాగంతో సంప్రదించి వ్యయ విభాగం తుది ఆమోదముద్ర వేశాక స్పష్టత ఇస్తాం. సాధారణ ఆర్థిక నియమావళి (జనరల్‌ ఫైనాన్షియల్‌ రూల్స్‌-జీఎఫ్ఆర్‌) నిబంధనల ప్రకారమే ప్రాజెక్టుకు చెల్లింపులు జరపాలి. అక్రమ చెల్లింపులు జరిగాయో లేదో తేల్చేందుకు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చాకే నిధులు విడుదల చేయాలి అని మెమొరాండంలో స్పష్టం చేసింది'' అని ఆ కథనంలో రాశారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)