హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేసే ఆలోచన లేదు : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి - ప్రెస్ రివ్యూ

  • 18 నవంబర్ 2019
Image copyright Getty Images

''హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధాని చేసే ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డిని ఉటంకిస్తూ 'ఈనాడు' వార్తాకథనం ప్రచురించింది.

సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశంపై చర్చకు, నిర్మాణాత్మక సమాధానం ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి చెప్పారు. ఏపీ పునర్విభజన చట్టంలో తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుకు కేంద్రం ప్రయత్నం చేస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించాలని కోరారు.

రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, న్యాయపరంగా అందుకు కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా ఇచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేసేశారు. విభజన సమయంలో ఎంపీగా ఉన్న కేసీఆర్ పునర్విభజన చట్టంలో దీన్ని ఎందుకు పెట్టించలేదని ప్రశ్నించారు. చట్టంలో పొందుపరిచినందుకే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారని చెప్పారు.'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright Getty Images

‘తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన లేదు’

తితిదే లడ్డూ ధర పెంచాలని కీలక నిర్ణయం తీసుకోనుందని.. ఇందుకు ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని గత రెండ్రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''లడ్డూ ధర పెంచుతారన్న ప్రచారంపై భక్తుల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ అధికారులు ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ లడ్డూ ధరపెంపుపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. ఆదివారం నాడు ట్విట్టర్ వేదికగా ఆయనగా స్పందిస్తూ ఈ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. 'తిరుమల లడ్డు ధర పెంచే ఆలోచన లేదు.. అసలు ఆ ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదు. లడ్డు ప్రసాదం ధర పెంపు అని ప్రచారం అవుతున్న వార్తలన్నీ అవాస్తవాలు' అని ట్విట్టర్ వేదికగా వైవీ క్లారిటీ ఇచ్చేశారు.'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

Image copyright FACEBOOK/KCR

ఫిట్‌మెంట్‌ ఎంత పెరుగుతుంది?

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) నివేదిక నాలుగైదు రోజుల్లో ప్రభుత్వానికి అందనుందని 'సాక్షి' కథనం తెలిపింది.

''నివేదిక అందిన వెంటనే సీఎం కేసీఆర్‌ ఉద్యోగులతో సమావేశమై ఫిట్‌మెం ట్‌ను ఖరారు చేసే అవకాశం ఉంది. పీఆర్‌సీ నివేదికను 10-12 రోజుల్లో సమర్పించాలంటూ పీఆర్‌సీ చైర్మన్‌ సి.ఆర్‌. బిస్వాల్‌ను సీఎం కేసీఆర్‌ ఈ నెల 10న ఆదేశించడంతో నివేదికను అందజేసేందుకు వేతన సవరణ సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో పీఆర్‌సీ నివేది కలో ఉండే అంశాల్లో ప్రధానమైన ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు అంచనా వేసుకుంటున్నారు. నిత్యావ సర ధరల పెరుగుదల సూచీ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుదలను ఖరారు చేయడమే ఫిట్‌మెంట్‌. ఫిట్‌మెంట్‌ ఆధారంగానే వేతనాల పెంపుదల ఉండనుండటంతో ఎక్కువ మొత్తంలో ఫిట్‌మెంట్‌ సాధనకు సీఎంను ఒప్పించాలని ఉద్యో గులు ఆయా సంఘాల నేతలను కోరుతున్నారు.

ఉద్యోగ సంఘాలు కోరుతున్నది.. 63%

వేతన సవరణ సంఘం సిఫార్సు?.. 25%

రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2.67 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. మొత్తంగా 5.29 లక్షల మందికి పీఆర్‌సీని అమలు చేయాల్సి ఉంటుంది. వారికి ఒక శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేస్తే ఏటా అదనంగా రూ. 225 కోట్లను ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుందని పీఆర్‌సీ వర్గాలు ఇప్పటికే అంచనా వేశాయి. ఇలా ఒక శాతం నుంచి మొదలుకొని 35 శాతం వరకు ఫిట్‌మెంట్‌ ఇస్తే వెచ్చించాల్సిన మొత్తంపై లెక్కలు కట్టాయి. దాని ప్రకారం రాష్ట్రంలోని ఉద్యోగులకు 20 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ. 4,500 కోట్లు, 22 శాతం ఇస్తే రూ. 4,950 కోట్లు, 24 శాతం ఇస్తే రూ. 5,400 కోట్లు, 25 శాతం ఇస్తే రూ. 5,625 కోట్లు, రూ. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తే రూ. 6,075 కోట్లు ప్రభుత్వం వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేశారు. అలాగే ప్రతి శాతానికి రూ. 225 కోట్ల చొప్పున లెక్కించి 35 శాతం ఇస్తే రూ. 7,875 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు.'' అని అందులో వివరించారు.

నీరు Image copyright Getty Images

హైదరాబాద్ తాగునీరు భేష్

హైదరాబాద్ నగరంలో నల్లాల ద్వారా జలమండలి సరఫరాచేస్తున్న మంచినీరు సురక్షితమైనదని కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో తేలిందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దేశంలోని 21 పెద్ద నగరాల్లో జరిపిన అధ్యయనంలో ముంబై మహానగరం తర్వాత సురక్షితమైన తాగునీటిని సరఫరాచేస్తున్న నగరంగా హైదరాబాద్ రెండోస్థానం దక్కించుకొన్నది. దేశరాజధాని దిల్లీ చిట్టచివరిస్థానంలో నిలిచింది. కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి రాంవిలాస్‌ పాసవాన్ ఆదివారం బీఐఎస్ నివేదికను విడుదలచేశారు. ఒక్కో నగరం నుంచి 10 శాంపిల్స్ సేకరించి 28 రకాల ప్రమాణాలపై పరీక్షలను నిర్వహించినట్లు పాసవాన్ వెల్లడించారు.

ముంబైలో పది శాంపిల్స్‌లోనూ అన్ని ప్రమాణాలకు సంబంధించి సత్ఫలితాలు వచ్చాయని, హైదరాబాద్‌లో 9 శాంపిల్స్ అన్ని ప్రమాణాల మేరకు పరీక్షకు నిలబడ్డాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు భువనేశ్వర్, రాంచీ.. పది శాంపిళ్లలో ఒక్కో శాంపిల్‌లో విఫలం కాగా, రాయ్‌పూర్ ఐదు, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినుంచి సేకరించిన పది శాంపిళ్లలో ఆరు ఫెయిలయ్యాయని చెప్పారు. సిమ్లాలో ఏకంగా పది శాంపిళ్లలో 9 శాంపిళ్లు పరీక్షలో విఫలమయ్యాయని పాసవాన్ తెలిపారు. దాదాపు 13 రాష్ర్టాల రాజధానుల్లో (చండీగఢ్, తిరువనంతపురం, పాట్నా, భోపాల్, గువాహటి, బెంగళూరు, గాంధీనగర్, లక్నో, జమ్ము, జైపూర్, డెహ్రాడూన్, చెన్నై, కోల్‌కతా) నగరాల్లో సేకరించిన శాంపిళ్లలో ఒక్క శాంపిల్ కూడా బీఐఎస్ ప్రమాణాల మేరకు లేవన్నారు.'' అని ఆ కథనంలో తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు