చంద్రబాబుపై ఏసీబీ కోర్టు విచారణ.. లక్ష్మీపార్వతి 14 ఏళ్ల కిందట వేసిన కేసులో కదలిక - ప్రెస్ రివ్యూ

  • 19 నవంబర్ 2019
Image copyright CHANDRABABU/FB

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టిందని 'ఈనాడు' కథనం తెలిపింది.

''దాదాపు 14 ఏళ్ల కిందటి కేసులో స్టే తొలగిపోవడంతో కేసును విచారణకు స్వీకరించింది.

చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని గతంలో నందమూరి లక్ష్మీపార్వతి కేసు వేశారు. దీనిపై అప్పట్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఆరు నెలలు దాటితే స్టే తొలగినట్లేనని ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది.

చంద్రబాబు గతంలో తెచ్చుకున్న స్టే ఉత్తర్వులకు పొడిగింపు తీసుకోకపోవడంతో విచారణ చేపడుతున్నామని సోమవారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం తెలిసింది.

తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నార''ని అందులో వివరించారు.

Image copyright Getty Images

మద్యం ధరలు పెంపు యోచన

తెలంగాణలో త్వరలో మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని 'సాక్షి' కథనం తెలిపింది.

''ఆదాయాన్వేషణలో భాగంగా మద్యం ధరల ను సవరించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముగ్గురు మంత్రు లతో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసి మద్యం ధరలను నిర్ధారించే బాధ్యతలను అప్పగించబోతోందని ఎక్సైజ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సబ్‌కమిటీ ఏర్పాటు త్వరలోనే ఉంటుందని, ఈ కమిటీ సిఫారసుల మేరకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని ఆ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన వెంటనే మద్యం ధరల పెంపుపై కొంత కసరత్తు చేసిన ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే వివిధ రకాల మద్యం ధరలను 5-10 శాతం మేరకు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని ఆమో దిస్తే ఏటా రూ. 1,200-1,700 కోట్ల వరకు అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతుందని ఆ వర్గాల అంచనా. ఈ ప్రతిపాదనలను త్వరలోనే సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లే అంశంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్‌ ఉన్నతాధికారులకు మధ్య ఇటీవల చర్చ జరిగిన ట్టు తెలుస్తోంది. సీఎం దృష్టికి తీసుకెళ్లిన అనంతరం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటవుతుందని, ఈ కమిటీ నిర్ధారించిన ధరలపై కేసీఆర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని సమా చారం. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి మద్యం ధరల సవరణపై నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తే అవి ముగిసిన తర్వాత సవరించాలని, మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌కు జాప్యం జరిగితే వీలున్నంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం'' అని అందులో పేర్కొన్నారు.

Image copyright Getty Images

75 శాతం హాజరుంటేనే 'అమ్మఒడి'

ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్న 'అమ్మఒడి' పథకానికి సంబంధించి సోమవారం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేసిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''నవంబరు నెలాఖరు వరకు విద్యార్థులకు 75% హాజరు ఉంటేనే ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారని ప్రభుత్వం తెలిపింది. ఒకవేళ అంతకంటే తక్కువ హాజరు ఉంటే.. ప్రధానోపాధ్యాయులు నిశిత పరిశీలన చేసి, హాజరు తగ్గడానికి విద్యార్థి లోపం లేదని, పరిగణనలోనికి తీసుకోవచ్చని సిఫారసు చేస్తే పథకం వర్తింప జేస్తామని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి పింఛను తీసుకుంటున్న మాజీ ఉద్యోగుల పిల్లలకు 'అమ్మఒడి' ఉండదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రాష్ట్ర/కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షనర్లు(పీఎ్‌స యూ, కేంద్రంతో సహా), ఆదాయపు పన్ను చెల్లింపుదారుల పిల్లలు ఈ పథకం కింద అర్హులు కాదని తెలిపింది. దారిద్య్ర రేఖకు దిగువ ఉండి(బీపీఎల్‌), తెల్లరేషన్‌ కార్డు, ఆధార్‌ కలిగిన వారు అమ్మఒడికి పూర్తి అర్హులని ప్ర భుత్వం వివరించింది. ఈ కార్యక్రమం కోసం డీఈవో కార్యాలయంలో 24 గంటల సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ ఆదేశించారు. కాగా, 'అమ్మఒడి' కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు 13 జిల్లాలకూ పర్యవేక్షకులను నియమించార''ని వివరించారు.

గంజాయి Image copyright Getty Images

వరంగల్ నిట్‌లో గంజాయి

వరంగల్‌లోని ప్రతిష్టాత్మక జాతీయ సాంకేతిక విద్యాలయం (నిట్) హాస్టల్‌లో గంజాయి దొరికిందని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''1.8కే హాస్టల్‌లో గంజాయి వాడుతున్నట్టు అనుమానం రావడంతో నిట్ వర్గాలు సోదాలు చేశారు. బీటెక్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థుల వద్ద గంజాయి దొరికింది. వారి వద్ద నుంచి దానిని స్వాధీనం చేసుకున్న నిట్ వర్గాలు అన్ని హాస్టల్ రూంలను సోదాలు చేశారు.

గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది..? ఎవరెవరు వాడుతున్నారు..? వంటి విషయాలను నిగ్గు తేల్చేందుకు నిట్ రిజిస్ట్రార్ గోవర్దన్‌రావు వివిధ విభాగాల డీన్లతో కమిటీ వేశారు. హాస్టల్ హెడ్‌వార్డన్, వివిధ హాస్టళ్ల వార్డెన్లతో పాటు స్టూడెంట్ డీన్ రామ్‌గోపాల్‌రెడ్డితో కూడిన కమిటీ నిట్ ప్రాంగణంలోని అన్ని హాస్టల్స్‌లో సోదాలు చేసింది.

గతంలోనూ విద్యార్థులు హాస్టల్స్, తరగతి గదుల్లోనూ గంజాయి వినియోగించిన క్రమంలో వారిని పట్టుకొని నిట్ నిబంధనలకు అనుగుణంగా సెమిస్టర్లను రద్దు చేస్తూ శిక్షలు విధించిన దాఖలాలున్నాయి. విదేశీ పర్యటనలో ఉన్ననిట్ డైరెక్టర్ రమణారావు వచ్చిన అనంతరం గంజాయి వాడుతున్నట్టు అనుమానాలున్న 12 మంది విద్యార్థులపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్టు నిట్ వర్గాలు చెప్పాయ''ని అందులో తెలిపారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)