ఉత్తమ నటుడు రాంచరణ్... ఉత్తమ నటి కీర్తిసురేష్: చెన్నైలో ఫిలింఫేర్ అవార్డుల ప్రదానం - ప్రెస్ రివ్యూ

మహానటిలో కీర్తిసురేష్

ఫొటో సోర్స్, Mahanati/Facebook

ద‌క్షిణాది చ‌ల‌న చిత్ర‌సీమ‌ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం శ‌నివారం చెన్నైలో జ‌రిగిందని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. 2018లో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన ప‌లు సినిమాలు, న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ అవార్డుల‌ను అందించారు. తెలుగులో 'రంగస్థలం', 'మహానటి' చిత్రాలు పలు విభాగాల్లో సత్తా చాటాయి.

తెలుగులో 2018 ఏడాదికిగానూ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన `మ‌హాన‌టి` ఉత్త‌మ‌చిత్రంగా ఎన్నికైంది. ఆ చిత్రంలో సావిత్రి పాత్రలో నటించిన కీర్తి సురేష్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. 'రంగ‌స్థ‌లం'లో చిట్టిబాబుగా న‌టించి మెప్పించిన రామ్‌చ‌ర‌ణ్ ఉత్త‌మ‌న‌టుడుగా అవార్డును సొంతం చేసుకున్నారు.

మొత్తంగా 'రంగస్థలం' ఐదు, 'మహానటి' నాలుగు అవార్డులు అందుకోవటం విశేషం.

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి సందీప్‌కిష‌న్‌, రెజీనా వ్యాఖ్యాత‌లుగా వ్య‌వ‌హ‌రించారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ తారలు ఒకే వేదికపై తళుక్కుమన్నారు.

ఉత్త‌మ చిత్రం : మ‌హాన‌టి

ఉత్త‌మ న‌టుడు: రామ్‌చ‌ర‌ణ్‌ (రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ న‌టి: కీర్తి సురేష్‌ (మ‌హాన‌టి)

ఉత్త‌మ ద‌ర్శ‌కుడు: నాగ్ అశ్విన్‌ (మ‌హాన‌టి)

ఉత్త‌మ న‌టుడు (విమ‌ర్శ‌కులు): దుల్క‌ర్ స‌ల్మాన్‌ (మ‌హాన‌టి)

ఉత్త‌మ న‌టి (విమ‌ర్శ‌కులు): ర‌ష్మిక‌ మందన్న (గీత గోవిందం)

ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు: జ‌గ‌ప‌తిబాబు (అర‌వింద స‌మేత‌)

ఉత్త‌మ స‌హాయ న‌టి: అన‌సూయ‌ భరద్వాజ్ (రంగ‌స్థ‌లం)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్: రత్నవేలు (రంగస్థలం)

ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు: దేవిశ్రీ ప్ర‌సాద్‌ (రంగస్థలం)

ఉత్త‌మ గీత ర‌చ‌యిత‌: చంద్ర‌బోస్‌ (ఎంత స‌క్క‌గున్న‌వే - రంగ‌స్థ‌లం)

ఉత్త‌మ నేపథ్య గాయ‌కుడు: సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం కావాలె - గీత గోవిందం)

ఉత్త‌మ నేపథ్య గాయ‌ని: శ్రేయా ఘోష‌ల్‌ (మందార మందార - భాగ‌మ‌తి)

ఫొటో సోర్స్, Akkineni Nagarjuna/Facebook

మరో కొత్త దర్శకుడితో నాగార్జున యాక్షన్ షురూ...

కొత్త దర్శకులతో సినిమాలు చేయటం నాగార్జునకు కెరీర్ స్టార్టింగ్ నుంచి అలవాటేనని.. ఆయన తాజాగా మరో కొత్త దర్శకుణ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. భారీ యాక్షన్‌తో కూడిన ఓ పోలీస్ ఆఫీసర్ కథతో నాగార్జున కొత్త చిత్రం ఉంటుందని సమాచారం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ఈ సినిమాకు పనిచేయనున్నారట.

'ఊపిరి', 'మహర్షి' సినిమాల్లో రచనా విభాగంలో పనిచేసిన సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. ఇందులో ఆయన పవర్‌ఫుల్ పోలీస్‌గా కనిపించనున్నారు.

ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Deepika Padukone/Facebook

'ఛపాక్' సమయంలో కుంగుబాటుకు గురయ్యా: దీపికా పదుకొణె

'నేను కొన్నేళ్లుగా మానసిక కుంగుబాటుతో బాధపడుతున్నా' అంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రముఖ బాలీవుడ్ కథానాయిక దీపికా పదుకొణె.. ఇప్పుడు 'ఛపాక్' చిత్రీకరణ సమయంలో మళ్లీ మానసిక కుంగుబాటుకు గురయ్యానని చెప్పినట్లు 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. దీపిక తనలా కుంగుబాటు సమస్యతో సతమతమవుతున్నవారికి అండగా నిలిచేందుకు కౌన్సెలర్‌గానూ మారింది.

అయితే.. యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితకథతో తెరకెక్కుతున్న 'ఛపాక్' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న దీపిక.. ఇది తన కెరీర్‌లోనే క్లిష్టమైన చిత్రమని చెప్పింది.

ఇంతకుముందు ట్రైలర్ విడుదల వేడుకలో తన పాత్ర గురించి చెబుతూ దీపిక కన్నీటి పర్యంతమైంది.

ఇప్పుడు ఈ సినిమా చిత్రీకరణను గుర్తు చేసుకుంటూ ''ఎందుకో నేను మానసికంగా బాగా అలసిపోయినట్లు అనిపించింది. సుదీర్ఘంగా పనిచేయడమే అందుకు కారణం అనుకున్నాను. కానీ పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావన మొదలైంది. నా కౌన్సెలర్ సెట్స్‌లో నా పక్కనే ఉండాల్సి వచ్చింది'' అని చెప్పింది దీపిక.

మేఘనా గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 10న విడుదలవుతోంది.

ఫొటో సోర్స్, @baraju_SuperHit

దర్శకులు అవ్వాలనుకునే వారికి 'మత్తు వదలరా' ఓ మంచి ఉదాహరణ: రాజమౌళి

''నిర్మాత నమ్మి డబ్బులు పెట్టాలంటే ముందు నమ్మకం కలిగించాలి. రితేష్ ఒక బృందాన్ని తయారుచేసుకుని, నిర్మాత నమ్మకాన్ని పొంది ఈ సినిమా అవకాశం దక్కించుకున్నారు. రితేష్ ఐడియా నాకు బాగా నచ్చింది'' అని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి పేర్కొన్నట్లు 'ఆంధ్రప్రభ' ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మత్తు వదలరా' ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి రితేష్ రానా దర్శకత్వం వహిస్తుండగా.. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు.

హైదరాబాద్‌లో జరిగిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ.. కొత్తగా దర్శకత్వం చేయాలనుకునే వారికి 'మత్తువదలరా' ఓ మంచి ఉదాహరణ అని చెప్పారు. ''సినిమా చూశాను. తీపి కారం ఒకేసారి తిన్న అనుభూతి కలిగింది. ప్రతి ఫ్రేమ్ చక్కగా రూపొందించారు'' అని చెప్పారు.

కీరవాణి మాట్లాడుతూ.. ''నా పిల్లల్ని తిడుతూ ప్రోత్సహిస్తుంటాను. ఇప్పుడు నా పిల్లల్ని చూస్తుంటే గర్వంగా ఉంది'' అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)